Home » Yandamuri veerendranath » Anaithikam


    నా కసహ్యమేసింది. ఇంకితడితో మాట్లాడడం అనవసరం. లేచి నిలబడ్డాను. పాపని ఎత్తుకుని "వెళ్తున్నాను" అన్నాను క్లుప్తంగా. నేను గుమ్మం దాటబోతుంటే-

 

    "ఆగు" అన్నాడు.

 

    నా హృదయాన్ని చీల్చడానికి మరొక బాణమేదైనా వేయబోతున్నాడేమో అని ఆగాను. అతడు లోపలి నుంచి వస్తూ నా చేతిలో కవరందించాడు. కవరప్పటికే చించి వుంది.

 

    తీసి చూశాను. యూనివర్సిటీ నుంచి వచ్చిన ఉత్తరం అది. నాకు త్వరలో డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నారు.

 

    ఆ సమయంలో అది రావడంవల్ల సంతోషించాలో లేదో కూడా తెలీనంత భావరహితంగా వుంది నా మనసు.

 

    'కంగ్రాట్స్' వెటకారంగా అన్నాడు. నేను పట్టించుకోకుండా కవరు హాండ్ బాగ్ లో పెట్టుకుని పాపతో కలిసి బయటికి నడిచాను ఆ పరిసరాల నుంచి శాశ్వతంగా.

 

                                                                 22

 

    "దానికి వంట్లో బాగాలేదా ఏమిటి? రాత్రి పదకొండవుతోంది. భోజనానికి లేవమను!" అంటోంది అమ్మ వదినతో.

 

    "బాగా అలసటగా వచ్చి పడుకుంది. కాస్త నిద్ర పోనివ్వండి. ఆకలేస్తే తనే లేస్తుంది. నేను చూసుకుంటాను, మీరెళ్ళి పడుకోండి!" అంటోంది వదిన.

 

    నాకు వదినంటే అంతులేని కృతజ్ఞతాభావం కలిగింది. అసలేం జరిగిందో తెలియకపోయినా, ఏదో అయిందని ఊహించి, నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి, మా అమ్మని నాతో కలవనివ్వకుండా చేయడానికి ఎంత అవస్థలు పడుతోందో...!

 

    అమ్మ వెళ్ళి పడుకున్నట్లుంది. వదిన రిలీఫ్ గా గదిలోకి వచ్చింది. మంచంమీద నా తలవైపు కూర్చుంది.

 

    "అన్నయ్య లేడా, వదినా?" అదే నేనడిగిన మొదటి ప్రశ్న.

 

    "ఓఁ మేలుకునే వున్నావా? మీ అన్నయ్య లేడు. ఈ రోజే క్యాంప్ కెళ్ళాడు. నీ అదృష్టమో, దురదృష్టమో మరి! ఆయనుంటే నీక్కాస్త ధైర్యంగా వుండేదేమో!" అంది.

 

    నేను నీరసంగా నవ్వి, "నీకు వున్నప్పటికంటే ఎక్కువ ధైర్యంగా వుండదులే!" అన్నాను.  

 

    వదిన మాట మార్చి- "పాలు తాగుతావా?" అని అడుగుతూ టేబుల్ మీదున్న గ్లాసు అందించింది. నిశ్శబ్దంగా తాగేశాను.

 

    "ఇప్పుడు చెప్పు!" అంది వదిన సర్దుకు కూర్చుంటూ. నేను కాసేపు మౌనంగా వుండిపోయాను. తర్వాత చెప్పడం మొదలుపెట్టాను.

 

    నేనా ఇంట్లో అడుగుపెట్టిన మొదటిరోజు నుంచీ, నాకు మొదట్లో వాళ్లమీద కలిగిన సదభిప్రాయం- తర్వాత అర్థమైన వాళ్ళ డిప్లమసీ, నా భర్తతో ఎంత ప్రయత్నించినా నేనేర్పర్చుకోలేకపోయిన ఇంటిమసీ, నా బావగారితో నా పరిచయం బలపడడం, వాళ్ళ ఇంట్లో దానికి లభించిన ప్రోత్సాహం, నేను గిల్టీగా ఫీలవడం, ఆ తరువాత నా బావగారికి దూరమవ్వాలనుకుని అవలేని పరిస్థితుల్లో ఇరుక్కోవడం, నా తోడికోడలి చెల్లెలు రావడం, నా బావగారితో ఏర్పడ్డ అపార్థాలు, ఆ అమ్మాయి చనిపోవడం, నా భర్తే దానికి కారణమని తెలియడం, నా భర్త నన్ను బావగారితో చూడడం, మేము విడిపోవడం వరకూ అన్నీ... ఏదీ దాచకుండా చెప్పాను.

 

    అన్నీ గుర్తు చేసుకుంటూ ఆగి, ఆగి... జరిగిపోయి కాలాన్నీ, దాని తాలూకు అనుభవాల్ని వెలికితీసి నాలో నేనే మాట్లాడుకుంటున్నట్లుగా చెప్పాను. నిస్సంకోచంగా ఏ అబద్ధాలూ, సంజాయిషీలూ, విశ్లేషణలూ, సమర్థింపులూ లేకుండా చెప్పాను.

 

    అంతా చెప్పేసిన తరువాత హృదయం మీదనుండి కొండంత భారాన్నేదో దింపేస్తున్నట్టు తేలిగ్గా అనిపించింది.

 

    నా గురించి మరో వ్యక్తికి అంత నిర్లజ్జగా చెప్పేసుకుంటున్నాననో, తనేం అనుకుంటుందనో శంక నాకు కలగలేదు. ఒక నమ్మకమైన మనిషి ముందు మనల్ని మనం విశ్లేషించుకోవడంలో ఇంత రిలీఫ్ వుంటుందని అప్పటివరకూ నాకు తెలియదు.

 

    అంతా చెప్పేసి నా భారాన్నంతా మరొకరిమీద మోపేసిన నిశ్చింతతో నా మోకాళ్ళ చుట్టూ చెయ్యేసుకుని వాటిమీద తల ఆనించి నిశ్శబ్దంగా వుండిపోయాను.

 

    నేను చెప్తున్నంతసేపూ వదిన మౌనంగా వింది. చాలా సేపు ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా వుండిపోయింది. నేను ఆమె చెప్పబోయే దానికోసం చూస్తున్నాను.

 

    ఆమె లేచి, "పడుకో! బాగా పొద్దుపోయింది. ఏం చెయ్యాలో రేప్పొద్దున నిర్ణయించుకుందాం!" అని నిశ్శబ్దంగా ఆ గదిలోనుంచి వెళ్ళిపోయింది.

 

                                        *    *    *

 

    ఎప్పటికో మెలకువ వచ్చింది. వదిన అమ్మతో "ఏదో చిన్న మాటా మాటా అనుకున్నారులా వుంది. సాయంత్రం వచ్చాక నేనడుగుతానులెండి! మీరేం కదిలించొద్దు. మీతో చెప్పడానికి మొహమాట పడుతుందేమో!" అంటోంది.

 

    "అలాగేలే. అయినా పెళ్ళయి ఇన్నేళ్ళయినా గొడవ లేమిటి?" సణుగుతోంది అమ్మ.

 

    నేనలాగే పడుకుండిపోయాను. వదిన ఆఫీసుకి వెళ్తూ వెళ్తూ గదిలోకి వచ్చింది.

 

    "నేనీ రోజు నీ భర్తని కలిసి, అతనితో మాట్లాడి చూస్తాను. ఏదైనా ఫలితముంటే మంచిదే. లేదంటే ఇక డైవర్స్ తప్పదు. అంతవరకూ అమ్మవాళ్ళతో ఏం చెప్పద్దు. సరేనా?" అంది.

 

    సాయంత్రం వరకు ప్రశాంతంగా గడిచిపోయింది. నేనూ మనసులో ఎలాంటి ఆలోచనలూ పెట్టుకోకుండా అమ్మతో మాట్లాడుతూ గడిపాను.

 

    అయినా మనసులో టెన్షన్ గానే వుంది.

 

    వదిన సాయంత్రం ఏడింటికి ఇంటికి వచ్చింది. తన మొహంలోకి చూసి నేనేమీ చదవలేకపోయాను. అమ్మని, పాపని, నాన్ననీ, గుడికి పంపేసి డాబామీదకి కుర్చీలు తీసుకువెళ్తూ "పద!" అంది.

 

    టీ తాగుతున్నంతసేపూ మేమేం మాట్లాడుకోలేదు. తర్వాత అంది- "నేను మీ బావగారినీ, భర్తనీ ఇద్దరినీ కలిశాను. ఇద్దరిలోకి కాస్త నీ బావగారే బెటరు. ఆయన లౌక్యుడైతే అయ్యుండవచ్చు. కానీ, నీ పట్ల నిజంగానే కాస్తంత సాఫ్ట్ కార్నరుంది. అది ప్రేమని నేను అనను. ప్రస్తుతం అతను నీకు జరిగిన అన్యాయానికి జాలో, పశ్చాత్తాపమో పడుతున్నాడు" అంది.

 

    నేను విషాదంగా నవ్వి, 'దానివల్ల ఆయనకొచ్చే నష్టం ఏమీలేదు కాబట్టి" అంటూ ఆగి, "ఇంతకీ నా భర్త ఏమంటున్నాడు?" అనడిగాను.

 

    "అతను పెనంమీద ఆవగింజలా పేలిపోతున్నాడు. రాజీ పడడానికి ఒప్పుకోవట్లేదు. మొత్తం మీ వంశాన్నే తిట్టాడు. అతనితో నువ్వు రాజీపడాలని ఎందుకు అనుకుంటున్నావో నాకు తెలియట్లేదు. నీకు డైవర్స్ అంటే భయంగా వుందా? అమ్మా, నాన్న బాధపడతారేమోనని ఆలోచిస్తున్నావా, లేక... లేక అతన్ని ఇంకా ప్రేమిస్తున్నావా?" అన్నది.

 

    "నా కూతురికోసం వదినా! నీకు తెలియనిదేముంది? మనం చేసే పొరపాట్లకి పిల్లలు బలికాకూడదు. నా కూతురికి తండ్రి ప్రేమ దూరం చేయడం నాకిష్టం లేదు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లీ తండ్రీ ఇద్దరూ అవసరమే. ఆ ఒక్క కారణం వల్లనే నేనింత తాపత్రయ పడేది" అన్నాను.

 

    వదిన చురుగ్గా చూసింది. "అంత అసహ్యంగా పోట్లాడుకునే తల్లిదండ్రుల మధ్య పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారనుకుంటున్నావా? ఇలా అంటున్నానని మరేం అనుకోకు. అతనికి నువ్వంటే ఏ మాత్రం గౌరవం లేదు. భార్యాభర్తలమధ్య ప్రేమకంటే గౌరవం, అవగాహన ఎక్కువ అవసరం. అది లేనప్పుడు పిల్లలమనస్సు మరింత కలుషితమవుతుంది. అంతకంటే "తండ్రి లేడు" అనే నిజాన్ని ఒప్పేసుకుని బతకడం నేర్చుకుంటే పిల్లలు బాగుపడతారేమోనని నా వుద్దేశం" అంది.

 

    వదిన కూడా మేము విడిపోవడాన్ని ఎందుకు సమర్థిస్తోందో నాకు అర్థంకాలేదు.

 

    ఇంతలో వదిన అంది- "నా కొకటి అర్థంకాలేదు. నువ్వూ, నీ బావగారూ ఇద్దరూ కల్సి చేసిన తప్పుకి నీ భర్త నిన్ను మాత్రమే నిందిస్తున్నాడు. అసలు అతనికి తన అన్నయ్యంటే శ్రుతిమించిన కృతజ్ఞతో, అసలు తన వాళ్ళంటేనే వున్న పక్షపాత బుద్దో అర్థంకాలేదు".

 

    నేను విషాదంగా నవ్వాను. "ఇందులో చిత్రమేమీ లేదు, వదినా! మగవాళ్ళ సంగతి వదిలెయ్! ఇదంతా ఒక కథగా రాస్తే, ఆడవాళ్ళు కూడా 'ఛీ' కొడతారు. బావగారంటే తండ్రితో సమానం కదా అంటారు. ఎంత ఒంటరితనంతో బాధపడుతుంటే మాత్రం- అలా అక్రమ సంబంధం ఏర్పరచుకోవడమేనా అని ముక్కునవేలేసుకుంటారు. ఒంటరితనంతో బాధపడే వాళ్ళందరూ ఇలాగే సంబంధాలు పెట్టేసుకుంటున్నారా అని చీదరించుకుంటారు. అంతవరకూ ఎందుకు? ఇప్పుడాలోచిస్తుంటే- ఎందుకంత అనాలోచితంగా ప్రవర్తించానా అని నాకే అనిపిస్తోంది".   

 

    "స్త్రీ మానసికంగా ఒంటరి అయినప్పుడు- కాసింత ఓదార్పుకోసం విలవిలలాడుతుంది. అది 'దేనికి దారితీస్తుంది' అనేది చుట్టూ వున్న అవకాశాల మీద ఆధారపడి వుంటుంది".

 

    "నేను మాట్లాడుతున్నది నైతిక విలువల గురించి వదినా!"

 

    "నైతిక విలువల్ని కూడా 'అవకాశమే నిర్దేశిస్తుంది. యుగయుగాల చరిత్ర- మగవాడికి ఆ 'అవకాశాన్ని' ఇచ్చింది. కాబట్టే స్త్రీకో విలువా, పురుషుడికో విలువా ఏర్పడ్డాయి. ఒకే తప్పు ఇద్దరూ చేసినా స్త్రీని క్షమించకపోవడం అనేది మన రక్తంలో జీర్ణించుకుపోవడానికి కారణం కూడా ఆ చరిత్రే. మన విలువల్ని మన తర్కం కాకుండా చరిత్ర నిర్దేశించడం ఎంత దురదృష్టకరం!"  

 

    నేను వదినవైపు అప్రతిభురాలినై చూశాను. కేవలం నా గిల్టీఫీలింగ్ పోగొట్టడానికి కాదు, ఆ మాటలు ఆమె మనసులోంచే వచ్చాయి. అది గుర్తించి ఆమె వ్యక్తిత్వానికి లోలోపలే జోహార్లర్పించాను. ఈమె నా అన్నయ్య భార్యగా ఈ ఇంట్లో ప్రవేశించినప్పుడు- నా అన్నయ్య ఆమెకు రెండో భర్త అని తెలిసి నేనేమనుకున్నానో గుర్తొచ్చి, నాకు చాలా సిగ్గువేసింది. అన్నయ్య ఆమెను ఎందుకంతగా ప్రేమిస్తాడో అర్థమైంది.

 

    నా ఆలోచనలు చెదరగొడుతూ నా వదిన అంటోంది- "అతనంత అసహ్యంగా మాట్లాడగలడని నేనూహించలేదు. ఆ క్షణంవరకూ నీవు పొరపాట్లు చేశావు అనే భావన నాలో ఎక్కడైనా వుండుంటే అది ఆ క్షణంలో పోయింది. ఇక అతనితో వాదించడం అనవసరం అనుకున్నాక, అతనితో నాక్కొన్ని ఒడంబడికలు అవసరమయ్యాయి. విడాకులు ఎలాగూ తప్పవు. కనీసం జరిగిన విషయాలన్నీ ప్రపంచానికి తెలియకుండా గుట్టుగా విడిపోతే బాగుండుననిపించింది".

 

    "విడాకులు అంత అవసరమా, సింగిల్ గా విడిపోతే చాలదా?" అనడిగాను.

 

    "ముందు నేనూ అలానే అనుకున్నాను. విడాకులివ్వడానికి మా అమ్మాయి సుముఖంగా లేదని చెప్పాలని నోటివరకూ వచ్చింది. కానీ దానివల్ల మనకే నష్టం. అతను ఆవేశంతో కోర్టుకెక్కి ఇవన్నీ బయట పెడతాడు. దానివల్ల మనకే నష్టం ఎక్కువనుకో. వాడిని ఓ అమ్మాయి ఆత్మహత్యకి కారకుడిగా నిరూపించే ఎలిబీ కూడా మన దగ్గరుంది. కానీ ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలని మనం ఒక కన్ను పోగొట్టుకోవడం వివేకం కాదు కదా! ఇవన్నీ తెలిస్తే ప్రపంచం సంగతేమో కానీ అమ్మ, నాన్న ముఖ్యంగా నీ కూతురూ బాధపడతారు. అందుకే విడాకులకి ఒప్పుకున్నాను. ఇద్దరికీ భేదాభిప్రాయాలు, ఈగో ప్రాబ్లమ్స్ వల్ల విడిపోతున్నారు అని తప్ప మరే విషయం బయటకు రావడానికి వీల్లేదన్నాను. అతనూ తెలివితక్కువ వాడేం కాదు. మన దగ్గర ఆ ఉత్తరం వుందన్న విషయం తెలుసు కాబట్టి బాగా చల్లబడ్డాడు. నాకు తెలిసినంతవరకూ ఈ విషయాలేవీ బయటకు రాకుండా నీవు ఈ ఊబినుంచి బయట పడతావు!" వదిన చెప్తోంది.

 

    నేను తననే చూస్తూ ఆలోచిస్తున్నాను. వదిన నా చేతిమీద తట్టి, "ఏమిటి ఆలోచిస్తున్నావు? మీ ఇద్దరినీ కలపడం బదులు వ్యవహారం మరింత అసహ్యంగా చేశాననా?" అంది.

 

    నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఏం చేసి తీర్చుకోను తన ఋణం? నా సంగతంతా తెలిసినా నన్నేమాత్రం అసహ్యించుకోకుండా కనీసం మాటల్లో, చూపుల్లో కూడా ఎక్కడా అపహాస్యం కూడా లేకుండా నన్నింత గౌరవిస్తూ...

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra