Home » Yandamuri veerendranath » Anaithikam


    నా మాటలు పూర్తి కాలేదు. అతను ఛివాలున లేచాడు. "కలిసి వుండడమనే ప్రశ్నే లేదు. నువ్వు నీకు తోచినవాళ్ళతో కలిసి వుండచ్చు. నా దారి నేను చూసుకుంటాను" అన్నాడు.

 

    నా కంటి చివర్లలో నీళ్ళు చేరుతున్నాయన్న సంగతి నాకు తెలుస్తూనే వుంది. వాటిని ఆపుకుందామన్న ప్రయత్నం నిరర్థకమవుతోంది. బహుశా ఈ నీటిని భగవంతుడు స్త్రీని సృష్టిస్తున్నప్పుడే ఆమె నిస్సహాయతకి గుర్తుగా వాటిని తోడిచ్చి ఈ భూమిమీదకి పంపించి వుంటాడు. నేను ఆ క్షణం భగవంతుడితో పోరాడదల్చుకున్నాను. అందుకని దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకున్నాను.

 

    అయితే నేను నా భర్త దగ్గరేమీ దాచదల్చుకోలేదు. మా బావగారితో అసలు సంబంధం లేదనీ, అది కేవలం 'పవిత్రస్నేహ' మనీ చెప్పదల్చుకోలేదు. ఆయనకూ నాకూ మధ్య వున్న సంబంధం గురించి ఏవైనా రుజువులు చూపించమని సవాల్ చేయదల్చుకోలేదు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడం లాంటి పెద్ద పెద్ద మాటలు అనవసరం కానీ నా కెందుకో గతాన్ని ఒక పీడకలగా మర్చిపోయి, భవిష్యత్తుని భర్తతో పునర్నిర్మించుకోవాలనే- ఆశ బలంగా కలుగుతోంది. అందుకే వీలైనంతవరకూ సహనంతో, ఓర్పుతో మాట్లాడడానికి ప్రయత్నించసాగాను. అయితే నా భర్త దేనినీ వినే మూడ్ లో లేడు. విసురుగా పచార్లు చేస్తూ అన్నాడు.

 

    "పెళ్ళి చేసుకున్న రోజునుంచీ నువ్వు నా పట్ల నిరాసక్తతని ప్రదర్శిస్తూనే వున్నావు. బాధ్యతల్ని పంచుకోకుండా హక్కుల కోసం పోరాడావు. నా ఇష్టాఇష్టాలకీ విలువ ఇవ్వకుండా నీకు తోచిన నిర్ణయాలు తీసుకున్నావు. అన్నిటికన్నా ముఖ్యంగా నన్నూ, నా వాళ్ళని వేరు చేయడానికి ప్రయత్నించావు. నాకు మానసికంగా, శారీరకంగా కూడా ఏ తృప్తీ, సుఖమూ ఇవ్వక పోయినా నిన్ను సహిస్తూనే వచ్చాను" అన్నాడు- చివరి వాక్యం నొక్కి పలుకుతూ.

 

    ఆ పరిస్థితుల్లో కూడా నాకు నవ్వు వచ్చింది. అతడు నాపై చేసిన ఆరోపణలన్నీ అతడికి వర్తిస్తాయి. కానీ తెగేవరకూ తాడులాగడం ఇప్పుడు నా అభిమతం కాదు. అందుకే అనునయంగా అన్నాను.

 

    "చూడండీ, మీరు నా పరిస్థితిలో వుండి ఆలోచించండి. ఒక కొత్త పెళ్ళికూతురుగా నేనీ ఇంట్లో ప్రవేశించాను. నాకూ కొన్ని ఆశలూ, ఆశయాలూ వుంటాయి. నేనూ చదువుకున్నాను. భర్తతో కలిసి సుఖంగా సంసారం చెయ్యాలనీ, చిన్న చిన్న ఆనందాలని హృదయపూర్వకంగా ఆనందించాలనీ, ఎన్నో కోరికలతో ఈ ఇంట్లో ప్రవేశించాను. మీకూ, నాకూ మధ్య తెలీకుండానే ఏదో తెర ఏర్పడిపోయింది. వీలైనంతవరకూ దాన్ని తొలగించాలని ప్రయత్నించాను. కానీ మీ వైపునుంచీ ఏ స్పందనా రాలేదు. నేనూ మామూలు మనిషినే! నాకూ కొన్ని బలహీనతలుంటాయి. నా గొప్పదనాన్నీ, చురుకుదనాన్నీ నా భర్త గుర్తించాలనుకుంటే అందులో పొరపాటేమీ లేదే! అటువంటి పరిస్థితికో నాకో చిన్న ఆలంబన లభించగానే అటువైపు మొగ్గాను. ఇదంతా తప్పా, కాదా అన్న ప్రశ్న పక్కన పెట్టి మనం భవిష్యత్తు గురించి ఆలోచించుకుందాం. ఇప్పుడు నేను మానసికంగా పరిణతి చెందాను అనను కానీ వాస్తవ పరిస్థితుల్ని సరైన దృక్పథంతో చూడగలుగుతున్నాను అనుకుంటున్నాను. మనిద్దరం ఒక మంచి భవిష్యత్తుని నిర్మించుకుందాం".

 

    "చిన్న ఆలంబన దొరికితే వెళ్ళి పోవడానికి, తిరిగి వెనక్కి రావటానికి ఇదేమీ రాజకీయ వ్యవహారం కాదు" వెటకారంగా అన్నాడు. "నువ్వు నాకెంత దూరమయ్యావో, నేనూ నీకంతే దూరమయ్యాను. కానీ నేను నీలాగ పరాయి స్త్రీల కోసం వెంపర్లాడలేదే!"

 

    నేను విస్తుపోయి అతడివైపు చూశాను. అతడేం మాట్లాడుతున్నాడో కొద్ది కొద్దిగా అర్థమవసాగింది. "అంటే మీరు చెప్పేది మీ కింతకాలం ఏ స్త్రీతోనూ పరిచయం లేదనా?" నా కంఠం నాకే వింతగా ధ్వనించింది.

 

    అతడు విసురుగా నావైపు తిరిగాడు. "ఏమిటి నీ ఉద్దేశం? నేను నీలాగా ఎవరు దొరుకుతారని మొహం వాచి కూచున్నాననుకున్నావా? నైతిక విలువలపట్ల నాకు చాలా గౌరవం వుంది. అందుకే నేను నిన్ను వదిలేద్దామనుకుంటున్నాను. కొద్దిగా కష్టంరాగానే ఎవడు దొరుకుతాడని వెంపర్లాడే స్త్రీ నా భార్య అనుకోవడమే నాకు చాలా నీచంగా వుంది. అంతవరకూ ఎందుకు? నీ భాగోతమంతా పదిమంది ఆడాళ్ళకే చెప్పిచూడు. నీ మొహం మీదే ఉమ్మేస్తారు. అందరి సానుభూతి నా మీద వుండకపోతే చెప్పుచ్చుకొట్టు".    

 

    నేనతని వైపు సూటిగా చూశాను. ఎవరో రచయిత వ్రాసిన మాటలు గుర్తొచ్చాయి. మనుష్యులు ఒక రకంగా బతుకుతుంటార్ట. మరోరకంగా ఆలోచిస్తూంటార్ట. బతుకుతున్న విధానాన్ని సపోర్ట్ చేయకుండా వారి ఆలోచనలెప్పుడూ ఎలా బతకాలనుకుంటారో ఆ విధానాన్నే సపోర్ట్ చేస్తాయిట. మనసా వాచా కూడా వాళ్ళు దాన్నే నమ్ముతార్ట. నా భర్తకూడా అలాటి జాతికి చెందినవాడని మొట్టమొదటిసారి అర్థమైంది. అయినా కూడా నేను నా సహనాన్ని కోల్పోకుండా-

 

    "అయిపోయిందేదో అయిపోయింది. ఇక నుంచి..."

 

    నా మాట పూర్తికాకుండానే అతడు "ఎన్నిసార్లు చెప్తావు, అయిపోయిందేదో అయిపోయిందనీ? ఏమీ అవలేదు, ఇప్పుడే ప్రారంభమైంది. నీలాంటి కులటని నేను నా భార్యగా ఏలుకోలేను. శ్రీరామచంద్రుడంతటివాడే సీతనడవికి పంపించాడు. హేళనగా అన్నాడు.

 

    "మీరు శ్రీరామచంద్రుడూ కాదూ, నేను సీతనూ కాదు" అన్నాను నేనూ అంతే విసురుగా.

 

    "అంటే ఏమిటి నీ ఉద్దేశం?"

 

    "పరాయి స్త్రీ వళ్లో తలపెట్టుకుని ఆమెతో తన భార్య గురించి నీచంగా చెప్పి, ఆమెని వాడుకుని, గర్భవతిని చేసి, ఆత్మహత్యకి కారణమైనవారు శ్రీరామచంద్రుడెలా అవుతారు?"

 

    అయిపోయింది. ఏ టాపిక్ మా మధ్యకి రాకూడదనుకున్నానో అది వచ్చేసింది.

 

    నా నోటినుంచి ఆ మాటలు రాగానే అతడు కాసేపు మ్రాన్పడిపోయాడు. నావైపు తెల్లబోయి చూశాడు. మనిషి మనస్తత్వం ఎంత భయంకరమైనది? తను తప్పుచేసినా అది ఎదుటి వ్యక్తికి తెలియలేదంటే తనూ తప్పు చేయనట్టే వుంటాడు. తనని తానే నమ్మించుకుంటాడు కూడా! కానీ తెలిసిందని అర్థమైతే... "ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది?" అనడిగాడు.

 

    "ఒకే తప్పు ఇద్దరం చేశాం. అటువంటప్పుడు దాన్ని మర్చిపోయి వున్నంతలో సుఖంగా బతుకుధామంటున్నాను".

 

    అతడికేదో అర్థమైందనుకుంటాను. కానీ ఇంకా అనుమానం తీరనట్టు "ఒక తప్పు ఇద్దరం చేయడమేమిటి?" అన్నాడు.

 

    "నేను మాట్లాడుతున్నది నా తోడికోడలి చెల్లెలి సంగతి" అన్నాను.

 

    అయితే నేనాశించినట్టు నా భర్తలో ఏ విధమైన అలజడీ కనిపించలేదు. అప్పటికే అతడు మానసికంగా ప్రిపేరైపోయినట్టున్నాడు.

 

    "ఓహో! అంతా నీకు తెలిసిందన్నమాట. అవును, నేను తప్పుచేశాను. ఇప్పుడేమంటావ్? నీ తప్పుకీ నా తప్పు చెల్లంటావా?" అని అడిగాడు.

 

    "బాకీలు, చెల్లుబాట్ల సంగతి నేను మాట్లాడడంలేదు. ఆవేశంలోనో, అనాలోచితంగానో మనిద్దరం ఒకేపని చేశాం. ఎంత కాదనుకున్నా మనిద్దరం భార్యాభర్తలం. అవగాహనాలోపం వల్ల మనిద్దరం దూరమయ్యాం. ఇప్పుడు మన తప్పులు సరిదిద్దుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఇద్దరం తప్పులు చేశాం కాబట్టి ఒకర్నొకరం క్షమించడం తేలికవుతుందని నా ఉద్దేశ్యం".

 

    "ఊఁ ఇంకా" అన్నాడతను.

 

    "ఇంకా నేను చెప్పడానికేమీ లేదు. పాపతో కలిసి మనిద్దరం కొత్తజీవితాన్ని ప్రారంభిద్దాం. నేను వాగ్దానం చేస్తున్నాను. భవిష్యత్తులో నాతో జీవితం మీరు బాధపడేలా వుండదు. పైపెచ్చు మరింత ఆనందప్రదంగా వుంటుంది".

 

    అతను హేళనగా నవ్వాడు. "నీకు మొదటినుంచీ నీ తెలివితేటల మీద గొప్పనమ్మకం. నీ అంత మేధావి మరొకరు లేరని అహంకారం నీకు! నీ తెలివి, నీ చదువుల ముందు మొగుడు, అత్తగారు, సంసారం అన్నిటికీ చిన్నచూపే! నువ్వు ఏది ఆలోచించినా అదో పెద్ద అద్భుతం అనుకుంటూ వుంటావు. నీకు బోల్డంత జనరల్ నాలెడ్జి వుందనే భ్రమ. ఏమైంది. అన్నిటికంటే హాస్యాస్పదమైన విషయం తెలుసా? నువ్వు మా అన్నయ్యతో నడిపిన భాగవతం అంతా ఎవరికీ తెలీదనుకున్నావు. కానీ మా వదినతో సహా అందరికీ తెలుసు. చివరగా తెలిసింది నకే!"

 

    "...నీకు నేను అన్నీ ఇచ్చాను. ఇల్లు, సంసారం, సుఖప్రదమైన జీవితం, ఒక పాప, అన్నీ వుండికూడా నువ్వు ఇంకొకడితో సంపర్కం పెట్టుకున్నావు. కానీ నేనలా కాదే! అన్నీ కోల్పోయిన తర్వాత అప్పుడు పరాయి స్త్రీ పంచన చేరాను. నీ నుంచి ఏ సుఖమూ లభించదని తెలిసాక వేరేచోట సుఖం వెతుక్కున్నాను. నీకూ, నాకూ పోలికేమిటి?"

 

    అతడు చప్పున ఆ విధంగా ప్లేటు మార్చేక నాకు ఏం వాదించాలో తెలీలేదు. అయినా ఇటువంటి వాదనవల్ల ఫలితమేమీ వుండదు. ఒకరినొకరు నిందించుకునే కొద్దీ ఆ దూరం మరింత ఎక్కువవుతుందని నాకు తెలుసు. "అయితే నా అఫైర్ కన్నా ముందే మీ అఫైర్ మొదలై వుంటే మీరు నన్ను క్షమించేవారా?" అని అడుగుదామని నోటి చివరివరకూ వచ్చింది. కానీ అతన్ని మరింత రెచ్చకొట్టడం ఇష్టంలేకపోయింది. ఒక్కొక్కమాట కూడగట్టుకుంటూ అన్నాను.

 

    "...అవును. నేను అఫైర్ నడపడం తప్పే. నిజంగానే నేను తెలివైనదాన్ననే అనుకున్నాను. అందుకే నా తెలివితేటల్ని గుర్తించాడనుకున్న మీ అన్నయ్యతో అఫైర్ కొనసాగించాను. కానీ మీరూ అంతేగా... సంసారానికి తెలివితేటలు అక్కరలేదనుకున్నారు. అందుకే మీకు నచ్చిన, మీకన్నా తక్కువ తెలివైన, ఒద్దికైన అమ్మాయిని మీరు వాడుకున్నారు. ఆ అమ్మాయి అమాయకత్వాన్ని మీ స్వలాభానికి ఉపయోగించుకున్నారు. ఆమె ఆత్మహత్యకి కారణమయ్యారు. నేను కనీసం ఆ పాపం మూటగట్టుకోలేదు కదా..."

 

    అప్పుడు కొట్టాడతడు. క్షణంలో చెంప ఎర్రగా పొంగి పోయింది. నాకు కన్నీళ్ళు రాలేదు. అతని పురుషాధిక్యతని నేను అర్థం చేసుకోగలను. అందుకే మౌనంగా వేచి వున్నాను. అతడి ఆవేశం తగ్గుతుందనీ, సవ్యంగా ఆలోచించే స్థితికి వస్తాడనీ ఎదురు చూస్తున్నట్టు నిశ్శబ్దంగా కూచుండిపోయాను.

 

    అతడు పళ్ళు బిగపట్టి అన్నాడు. "అదే... అదే నీ అహం. ఆ అహమంటేనే నాకు వళ్లు మంట. సంసారానికి నువ్వసలు పనికి రావు. స్త్రీకి కాస్తంత స్త్రీత్వం, కాస్త ఒద్దిక, వినయ విధేయతలు, సంప్రదాయం లాంటివి కావాలి. అవి అసలు నీ డిక్షనరీలో లేని లక్షణాలు. నేను నిన్నెందుకు వదిలేస్తున్నానో ఇప్పటికైనా అర్థమైందా?"    

 

    స్త్రీత్వమంటే ఏమిటో ఏ డిక్షనరీలో వుందో నాకు తెలీదు. కానీ ఒద్దిక, వినయ విధేయతలు సంప్రదాయం లాంటివి కేవలం స్త్రీకే ఎందుకు కావాలో మాత్రం నాకు అర్థంకాలేదు.

 

    ఈలోగా అతనన్నాడు. "ఇక మనిద్దరం కలిసి బ్రతకడం అసంభవం. నేను నీ దగ్గరకొచ్చిన ప్రతిసారీ నీ అంగాంగాల్నీ ఇంకెవరో ముట్టుకున్నారన్న భావం నన్ను దహించివేస్తుంది. అంతేకాదు, నాకు కాంప్లెక్సు ఎక్కువ. ఈ ఇంట్లో అన్నయ్యపట్ల నాకు గౌరవమే కాదు, కాంప్లెక్సు కూడా వుంది. అతను నాకన్నా అన్ని విధాలా అధికుడన్న భావం నా రక్తంలో జీర్ణించుకుపోయింది. చివరికి నా భార్యని కూడా అతను కొల్లగొట్టాడు. నీతో గడిపిన ప్రతిక్షణం ఆ భావం నన్ను వెంటాడుతుంది...."

 

    తరతరాల పురుషాధిక్య, పురుషాధిక్య, పురుషాభిజాత్యానికి అతడు ప్రతినిధిలా మాట్లాడుతున్నాడు. 'ఇంకెవరో ముట్టుకున్నారన్న భావ' మట! మరి నాకుండదా అది! అయినా నేను రాజీ పడుతూనే వున్నానుగా. అతడి అన్నయ్య అతడినుంచి అన్నీ తీసేసుకుంటే అది అతడి లోపంకాదా?

 

    "మీరిక్కడినుంచి ఎక్కడికైనా ట్రాన్స్ ఫర్ చేయించుకోండి. మనం ముగ్గురం వెళ్ళిపోదాం. కనీసం పాప భవిష్యత్తు కోసమైనా మరొకసారి ఆలోచించండి" అన్నాను చివరి ప్రయత్నంగా.

 

    "పాప నాతోనే వుంటుంది".

 

    నేను ఛివుక్కున తలెత్తి "నో" అని అరిచాను. బిగ్గరగా "పాపని వదిలి నేనుండలేను".

 

    అతను నవ్వాడు. "థాంక్యూ! నీతో ఆ మాట అనిపించాలనే నేనలా అన్నాను. పాప నాకవసరం లేదు. పాపకి తండ్రి కావాలంటే మా అన్నయ్యని రెండో పెళ్ళిచేసుకో! వదిన్ని మాత్రం మీరిద్దరూ కలిసి అన్యాయం చేయకండి". మళ్ళీ అదే వెటకారం ధ్వనించింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra