Home » Suryadevara rammohan rao » త్రినేత్రుడు-1


    అప్పటికి బోస్ ని హాస్పటల్లో చేర్పించి మూడు రోజులైంది. అతనికింకా స్పృహ రాలేదు. ఓ పక్క తన పనులు చూసుకుంటూనే ప్రతిరోజూ ఉదయం సాయంత్రం బోస్ ని చూసేందుకు హాస్పటల్ కి వస్తున్నాడు త్రినాధ్.

    ఈలోపు జరిగిన మరో మార్పు త్రినాధ్ తల్లితో సహా మంచి ఇంట్లోకి అద్దెకు దిగటం... ఆశించినా జరగని మార్పు- తనిచ్చిన ప్రకటనలకు ఒక్క అప్లికేషన్ మించి రాకపోవటం.

    త్రినాధ్ ప్రస్తుతం హాస్పటల్ వరండాలో అసహనంగా పచార్లు చేస్తున్నాడు. అక్కడే ఓ పక్కగా వున్న బెంచ్ మీద హిందూ కూర్చునుంది.

    ఆమె కింతవరకు ఏం జరిగిందో తెలియలేదు. త్రినాధ్ కూడా చెప్పలేదు.

    బోస్ మీద ఈ మధ్యవరకూ హిందూకి కోపంగా, అసహ్యంగా వుండేది. కాని హాస్పటల్లో చేర్పించిన తొలిరోజు అతనిమీద ఒకింత జాలి కలిగింది. అసలేం జరిగిందోనని ఆమెకు ఆతృతగా వుంది. ఉండబట్టలేక చివరకు నోరు తెరిచి అడిగింది.

    "అసలేం జరిగింది త్రినాధ్...? అతను ఎలా దెబ్బలు తిన్నాడు? నీళ్ళల్లో ఎందుకు పడ్డాడు..." ఆమె ప్రశ్నకు ఓ క్షణం పచార్లు చేస్తున్నవాడల్లా ఆగిపోయి ఆమె మోములోకి చూశాడు.

    ఆమె కళ్ళ లోతుల్లో ఎక్కడో సూక్ష్మంగా ఆందోళన పొడచూపింది.

    జరిగిందంతా సంక్షిప్తంగా చెప్పాడు త్రినాధ్. ఆమె విస్మయంగా వింటుండిపోయింది. ఆఖరుగా అడిగింది ఓ ప్రశ్న "ప్రియాంకను వెంటాడిన వాడివి హఠాత్తుగా వెనక్కు ఎందుకు తిరిగావ్...?"

    "ప్రియాంకలో కనీసపు మానవత్వం లేదు. ఒక రకంగా ప్రియాంక కన్నా బోసే మానవత్వమున్నవాడు. బోస్ గ్యాంగ్ మిగతా ఆడపిల్లల్ని వేధిస్తుంటే వారిని వారించాడు. అంటే ఏమిటర్ధం...? ఏదో ఒకటి ఎలాగోలా చేయాలనుకోలేదతను. అతని కక్ష కేవలం ప్రియాంక మీదే, అందుకే ఆ క్షణాన వాళ్లు బ్రతికిపోయారు. ఇకపోతే ప్రియాంక ఆ స్థితిలోనూ బోస్ ని రెచ్చగొట్టినట్లు తెలిసింది. నేను బోస్ తో ఆమె కోసం పోరాడుతుండగా, ఆ పోరాటంలో బోస్ దే పైచేయి అవుతుండగా గమనించి కూడా ఏదో ఒకటి తనకు చేతనైన సహాయం నాకు చేయకపోగా, సందు చూసుకొని ఆ ప్రాంతం నుంచి ఉడాయించాలని చూసింది. ఆ సమయంలో ఆమె ఆలోచన ఒక్కటే- తను బోస్ నుంచి తప్పించుకొని- నేను బోస్ చేతిలో చావు దెబ్బలు తినాలని-"

    "ఎంత దారుణమైన ఆలోచన...?!" హిందూ ప్రియాంక మనస్తత్వానికి నిర్ఘాంతపోయింది.

    "ఒక దశలో, ఆమె పక్కగా పడున్న బోస్ చెయిన్ ని నాకు అందించగలిగి వుండి కూడా- నేనా ఉద్దేశంతో ఆమెవేపు ఆశగా చూసినా- ఆమె మాత్రం చూడనట్లుగా వుండిపోయింది. ఆఖరు దశలో బోస్ ని ధర్మయుద్ధంలో గెలవడం కష్టమని నాకు తెలిసిపోయింది-" అక్కడో నిమిషం చెప్పడం ఆపాడు త్రినాధ్.

    ఇప్పుడతని ఆలోచనలు కొద్ది క్షణాలపాటు బోస్ చుట్టూ పరిభ్రమించాయి.

    బోస్ నిజంగా గొప్ప బలసంపన్నుడు. శత్రువుని ధర్మంగా తెలివితో దెబ్బతీయగల సమర్ధుడు.

    అంతటి అతని అమితమైన బలం వెనుక వున్న మూర్ఖత్వాన్ని, టెంపర్ మెంట్ ని పక్కకు తప్పించగలిగితే? అప్పుడు స్పురించిందతనికి- ఇలాంటివాడు తనకు కుడిభుజమైతే తను సాధించలేనిది వుండదని. అప్పటికప్పుడే బోస్ పట్ల ఒక నిర్ణయానికి వచ్చాడు- అతన్నెలాగైనా సంస్కరించాలి- అతనిలోని ఆవేశాన్ని కంట్రోల్ చేయాలి- అవసరం వచ్చినప్పుడు అతన్ని రంగంలోకి దింపితే ఒక చిచ్చరపిడుగై విజయాన్ని సాధించిపెడతాడు. తద్వారా అతన్ని బాగుచేసినట్లూ అవుతుంది. తనకు ఉపయోగపడినట్టూ వుంటుంది.

    ఇప్పుడు త్రినాధ్ మొహాన ఒకింత రిలీఫ్ కనిపించింది.

    ఆ మార్పుని హిందూ గమనించకపోలేదు. ఆమెకు రోజు రోజుకు త్రినాధ్ ఒక పజిల్ గా మారిపోతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నట్టుగానే వుంటాడు- అంతలోనే ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆలోచనాపరంగా.

    "నాకు బలం వున్నా దాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం తెలియదు. ఇంతకాలం ఆ అవసరం రాలేదు...." త్రినాధ్ మరలా ఆగిపోయాడు. మాలినిదేవి ప్రసంగ ప్రభావం అతనిమీద బాగా పనిచేస్తోంది. ఎక్కడికక్కడ ఆగిపోయిన తనలోని లోటుపాట్లు, అసమర్ధతపట్ల రియలైజ్ అవుతున్నాడు.

    అవును... ఇప్పుడు తనకున్న బలం ఒక సమర్ధుడుగా ఈ హింసాయుత సమాజంలో తనను తాను రక్షించుకునేందుకు సరిపోయినా, అవసరం వస్తే విపత్కర పరిస్థితిలో శత్రువుల్ని దెబ్బ తీసేందుకు చాలదు. ఇప్పుడు తనకున్న బలానికి ఒడుపు, తెలివి, చాకచక్యం ఫిజికల్ లాజిక్ కావాలి. క్షణాల్లోనే తనను తాను సరిదిద్దుకోగల స్థాయికి ఎదిగిపోయాడు త్రినాథ్ చూస్తుండగానే. 

    ఇప్పుడతని ముఖాన సన్నని చిరునవ్వు కనురెప్పపాటు కాలం మెరిసి అదృశ్యమైంది.

    "అప్పుడిక నా ధ్యేయం ఒక్కటే... ఎలాగైనా బోస్ ని దెబ్బతీసి వార్ని రక్షించాలి. కనుక తప్పే అయినా బోస్ ని అన్యాయంగా చాటు దెబ్బతీయక తప్పలేదు. అలా బోస్ ని దెబ్బతీసి అతన్ని రోడ్డుపక్కకు లాగి వెనుదిరిగేలోపే ప్రియాంక కారు ముందుకి దూసుకుపోయింది. అప్పుడు నాలో కలిగిన కోపమే ఆమెను వెంబడించేలా చేసింది. అయితే కొంతదూరం వెంబడించాక అనిపించింది నా ధ్యేయం నెరవేరే వరకూ సక్రమంగానే ఆలోచించిన నేను తర్వాత అనవసరపు ఉక్రోషానికి లోనయ్యానని, నిస్వార్ధంతో చేసిన సహాయానికి కృతజ్ఞతలు ఆశించి, వెంబడించి అల్పుడినయ్యానని.

    బోస్ పైకి ఎంత రౌడీగా, జులాయిగా కన్పించినా లోలోన ఎంతో సెన్సిటివ్ అని అనిపించింది. అలాంటివాడు రెండే పనులు చేస్తాడు. ఒకటి చాతనైతే అవతలవార్ని నాశనం చేయటం. అది సాధ్యం కానినాడు తల కొట్టుకు చావటం. అతనిలో అవమానాన్ని భరించే అల్పత్వమే ఉంటే తనను ఘోరంగా నలుగురి ముందు అవమానించిన ప్రియాంకను మర్చిపోయి వుండేవాడు. నేను కొట్టిన దెబ్బలకు బోస్ స్పృహ తప్పగలడే కాని చావడు. అతనికి దెబ్బలు తగిలాయే... ఏమవుతాడో అని వెనుదిరగలేదు. నా అంచనా ప్రకారం అతను మరో భీభత్సానికి అన్నా దిగాలి. అలా దిగేందుకు అప్పుడతనికి శక్తి లేదు. ఇక మిగిలింది ఆత్మహత్య. దానికంత బలం, శక్తి అవసరం లేదు. అందుకే.... వెనుతిరిగాను" త్రినాధ్ మాటలింకా పూర్తికాలేదు.

    "శభాష్ త్రినాధ్" అన్న మాటలు వినిపించి ఉలికిపాటుగా వెను తిరిగి చూశాడు త్రినాధ్.

    అక్కడ మాలినీదేవి చిరునవ్వుతో నిలబడి వుంది.


                     *    *    *    *


    పూర్తయిన స్విమ్మింగ్ ఫూల్ వేపు నిర్వికారంగా చూస్తోంది ప్రియాంక బాల్కనీలో నించుని. అంత గొప్ప స్విమ్మింగ్ ఫూల్ ని కట్టించుకోగలిగానన్న ఆనందం లేదిప్పుడామెలో. దాని వెనుక దాగిన త్రినాధ్ తెలివితేటలే ఆమెను ముల్లులా బాధిస్తున్నాయి.

    అడుగుల చప్పుడుకి ప్రియాంక వెనుదిరిగి చూసింది. అక్కడ సైంటిస్ట్ నించొని వున్నాడు.

    ఎంత కాలంగానో తన అద్వితీయమైన అందంపట్ల అడ్మైర్ అవుతున్న సైంటిస్ట్ ని ప్రియాంక తన గుప్పిట్లోకి తీసుకోవటం పెద్ద కష్టం కాలేదు.

    "త్రినాధ్ వివరాలు కావాలి నాకు. అవునూ అతని పేరు తిమ్మడు కదా...? మరి...?"

    "అతనిలో రోజురోజుకు చిత్రమైన మార్పు వస్తోంది. ఆ మార్పు వెనుక పొగరుతో కూడుకున్న అపరిమిత ఆత్మ విశ్వాసం గూడుకట్టుకుంటోంది. అది నచ్చకే నేను అతనితో కలవలేదు..." సైంటిస్ట్ కళ్ళనిండా ఆమె అందం పట్ల పెంచుకున్న ఆరాధనే కనిపిస్తోంది.

    ఆ భావాన్ని ఆమె పసిగట్టింది. అలా అతనిలా గతంలో ఎందరో తనను ఆరాధిస్తూ తన వెంటబడడం, తన కోసం పిచ్చివాళ్ళు కావటం, కొట్టుకోవటం ఆమెకు మామూలే. ఆమెకు అదో హాబీ. తన అందాన్ని అందరూ పిచ్చిగా పొగడటం ఆమెకు మహదానందం కలిగించే విషయం. అది త్రినాధ్ వద్దే ఎదురు తిరిగింది. ఆమె యిప్పుడు కోపంతో బుసలు కొడుతోంది. తన అందాన్ని అందం కాదనటం, తననే గెలుస్తానని సవాలు చేయటం, తను ఎంతో యిష్టపడి, తన స్థాయికి తగిన అందగాడికి సొంతం చేయాలనుకున్న తన అందమైన పెదవుల్ని మూర్ఖంగా ఎంగిలిచేయటమే ఆమెకు పిచ్చి కోపాన్ని తెప్పిస్తున్నాయి.

    "నచ్చకా? లేక సహించలేకా?" ప్రియాంక సర్ కాస్టిగ్గా అడిగింది.

    "దాన్ని తను గమనించలేదు.

    "రెండూ."

    తనను ఆమె దగ్గరకు పిలిచి తనతో కొద్దిసేపు మాట్లాడటం, తన సహాయం అర్ధించటమే అతనికి కొండెక్కినంత ఆనందంగా వుంది.

    "అతని పేరులో మార్పు సంగతి...?"

    "తిమ్మడు బావోలేదని మార్చుకున్నాడు. దానికి తెలివితేటలు వుపయోగించాడు. ఫార్మాలిటీస్ పూర్తిచేసి గవర్నమెంట్ గెజిట్ లో తన కొత్త పేరు చేర్పించుకున్నాడు. రూల్స్ ప్రకారమే తన పేరును మార్పును ఒక పేపర్ లో ప్రకటించాడు" త్రినాధ్ గురించే ఆమె ఎక్కువగా అడగటం అతనికి ఒకింత బాధగా ఉన్నా బయటపడలేదు.

    "అతనిలోని మార్పుకు కారకులు...?"

    "ఉన్నారని తెలుసు. కాని ఎవరో తెలియదు..." ఆమెకు ఆ సమాధానం చికాకనిపించింది. అవసరం వుంది కనుక తన చికాకును సైంటిస్ట్ పట్ల పొగడ్తగా మార్చుకుంది.

    "నువ్వు తలుచుకుంటే ఆ వ్యక్తి ఎవరయిందీ తెలుసుకోగలవ్. యామై రైట్-?" వాలుగా చూస్తూ అంది. 

    "అతి త్వరలోనే తెల్సుకుంటాను-"

    "వెరీగుడ్-" అందామె హుందాగా.

    "థాంక్యూ- వెల్ కమ్-" అన్నాడు. లోలోన మరికొన్నిసార్లు ఆమెను కల్సుకొనే అదృష్టం దొరుకుతుంది గదాని.

    "ఆరువేలతో అతను చేయబోయే వ్యాపారం-?" ఆమె మరింత లోతుగా వెళుతోంది.

    "వాడి ముఖం. ఏ వ్యాపారం లేదు."

    "నేన్నమ్మను..." అందామె సాలోచనగా.

    తనముందు త్రినాధ్ గొప్ప చెప్పటానికి ఇబ్బందిపడి అలా అన్నాడని ఆమె వుద్దేశం. ఆడపిల్లల అందంపట్ల తేలిగ్గా మోజుపడే యువకుల సైకాలజి ఆమెకు కొట్టిన పిండి.

    "ఎవడ్నో నాలుగు తన్ని, బలం వుందిగా, మొరటు బలం పిచ్చి వెధవ రాక్షసుడిలా..."

    "దారి తప్పుతున్నావ్" మందలించింది.

    "సారీ... ఎవడ్నో నాలుగు తన్ని, వాడు ఎంతకాలంగానో దౌర్జన్యంగా వుంటున్న బిల్డింగ్ ని ఖాళీ చేయించాడు. దాంతో ఆ బిల్డింగ్ ఓనర్ సంబరపడిపోయి వీడు కొన్నాళ్ళు ఫ్రీగా అందులో వుండటానికి అవకాశం యిచ్చాడు. ఆ... ఎన్నాళ్ళు వుండనిస్తాడులే..." తీసిపారేస్తూ అన్నాడు.

    "ఎన్నాళ్ళయినా వుండనివ్వక ఏం చేయగలడు? అలా చేయగలిగిన వాడే అయితే త్రినాధ్ సహాయం లేకుండా తనే ఖాళీ చేయించుకోగలిగేవాడు కదా...?"

    ఉలిక్కిపడ్డాడు సైంటిస్ట్ ఆమె లాజిక్ కి.

    "ఇంతకీ ఆరువేలతో చేయబోతున్న వ్యాపారం సంగతి చెప్పనేలేదు" అంది చిరునవ్వులొలికిస్తూ.

    "ఏ వ్యాపారం చేయాలనేది అతనింతవరకు నిర్ణయించుకోలేదు. అయినా ఆరువేలతో ఈరోజుల్లో ఏ వ్యాపారం చేయగలడు... కిళ్ళీకొట్టు పెట్టాలన్నా ఆ మొత్తం చాలదు..."

    త్రినాధ్ పట్ల సైంటిస్ట్ అంతగా ఉక్రోషపడటం, చులకనగా మాట్లాడటం వెనుక అతనిలోని అసూయను ఆమె గ్రహించింది.

    ఎం.ఎస్సీలో అత్యధిక మార్కులతో పాసై, అతి తక్కువ కాలంలో డాక్టరేట్ సంపాదించగలిగిన ఇతను, అక్షరం ముక్క చదువురాని త్రినాధ్ పట్ల అసూయ పడుతున్నాడంటే ఇతనికి లేని శక్తిసామర్ధ్యాలేవో అతనికి వుండి వుండాలి.  

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra