Home » Yandamuri veerendranath » Anaithikam


    నా గొంతులో వున్న వ్యంగ్యం అతనికి అర్థమైందేమో, సన్నగా నవ్వేస్తూ, "ఓ అదా! నిజంగా అలా అనడం నిన్నంతలా బాధించిందా? నేనే సందర్భంలో అలా మాట్లాడానో అర్థం చేసుకోవేం" అన్నాడు అతి మెత్తగా.

 

    "అర్థమయిందండీ... మీ తమ్ముడు చేసిన నిర్వాకం మీరు దాచినప్పుడే మీరు మగవాడి చంచలత్వాన్ని ఎందుకు సమర్ధించారో అర్థమైంది. పరాయి స్త్రీ ప్రేమ మగవాడి అహాన్ని సంతృప్తిపరచడమనేది ఎంత సహజమో మీరు సో....దాహరణంగా వివరించినప్పుడు క్లియరయిపోయింది...." నాలో ఆవేశం కట్టలు తెగింది. "ఏదెలా వున్నా సరే చివరికి ఒకరికొకరుగా మిగిలి పోతారనీ వాళ్ళ బంధం ముందు ఈ ఎఫయిర్ల లాంటివన్నీ అల్పమైనవనీ చెప్పి, మీ తమ్ముడి ఘనకార్యం తెలిసినా కూడా అతనితో నేను కలిసి కాపురం చేయాలన్నదేకదా మీ ఉద్దేశ్యం".  

 

    అతనొక్కసారిగా దిమ్మెరపోయాడు. అంతలోనే తేరుకుని "అయితే నీ కంతా తెల్సిపోయిందా? ఎలా తెలిసింది....? ఎవరు చెప్పారు?" అని అడిగాడు.

 

    నేను క్లుప్తంగా "అది అంత అవసరం కాదనుకుంటాను" అన్నాను. అతనింకా షాక్ నుంచి తేరుకోలేదు. అతడిని సందిగ్ధావస్థలో వుంచడం ఇష్టం లేకపోయింది. జరిగింది చెప్పాను. అంతావిని అతడు ఒక ప్రశ్న- ఒకే ప్రశ్న అడిగాడు. "ఆ అమ్మాయి అన్నట్లు నేన్నిన్ను ఉపయోగించుకున్నట్లుగా అనిపించిందా ఎప్పుడైనా అనిపించిందా?" అని.

 

    క్లిష్టమైన ప్రశ్న. చాలా కష్టమైన ప్రశ్న. నేను స్వార్థపరుడినా అని అడుగుతున్నాడు. ఏది స్వార్థమో, ఏది కాదో ఎలా చెప్పగలను? అసలు ప్రేమంటేనే స్వార్థం. ఎదుటి వ్యక్తిని ప్రేమించడం ద్వారా మనం పొందే ఆనందం కూడా స్వార్థమే. వాళ్ళనుంచి ప్రేమను పొందాలనుకోవడం స్వార్థంలో కెల్లా స్వార్థం. ఆ మొత్తం శ్రేణిలో ఉపయోగించుకోవడమనేది ఎక్కడో అక్కడ జరక్కమానదు. నేను ఆలోచిస్తూనే వున్నాను.

 

    అతను నాకు అతి దగ్గరగా వచ్చాడు. నా మొహంలోకి వాత్సల్యంగా చూస్తూ "ప్లీజ్... అంత వైరాగ్యంగా వుండకు. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా చెప్తున్నాను విను. ఐ లవ్ యూ".

 

    ఒక వ్యక్తి మరోవ్యక్తిని "నేన్నిన్ను ప్రేమిస్తున్నానో" అని అన్నిసార్లు చెప్పి కన్విన్స్ చేయాల్సి రావడమే ట్రాజడీ. అప్పటికే ప్రేమ పునాదులు కూలిపోయినట్టు.

 

    "ఏమిటి... ఇకముందు ఏం చేద్దామనుకుంటున్నావ్ నువ్వు? నాతో చెప్పు. నీ ఏ నిర్ణయానికీ నేనడ్డురాను. వీలైతే చేతనైతే సాయం చేస్తాను. నీ విషయంలో నేను టెంప్ట్ అయినమాట నిజమే. కానీ, నిన్ను ఉపయోగించుకుని వదిలేయాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఇదొక్క నిజం నమ్మి చెప్పు. నీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?" అతని గొంతులో సిన్సియారిటీ కనిపించింది.

 

    "నేను నా భర్తతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. మంచో, చెడో, కష్టమో, సుఖమో అతనితోనే పంచుకోవాలనుకుంటున్నాను". నా మాటలకు అడ్డు తగులుతూ అతనన్నాడు. "మంచిదే. చాలా మంచి నిర్ణయం. ఆలస్యంగానైనా సరైన దారిలో ఆలోచిస్తున్నావు." ఆ....ల....స్యం....గా....నై....నా

 

    అతను అనాలోచితంగానే అన్నాడు. నేనా మాటలకు బాధ పడదల్చుకోలేదు. అతనన్నదాన్లో తప్పేముంది? మొదట్నుంచీ అదేగా అతను నాకు చెప్పింది. అయినా నా మనస్సు చివుక్కుమంది.

 

    నా మనసులో భావాల్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాను.

 

    "నా భర్తమీద హఠాత్తుగా ప్రేమ పుట్టో, నా తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తంగానో అతనికి నేను దగ్గరవదల్చుకోలేదు. నాకు అతన్లో ముందు కనిపించిన లోపాలు కనిపించడం మానేశాయి. అందరు మగవాళ్ళకీ వుండే సాధారణమైన బలహీనతలే అతనికీ వున్నాయి. మిగతా అందరు మగవాళ్ళకీ, అతనికీ ఏ తేడా లేనప్పుడు నేనతన్ని వదిలి వేరే దగ్గర సాంత్వన ఎందుకు పొందాలి అనే జ్ఞానోదయం కలిగింది" ఆగి అన్నాను.

 

    "....నేను చాలా తెలివిగలదాన్ననే గర్వం నాకుండేది. దానికి కారణం యూనివర్సిటీ గోల్డ్ మెడలో, మీరిచ్చిన గుర్తింపో తెలియదు కానీ, ప్రస్తుతం చదువులేని నా తోడికోడలి చెల్లెలికున్న పాటి లోకజ్ఞానం నాకు లేదని ఏ ఈగో లేకుండా ఒప్పుకుంటాను. అంతేకాదు, ఈ క్షణంనుంచి నా జ్ఞానాన్ని వదిలివేయదల్చుకున్నాను. నా సంసారం నాకు కావాలనుకున్నంతకాలం ఓ సగటు భార్యలా నేను కొన్ని కాంప్రమైజెస్, మరికొన్ని త్యాగాలు చేయడానికి వెనకాడదల్చుకోలేదు..."

 

    అతను రెప్పవాల్చకుండా నన్నే చూస్తున్నాడు.

 

    "ప్రస్తుతం నా కూతురే నా ఆనందం. దానికి ప్రేమపూరితమైన వాతావరణం కల్పించడానికి నేనెన్ని రాజీలకైనా సిద్ధమే. మీకు తెల్సా? ప్రస్తుతం నాకున్న ఒకే ఒక కోరికేంటంటే...నా కూతుర్ని జాగ్రత్తగా పెంచాలి. జాగ్రత్త అంటే కట్టుదిట్టాలతో కాదు. ఏది ఏంటో అర్థంచేసుకునేంత తెలివితేటల్ని నేర్పాలి. ఒక మగవాడి చిన్న ప్రశంసకే కలల్లో తేలిపోయేంత ఇమ్మెచ్యూరిటీ దానికి టీనేజ్ లోనే పోగొడతాను. విశిష్టమైన వ్యక్తిత్వాన్ని కలిగిస్తాను. అదే ప్రస్తుతం నా ఆశయం".

 

    "తప్పకుండా చెయ్యగలవు నీవు. అయితే ఇంత వైరాగ్యంగా గాక భవిష్యత్తుని కాస్తంత ఆప్టిమిస్టిక్ గా చూడడం మొదలెట్టు. నీ లైఫ్ లో నీకు జరిగిన మోసాలన్నీ ఇతరుల దృష్ట్యా ఆలోచిస్తే సహజమేనని నువ్వే ఒప్పుకునేంత ఎలివేట్ అయ్యావు కదా! మరిక వైరాగ్యం దేనికి? కమాన్ ... ఛీరప్ నువ్వేం చేయాలనుకున్నా నా సపోర్ట్ నీ కుంటుందని గుర్తుంచుకో" అతను ధైర్యం చెప్తున్నట్లుగా నా భుజంమీద తట్టాడు.

 

    నాకతనంటే కృతజ్ఞతాభావం కలిగింది. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు విడిపోవడం ఇంత సామరస్యంగా వుండదు. ముఖ్యంగా ఎఫయిర్ల విషయంలో. అలాంటిది ఎన్ని అసంతృప్తులు, భేదాభిప్రాయాలతో దూరమైనా ఇంత స్నేహంగా మాట్లాడుకోవడం భవిష్యత్తులో ఈ అనుభవం తాలూకు చేదుని మిగల్చదు.

 

    నేనూ స్నేహంగా అతని చేతిమీద నా చేతిని వుంచి "థాంక్యూ" అన్నాను, అతని చేతిమీద తల వాలుస్తూ-

 

    అప్పుడు జరిగింది- మేమిద్దరం ఊహించని విధంగా!

 

    దగ్గరగావేసిన తలుపుని దఢాల్న తోసి- గుమ్మం దగ్గర నిలబడి వున్నాడు నా భర్త..... అసహ్యం కురిసే చూపుల్తో.

 

    అతడి చేతుల్లో- బిత్తరపోయిన మొహంతో నా కూతురు....

 

    నా మొహంలో రక్తం ఒక్కసారిగా ఇంకిపోయింది. చేతి వేళ్లు సన్నగా కంపించసాగాయి. అయితే ఇది గిల్ట్ ఫీలింగ్ మాత్రం కాదు- అనుకోకుండా నా భర్తని అక్కడ ఆ విధంగా చూడడంవల్ల! నా చేయి ఇంకా బావగారి చేతిమీదే వుంది. ఆయనే నెమ్మదిగా వెనక్కి తీసుకున్నాడు. నేనా విషయం గమనించలేదు. ఇంకా నాభర్తవైపే చూస్తున్నాను.

 

    "అయితే నేనూహించుకుంటున్నదంతా నిజమేనన్నమాట". అతని గొంతు కోపంతో కంపిస్తోంది. కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. 'ఈ రోజు నువ్వు రెడ్ హాండెడ్ గా దొరికావు' అన్నట్లు చూస్తున్నాడు.

 

    నేను అతని మాటల్ని వినడంలేదు. కదలిక లేకుండా అచేతనంగా కళ్ళు పెద్దవి చేసుకుని, బిక్కమొహంతో చూస్తున్న నా కూతురివైపు చూస్తున్నాను. ఆ పాపకి ఏమీ అర్థమై వుండదు. కానీ ఏదో జరగరానిది జరిగిందన్న విషయం మాత్రం అంత చిన్న వయసులోనే గ్రహించగలిగి వుంటుంది. అందుకే కళ్ళప్పగించి చూస్తోంది. నాకెందుకో ఒక్కసారిగా చాలా నిస్సత్తువగా అనిపించింది.   


    
    "రాక్షసీ! నువ్వసలు మర్యాదస్తుల కుటుంబంలో పుట్టిన ఆడదానివేనా? ఎన్నాళ్ళనుంచి జరుగుతోంది ఇలా?" అంటూ గట్టిగా అరుస్తున్నాడు నా భర్త. ఈ లోగా నా బావగారు లేచి అతడితో ఇబ్బందిగా "నువ్వనవసరంగా ఆవేశపడకు. ముందిలా వచ్చి కూర్చో" అంటున్నాడు.

 

    నా భర్త కనీసం అతనివైపు కూడా చూడలేదు. విసురుగా నా దగ్గరకి వచ్చి, చేయి ముందుకు చాచాడు. బహుశా నా జుట్టుపట్టి లాగి ఈడ్చి తన్నాలని అతని ఉద్దేశ్యమై వుండవచ్చు. నేను కదలకుండా అతనివైపే సూటిగా చూస్తూ-

 

    "పాపనిక్కడికెందుకు తెచ్చారు?" అనడిగాను.

 

    నేను అంత ధైర్యంగా ఆ ప్రశ్న అడుగుతానని వూహించక పోవడంతో చాచిన చేతిని వెనక్కి తీసుకుని, హేళన, కోపం మిశ్రమమైన స్వరంతో-

 

    "నీ కూతురికి నీ నిజస్వరూపం చూపిద్దామని" అన్నాడు వ్యంగ్యంగా.

 

    ఏమర్థమైందో తెలీదు కానీ, నా కూతురు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు వినగానే నాలో ఏదో తెలీని ఆవేశం ప్రారంభమైంది. ఒక్క వుదుటున అతని చేతుల్లోంచి పాపని లాక్కుని హృదయానికి హత్తుకున్నాను.

 

    "ఒరేయ్! ఇక్కడేం జరిగిందని..." అని నా బావగారేదో అనబోతుండగా నా భర్త అతడికేసి తీవ్రంగా చూశాడు.

 

    నేను ఆయనవైపు తిరిగి "ఇది మా భార్యాభర్తలిద్దరి సమస్య. దీంట్లో మూడో వ్యక్తికి ప్రవేశం లేదు. ఇదేదో మేమే పరిష్కరించుకుంటాం" అన్నాను. బహుశా ఆ క్షణం నాలో ఏదో తెగింపు ప్రవేశించి వుంటుంది. నా మాటల కరుకుదనానికి ఎవరూ ఎదురు మాట్లాడలేకపోయారు. నా కూతుర్ని అలాగే పొదివి పట్టుకుని "పదండి" అన్నాను నా భర్తతో. పాపా నన్ను బల్లిలా కరుచుకుపోయింది. ఏమనుకున్నాడో తెలీదు కానీ నా భర్త గిరుక్కున వెనక్కి తిరిగాడు. అతన్ని అనుసరిస్తూ బయటికి వచ్చాను.

 

    వస్తూ వస్తూ గుమ్మం దగ్గర ఒక్కక్షణం ఆగి వెనుతిరిగి చూశాను. సోఫాలోంచి లేవకుండా అలాగే కూచుని నా బావగారు మావైపే చూస్తున్నాడు. గొడవ పెద్దదవకుండా అక్కడితో అది సమసిపోవడంవల్లనో, లేక మొత్తం సమస్యా పరిష్కారాన్నంతా నేను నా భుజాలమీద వేసుకోవడం వల్లనో తెలీదు కానీ, ఆయన మొహంలో అదోలాంటి రిలీఫ్ కనబడింది. ఆయన మొహంలో ఆ క్షణం కనపడిన రి...లీ...ఫ్ నా మనస్సు చివుక్కుమనేలా చేసింది.

 

    ఏదైనా అనుకోని ఉపద్రవం సంభవించినప్పుడు మొత్తం బాధ్యతనంతా స్త్రీ భుజాల మీదకు నెట్టివేసే పురుషుడి జాణతనానికి ప్రతీకగా నిలిచిన ఆయన మొహంలో కనపడుతున్న రిలీఫ్... నాకు జీవితంలో గొప్ప పాఠంగా నిలిచింది.

 

                                                                   21

 

    ఇద్దరు ప్రత్యర్థుల్లా మేమూ ఎదురెదురుగా కూర్చున్నాం. చాలాసేపటి వరకూ నేనేమీ మాట్లాడలేదు. నా చేతి వేళ్ళవైపే చూస్తూ కూచున్నాను. అతడి కోపాన్నీ, అసహనాన్నీ నా మాటల ద్వారా మరింత రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు. అందుకని అతడే ఏదైనా మాట్లాడతాడని మౌనంగా వుండిపోయాను.

 

    "చెప్పు" అన్నాడు.

 

    "ఏం చెప్పను?" అన్నాను.

 

    "ఏదో చెప్పాలనేగా అక్కడినుంచి అంత అర్థాంతరంగా తీసుకొచ్చావు? లేకపోతే ఈ విషయాన్ని అక్కడే సెటిల్ చేసుండేవాణ్ణి" అన్నాడు కరుగ్గా.

 

    నేను అనునయంగా "చూడండీ, మనిద్దరం ఆగర్భ శత్రువుల్లాగా పోట్లాడుకోవలసిన అవసరం లేదు. అయిపోయిందేదో అయిపోయింది. ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుందాం" అన్నాను. "నాక్కావలసిందీ అదే! వీలైనంత త్వరలో మనిద్దరం విడిపోవడం" అన్నాడు.

 

    నేను నెమ్మదిగా తల పైకెత్తాను. "నే చెప్తున్న పరిష్కారం అదికాదు. జరిగినదంతా మర్చిపోయి మనం కలిసి వుండడం గురించి".

 

    "ఏమిటీ, స్పృహలో వుండే మాట్లాడుతున్నావా? మనిద్దరం కలిసి వుండడమా? జరిగినదంతా మర్చిపోవడమా? అసలు నేను మగవాణ్ణనే విషయం కూడా. పరాయి పురుషుడి మైకంలో పడిమర్చిపోయినట్టున్నావ్. ఇంత జరిగాక మనిద్దరం కలిసి వుండాలని ఎలా ఆశిస్తున్నావ్?"

 

    "చూడండీ, మీతో వాదించడం నా ఉద్దేశం కాదు. జరిగి పోయిన తప్పు ఎలాగు జరిగిపోయింది. నా గురించి మీకున్న ఫిర్యాదు లేమిటో చెప్తే మనమో రాజీకి రావచ్చునని నా ఉద్దేశం. ఇలా సూటిపోటీ మాటలతో ఒకర్నొకరు నిందించుకుని ఏం లాభం? ఎన్ననుకున్నా చివరివరకూ కలిసి వుండవలసిన వాళ్ళం....."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra