Home » Yandamuri veerendranath » మరో హిరోషిమా


    బృహస్పతి నవ్వాడు. "ఆ నిధి ఎక్కడుందో నాకు తెలుసు ఇబ్రహీంఖాన్! కానీ ఆ విషయం వెల్లడి చేస్తే ఒకవైపు రాజా విక్రమ్ దేవ్ వారసులూ, మరొకవైపు ప్రభుత్వమూ వెంట పడతారని- ఆ స్థలం ఎక్కడో మర్చిపోయినట్టు నాటకం ఆడాను. పోతే ఇక ఫోటోల సంగతి! అవి రత్నాబాయి దగ్గర ఉండాలి. మరి ఇప్పుడు ఆ వృద్ధురాలు ఎక్కడ ఉందో- అసలు బ్రతికి ఉందో లేదో కూడా మనకీ తెలీదు కదా."

    "నువ్వు నన్ను క్షమిస్తానంటే ఒక్క విషయం చెప్తాను మంగళ్ సింగ్".

    "ఏమిటది?" భృకుటి ముడిచి అడిగాడు బృహస్పతి.

    "పోలీస్ ఎన్ కౌంటర్ లో నువ్వు ....అంటే మంగళ్ సింగ్ మరణించాడని తెలియగానే మేము ముగ్గురం నీ భార్య దగ్గరికి వెళ్ళాం. నువ్వు నిధి ఎక్కడ దాచావో చెప్పమని నీ భార్యని వాళ్ళిద్దరూ చాలా హింసించారు. ఆమెకి ఆ విషయం తెలీదని నిర్ధారించుకున్నాక వదిలిపెట్టారు! అప్పటికే ఆమె చిత్రహింసలవల్ల దాదాపు మరణించే స్థితిలో ఉంది."

    బృహస్పతి పళ్ళు బిగిసుకున్నాయి. అతికష్టంమీద తనను తాను సంబాళించుకుని, "మరి ఫోటోల విషయం అడగలేదా?" అన్నాడు.

    "అప్పటికి మేము భవిష్యత్తులో ఇంత పెద్దవాళ్ళమవుతామన్న విషయం తెలీదు కదా! అందుకే వాటిగురించి పట్టించుకోకుండా చావు బ్రతుకుల మధ్య ఉన్నా ఆమెని అడవిలో మృగాలకి వదిలేసి మేము వెళ్ళిపోయాం. అదే ఆఖరుసారి ఆమెను చూడడం" అంటూ హరిస్వామి అతడి దగ్గర శెలవు తీసుకున్నాడు. వెడుతూ వెడుతూ చివరగా ఒకమాట అన్నాడు. ".... ఫోటోలు నీ దగ్గర లేవన్న విషయం తెలిస్తే వాళ్లు చెయ్యి జారిపోతారు. అవి నీ దగ్గరే ఉన్నట్టు నాటకం ఆడు. నేను కూడా అలాగే చెప్తాను. స్వయంగా వాటిని నా కళ్ళతో చూసానని కూడా చెప్తాను. ఇక ఈ విషయం నువ్వు నాకు వదిలిపెట్టు బృహస్పతీ! మొత్తం నాటకం అంతా ఆడించి ఎలా రక్తి కట్టిస్తానో చూద్దువుగాని."

    "అవసరం లేదు హరిస్వామీ! ఇప్పటివరకూ చాలామంది ప్రధానుల దగ్గర నువ్వు సూత్రధారుడిగా పనిచేసావు. ఈసారి నాటకం నేను రక్తి కట్టిస్తాను. నువ్వు విదూషకుడి పాత్ర పోషిద్దువుగాని" అన్నాడు.

    హరిస్వామి ఏడవలేక నవ్వినట్టు నవ్వి, అక్కడినుంచి కదిలాడు.

    "రాత్రి ఒంటిగంట అవుతోంది. వెళ్ళగలవా?"

    "వెళ్ళగలను. నాకు అలవాటే" అంటూ హరిస్వామి చీకట్లో కలిసిపోయాడు.

    నిమిషం తరువాతం అతడి కారు బయల్దేరిన చప్పుడు వినబడింది. ఆ శబ్దం దూరమయ్యే వరకూ అక్కడే నిలబడి వుండి, ఆ తర్వాత వెనుతిరిగి చెట్టు దగ్గరికి బృహస్పతి చేరుకున్నాడు. చప్టామీద రావు కూర్చుని ఒక వృద్ధురాలితో కబుర్లు చెపుతున్నాడు. పక్కనే కూర్చుంటూ-

    "రత్నాబాయీ! ఇప్పుడే నీ భర్త తాలూకు ఒక అనుచరుడు వచ్చి వెళ్ళాడు" అన్నాడు.

    "అవును. ఇబ్రహీంఖాన్ కదూ! కంఠం గుర్తుపట్టాను" అన్నది ఆమె. అదే సమయానికి దూరంగా చప్పుడు కాకుండా తుప్పల వెనుకనుంచి దావూద్ హర్షద్ లేచాడు. అతడి చేతిలో మెషిన్ గన్ వుంది.

    పౌర్ణమి దగ్గర పడుతూ వుండడంతో చెట్టుకింద ఆకారాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దావూద్ హర్షద్ పొజిషన్ లోకి వచ్చి గురి చూసుకుంటున్నాడు. ఒకరినే చంపాలన్న నిబంధన ఏమీలేదు. మెషిన్ గన్ కాబట్టి అక్కడున్న ముగ్గుర్నీ కాల్చేయాలనుకున్నాడు.

    ప్రమాదం ఎంత దగ్గరలో వున్నదో తెలియని ఆ ముగ్గురూ మామూలుగా సంభాషించుకుంటున్నారు.

    "నన్ను క్షమించు రత్నాబాయీ!" అన్నాడు బృహస్పతి. "....నేనే గతజన్మలో నీ భర్తని అని చెప్పి, నువ్వు ఇంతదూరం వచ్చేలా చేసాను".

    "దానికేముంది? పేపర్లో చదివి ఎవరో చెపితే చూద్దామని వచ్చాను. అంతే తప్ప ఏదో డబ్బుల కోసం ఆశపడి మాత్రం కాదు."

    "ఛ.... ఛ.... నేనూ అలా అనుకోవడంలేదు. ఈ రోజు నువ్వు వచ్చి చాలా గొప్ప సహాయం చేసావు. నేనే మంగళ్ సింగ్ నన్న రుజువుల కోసం హరిస్వామి నన్ను యక్షప్రశ్నలూ వేసాడు. నీకు కొడుకు పుట్టినప్పుడు 'పళ్ళతో పేగు తెంపడం' లాంటి కొన్ని విషయాలు ఈ రోజు చెప్పి వుండకపోతే, నేను చాలా ఇబ్బందిలో పడి వుండేవాడిని. పోతే నేను గతజన్మలో మంగళ్ సింగ్ ని కానన్న విషయం నీకూ, నాకూ, నా స్నేహితుడికీ తప్ప మరెవరికీ తెలీదు. ఎవరికీ చెప్పకు."

    "చెప్పను బాబూ! కానీ ఎందుకు ఈ నాటకమంతా?"

    అప్పటివరకూ శ్రోతలా వింటున్న రావు కల్పించుకుని- "దీని వెనుక చాలా పెద్ద ఆలోచన వుందిలే రత్నాబాయి! అది కానీ ఫలిస్తే నీ దగ్గరికే మేము వచ్చి నువ్వు వూహించలేనంత డబ్బు యిస్తాం!" అన్నాడు.

    "నాకు డబ్బుపట్ల ఆశలేదు బాబూ! అదే వుండి వుంటే నా భర్త దాచిన నిధినే తవ్వి తీసుకునే దాన్ని గదా!"

    మామూలుగా సంభాషణ జరుపుతున్న మిత్రులిద్దరూ ఉలిక్కిపడి - "ఆ నిధి ఎక్కడుందో నీకు తెలుసా?" అనడిగాడు.

    "పోలీసులు వెంటపడుతున్నప్పుడు ఒక కాగితం మీద ఆ ప్లాన్ గీసి అనుచరుడిద్వారా పంపాడు. అదేదో సరిగా నాకు అర్ధంకాలేదు. ఆయన తాలూకు ఫోటోలూ, డైరీలూ వున్న పెట్టెలో పడేసాను."

    స్నేహితులు ఇద్దరూ అదిరిపడి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

    బృహస్పతి అడిగాడు- "మరి ఆ ముగ్గురు కిరాతకులూ వచ్చి నిన్ను ఆ నిధి ప్లాన్ కోసం హింసించినపుడు అది నీ దగ్గరుందని చెప్పలేదా?"

    "అప్పటికి నాకు తెలీదు బాబూ! నన్ను హింసించి, హింసించి అడవిలో క్రూరమృగాలకి వదలేసి అడవిలో క్రూరమృగాలకి వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నేనెలాగో బ్రతికి బయటపడ్డాను. ఆ తర్వాత నా భర్త తాలూకు అనుచరుడు వచ్చి ఆ ప్లాన్ ఇచ్చాడు. దాన్నికూడా ఆ ఫోటోలతోపాటు కలిపేసేను."

    "ఆ ఫోటోలూ, డైరీలూ ఇప్పుడు నీ దగ్గరే వున్నాయా?" ఉద్విగ్నంగా అడిగాడు రావు.

    "ఉన్నాయి. మీకు చూపించడం కోసం తీసుకొచ్చాను కూడా!" చెప్పింది రత్నాబాయి.

    ఎంత పెద్ద విషయాన్నైనా తేలిగ్గా తీసుకునే బృహస్పతి కూడా రత్నాబాయి చివరిమాటకి విపరీతమయిన ఎగ్జయిట్ మెంట్ ఫీలయ్యాడు.

    "ఏదీ ఆ పెట్టె?" అంటూ లేచి నిలబడ్డాడు. 

    సరిగ్గా ఆ పొజిషన్ కోసమే ఎదురుచూస్తున్న దావూద్ హర్షద్ వరసగా మెషిన్ గన్ లోంచి బుల్లెట్ల వర్షం కురిపించాడు. 


                                                   14


    తన బ్రతుకిలా బండారులంక చాకిరేవు అయిపోతుందని సరళరేఖ కలలో కూడా అనుకోలేదు. కలలు రావటం లేదు. అసలు నిద్రే లేకపోతే కలేమిటి? ఒకవైపు దోమలూ, మరోవైపు కుక్కిమంచం.

    రావిచెట్టుకి కాస్త దూరంలో చిన్న టెంట్ లో పడుకుని వుందామె. పోలీస్ డిపార్ట్ మెంట్ వాళ్ళు వేసిన ఆ టెంట్, వాళ్ళ భద్రతా ఏర్పాట్లలాగే ఏ క్షణమైనా కూలిపోయేట్టు వుంది.

    నెలకి పదివేలు తక్కువ కాకుండా "పైన" సంపాదించే పొజిషన్ లోంచి - ఈ విధంగా భక్తుల్ని క్యూలో నిలబెట్టే ఉద్యోగంలోకి ట్రాన్స్ ఫర్ కాబడటం ఆమె చిరాకుకి మొదటి కారణమైతే, బృహస్పతి సేవలో నిరంతరం వుండవలసి రావడం రెండవ కారణం. అయితే ఈ సమస్యనుంచి బయట పడటానికి తనకున్న పలుకుబడి సరిపోదని ఆమెకి తెలుసు. బృహస్పతిని మంచి చేసుకోవడం ఒకటే మార్గమనిపించింది. మంచి చీర కట్టుకుని అతడి దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు పొద్దున జరిగిన సంఘటన అది!    

    "మనిద్దరి మధ్యా ఇంత శత్రుత్వం అవసరమా?" అంది ఒక ఆహ్లాదకరమైన చిర్నవ్వు విసిరి.

    "ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లో వస్తుంది కదా!"

    "ఎలా?" అంది అర్ధంకానట్టు.

    "ప్రధాన మంత్రి పదవికి ఇద్దరం పోటీపడబోతున్నాం. ఆ విధంగా!"

    సరళరేఖ కాస్త సిగ్గుపడి "పొండీ! మీరు మరీ మునగ చెట్టు ఎక్కిం చేస్తున్నారు" అంది గోముగా.

    "లేదు. నువ్వు అక్కడే ఉన్నావు. ప్రస్తుతం నేను ఎక్కుతున్నాను."

    "మనిద్దరం యిలా పోట్లాడుకుంటుంటే కలిసి కింద పడతామేమో!"

    "నా కభ్యంతరం లేదు. నువ్వు కిందో, పైనో ఉంటావు గదా!"

    సరళరేఖ బుగ్గలు ఎర్రబడ్డాయి. సిగ్గుతో కాదు- గుండెల్లో నుంచి తన్నుకొస్తున్న ఉక్రోషాన్ని బయట పడనివ్వకుండా బలవంతంగా అదిమిపెట్టడం వల్ల.

    "విషయం చెప్పు. ఇంత ప్రొద్దున్నే యూనిఫామ్ వేసుకోకుండా చీరలో వచ్చావంటే ఏదో ఆలోచన ఫామ్ అయ్యే వుంటుంది."

    "భలే కనుక్కున్నారే! అందుకే మిమ్మల్ని బృహస్పతి అన్నారు. నిన్న రాత్రి నాకో వాస్తవం అర్ధం అయింది. చరిత్ర చెప్పిన వాస్తవం అది"

    "రాజీనామా చేయబోయే ప్రధానమంత్రి, పార్లమెంట్ లో ఇచ్చిన ఆఖరి ఉపన్యాసంలాగ ఏమిటా భాష? అసలు విషయం చెప్పు."

    "దేశంలో టెర్రరిజం పుట్టినప్పటి నుంచీ వి.ఐ.పి.ల వెనక బ్లాక్ కాట్ కమెండోలనీ, ఎంతోమంది సెక్యూరిటీ గార్డులనీ నియమిస్తున్నారు కదా!"

    "అవును. నా వెనుక నిన్ను నియమించినట్టు!" అన్నాడు.

    "గతంలో ఏనాడైనా, ఏ రక్షణ బృందమైనా తమ నాయకుడిని రక్షించుకోగలిగిందా? మన మాజీ ప్రధానమంత్రి నుంచి, పంజాబ్ ముఖ్యమంత్రి వరకూ టెర్రరిస్టు చర్యలకి ప్రాణాలర్పించిన వాళ్ళే కదా! కనీసం ఒక్కసారయినా టెర్రరిస్టులు ఫెయిలైన సందర్భం వుందా? నాయకుడి మీద కాల్పులు జరుపుతున్న ఏ టెర్రరిస్టునైనా నాయకుడు మరణించక ముందే సెక్యూరిటీ వాళ్ళు పట్టుకోగలిగారా?"

    "ఇంతకీ యిదంతా ఎందుకు చెపుతున్నావ్?"

    "మిమ్మల్ని ఎవరయినా చంపితే, ఆ చంపినవాళ్ళని పట్టుకోగలను కానీ, చంపకుండా ఆపలేను కదా నేను. మరి మీకెందుకు సెక్యూరిటీ?"

    'ఓరి నీ సరళరేఖో' అన్నట్టు చూసాడు బృహస్పతి. ".... నీకు నువ్వే 'బ్లాక్' కాట్ కమెండో ననుకుని ఆ విషయం చెప్పడానికి పొద్దున్నే 'వైట్' చీర కట్టుకుని వచ్చావా సరళరేఖా? నువ్వు ఇక్కడ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వి. నా సెక్యూరిటీ గార్డువి కాదు...."

    రేఖ కళ్ళనీళ్ళు పర్యంతమయింది. "చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు బృహస్పతి గారూ?" అంది. 'ఓటు కొచ్చి మందు దాచడం ఎందుకు' రాజకీయ నాయకుడిలా, ".... నన్ను పూర్వపు పదవిలో వేయిస్తే మీకు ఆజన్మాంతరం కృతజ్ఞురాలినై ఉంటాను."

    "ఇంకా నయం, ప్రధానమంత్రి అయ్యాక 'ఫెయిల్ గ్రోత్' లో వాటా ఇస్తాననలేదు. చూడు రేఖమ్మా! రాజకీయాల్లోనూ, శోభనంలోనూ, లంచానికి పన్లు మాట్లాడుకోవడంలోనూ.... కృతజ్ఞతల ప్రసక్తే వుండదు. మనం ఎంత తీసుకోగలం అనేది- మనం ఎంత ఇవ్వగలం అనే దానిమీద ఆధారపడి వుంటుంది. బేరం సరిగ్గా చెప్పు."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra