Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 24


    ఈ 'విజయశ్రీ' రచించిన కవి 'కరుణశ్రీ' అనే గుప్తనామము ధరించిన శ్రీ జంధ్యాల పాపయ్యశాస్తి గారు. వీరు ఇదివరకే చాలా కావ్యాలు వ్రాసి పేరుపొందారు. వీరి ఖండకావ్య సంపుటి 'ఉదయశ్రీ' తెలుగునాతిని అలరించి తెలుగుహృదయాన్ని ఆనంద వీచికలలో ఉయ్యాలలూగించింది. 'ఉదయశ్రీ'కి సమానస్కంధము వీరి 'అరుణ కిరణాలు'. 'అరుణకిరణాల' ప్రాతశ్శోభలో పరువులు పెడుతూ బయలుదేరింది వీరి 'కరుణామయి'. పాటల పాపాయి 'కరుణామయి'.
    'విజయశ్రీ' వీరి నూతన కావ్యం. పాండవులు యుద్దానికి సన్నద్దులవడం ఈ కావ్యానికి వస్తువు. ఏమంత గొప్పవిషయ మిది కావ్యవస్తువుగా స్వీకరించడానికి? అయితే మాత్రమేమి? కవి సొన్నారి. వస్తు వెంతటి సామాన్యమైన దయితేనేమి? అతని చేతిలో దాని కెక్కడలేని తీర్పు వస్తుంది. అందులో చాలా ఘటికుడు ఈ సొన్నారి 'కరుణశ్రీ' నామాంచితుడు పాపయ్యశాస్త్రి. ఈకవి యలంతి విషయాన్ని చేపట్టి చదివినకొద్దీ చవులూరించి హృదయాన్ని రంజింపచేసే భవ్యమైన నవ్య కావ్యముగా వెలయించినాడు. విన్నాణముతో అద్భుతమైన శిల్పము చూపి మంత్రాలోచనం, స్కంధావారం, విషాదం, ప్రబోధం, విజృంభణం అనే అయిదు చక్కని చిక్కని రేకులుగా మలచి సుమనో మనోజ్ఞముగా ఈ దివ్యకావ్యకల్ప ప్రసూనమును రచించారు శ్రీ శాస్త్రిగారు. గుణాలం కారాది కావ్య  విభూతిని సంతరించుకొని ఈ రసవత్కావ్యం అవిర్భవించింది.
    నేడు ప్రకటితము లవుతున్న నవ్యాంధ్ర కావ్యకుసుమాలలో విశిష్టతల చక్కని మధురసార్ధ్ర సుమమిది. ఈ కావ్యానికి ఈడు వచ్చే ఖండకావ్యాలు తెలుగులో ఎన్నో లేవంటే అది అతిశయోక్తి కాదు. అసలే ఇది భారత వీరకుమార గాథ, సువర్ణాంచితమైనది; అందులోనూ శ్రీ పాపయ్యశాస్తిగారు కడు నేర్పుతో ఈ కావ్యాన్ని నిర్మల గంగా ప్రవాహమువలె అచ్చస్వచ్చము, మధురము, ఉద్గమన వేగాటోపముగల తమకు సహజమగు లలిత మనోహరమైన చక్కని శైలిలో రచించారు ద్రాక్షా పకములో పడిన యిది యే సహృదయ హృదయాహ్లాదము కలిగింపదు? ఏ రసలుబ్దుల కిది ఆస్వాద్యమై సుసేవ్యము కాదు? విశేష మేమంటే ఇందలి ఘట్టము లన్నీ పండిత పామరుల నొక్కరీతిని అలరించె రసఘటికలు.
    ఈ కావ్యం చదివీ చదవగానే మన మనసుకు తగిలేది కవన మల్లుటలో కవికి గల చాతుర్యము. ప్రసన్న కథాకలితార్ధ యుక్తిగల పదాలు ఏర్చి కవి రసజ్ఞుల కంజలిపట్టి గిలకరించి యిట్టే విక్షేపించగా అవి తమకుతామై ఛందస్సూత్రములో కూర్పుపడి వృత్తాలుగా గీతికలుగా రూపొందినట్టుంటాయి ఇందలి పద్యాలు. కాకపోతే ఏమిటి ఇదిగో ఈ పద్యం చూడండి -
        ఇమ్మన్నాఁడయిదూళ్ళు భీష్ముఁడు; గురుం డేదో విధిన్ సంధి కా
        నిమ్మన్నాఁడు, విచిత్రవీర్యతనయుం డేలా విరోధమ్ము పో
        నిమ్మన్నాఁ, డటు మీఁద కర్ణుని మొగ మ్మీక్షించి పొందేమి పో
        పొమ్మన్నాఁడు సుయోధనుం డనుఁగుతమ్ముల్ రొమ్ము లుబ్బింపఁగన్.
    ఇందులో భావం పదాల నేవిధంగా ఆకట్టుతూ తరుముకు పోయిందో! ఛందోవృత్తంలో పదాలు తమ స్థానాలలో ఆశ్రమంగా వెదకుకుంటూ వచ్చి నిలిచాయి. ప్రతి పద్యములోని భావమూ కొండ కోనలోనుండి వెలువడే ఒక సెలయేరులాగా తనత్రోవ తాను అప్రయత్నముగానూ సుకరముగానూ మలచుకొంటూ పోయింది. ఏ గణ యతి ప్రాసలూ దాని గతి కడ్డురావు సరికదా దాని కలంకార ప్రాయమే అవుతాయి. అవి వేని కవే ఒత్తిగిలి త్రోవ యిచ్చి భావాన్ని లోగోని ఒండొంటితో సమైక్యమై హృద్యతను భజించాయి. కావ్యములోని ప్రతిపద్యమూ ఇదే రీతి. కావ్యమంతా కథనరీతిలో నట్టు లేకుండా ఉద్వేగముతో ఉరవడితో నడిచిపోయింది.
    ఈ కావ్యంలోని మరో గొప్పగుణం ఏమంటే, నిఘంటువులోని మారు మూలపదాలు వెదకిపట్టి వేయకుండా మనం సామాన్యంగా మాటాడుకొనే మామూలు మాటలతోనే రసం ఉట్టిపడేటట్లు శక్తి మహితమైన గొప్ప కవిత్వం చెప్పడం ఈ కవికి సహజంగా అలపడ్డ ప్రజ్ఞ. అన్ని శబ్దాలూ మనకు పరిచయమైనవే. నిత్యవ్యవహారంలో వున్నవే, తేలికవే. భావాన్ని ఎంత స్ఫూర్తితో బలంగా మలిచి మూర్తిమంతం చేస్తున్నాయో అవి చూడండి-
        ఆడుది యేడ్చి తెచ్చుకొని నట్టి దయారస ధర్మభిక్షకై
        గూడలు క్రుంగి కుంతి కొడుకుల్ చెయిచాచుట యెగ్గుసిగ్గులన్
        వీడుట కాదె? "దేహి"యని వేడుదురే పగవారి? నేఁ డిటుల్
        పా లొనర్చితిమిపో అమృతాంశుకులప్రతిష్ఠలన్!
    
        లెమ్ము ధనంజయా! విధి బలీయము! న్యాయము గెల్చు; నిల్చు స
        త్యమ్ము; నశించు స్వార్ధము; సదా యుగధర్మ మిదే గదోయి;క
        న్గొ మ్మిక నంత్యకాలమున నూర్వురు బిడ్డల తండ్రికైన పిం
        డ మ్మిడు దిక్కు గల్గ దకటా! గ్రహచారము తప్పివచ్చినన్!
    
    మరోగుణము పద్యాలలోని హృద్యమైన సంభాషణ శైలి. చూడండి ఈ క్రింది పద్యములు -
        అంధుఁడు వృద్ధరాజట! మదాంధుఁడటే యువరాజు! రాజసం
        బంధులు ద్యూత బంధులటె మంచికి మార్గ మికెట్లు? గాఢ గ
        ర్వాంధ తమ స్తమస్వినుల స్వార్ధపిశాచము గజ్జెగట్టగా
        సంధిలునయ్య సంధి? కొనసాగునటయ్య నయప్రయత్నముల్?
    
        హింస యొనర్పనంటివి సరే! మిము హింసల పాలొనర్చు వి
        ధ్వంసక శక్తులందు దయదాల్చుట ధార్మికహింస కాదె! మా
        కంసుని జంపి లోకముల కష్టము దీర్పనె? చెల్లునే యసృ
        ఙ్మాంసము లెండ తిండికయి మాడుట రాచకొలమ్మువారికిన్?
    ఈ విధంగా ఎన్ని - పద్యాలయినా చూపవచ్చును. కావ్యమంతా ఇదే రీతి నున్నప్పుడు వేరే వాటిని ఎత్తి చూపడమెందుకు?
    ఈ కావ్యము వీరరసప్రధానమైనది. అసలు కావ్యరచనకు తీసికొన్న ఘట్టమే అటువంటిది. సంధికార్యము విఫలమైనది. పాండు నందనులలో ఒక్క ధర్మరాజు తక్క మిగిలిన వారందరూ కౌరవుల మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. సంధి విఫలమైనా అసలు సామంచేతనే కార్యం సాధించాలనే యత్నంలో వున్న ధర్మరాజు మాత్రం    గురుబంధుజన సంహారానికి సుముఖుడు కాడు. కాని పరాభవానలదందహ్యమాన మానస పాంచాలి తనపాతులను ఉపాలంభించి యుద్దానికి పురికొల్పుతుంది. కౌరవుల రాజ్యమదాంధత, తృష్ణ బాగా తెలిసివచ్చిన కృష్ణుడు కూడా ఇక దండోపాయం తక్క కార్య సాధనానికి వేరే ఉపాయం లేదనే నిశ్చయంలో ఉన్నాడు. చివరికందరు యుద్ధం చేయడానికే నిశ్చయించి అందుకు తగిన సన్నాహం చేస్తారు.
    ఈ మంత్రాలోచన ఘట్టం రసవంతములైన పద్యాలతో హృద్యంగా ఉంది. ఈ ఘట్టంలోని పాంచాలిపాత్ర చాలా గొప్పది. ఆమె క్రోధోద్రిక్త అయి తన పాతులను వెగటుగాను వికటంగాను ఎత్తిపొడుస్తూ బరిమీద ఆడు త్రాచులాగ శౌర్యాగ్ని విస్ఫులింగాలు చిమ్ముతూ బుసలుకొడుతుంది. ఆ సాధ్వి ఆడే ఒక్కొక్కమాట సెగలు పొగలతో కాలకూటవిషం గాక్కుతూ ఉంటుంది. ఆ విషం సెగకు తాళుకోగలవా రెవరు? ఆమె హృదయోద్వేగమూ ఉద్రేకమూ గమనించండి -    
        భుజాగ్రముల్ పొంగా పురోగమింతురో!
        ధ్వజాగ్రముల్ వంగ తిరోగమింతురో!
        శరమ్ములన్ దాల్చి పరాక్రమింతురో!
        కరమ్ములన్ మోడ్చి పరిక్రమింతురో!
    ఏమి ఉద్వేగము! ఏమి ఉద్రేకము! సందర్భానుసారముగా ఇక్కడ వృత్తమే మారింది. ఈ పద్యం చిత్రమైనది. అది చదువుతూ ఉంటే ఆ పాంచాలి హృదయంలోని భావోద్వేగ తరంగాలు ఒకదాని నొకటి తరుముకొనిపోతూ ఉవ్వెత్తుగా లేస్తూ పడుతూ లయబద్దమైన ద్రుతగతిలో సాగిపోతున్నట్టు స్ఫురిస్తుంది మనకు. ఇదే కళ; కవి చాతుర్యము; చూడండి ఈ యెత్తి పొడుపు ఎంత నిష్ఠురమైనదో -
        త్యజింతురో క్షాత్రకుల ప్రతిష్ఠలన్!
        భజింతురో శాత్రవ పాదపద్మముల్!
        భుజింతురో కానల కందమూలముల్!
        సృజింతురో తాత్త్విక ధర్మశాస్త్రముల్!

 Previous Page Next Page