Home » Vasireddy seeta devi novels » Rabandulu Ramachilukalu


    "మీరు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు మేడం! నా రచనల్లో కసి కన్పించేమాట వాస్తవమే! కసినుంచే గొప్ప రచనలు వస్తాయి" అన్నాడు పుణ్యశ్రీ గొంతు తగ్గించి.

 

    "అవును! రచయితకు కసి వుండాల్సిందే. అప్పుడే పదునైన రచనలు చెయ్యగలడు. కాని రచయితకు వుండాల్సింది వ్యక్తిగతమైన కసికాదు. రచయిత తన కసిని లోకంమీదకు విసరకూడదు. నీకు రాని పేరు మరొకరికి వచ్చిందంటే సహించలేక ఏర్పడ్డ కసికాదు రచయితకు వుండాల్సింది. ఒక మగవాడివల్ల బాధకు గురైన రచయిత్రి మగజాతినే ద్వేషిస్తూ, తిట్టిపోస్తూ, రాసే రచనల్లో కన్పించే కసికాదు, కవితల్లో, రచనల్లో వుండాల్సింది. అలాగే ఒక స్త్రీవల్ల మోసపోయినవాడు, ఆడజాతిమీద ద్వేషం పెంచుకుని రచనలు చెయ్యడం సమర్ధనీయం కాదు. ఇది వ్యక్తిగతమైన కసి. ఈ కసినుంచి కసినీ, ద్వేషాన్నీ పెంచే రచనలు చెయ్యడం సమర్ధనీయం కాదు. ఈ కసినుంచి, కసినీ, ద్వేషాన్నీ పెంచే రచనలు మాత్రమే వస్తాయి. ప్రయోజనకరమైన రచనలు వస్తాయనే నమ్మకం నాకులేదు. వ్యక్తిగతమైన కసితో రాసిన రచనలు తాత్కాలికంగా కొంత సంచలనాన్ని కల్గించి రచయితకు కొంత పేరుకుకూడా తెచ్చిపెట్టవచ్చును. కాని ఇలాంటి రచనలు ఎంతోకాలం నిలవ్వు. సాంఘిక అన్యాయాలనూ, అక్రమాలనూ చూసి రచయితలో కసి ఏర్పడాలి. అతని వ్యక్తిగత జీవితానికీ, ఆ కసికీ ఎలాంటి సంబంధమూ వుండకూడదు. అప్పుడే అతని రచనల్లో విశ్వజనీనత కన్పిస్తుంది" మిసెస్ వైకుంఠం కంఠంలో తీవ్రత వినిపించింది. అన్నీ తెలిసిన మనిషే అయినా ఇలా ఎందుకయిపోయిందబ్బా అన్న భావన ఆమెను ఆ క్షణంలో చూసిన వాళ్ళకు అనిపిస్తుంది.

 

    "మన పుణ్యశ్రీ రచయిత్రుల రచనల్నే కాదు, తన పత్రిక తప్పించి మిగతా పత్రికల్నికూడా విమర్శిస్తాడు" అన్నాడు లూ.

 

    "అవునయ్యా! అది సరేగాని, ఫలానా పత్రికలో ఫలానా కాలం బొత్తిగా అనవసరం అని రాస్తావుగదా? ఏ పత్రికలో ఏ శీర్షికలుండాలో, ఏవి వుండకూడదోకూడా నువ్వే నిర్ణయిస్తావా?" మిసెస్ వైకుంఠం దూకుడుగా అన్నది.

 

    "ఏమిటివ్వాళ పాపం పుణ్యశ్రీని పట్టుకొని అంతగా దులిపేస్తున్నావ్?" పరమేశం అంటూ వుండగానే శేఖరం హాల్లో ప్రవేశించాడు.

 

    ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. పుణ్యస్రీ రిలీఫ్ గా సర్దుకొని కూర్చున్నాడు.

 

    "బావా! ప్రయాణానికి అన్నీ సిద్ధం చేశాను" అంటూ రాణి హాల్లోకి వచ్చింది.

 

    "అదేమిటమ్మాయ్! నువ్వెళ్ళడంలా?" రాణిని ఆశ్చర్యంగా ప్రశ్నించింది మిసెస్ వైకుంఠం.

 

    "బావ ఏదో మీటింగు పని మీద వెళ్తుంటే మధ్య నేనెందుకూ?" అన్నది రాణి సాగదీసి నవ్వుతూ.

 

    "అలా అనకు! ఈనాడు మహిళల సహకారం లేనిదే పురుషులు ఏ రంగంలోనూ రాణించలేరు. ముఖ్యంగా రాజకీయాల్లో మనవాళ్ళు ముందుకు రావాలంటే ఆడవాళ్ళ సహకారం వుండి తీరాలి." శేఖరం వైపు తిరిగి "ఏమయ్యా శేఖరం? వింటున్నావా? అమ్మాయిని ఇప్పటి నుంచే రాజకీయాల్లో ప్రవేశపెడ్తేగాని, అప్పటికి నువ్వు రాణించవు" అన్నది మిసెస్ వైకుంఠం.

 

    "రాణీ ఎందుకండీ ఈ మీటింగుకు?" నసిగాడు శేఖరం.

 

    పరమేశం అందుకొని "అవును! శేఖరం! రాణిని కూడా తీసుకెళ్ళు, మీటింగుకు చాలా పెద్ద ఏర్పాట్లు చెయ్యాల్సి వుంటుంది. అమ్మాయి సహాయంగా వుంటుంది" అన్నాడు పరమేశం.

 

    రాణీ, శేఖరం ముఖంలోకి చూసింది.  

 

    "అవునమ్మాయ్! నువ్వు కూడావెళ్ళు. శేఖరం ఒక్కడు ఎన్ని పనులని చూసుకుంటాడు?" అన్నాడు పరమేశం కూతురితో.

 

    "బావకు ఇష్టంలేనట్టుంది. నేనెందుకులే?" గుణుస్తూ అన్నది రాణి.

 

    "ఇందులో నా కిష్టం లేకపోవడానికేముంది? ఏ కొత్త ఊరి కెళ్తున్నాం గనుక? సరే మామయ్యా! ఇద్దరం వెళ్తాం!" అన్నాడు శేఖరం.

 

    "ధర్మయ్యగారి సహాయంకూడా తీసుకో! పరమయ్యా, రామయ్యా నువ్వొచ్చావంటే రెక్కలు కట్టుకు వాల్తారు. చూడు శేఖరం! ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకో. ఆ రోజుకు నేను ఎలాగూ వస్తాననుకో!" అన్నాడు పరమేశం.   

 

    "అలాగే మామయ్యా!" అని "ఊఁ కదులు! ఇంకా అట్లాగే నుంచున్నావేం?" అన్నాడు శేఖరం రాణీతో.

 

    కూతురూ, మేనల్లుడూ వెళ్ళిన వైపే చూస్తూ ఆనందంగా నవ్వుకున్నాడు పరమేశం.

 

    "అమ్మాయికి పెళ్ళెప్పుడు చేస్తారు?" అన్నది మిసెస్ వైకుంఠం.

 

    "చేద్దాంలే తొందరేముంది?" అన్నాడు పరమేశం.

 

    "అల్లుడుగారు సమితి ప్రెసిడెంటు అయ్యాక...."

 

    మిసెస్ వైకుంఠం మాటలకు మధ్యలోనే అడ్డొచ్చి "కాదు, మన పరమేశంగారు మంత్రి అయ్యాక" అన్నాడు పుణ్యశ్రీ.

 

    "అది సరేలేవయ్యా! నువ్వేదో స్పెషల్ ఇష్యూ అంటున్నావ్? అదేదో నాన్చక చెప్పు మరీ!"

 

    "అవునుసార్! అదే నరహరిగారి స్పెషల్...."

 

    పరమేశం ఓ క్షణం నొసలు ముడిచి ఆలోచనలో పడ్డాడు.

 

    "ఊఁ సమయానికి వచ్చేటట్టు చూడు. వచ్చే సంచికే నరహరి స్పెషల్ ఇష్యూగా రావాలి. అదీ సరిగ్గా మీటింగునాటికి. ఆ తర్వాత ప్రయోజనంలేదు. తెలిసిందా?"

 

    "వచ్చే సంచిక మహిళల...." నీళ్ళు నమిలాడు పుణ్యశ్రీ.

 

    "అది తర్వాత వేసుకోవయ్యా! కారణాంతరాలవల్ల ఈ సంచికను మహిళా స్పెషల్ గా వెయ్యలేకపోయాం అంటూ చిన్న క్షమాపణ చెప్పుకొని, వచ్చే సంచికలో ఆడా, మగా కానివాళ్ళకు మరో అద్భుతమైన సీరియల్ వెలువడుతుందని రాసుకో. అప్పుడు నీ పత్రిక మార్కెట్ లో హాట్ కేక్ లా పోతుంది" వళ్ళు మండినట్టు అన్నది మిసెస్ వైకుంఠం.

 

    "మధ్యలో నీ గొడవేమిటి! నువ్వూరుకోవమ్మా" అన్నట్టు పుణ్యశ్రీ మిసెస్ వైకుంఠంకేసి చురచురా చూశాడు.

 

    "మహిళా స్పెషల్ దాదాపు పూర్తి కావచ్చింది. అయినా డేట్ మార్చి తర్వాత సంచికగా వేసుకోవచ్చుననుకోండి! కానీ ఇప్పటికిప్పుడు దాన్ని ఆపేసి, మరోసంచిక, అందులో స్పెషల్ ఇష్యూ మొదలు పెట్టాలంటే" ఆగి పరమేశం ముఖంలోకి చూశాడు పుణ్యశ్రీ.

 

    "ఎంత కావాలో సూటిగా చెప్పరాదూ, అట్లా నీళ్ళునమలకపోతే?" విసుక్కున్నాడు పరమేశం.

 

    "అబ్బే ఎంతో అక్కర్లేదుసార్! ఓ మూడు వేలు....త్రివర్ణ ముఖ చిత్రంతో...." పరమేశం ముఖం చూసి ఆగిపోయాడు పుణ్యశ్రీ.

 

    "మూడువేలే?" లూ నోరుతెరిచాడు.

 

    "సరేలే! కాని ఒక్క షరతు. అన్ని పేజీలూ నరహరిగురించే నింపివెయ్యాలి. మళ్ళీ అడ్వర్టయిజ్ మెంట్సుతో పేజీలు వృధాచెయ్యకూడదు. నరహరికి పత్రికలో రాయించుకోవడమంటే మహా చెడ్డ సరదా! ఆఁ ! చూడూ! ఆ మూడురంగుల ముఖమేదో ఆ నరహరిదే వేసేయ్!" అన్నాడు పరమేశం.

 

    "అదినాకు వదిలేయండి సార్! ఈ జర్నలిజంలో నాకు ముప్పై ఏళ్ళ అనుభవం వుంది" ఉత్సాహంగా అన్నాడు పుణ్యశ్రీ.

 

    "చూస్తాగా!" అంటూ పరమేశం లేచి నిల్చున్నాడు.

 

    పుణ్యశ్రీ, లూ ఇద్దరూ లేచి నమస్కరించారు.

 

    లూ వెళ్ళిపోయాడు. పుణ్యశ్రీ, పరమేశం ఇచ్చిన చెక్కు తీసుకుని వెళ్లిపోయాడు.

 

    మిసెస్ వైకుంఠంకేసి చిరునవ్వుతో చూస్తూ ఆమె పక్కగా సోఫాలో కూర్చున్నాడు పరమేశం.

 

    మిసెస్ వైకుంఠం పైట సర్దుకుని తలవంచుకుంది.  


                                          13


    హైరోడ్డుమీర ఇంఫాలా కారు రధంలా సాగిపోతూవుంది. శేఖరం డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. ప్రక్కన కూర్చున్న రాణి వసపిట్టలా ఏదో మాట్లాడుతూనే వుంది. శేఖరం రాణి మాటలు వినడంలేదు. కాని యాంత్రికంగా "ఊఁ" కొడుతున్నాడు.

 

    కారు ముందుకు సాగిపోతూవుంది. పంట పొలాలూ, చెట్లూ వెనక్కు పరిగెడుతున్నాయి.

 

    కారు అద్దంలో నుంచి ఎదురుగా ఆకాశంమీద కన్పిస్తున్న వెండిమబ్బుల్లో రకరకాల రూపాల్ని ఊహించుకుంటూ ఆనందిస్తోంది రాణి.

 

    రాణి పక్కకు చూసింది. కళ్ళు పెద్దవి చేసి, ఆకుమళ్ళూ, జొన్న చేలూ, కంచిపొలాలూ, చెరుకుతోటలూ చూడసాగింది.

 

    "అదేం తోట బావా?" కుతూహలంగా అడిగింది రాణి చెయ్యి చూపిస్తూ.

 

    "ఆకుతోట!"

 

    "అంటే తమలపాకుల తోటా? కారు ఆపు బావా! దిగి చూస్తాను" చిన్నపిల్లలా అడిగింది రాణి.

 

    కారు ఆగింది. రాణి దిగి శేఖరం కోసం నిల్చుంది. శేఖరం దిగలేదు.

 

    "దిగవేం బావా?"

 

    "నేనెందుకూ? నువ్వెళ్ళి చూసిరా!" అన్నాడు శేఖరం.

 

    రాణి ముఖం చిన్నబుచ్చుకొని కారెక్కి కూర్చుని డోర్ గట్టిగా వేసింది.

 

    "ఆఁ ఆఁ చిన్నగా! నా మీద కోపం ఆ డోర్ మీద చూపిస్తావేం? తిరిగి వెళ్ళేప్పుడు అన్నీ సరిగ్గా చూద్దాంలే!" అన్నాడు శేఖరం నవ్వుతూ.

 

    రాణి మూతి సున్నాచుట్టి కూర్చుంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra