Home » Suryadevara rammohan rao » త్రినేత్రుడు-1


    అప్పుడు సమయం 4-30.

    అది ఓబరాయ్ హోటల్.

    బాగా డబ్బుండి తమ అందాన్ని, అంగ సౌష్టవాన్ని కాపాడుకోవాలనుకొనే అమ్మాయిలూ ఒక్కొక్కరే కార్లో దిగుతున్నారు. దిగినవారు దిగినట్లే హోటల్ వెనుక వైపున్న స్విమ్మింగ్ ఫూల్ దగ్గరకు వెళుతున్నారు రాజహంసల్లా.

    స్విమ్మింగ్ ఫూల్ ఒడ్డునే తచ్చాడుతున్న త్రినాధ్ ప్రియాంక కోసం ఎదురు చూస్తున్నాడు ఆతృతగా.

    4-30... 4-34... 4-40... నిమిషాలు భారంగా దొర్లిపోతున్నాయి.

    తను ఆడబోయే డ్రామా అనుకున్నట్లే రక్తికడితే మరో నాలుగు రోజులకే పెట్టుబడి వస్తుంది. దానితో తొలి అడుగు బలంగా వేయాలి. త్రినాధ్ ఓ ప్రక్క ఆలోచిస్తూనే మరోప్రక్క ప్రియాంక కోసం ఎదురుచూస్తున్నాడు.

    సరిగ్గా 4-50 కి వచ్చింది ప్రియాంక. ఆమె ఉల్లాసంగా, హుషారుగా అప్పటికే అక్కడికి చేరుకున్న తన ఫ్రెండ్స్ ని కళ్ళతోనే విష్ చేస్తూ త్రినాధ్ ముందునుంచే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిన నాలుగు నిముషాల్లోనే బేతింగ్ డ్రెస్ లో బయటకు వచ్చింది.

    ఆమెను త్రినాధ్ కొద్దిక్షణాలు విస్మయంగా చూస్తుండిపోయాడు.

    అద్భుతమైన ఒంపుసొంపులు...

    అనన్య సామాన్యమైన ఆకర్షణ...

    పసుపు పచ్చగా నునుపు తేలిన శరీర లావణ్యం... ఆమె లేత గులాబీ రంగు చెక్కిళ్ళమీద సూర్యకాంతి మృదుమధురంగా జాలువారుతోంది.

    తడిదేరిన ఆమె పెదవులు వంపుతిరిగి ప్రవరుడ్ని సయితం భూమ్మీదకు దింపుతాయా అన్నంత అందంగా వున్నాయి.

    వెడల్పాటి ఎత్తయిన ఆమె ఎద, ఒంపులోకి దిగిపోయి అక్కడ చిక్కిపోయి ఒక్కసారిగా మరెంతో ఎదిగిపోయినట్లుంది....

    ఆమె అద్భుత సౌందర్యం త్రినాధ్ హృదయ సామ్రాజ్యానికి ఆ క్షణానే చక్రవర్తిని చేసింది. అంతకుముందు తను చూసిన ప్రియాంకలో పొగరు... అలంకరణలు, ఆర్భాటాలు కనిపించాయి.

    కాని ఇప్పుడు... వర్ణనాతీతమైన ఆమె సౌందర్యం దిగ్భ్రమ కల్గిస్తోంది.

    ఇంతటి అందాల రాశి కూడా ఈ భూమ్మీద వుందా అన్నంత విస్మయానందం త్రినాధ్ ని కొద్ది క్షణాలు ఊపివేసింది.

    పెదాల మీద చిరునవ్వు, కదలాడుతుండగా ఏదో గుర్తొచ్చిన వాడిలా తన పెదవుల్ని చూపుడు వేలితో మృదువుగా రుద్దుకున్నాడు.

    ఆమె ఇంకా త్రినాధ్ ని చూడలేదు. హంసలా నడుస్తూ నీలి ఆకాశపు రంగు నీళ్ళలోకి దిగిపోయింది.

    ఎవరో మంత్రించినవాడిలా వున్నచోటనే నిశ్చలంగా వుండిపోయాడు. చూపులు మాత్రం చేపపిల్లలా ఈదుతున్న ఆమె మీదే వున్నాయి.

    ఓ పావుగంట ఈదాక ఆమె ఒడ్డుకు వచ్చింది. ఆమెకు టవల్ అందించడమే త్రినాధ్ డ్యూటీ. కావాలనే ఎటో చూస్తూ అదే పనిచేశాడు.

    ఆమె ఇంకా చూడలేదు అతన్ని. టవల్ ని విసురుగా లాక్కొని ఒళ్ళంతా సుతారంగా అద్దుకుని దాన్ని విసిరేయబోతూ చూసింది త్రినాధ్ ని.

    త్రినాధ్ ని అక్కడ చూసినందుకు ఆమె ఓ క్షణం ఆశ్చర్యపోయింది.

    వెంటనే తేరుకుని పకపకా నవ్వింది.

    మంద్రంగా దూకే నయాగరా జలపాతంలా వుందామె నవ్వు.

    ఆమె ఎందుకు నవ్విందో అర్ధం చేసుకున్నాడు త్రినాధ్. అయినా తన ముఖంలో ఏ భావమూ బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు.

    "ఈ ఉద్యోగం చేసి నాలుగేళ్ళలో సంపాదిస్తావా?" మరలా నవ్విందామె. ఆ నవ్వు తెరలు తెరలుగా, అలలు అలలుగా పరిహాసపు పదఘట్టనలా వుంది.

    "అంటే మీ నాన్నకు ఇరవై కోట్లు వుందన్న మాట...?" సాలోచనగా అన్నాడు. అతని చూపుల్ని కావాలనే ఆమె మోము మీంచి తప్పించి ఆమె మృదువైన భుజాల వంపులపై నిలిపాడు.

    "ఎస్..." అంటూ అతని చూపుల్ని పసిగట్టి కోపంగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.


                                                   *    *    *    *


    మరుసటి రోజు మరలా సరిగ్గా అదే టైమ్...

    ఆమెలో అదే కోపం...


                                                  *    *    *    *


    మూడో రోజు...

    మరలా సరిగ్గా అదే టైమ్...

    అతడివి అవే చూపులు... ఇంకాస్త శోధనగా... ఒకింత కాంక్షగా...

    ఆమెలో కోపం పెరిగింది. కోపం ఉక్రోషంగా మారింది.


                      *    *    *    * 


    ఆఖరి రోజు... తన అంచనా దెబ్బతినకూడదు. ఆమెను ఓడించటానికి ఆమె చేతే పెట్టుబడి పెట్టించే తన ప్రయత్నం విజయవంతం కావడంతోటే తొలి మెట్టుపై కాలు మోపడం ఆరంభం కావాలి.

    ఆ మాత్రం పెట్టుబడి మాలిని దగ్గర పొందలేకకాదు. ఆ పెట్టుబడిలో ఒగరు, పొగరు వుండాలంటే ఇదే సరైన మార్గం.

    సాయంత్రం 4-30 అయింది. ఐదారుగురు అమ్మాయిలూ అప్పటికే స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్నారు.

    సంపెంగ పూవులాంటి ప్రియాంక రాజహంసలా వచ్చి పూల్ పక్కన లాన్ లో పోక చెట్టు క్రింద కూర్చుంటుంది.

    అతి ఖరీదైన కుర్చీలో అతి షోగ్గా, అతి వయ్యారంగా కూర్చుంటుంది. త్రినాధ్ ఆలోచిస్తూనే ఆ పోక చెట్టుఅయిపు చూశాడు.

    అతను ఇది వరకు తిమ్మడు కాదు. స్టాలియన్ రేస్ హార్స్ లాంటి అతని శరీరపు కదలికలు- పాదరసంలా పనిచేసే మెదడు - క్షణాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోగల స్థయిర్యం, తన అంచనాలు తప్పవనే ఆత్మ విశ్వాసం.

    స్విమ్మింగ్ పూల్ వేపే చూస్తున్నాడు. మధ్య మధ్యలో మెయిన్ హోటల్ నుంచి స్విమ్మింగ్ పూల్ కి వేసిన దారివైపు చూస్తున్నాడు ఆమె వస్తుందేమోనని.

    సరిగ్గా 4-50 అయింది. ముందుగా ఆమె తల కనిపించింది. పూల్ కి చుట్టూ వేసిన పెద్ద కట్టకి ఆవలవేపున మెట్ల వరుస మీద ఆమె ఇప్పుడు వుంది. ఒక్కో మెట్టే ఎక్కుతోంది. కొద్దికొద్దిగా ఆమె కనిపిస్తోంది.

    పెదవులు దాటని చిరునవ్వుతో ఆమెవైపే చూస్తున్నాడు త్రినాధ్.

    మరో నిమిషానికి ఆమె కట్ట ఎక్కడం, దిగడం పూర్తయింది. ఆమె తలెత్తగానే ముందుగా ఆమె దృష్టిలో పడింది త్రినాధ్.

    ఆమె ముఖాన్ని చిట్లించింది.

    ఆమె నడకలోని విసురు, కళ్ళలోని ఎరుపు జీరను పసిగట్టాడు త్రినాధ్.

    ఆమె డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళబోయి అంతలోనే మనస్సు మార్చుకొని త్రినాధ్ దగ్గరకు వచ్చింది కోపంగా.

    "నీకు వేరే ఏం పని లేదా...?" అంది కోపంగా. త్రినాధ్ నవ్వాడు. అవతల వాళ్ళు కోపంగా వున్నప్పుడు ఇవతలివాళ్ళు సమాధానం ఇవ్వకుండా చిరునవ్వు నవ్వితే చాలు రంగం సమాయత్తమవుతుంది. అదే ట్రిక్ ఉపయోగించాడు త్రినాధ్. ఆమెకు అరికాలి మంట నెత్తికెక్కింది.

    "సమాధానం చెప్పవేం?" మరలా అంది.

    "ఈ పని చేస్తూ వేరేపని కూడా చేస్తే హోటల్ వాళ్ళు ఊరుకోరు" నింపాదిగా సమాధానం ఇచ్చాడు త్రినాధ్.

    "నీ ఉద్యోగం పీకించేస్తాను" కోపంతో ఆమె లేత మోము ఎర్రగా కందిపోయింది.

    "నీ వల్లకాదు. అయినా నావల్ల నీకొచ్చిన ఇబ్బంది...?"

    ఆమె సమాధానం చెప్పలేకపోయింది.

    "నీ బాధేమిటో పాపం చెప్పుకో" కావాలనే రెచ్చగొడుతున్నాడు త్రినాధ్.

    "ఎప్పుడూ ఆడదాన్ని చూడనట్టు ఆ చూపులేమిటో?"

    ఈ గొడవ అక్కడున్న అందరి దృష్టిలో పడింది. ఎవరికి వారు తాము చేస్తున్న పనులు ఆపి వీరికి దగ్గరగా రాసాగారు.

    ఉన్నట్టుండి గమ్మత్తయిన నిశ్శబ్దం అక్కడ అలుముకుంది.

    క్రమంగా వెలుతురు పల్చబడుతోంది. అప్పుడే లైట్స్ వేశారు. మెర్క్యురీ లైట్స్ కాంతిలో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది.

    "ఇది పబ్లిక్ ప్లేస్. పబ్లిక్ హోటల్. ఇక్కడ నే ఒక్కడ్నే చూట్టం వుండదు. అందరూ చూస్తారు. కావాలంటే ఒక్కసారి ఈ హోటల్ గదుల కిటికీలవైపు చూడు. గదుల్లో వున్న లాడ్జెర్స్ చూపులన్నీ స్విమ్మింగ్ పూల్ వేపే..."

    ప్రియాంక ఉలికిపాటుగా హోటల్ వైపు చూసింది. అవమానంతో ఆమె ముఖం కందగడ్డలా అయింది.

    "నీ అందాన్ని, లావణ్యాన్ని, శరీరాన్ని ఎవరూ చూడకూడదనుకుంటే స్విమ్మింగ్ మానేయ్. లేదా ఇంట్లోనే ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించుకో. డబ్బున్నదానివేగా...?"

    అప్పుడే అక్కడకు చేరుకున్న కొందరు బేరర్స్ త్రినాధ్ కు సపోర్టుగా నిలిచారు.

    "అవును. అంత పౌరుషం వున్నదానివైతే సొంతంగా స్విమ్మింగ్ పూల్ కట్టించుకో. పెద్ద బిర్లా, తాతా, తాపర్స్ మనవరాల్లా ఫోజ్..." అంతకు ముందు ఏదో ఒక సంవత్సరంలో వాళ్ళూ ప్రియాంక చేతిలో అవమానం పొందినవాళ్ళు కావటంతో అంత పౌరుషంగా మాట్లాడి త్రినాధ్ కు పరోక్షంగా సహకరించారు.

    అంతమంది మధ్య తనకు జరిగిన పరాభవానికి ఆమె తట్టుకోలేక పోయింది.

    "ఇడియట్స్... స్టుపిడ్స్" అంటూ ఆవేశంగా వచ్చిన దారినే వెళ్ళిపోయింది.

    సరీగ్గా ఆరుగంటలకు మేనేజర్ కి కృతజ్ఞతలు చెప్పి బయటపడ్డాడు త్రినాధ్. ఇప్పుడతని చేతిలో 100 రూపాయలున్నాయి. నాలుగురోజులు హోటల్ లో పనిచేసినందుకు ముట్టిన సొమ్మది.

    ఇప్పుడతనికెంతో తృప్తిగా వుంది.

    ప్రియాంక ఇంటికి చేరిన పదినిమిషాలకే ఆమె అన్న, తండ్రి సుదర్శన్ రావులు హుటాహుటిని ఇంటికి బయలుదేరారు.

    ప్రియాంక కోపంతో బుసలు కొడుతోంది. ఏదో ఒకటి చేయాలి, తప్పదు. ఒక పాపర్ ఇది రెండోసారి తనను అవమానించడం.

    సరీగ్గా ఇదే సమయంలో త్రినాధ్ స్కూల్ టీచర్ విజయరామారావు ముందున్నాడు.

    త్రినాధ్ చెప్పింది విని ఆయనకు ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ, భయంగానూ వుంది.

    ఓ నిమిషంపాటు ఆయనేం మాట్లాడలేదు.

    త్రినాధ్ విజయరామారావువైపే చూస్తున్నాడు పరిశీలనగా. వృద్ధాప్యంతో ముడతలుపడిన ఆయన నుదుటిపై చెమట, ఆయన ఏటవాలు కన్నులలో నీళ్ళు, ఎండిన పెదవులూ, పాలిపోయిన ముఖమూ చిన్నగా వణుకుతున్నాయి.

    విజయరామారావులో వచ్చిన అనూహ్యమైన మార్పుకు త్రినాధ్ కొద్దిగా ఆశ్చర్యపోయినా ఆ భావాన్ని బయటపడనివ్వలేదు.

    "నిజానికి నాకు ఎన్నో ఏళ్ళుగా సుదర్శన్ రావును చావుదెబ్బ తీయాలనే వుంది."

    ఆయన తన గతం తాలూకు స్మృతుల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు.

    త్రినాధ్ మౌనంగా వింటున్నాడు.

    "నిజానికి ఇప్పుడు సుదర్శన్ రావు ఉంటున్న స్థలం నా కష్టార్జితం. అది ఒకప్పటి మాట. ఏ ఆధారమూ లేని నన్ను భయపెట్టి వెయ్యి గజాలు తన సొంతం చేసుకున్నాడు. ఈ ఐదువందల గజాల్ని కూడా కబళించే వాడే. కాని ఆ దుర్మార్గుడి భార్య మహాసాధ్వి. ఆమె పోరు పడలేక దీన్ని వదిలేశాడు. నువ్వు చెబుతున్నట్టుగా ఇది గొప్ప అవకాశమే. నిజానికి ఇక్కడ గజం మూడొందలుంది..." ఆయన ఓ క్షణం ఆగాడు.

    "చూడండి మాస్టారు... నా ధ్యేయం ఒక్కటే. బతకటం ఎలా అని భయపడే ఈ దేశ యువతకు నేనో పాఠం చెప్పాలి. అందుకు నాకు కొద్దిపాటి పెట్టుబడి చాలు. అందుకే హోటల్ బాయ్ అవతారం ఎత్తి ప్రియాంకలోని అతిశయాన్ని రెచ్చగొట్టాను. ఆమె ఖచ్చితంగా తన ఇంటి ఆవరణలోనే స్విమ్మింగ్ పూల్ కట్టిస్తుంది. కాని, అందుకు సరిపడే స్థలం మాత్రం లేదు. ఆ ఇంటికి మూడుపక్కలా ఎక్కడా స్థలం దొరికే అవకాశం లేదు. ఇక మిగిలింది మీ ఇంటివైపే. సో... ఖచ్చితంగా మీ స్థలం అమ్మమని అడగవచ్చు. ఇప్పుడు కొండలా నేను మీకు అండగా వుంటాను. వాళ్ళకు అవసరమయ్యేది కేవలం 20 గజాలు. అది మీ ప్రహరీగోడ మందం పొడవుగా కావల్సి వుంటుంది. దాన్ని మీరిప్పుడు గజం ఆరొందలకు బేరం చెప్పండి."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra