Home » Suryadevara rammohan rao » నిశీథి నియంత

    అంగీకారసూచకంగా నవ్వారు.


                          *    *    *    *


    ఉదయం 11 గంటల సమయం....విశాలమైన జైలు ప్రాంగణం నిశ్శబ్దంగా వుంది.

    ఖైదీలంతా తోటపనిలో నిమగ్నమై వున్నారు.

    కొందరు గార్డెన్ లో, మరికొందరు జైలు ఆవరణలో పండించే కూరగాయల తోటలో నిర్విరామంగా వంచిన తల ఎత్తకుండా పనిచేస్తున్నారు.

    సెంట్రీలు డబుల్ బ్యారల్ గన్స్ చేతబూని ఖైదీల పనిని పర్యవేక్షిస్తున్నారు.

    అప్పుడు....సరీగ్గా అప్పుడే జరిగిందా సంఘటన. కూరగాయల తోటలో పనిచేస్తున్న వివేక్ ఖైదీ డ్రస్ చెమటతో తడిసిపోయింది అప్పటికే.

    అతనా శారీరక శ్రమను భరించలేకపోతున్నాడు, అయినా తప్పటం లేదు. అప్పటివరకు దూరంగా వున్న యిద్దరు ఖైదీలు అటుగా వచ్చారు. అక్కడ పర్యవేక్షణలో వున్న సెంట్రీలు చిదంబరం, నిరంజనం. వాళ్ళ కనుసైగతోటే ఆ ఇద్దరు ఖైదీలు వివేక్ దగ్గరకు వెళ్ళారు.

    "అరేయ్!" ఒక ఖైదీ వివేక్ నుద్దేశించి పిలిచాడు.

    వివేక్ ఆ పిలుపును వినలేను.

    "ఏంటిబే....పొగరా....మావాడి పిలుపు వినబడలేదా?" రెండో ఖైదీ అరిచినట్లుగా అన్నాడు.

    అప్పుడు చూశాడతను తలెత్తి ఆశ్చర్యంగా.

    "కత్తిరించవలసిన పీకలు కత్తిరించేసి, జైలుకొచ్చి బుద్ధిగా తోటపని చేస్తే ఉరిశిక్షను యావజ్జీవ కారాగారశిక్షగా మారుస్తారని ఆశపడుతున్నావా?" ఒక ఖైదీ ప్రశ్నించాడు.

    "మాకీ రోజు బద్ధకంగా వుంది. మా వంతు పని నువ్వే చెయ్యాలి అన్నాడు మరో ఖైదీ.

    వివేక్ విభ్రాంతిగా చూశాడు ఆ ఇద్దరి వైపు.

    "ఏంటిబే పొగరుగా చూస్తున్నావ్? మర్యాదగా చెయ్" మొదటి ఖైదీ మడి గట్టున కూర్చున్నాడు.

    "ఏంటిరా పిరికినాకొడకా! చేస్తావా లేదా?" రెండో ఖైదీ కూడా గట్టున కూర్చుంటూ అన్నాడు నిర్లక్ష్యంగా.

    "నేనెందుకు చేయాలి మీ పని? నాకీ పనే చాలా కష్టంగా వుంది" అన్నాడు ఒకింత ధైర్యంచేసి వివేక్.

    "కష్టంగా వుందా? మా నాయనే.... మర్డర్ చేసొస్తే ఏసీ రూముల్లో బజ్జోబెడతారా? చెయ్యరా వెర్రి వెధవా...."

    అప్పటికే ఉదయం ఎనిమిది గంటలనుంచి చేస్తున్న శారీరకశ్రమతో వివేక్ బాగా అలసిపోయున్నాడు.

    దాంతో ఒకింత ఉక్రోషంగా దగ్గర్లో వున్న సెంట్రీ చిదంబరం దగ్గరకు వడివడిగా వెళ్ళి వాళ్ళ దౌర్జన్యం గురించి చెప్పాడు.

    "మీరూ-మీరూ దొంగలు- దొంగలు, దొంగలు ఊర్లేనా పంచుకునేది? పనిని కూడా పంచుకోవాలి. ఎవరు చేస్తే మాకెందుకు? ఆ మూడు మడులు మీ ముగ్గురే బాగుచేయాలి. చేయకుండా తేరగా దొబ్బితింటానికి మీ అబ్బల సొమ్మేం యిక్కడ లేదు. వెళ్ళు....వెళ్ళు....చేతనయితే నీ మడినే శుభ్రం చేసుకో. చేతకాకపోతే వాళ్ళ మడుల్ని కూడా శుభ్రంచెయ్...." చిదంబరం కసురుకున్నాడు వివేక్ ని.

    "ఇదన్యాయం...." వివేక్ ఉక్రోషంగా అన్నాడు.

    "మరి హత్యలు చేయటం....అందునా ఆడపిల్లల్ని హత్యలు చేయటాన్ని ఏమంటారు బాబూ? కన్నా.... న్యాయమంటారా....?" కోపంగా అన్నాడు నిరంజనం.

    ఆ మాటలకు పట్టరాని కోపం వచ్చింది వివేక్ కి. భయంతో తమాయించుకున్నాడు.

    "వాళ్ళ పని నేనెందుకు చేయాలి....? నాకప్పగించిన పనినే నేను చేస్తాను. ఆ విషయాన్ని వాళ్ళకి మీరే స్పష్టం చేయాలి. అది మీ డ్యూటీ కాదా?" తనకొచ్చిన కోపాన్ని పూర్తిగా సెంట్రీల ముందు వ్యక్తపరుచుకోవడానికి కూడా ధైర్యం చాలక దాన్ని దిగమింగుకుంటూ అన్నాడు.

    "రేపో, ఎల్లుండో చావబోయే నీకు పంతాలు, పట్టింపులూ ఎందుకురా బాబూ! అసలే అమాయకుడివి..... అర్భకుడివి! వాళ్ళు చెప్పినట్లు చెయ్. వాళ్ళంటే మాకే భయంగా వుంటుంది. ఇక నువ్వెంత....?" చిదంబరం వేదాంత ధోరణిలో అన్నాడు.

    "అలా అంటానికి మీకు సిగ్గుగా లేదా?" ఒకింత కోపంగా అన్నాడు వివేక్.

    "నువ్వు చెయ్యని హత్యని నీ ప్రత్యర్ధులు నీ మీద మోపితే సిగ్గు లేకుండా ఒప్పేసుకొని నువ్వు జైలుకి రాలా....?" నిరంజనం రెచ్చిపోయాడు.

    "ఎందుకురా బాబూ గొడవ....? బ్రతికిన నాలుగు రోజులయినా ప్రశాంతంగా బ్రతకరాదా?" అనునయంగా అన్నాడు చిదంబరం.

    "అరేయ్ బచ్చా! ఏంటిరా డిస్ కషనూ? వచ్చి చేయ్....అసలే ఆ వీరనారాయణ బహు చెడ్డోడు. మాకు కేటాయించిన పని పూర్తికాలేదంటే మా తాట వలిచేస్తాడు. వచ్చెయ్...." ఆ యిద్దరు ఖైదీల్లో ఒకరు అల్లంత దూరంనుంచే అరుస్తూన్నట్లుగా చెప్పాడు.

    "సెంట్రీలకు ఖైదీల్ని చూస్తే భయమా....?! ఎవర్ని చూసి ఎవరు భయపడాలి?" రోషంగా అడిగాడు వివేక్.

    "నిజమే! మరి నువ్వెందుకు ఇక్కడ ప్రతివాడ్నీ చూసి భయపడతావ్?" ఎకసెక్కంగా అడిగాడు నిరంజనం.

    సమాధానం దొరక్క కొద్దిక్షణాలు కలవరపడ్డాడు వివేక్. నిజమే అతనన్నదాంట్లో తప్పేముంది?

    "మెత్తవాడ్ని చూస్తే ఎవడికైనా మొత్తబుద్ధవుద్దిరా బాబూ! వాదన ఎందుకుగానీ వాళ్ళ పని కూడా చేసెయ్...." చిదంబరం చిరాగ్గా అన్నాడు.

    "ఏంటి చిదంబరం వీడ్ని బుజ్జగించేది....వాళ్ళు నాలుగు తన్నితే వీడికే అర్ధమయిపోతుంది. మనం పోదాం పద. ఆ అరుగుమీద కూర్చొని దమ్ముకొడదాం కమ్మగా...." నిరంజనం దగ్గరలో వున్న ఓ చెట్టు అరుగుకేసి నడుస్తూ అన్నాడు.

    సెంట్రీల నిర్లక్ష్యానికి అతను స్థాణువయ్యాడు. అతనికాక్షణం రక్తం మరిగిపోయినట్లయింది. "ఏదైతే ఆదవుతుంది.... వాళ్ళిద్దరేం చేయగలరో చూస్తాను. పడిన మరణశిక్షకన్నా పెద్ద శిక్ష వీళ్ళు వేయగలరా? చూస్తాను- అదీ చూస్తాను....' అని మనసులోనే అనుకుంటూ కూరగాయల మడి దగ్గరకు వెళ్ళాడు వివేక్. 

    ఆ చుట్టుపక్కల వాళ్ళు ముగ్గురు తప్ప మరెవరూ లేరు.

    "రామ్మా....రా....త్వరగా వచ్చి నడుం వంచు...." అన్నాడో ఖైదీ.

    వివేక్ నిర్లక్ష్యంగా తలెగరేసి తన మడి గట్టుమీద కూర్చుని కలుపుమొక్కల్ని నెమ్మదిగా పీకడం మొదలెట్టాడు.

    "అమ్మనీ....అమ్మా! వీడు మాటినేలా లేడు. ఒక పట్టుపడదామా?" అన్నాడు రెండో ఖైదీ.

    "అంతేనంటావా?" అన్నాడు మొదటివాడు.

    వాళ్ళ సంభాషణ స్పష్టంగా వినిపిస్తోంది వివేక్ కి. గొడవ తప్పదనే నిర్ణయానికొచ్చాడతను.

    అతనిలోని ఉక్రోషం ఉన్మాదంగా మారింది.

    "నోట్లో వేలుపెడితే కొరకటం కాదు- కనీసం చప్పరించటం చేతకాని యీ పిరికిగొడ్డు- ఇప్పుడు మన మాట వినలేదంటే, రేపెవరుమాత్రం యీ జైల్లో మన మాట వింటారు?"

    "నాలుగుతికితే వీడు వింటాడు- వీడి తల్లోని జేజెమ్మ వింటుంది."

    వివేక్ లోని ఉన్మాదం ఉగ్రరూపం దాల్చింది.

    శరీరాన్ని ఉక్కుముక్కలా బిగించి జస్పాల్ ని కొట్టిన సంఘటనని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు.

    ఇద్దరు ఖైదీలు అతని దగ్గరకు వచ్చారు.

    ఒక ఖైదీ విసురుగా వివేక్ కాలర్ పట్టుకున్నాడు వెనుకనుంచే.

    అంతే....

    ఏం జరిగిందో తెలిసేలోపు ఆ ఖైదీ కాలర్ వదిలేసి రెండడుగుల దూరంలో దబ్బున పడిపోయాడు.

    రెండోవాడు రంకెలేస్తూ మీదకు వచ్చాడు.

    అతన్ని బాగా దగ్గరకు రానిచ్చి తలతో అతని పొట్టలో బలంగా గుద్దాడు వివేక్.

    అంతే....

    అతను కడుపు పట్టుకొని మడిలో పడిపోయాడు.

    పడిపోయిన ఖైదీలిద్దరూ కోపంగా చూస్తూ విసురుగా లేచారు.

    ఆ ప్రయత్నాన్ని ముందుగానే శంకించిన వివేక్ పెనుభూతం ఆవహించినవాడిలా ఎగిరి వాళ్ళ గుండెలమీద తన్నాడు. తన్నుతూ తనూ కిందపడ్డా, క్షణాల్లో లేచాడు.   

    "రండిరా....చేయని హత్యకే నాకు శిక్షపడింది. మిమ్మల్నిప్పుడు నిజంగా చావగొట్టినా అంతకంటే పెద్ద శిక్ష లేదుగా.... ఉరిశిక్ష ఒక్కసారే గదా వేసేది! రెండుసార్లు వేయలేరుగా? కమాన్....రండి.... ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. మీరో- నేనో తేలిపోవాలి. నా మంచితనాన్ని అసమర్ధతగా, పిరికితనంగా భావిస్తార్రా? రండి....మీకీవేళ నా చేతుల్లో రాసిపెట్టి వుంది...." అంటూ వాళ్ళు లేచేలోపు వాళ్ళమీద బరువైన బండరాయిలా పడిపోయాడు.

    దెబ్బమీద దెబ్బ.... పిచ్చిపట్టినవాడిలా క్షణం గేప్ ఇవ్వకుండా తుక్కుకింద కొట్టేశాడు వాళ్ళను.

    వాళ్ళు దెయ్యాలైపోయి చూస్తుంటే-

    "నేను నీ పని చేయటం కాదురా....! మీరు నా పని చేయాలి....లేవండి" గర్జించాడు వివేక్.

    బిత్తరపోయారా యిద్దరూ.

    "ఏంటలా దెయ్యంపట్టినవాళ్ళలా చూస్తారు? చెయ్యండి.... ముందు నా మడిలో కలుపు తీసి- తర్వాత మీ పని చూసుకోండి...." అంటూ మీద మీదకు వెళ్ళడంతో వాళ్ళిద్దరూ ఒక్కసారి పరుగు లంకించుకొని చిదంబరం, నిరంజనం వున్న దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పారు.

    వాళ్ళు కోపోద్రిక్తులై వడివడిగా వివేక్ దగ్గరకు వచ్చారు. "ఏంటి నువ్వు చేసిన పని? తోటి ఖైదీల్ని తుక్కుకింద కొడతావా? ఎంత ధైర్యమురా నీకు?" నిరంజనం ఆవేశంతో వూగిపోతూ అన్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra