"ఊ! ఆయనైతే మాత్రం అంతమాట అంటే నేను వూరుకుంటానా ఏమిటి? నీ చేత 'ఊ' అనిపించుకోందే తిరిగి వెళ్ళి ఆయనగారి ముఖం చూడలేను" అని రవి ముఖంలోకి తీక్షణంగా పరికించి కొంచెం నవ్వి లాలనగా "మన హేమకు పధ్నాలుగు వెళ్లి పదిహేను వస్తున్నాయి" అంది.

    "నీ ఉద్దేశం కొంచెం విడమరిచి చెప్పరాదూ?" అని రవి అన్నం తినటం మాని కనుబొమ్మలు ముడిచి స్తబ్దుగా కూర్చున్నాడు.

    "అయ్యో రాత! నీ దగ్గర సిగ్గెందుకు నాయనా? హేమను "మామయ్య ఎలా వుంటాడే?" అని నేనడిగితే "పోమ్మా! నువ్వు మరీను" అని అవతలకు తుర్రుమంటుంది" అని సహేతుకంగా అతన్ని ఆసాంతం  వీక్షించి "మీరిద్దరూ ఒకరిప్రక్కన ఒకరు నిలబడితే చిలకాగోరింకల్లా వుంటారు. రేపు జ్యేష్ఠమాసంలో కావలసినన్ని ముహూర్తాలు......"

    మాట ఇంకా పూర్తికాకుండానే రవి అసహ్యంతో 'ఛీ!' అని కంచం అవతలకు తోశాడు.

    ఈ ఘాతము అగాధమైన హృదయంలో అన్నిమూలలూ తడిమి బలంగా తట్టగా ఆమెముఖం వెలవెలబోయింది. కానీ ఏ చాకచక్యాన్నో వినియోగించి కాస్త చిరునవ్వును అక్కడక్కడా ద్యోతకం చేసుకుని "అదికాదు తమ్ముడూ!" అని ఇంకేదో చెప్పబోయి, అది పూరించటంలో ఘోర పరాజయం పొంది, తేలిపోయి పాలిపోయిన వదనమండలాన్ని మరింత మలినపూరితం చేయగా, "అదేమిటి?" అని తడబడిన కంఠంతో గొణిగింది.

    రవి "నీకు కోపం రాకపోతే చెబుతాను. ఇలా సంబంధాలు కలవాలని ఉబలాటపడతారే? హేమ పుట్టినప్పటినుంచీ నాదగ్గర ఎంతో చనువుగా పెరిగింది. అమ్మానాన్నా పోయినప్పటినుంచీ నువ్వూ చిన్నక్కే తల్లీతండ్రీ అయ్యారు. అక్కయ్య కూతుర్ని మరోదృష్టితో నేను చూడలేను."

    ధైర్యం, స్థయిర్యం నశించి మ్రాన్పడి అలా చూపులు నిగుడించి వుండిపోయింది.

    "అసలు ఇలాంటిమాటలు ఎలా వస్తాయో అర్ధంకాదు. నాకు చాలా బాధ కలుగుతుందని మీరెందుకు అనుకోరు?" అని విసుగుగా లేచి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు రవి.

    ఆ రోజంతా సుభద్ర ఏడుస్తూ పడుకుంది. అస్పష్టంగా తనలో తాను గొణుక్కుంది.అది నిందించటమో, తూలనాడటమో, పరిహసించడమో రవి అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించలేదు. కానీ ఆమె కుములుతూ, కుళ్ళుతూ పడుకోవడం అతనికేం బాగోలేదు. చీకటి పడుతూండగా ఆమె దగ్గరకువెళ్ళి "నువ్వెందుకేడుస్తున్నావో నాకర్ధంకావటంలేదు. నీ తమ్ముణ్ణి అల్లుడ్ని చేసుకోవాలనేనా?"

    సాధారణంగా ఎవరికైనా సరే ఈమాట అశనిపాతమువలె తగలాలి మరి. ఆమె ఎటువంటి ఆవేదన చెందిందో, లేక ఓర్చుకుందో? మొత్తానికి పలకలేదు.

    "హేమకు మంచి వరుడ్ని చూసి పెళ్ళిచేసే బాధ్యత నాది."

 

    అప్పటికీ ఆమె పలకలేదు. చీరచెంగు ముఖంమీదకు లాక్కుని ఒక ప్రక్కన ఒత్తిగిలి పడుకొంద

    "నాతో మాట్లాడకూడదని పట్టుబట్టావా ఏం?"

    ఇంకా ఆమె 'ఆ,ఊ' అనకపోయేసరికి "సరే! మా అక్కయ్య ఇట్లాంటిదని చెప్పుకుని సంతోషిస్తాను" అని నిరసనతో అక్కడినుంచి కదలబోయాడు.

    అప్పుడు చప్పున ముసుగులోంచి తల ఇవతలకు పెట్టి ఆమె "తమ్ముడూ! నాకు మనస్సు ఏమీ బాగాలేదు. రేప్పొద్దున్నే వెళ్ళిపోయే సదుపాయం చూడు" అని, అతడు మెదలకుండా నిలబడేసరికి "నాకేం కోపంలేదు నాయనా! ఎవర్ని ఉద్ధరించేందుకు కనుక నా కినుక? నాకా ఈ నియమాలూ, విచిత్ర మనస్తత్వాలూ అర్ధంకావు. మీ బావగారిముందు మొహం చూపించో, చూపించకో నా అవస్థ నేను పడతాను నా ఖర్మం."

    "అంత తొందరగా వెళ్ళిపోవాలా ఏం?"

    పొంగి పొర్లివచ్చే దుఃఖాన్ని ఆపుకునేందుకు సతమతమవుతూ "ఇక్కడ వుండి ఈ వేదన భరించలేను. ఎన్నాళ్ళనుంచి పెంచుకున్నానో ఈ ఆశ. మరో అమాయకజీవిని కష్టపెట్టాను. నువ్వు చేసిన పని ఎన్నటికీ మరువరానిది. ఎవరిమీద వాళ్లకు అసహ్యం కలిగేటట్లు చేయటం సామాన్యమైన విషయమా?"

    అతను సంకోచిస్తూ తటస్థంగా ఒక నిముషం నిలబడి తరువాత నిదానంగా వెళ్ళిపోయాడు.

                                                                  6

    కొన్నాళ్ళకు  రిజల్ట్సు తెలిశాయి. రవి పాస్ అయ్యాడు. శశి నెంబరుకూడా తనకు కొంచెం దూరంలో వుంది. మధ్యలోవున్న కొన్ని నెంబర్లు వికృతంగా తోచాయి. కానీ ఆ మధ్యగలవాటిలో, ఏదో స్ఫురించి ఆతృతగా చూసేసరికి అందులో చంద్రం నెంబరులేదు. చాలా విచారించాడు.

    ఆగష్టు వచ్చింది. కాన్వొకేషన్ ని మద్రాసువెళ్ళాడు. ఇదివరలా ఇప్పుడతనికి గదిలేదు. సరాసరి చిన్న సూట్ కేసుతో సహా రాగిణి ఇంటికి దారితీశాడు.

    ఆ సమయానికి రాగిణి కిటికీలో అద్దంపెట్టుకుని తల దువ్వుకుంటూ, తడవకు ఎంత జుట్టు రాలిపోతుందో తలుచుకుని విచారిస్తూ కూర్చుంది. వాకిట్లో బండి ఆగటంచూసి, చేస్తున్నపని ఆపి ఊచలలోంచి తొంగిచూసింది. ఆనందాతిరేకంతో ఆమె కళ్లు మెరిశాయి.

    ఉసూరుమంటూ లోపలికి ప్రవేశించి మంచంమీద కూలబడ్డ రవిని "ఎప్పుడురాక?" అని సంభ్రమంతో పలకరించింది.

    "ఇప్పుడే. నాకు కాఫీ కావాలి, అర్జంటుగా..."

    "మీకు అర్ధరాత్రిపూట పాలు కావాలి. వేళకాని వేళల్లో కాఫీకావాలి. ఉండండి, మీ చిన్నక్కగారికి రిపోర్టుచేస్తాను."    

    అతను ఆశ్చర్యంతో "నేను ఇప్పుడే వచ్చానన్న సంగతి మరచిపోయావా ఏం? చాలాకాలంగా కలిసివుంటున్న దానిలా మాట్లాడుతున్నావు. భలే! మొత్తానికి అధిక్యత అంటే ఆడవాళ్ళదే."

    "మొదలుపెట్టారూ సోది? మీరు ఇలానే నా ఆనందాన్నంతా పాడుచేస్తారు. ఇవాళ నా పుట్టినరోజు తెలుసా? రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాను. నా జన్మదినాన కూడా నా అన్నవాళ్ళెవరూ దగ్గరలేకుండా పోయారని. కానీ ఆ దయామయుడు నా మొర ఆలకించాడన్నమాట. అతిథి సత్కారంచేసే భాగ్యం లభించింది" అని ఆమె కాఫీ తెచ్చేందుకు లోపలకు పోబోయింది.

    "అయితే నీకు నేను 'నా' అన్నవాడినే అన్నమాట!"

    ఆమె సగం అల్లుకున్న జడ భుజంమీదుగా ముందుపడేటట్లు గిర్రున వెనుదిరిగి "కాదామరి?" అంది నవ్వుతూ.

    అతని శరీరం ఆనందంతో రోమాంచితమైంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra