Home » Vasireddy seeta devi novels » Dr Vasireddy Seetha Devi Sahityam


    "ఇంతవరకూ లేదు. కేవలం మాటకు కట్టుపడాలనే ఉద్దేశంతో అలా అన్నాను."

 

    "మిమ్మల్ని ఆరాధించకుండా వుండలేను" అంది అరుంధతి.

 

    రాజారావు మాట్లాడలేదు. "నేను నా భర్తకు ద్రోహం చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను." కన్నీళ్ళు వత్తుకుంది అరుంధతి.

 

    "మీరు రేపే వెళ్ళిపోవాలా?"

 

    "అసలు ఈ రాత్రికే వెళదామనుకున్నాను. కాని కొంచెం గుండెల్లో నొప్పిగా వుంది. అందుకే రేపు వెళదామనుకుంటున్నాను. ఏ పరిస్థితుల్లోనూ రేపు రాత్రికి వెళ్ళిపోతాను" అన్నాడు రాజారావు కన్నార్పకుండా అరుంధతిని చూస్తూ. ఆమె రూపాన్ని కళ్ళతోనే ఫోటో తీసుకొని హృదయంలో దాచుకోవాలనిపించింది.

 

    "మీ ఆరోగ్యం కుదుటపడలేదు. ఇంతలోనే తిరగటం ప్రారంభిస్తే ఎక్కువ రోజులు బతకరు!" రుద్ధకంఠంతో ఆగి ఆగి అంది.

 

    రాజారావు నిర్లక్ష్యంగా నవ్వాడు. "మనిషి పుట్టాక చావటం తథ్యం. సత్యానికి భయపడి ఎక్కడకు పారిపోతాం? చావుకు భయపడి పనులు మానేస్తామా?" నిర్లిప్తంగా వున్నాయి అతని మాటలు.

 

    "ఆరోగ్యం బాగా లేనప్పుడు జాగ్రత్త తీసుకోవటంకూడా కర్తవ్యమేగా?"

 

    రాజారావు మౌనంగా కూచున్నాడు.

 

    "మీకు చావంటే భయం లేకపోవచ్చు. కాని ఆ వార్త విని నేను బతగ్గలనా? అంది అరుంధతి వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా మింగుకుంటూ.

 

    రాజారావు ఉబికివస్తున్న వుద్వేగాన్ని అదుపులో పెట్టుకొనే ప్రయత్నంలో సతమతమవుతున్నాడు. మాట్లాడలేదు.

 

    "ఇక్కడ వుండడం ఇష్టంలేకపోతే ఇంటికి వెళ్ళి వుండండి. నాకోసం కాకపోయినా మీ భార్యా పిల్లలకోసం అయినా మీరు బతకటం అవసరం" అంది అరుంధతి.

 

    రాజారావు ముఖంలో విషాద మేఘాలు వ్యాపించాయి. వేదాంతిలా నవ్వాడు.

 

    "పిల్లలు నేను లేకుండా పెరగగలరు, తినటానికి వుంది. నా భార్యకు నేను లేకపోతేనే బహుశా బాగుంటుందేమో! ఆస్తి అమ్మకుండా వుంటే చాలు ఆమెకు. ఆమెకు డబ్బు కావాలి. నాకంటే ఆమె డబ్బునే ఎక్కువగా ప్రేమిస్తుంది."

 

    "మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. స్త్రీ హృదయాన్ని మీరు అర్ధం చేసుకోలేడు."

 

    "కావచ్చు నేనే పొరబడుతూ వుండవచ్చు. కాని వెళ్ళీ వెళ్ళక ఎప్పుడో ఏ అర్ధరాత్రో ఇంటికి వెళితే ఆదరణతో కూడిన ఒక మాట అనదు. పైగా ఎత్తిపొడుపు మాటలతో నా ప్రాణాలను తోడేస్తుంది. భర్తను అర్ధం చేసుకోలేని భార్యతో కాపరం చెయ్యటంకంటే నరకం మరోటి వుండదు."

 

    రాజారావు వైపు జాలిగా చూసింది అరుంధతి.

 

    "మనిషిని మనిషిగా నిలబెట్టడానికి అతనికి ప్రేమా, ఆదరణా, సానుభూతి అవసరం. అవి నాకు ఇంటిదగ్గర దొరకవు. శుష్క రాజకీయ జీవితంలో విసిగినప్పుడు నాలోవున్న మానవుణ్ణి చావకుండా నిలబెట్టుకోవటానికే అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూవుండేవాణ్ణి. ఇకమీదట నాకు ఈ అవకాశంకూడా లభించదు."  

 

    "పాపిష్టిదాన్ని నావల్లనే." కళ్ళు తుడుచుకుంది అరుంధతి- "మీరు అప్పుడప్పుడూ వస్తానని మాట ఇవ్వండి" అంది చెయ్యి ముందుకు చాస్తూ.

 

    "రాలేను. అమ్మా, సీతాపతి కూడా మారిపోయారు. నేను మళ్ళీవస్తే కలతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది- రాను, రాలేను. కాని నీ జ్ఞాపకం మధురమైన ఆలాపనగా ఎల్లప్పుడూ నా హృదయంలో ధ్వనిస్తూనే వుంటుంది. ఆ అనుభూతి చాలు నాకీ జీవితానికి." కళ్ళు ఎర్రబడ్డాయి. కనురెప్పల్ని గట్టిగా మూసుకున్నాడు. కన్నీటిని ఆపుకో ప్రయత్నిస్తున్నాడని అర్ధం చేసుకుంది అరుంధతి.

 

    రేపటినుండి రాజారావు తనకు కనిపించడు అనే భావం రాగానే ఆమె హృదయంలో భూగోళమంత ఖాళీ ఏదో ఏర్పడినట్లు బాధపడసాగింది.

 

    "అమ్మాయ్ అరూ!" అత్తగారి కేకతో ఇద్దరూ వాస్తవ ప్రపంచంలోకి వచ్చారు.

 

    "అమ్మ పిలుస్తోంది వెళ్ళు. కళ్ళు తుడుచుకో!" అన్నాడు రాజారావు, కళ్ళు తుడుచుకొని సర్దుకొని కూచుంటూ.

 

    అరుంధతి గదిలోంచి వెళ్ళిపోతుంటే తన హృదయంనుంచి ఏదో భాగం వేరయిపోతున్నట్లుగా కలవరంగా చూశాడు.

 

    అత్తగారి ముఖం కోపంతో ధుమధుమలాడుతూంది. అరుంధతికి భయం వేసింది. ఆమె ఏం గొడవ చేస్తుందోనని. రాజాను ఏమయినా అంటుందేమోనని అపరాధినిలా తలవంచుకొని నిల్చుంది. తమ మాటలు కాని వినలేదు గదా!

 

    "అమ్మా! మనవంశం మచ్చలేని వంశం. నీ పేరు అరుంధతి. నీవల్ల ఈ వంశ గౌరవం పెరగాలి!" అత్తగారి కంఠం కంచులా ఖంగ్ మని మోగింది.

 

    ప్రశ్నార్థకంగా తల ఎత్తి చూసింది.

 

    "అర్ధం అయిందనుకుంటాను," అంటూ గిర్రున తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది శాంతమ్మ.

 

    అరుంధతి మంచంమీద వాలిపోయి కుమిలి కుమిలి ఏడ్చింది. సాయంత్రం అవుతుండగా అలసిపోయిన ఆమెకు నిద్ర పట్టింది.

 

    మాధవి "కెవ్వు" మనటంతో మెలుకువ వచ్చి పరుగెత్తుకొచ్చింది. సీతాపతి మాధవి వీపుమీద రెండు అంటించాడు అరుంధతిని చూశాక.

 

    "ఎందుకు పసిదాన్ని అంతేసి దెబ్బలు వేస్తారు?" అంటూ అడ్డం వచ్చింది అరుంధతి.

 

    సీతాపతి గుడ్లెర్రజేసి భార్య ముఖంలోకి చూశాడు. ఆమె పిల్లనెత్తుకుని అక్కడినుంచి వెళ్ళిపోయింది. పిల్ల ఏడుపు విని బయటకు వచ్చిన రాజాను చూసీ చూడనట్లే వుండిపోయాడు. తల్లిని నీళ్ళు తోడమన్నాడు.

 

    స్నానం చేస్తున్నంతసేపూ తల్లీ కొడుకులు దేన్నిగురించో మాట్లాడుకోవడం చూసింది అరుంధతి. ఆమెకు వళ్ళు మండింది. ముఖ్యంగా రాజాను నిర్లక్ష్యంగా చూడటం ఆమెకు సహించరానిదిగా వుంది.

 

    భోజనాల దగ్గర సీతాపతి రాజారావుతో మామూలుగానే మాట్లాట్టం చూసి అరుంధతి మనస్సు తేలికపడింది. ఇద్దరూ వెన్నెట్లో కుర్చీలు వేసుకొని కూచుని చాలా సంగతులు మాట్లాడుకున్నారు.

 

    అరుంధతి అన్నం తినలేదు. తల నొప్పిగా వుందని వంక పెట్టింది. శాంతమ్మకూడా అంత బలవంతం చెయ్యలేదు.

 

    "నీ వేషాలేం నచ్చలేదు" అన్నాడు సీతాపతి ఆ రాత్రి గదిలో కాలు పెడుతూనే. ఒక్కక్షణం ముఖంలోకి చూసింది. "దానికి నేనేం చెయ్యగలను?" అంది తాపీగా.

 

    అరుంధతినుంచి సీతాపతి ఆశించని జవాబు వచ్చింది. మతిపోయినంత పనయింది.

 

    "బుద్ధి లేకపోతే సరి!" అన్నాడు కటువుగా.

 

    "నేనంత బుద్ధిలేని పనులు ఏమీ చెయ్యటంలేదు" అంది అంత తాపీగానూ.

 

    ఆవిడ అంత నిర్లక్ష్యంగా జవాబులు ఇస్తూంటే సీతాపతి కోపంతో వణికిపోయాడు.

 

    "పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ లోకం చూట్టంలేదని అనుకుంటుందట!"

 

    "అలా అనుకోకపోతే అది పాలు తాగలేదు. అది బతకాలి గనుక అలా అనుకోక తప్పదు."

 

    అరుంధతి మాటలకు అర్ధం బోధపడలేదు. దాంతో పిచ్చికోపం వచ్చేసింది సీతాపతికి.

 

    "నోర్ముయ్! ఏకులా వచ్చి మేకులా తయారయావు. తిండిక్కూడా లేనిదాన్ని తెచ్చి నెత్తికి ఎక్కించుకున్నందుకు మా బాగా తయారయావు" ఈసడింపుగా అన్నాడు.

 

    అరుంధతి అహంమీద గట్టి దెబ్బ తగిలింది.

 

    "తిండికి లేకపోతే మీ ఇంటికి పెట్టమని నేను రాలేదుగా? మీరే వెతుక్కుంటూ వచ్చి, నా అందం చూచి మైమరచి, డబ్బును ఎరగా చూపించి నన్ను కొనుక్కున్నారు. లేకపోతే మీ అందం...చదువు చూసి మా నాన్న..."

 

    "నోరు ముయ్!"

 

    అరుంధతికి కళ్ళముందు మంటలు కనిపించాయి. ఏం జరిగిందో తెలుసుకొనేటప్పటికి చెంప మండిపోతూంది. సీతాపతి, కోపంతో బుసలుకొడుతున్నాడు.

 

    అరుంధతికి ఎదురు తిరగాలని వుంది. నువ్వంటే నాకు ఇష్టం లేదనీ, నువ్వంటే నాకు అసహ్యం అని అరచి చెప్పాలని ఉంది. ఆడదానిమీద చెయ్యి చేసుకొనే మగవాడంటే తనకు గౌరవం లేదని అనాలని వుంది. రాజారావును నేను ప్రేమిస్తున్నానని ఎలుగెత్తి అరవాలని వుంది కాని అందులో ఏ ఒక్కటి చెయ్యలేదు. మౌనంగా తలవంచుకొని కూచుంది. ఆ సమయంలో తను ఎదురుతిరిగితే పెద్ద రభస అవుతుందనీ, ఆ విషయం రాజారావుకు తెలిస్తే వున్నపాటున అక్కడనుండి వెళ్ళిపోతాడనీ ఆమెకు తెలుసు. అందుకే ఉబికివస్తున్న కోపాన్నీ, రోషాన్నీ, అభిమానాన్నీ, ఆవేశాన్నీ బలవంతంగా అణచుకుంది. మౌనంగా శిలాప్రతిమలా కూచుని వుండిపోయింది.

 

    తెల తెలవారుతుండగా అరుంధతికి మెలకువ వచ్చింది. అప్పటికే మాధవి లేచి బోసినవ్వుల్ని వెదజల్లుతూ మంచంమీద కూచుని వుంది. సీతాపతి అప్పటికే నిద్రలేచి వెళ్ళిపోయాడు. అరుంధతి పిల్లను ఎత్తుకుని వంటింట్లోకి వచ్చింది. రంగడు పాచిపనులన్నీ చేసేశాడు. పాలు కాచి పిల్లకు పట్టింది. కాఫీ కాచి శాంతమ్మకు ఇచ్చింది. వంటపని శాంతమ్మ చేసినా కాఫీ మాత్రం రెండువేళలా అరుంధతే కాస్తుంది. భర్త కనిపించకపోవడం చూసి ఇంత పొద్దుటే ఎక్కడకు వెళ్ళారని అత్తగార్ని అడగాలనుకుంది. కాని, అడగబుద్ధి పుట్టలేదు. మరో గ్లాసులో కాఫీ తీసుకొని రాజాకు ఇవ్వటానికి బయలుదేరింది.

 

    "రాజాకు కాఫీ నేను ఇస్తాలే!" అంటూ శాంతమ్మ అరుంధతి చేతిలో గ్లాసు అందుకుంది. అరుంధతికి తల కొట్టేసినట్లయింది.

 

    "ఎవరూ ఇవ్వనక్కరలేదు, నేనే వచ్చాను," అంటూ నవ్వుతూ కాఫీ తీసుకున్నాడు రాజారావు. అరుంధతికేసి జాలిగా బాధగా చూశాడు. నవ్వుతున్న అతని ముఖంలో కళా కాంతీ లేదు. ముఖం వెలవెలపోతూంది. దాన్ని దాచటానికే నవ్వు తెచ్చిపెట్టుకున్నాడనేది స్పష్టంగా తెలిసిపోతూంది.

 

    "సీతాపతి ఇంత పొద్దున్నే ఎక్కడకు వెళ్ళాడు? కనిపించటంలేదు." శాంతమ్మను రాజారావు అడిగాడు.

 

    శాంతమ్మ ఓ క్షణం ఆలోచించి, "ఏలూరు వెళ్ళాడు," అంది అరుంధతి విస్మయంగా చూసింది.

 

    "ఏలూరు వెళ్ళాడా?" ఆలోచనలో పడ్డాడు రాజారావు.

 

    "అవును బాబూ! ఏదో అర్జెంటు పని ఉందంటూ వెళ్ళాడు."

 

    "నాతో మాటమాత్రానికైనా అనలేదే?" సాలోచనగా అన్నాడు.

 

    "తెల్లవారుఝామునే వెళ్ళాడు. నువ్వు మంచి నిద్రలో ఉన్నావని లేపటం ఎందుకులే అని వెళ్ళివుంటాడు." అంది శాంతమ్మ.

 

    అరుంధతి రాజారావువైపు దీనంగా చూసింది.

 

    "వెళ్ళిపోదా మనుకుంటున్నావా? మంచివాడివే! ఇంకా ఆరోగ్యం కుదుటబడలేదు. నువ్వు వెళతానంటేమాత్రం మేము వెళ్ళనిస్తామా? అంది శాంతమ్మ.

 

    అరుంధతి శాంతమ్మ మాటల్లో నమ్మకం కుదరనట్లు చూసింది. కాని ఆమె ముఖంలో నిజాయితీ కనిపించింది. రాజారావుకూడా శాంతమ్మ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. అతనికి ఆమె మాటల్లో నిజం ఎంతవరకుందో అర్ధం కాలేదు. తనను వెళ్ళనివ్వరా? మరి వారి ప్రవర్తనలలో ఆ మార్పు? తను గమనించలేదనే అనుకుంటున్నావా?

 

    "మళ్ళీ ఎప్పుడు వస్తాడు సీతాపతి?" అన్నాడు రాజారావు.

 

    "రెండు రోజుల్లో వస్తాడు" అంది. శాంతమ్మకు ఆ విషయంలో సంభాషణ పొడిగించడం ఇష్టంలేనట్లు కనిపిస్తూంది.

 

    రెండు రోజులదాకా రాడా? తన భర్త ఏలూరు వెళ్ళి అంతకాలం ఎప్పుడూ లేడే! బహుశా తను తొందరపడి రాత్రి అలా ప్రవర్తించినందుకు బాధపడి ముఖం చాటు చేశాడేమో? అంతే అయివుంటుంది. తనే ఆయన్ను రెచ్చగొట్టిందేమో? అతను కోపంగా ఉన్నాడని తెలుసుకొని మౌనంగా ఉంటే బాగుండేది.

 

    "రెండు రోజులదాకా రాడా? అయితే నాకు కనిపించడన్నమాట!"

 

    రాజారావు మాటలకు దెబ్బ తగిలినట్లు చూసింది అరుంధతి.

 

    "అదేం? వాడు రాకుండానే వెళ్ళిపోతావా?" తొట్రుపాటుతో అడిగింది శాంతమ్మ.

 

    "అవును. ఈ రాత్రికే వెళ్ళిపోతానమ్మా!" అంటూ శాంతమ్మ మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే అక్కడనుంచి వెళ్ళిపోయాడు రాజారావు.

 

    ఆ రోజంతా రాజారావు అరుంధతిని తప్పించుకొనే తిర్గాడు. శాంతమ్మదగ్గర కూచుని కబుర్లు చెప్పసాగాడు. నవ్వుతున్నాడు. నవ్విస్తున్నాడు. కాని ఆ నవ్వు వెనక అతని హృదయం రోదిస్తూనే ఉంది. శాంతమ్మ కూడా బాధపడుతూనే ఉంది. అరుంధతి అశాంతిగా ఇల్లంతా కలయతిరుగుతూంది.

 

    సంధ్యచీకట్లు కమ్ముతున్నాయి. అరుంధతి దీపాలు వెలిగించి పెట్టింది. ఒక లాంతరు రాజారావు గదిలో పెట్టటానికి వెళ్ళింది. రాజారావు కిటికీ ముందు నిల్చుని చువ్వలు పట్టుకొని ఉన్నాడు. బయటకు చూస్తున్నాడు. అరుంధతివైపు అతని వీపు ఉంది. దీపం అక్కడ పెట్టింది. రాజారావు వెనక్కు తిరుగుతాడేమోనని ఓ క్షణం అలాగే నిల్చుంది. కాని రాజారావు వెనక్కు తిరగలేదు. కావాలనే అలా నిల్చున్నాడని అర్ధం చేసుకుంది అరుంధతి. వసారాలో లాంతరు ఉంచటానికి వెళ్ళిపోయింది.

 

    శాంతమ్మ వెంకన్నతో పొలం విషయాలూ, ఆ సంవత్సరపు పంటల్ని గురించి మాట్లాడుతుంది.

 

    "మన తాటితోపు ఆకులకు బేరం వచ్చింది అమ్మగారూ!" అన్నాడు వెంకన్న.

 

    "ఎంతేమిటి?"

 

    "మూడొందలు."

 

    "పోయిన సంవత్సరంకంటే ఎక్కువే. ఖాయం చేశారా?"

 

    "అయ్యగారు ఊళ్ళో లేరుగా?"

 

    "ఇచ్చెయ్యి. అంతకంటే ఎక్కువ రాదులే!"

 

    అరుంధతికి ఆ సంభాషణ తమాషాగా అనిపించింది. ఎంత శ్రద్ధగా మాట్లాడుకుంటున్నారో! ఇంతకాలమయినా తనకు ఇంకా ఈ విషయాల్లో అభిరుచి కలగటంలేదు.

 

    అరుంధతి వెండిగిన్నెలో పాల అన్నం పెట్టింది. మాధవిని ఎత్తుకుని ఇంటిముందు అటూ ఇటూ తిరుగుతూ గోరుముద్దలు పెడుతూంది. వెంకన్నా, శాంతమ్మ చెప్పుకుంటున్న మాటలు వింటూంది. కాని ఆమె మనస్సు రాజా వైపుకు పోతూంది. ఎలాగయినా ఆ రోజు ప్రయాణం ఆపాలని ఆలోచిస్తూంది.

 

    బరువైన అడుగుల శబ్దం వీధి వాకిట్లోంచి వినిపించింది. వీధి గుమ్మంకేసి చూసింది. అరుంధతి చేతిలోని గిన్నె కిందపడిపోయింది. పిల్లను గట్టిగా పట్టుకొని కొయ్యబారి నిల్చుండిపోయింది.

 

    "అయ్యబాబోయ్ పోలీసులు!" అన్నాడు వెంకన్న.

 

    శాంతమ్మ గబుక్కున లేచింది. నిలువెల్లా వణికిపోతూ నిలబడింది. చలనరహితంగా నిలబడివున్న అరుంధతి కళ్ళముందు మరో నిముషంలో రాజారావు పోలీసుల మధ్య నిలబడి కనిపించాడు. తెల్లగా పేలవంగా నాజూకుగా వున్న చేతులకు నల్లగా బలంగా కనిపిస్తున్న బేడీలు కనిపించాయి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra