Home » Suryadevara rammohan rao » అశ్వభారతం


    శంకర్ కి చెప్పకపోవడంతో భరత్ ఆలోచనవేరు. కన్నతండ్రిలా కంటిరెప్పలా పెంచిన శుక్రాచార్య పట్ల కృతజ్ఞతతో యజ్ఞంలోకి దిగని తను కేవలం తన మాస్టారుకు ఏదో హాని తలపెట్టారనే ఉద్దేశంతో శశాంక తేజదత్తకు శత్రువులా రంగంలోకి దిగినట్లు శంకర్ భావించే అవకాశం వున్నందువల్లే ఆ క్షణాల్లో ఇదంతా ఆలోచించిన భరత్ బయటపడలేక పోయాడు.

    భరత్ మోకాళ్ళ ద్వారా సంజ్ఞను అందుకున్న కింగ్ ను పూనా రోడ్ల వెంట మెరుపువేగంతో అనంత్ ట్రైనింగ్ గ్రౌండ్ వేపు సాగిపోతుంది.

    ఎవరీ శశాంక తేజదత్త ....?

    ఎవరీ యజ్ఞభూపతి ....?

    ఇద్దరు కుబేరులని, రేస్ హార్స్ ని మెయిన్ టైన్ చేస్తూ వుంటారని మాత్రమే తెలుసు తప్ప మరే వివరాలు వారి గురించి భరత్ కు తెలియవు.


                               *    *    *


    ఆడిటర్ చెబుతున్న ఎకౌంట్స్ వింటూ 15 హేండ్స్ (గుర్రాల ఎత్తుని హేండ్స్ లో కొలుస్తారు. ఒక హేండ్ 4  ఇంచెస్ కి సమానం. ఇటీవల నుంచే సెంటీమీటర్స్ లో కొలవడం ప్రారంభమైంది. ఒక హేండ్ 10.16 సెంటీమీటర్స్ కు సమానం) ఎత్తున్న విక్టోరియా జూలును నిమురుతున్నాడు యజ్ఞభూపతి. పదిహేను ఎకరాల విస్తీర్ణంలో యజ్ఞభూపతి తాతగారు కట్టించిన ప్యాలెస్....మైసూరు మహారాజా ప్యాలెస్ ని తలదన్నేట్లుగా ఠీవిగా.... దర్పంగా.... ప్రతి అంగుళం కళాత్మకంగా, విలాసవంతంగా తీర్చిదిద్దినట్లుండే ఆ ప్యాలెస్ వెనక ఆరు ఎకరాల స్థలాన్ని రేస్ హార్స్ కి కేటాయించాడు యజ్ఞభూపతి. 

    విక్టోరియా ఎంట్రీ పంపించావా?" ప్రక్కనే వున్న సెక్రటరీని అడిగాడు భూపతి.

    పంపించానన్నట్లుగా తలూపాడతను. ఆ సెక్రటరీ జీతం నెలకు ఐదు వేలు. అతని పనే మేలు జాతి గుర్రాల్ని భూపతి సలహా పై కొనడం, వాటిని ట్రైనింగ్ కి పంపించడం, అదయ్యాక ఇండియాలో వున్న తొమ్మిది రేస్ క్లబ్స్ కి (హైద్రాబాద్, మైసూర్, పూనా, బొంబాయి, మద్రాస్ ని, ఢిల్లీ, కలకత్తా, ఊటీ, బెంగుళూరు) ఎంట్రీస్, మంచి జాకీలను ఎన్నుకోవడం.

    "ఏ క్లబ్ కి పంపించావు....?" గుర్రం వేపేచూస్తూ అడుగుతున్నాడు.

    ఆరు అడుగుల ఎత్తులో, సపారీ డ్రస్ లో గంభీరంగా కనిపించే యజ్ఞభూపతి అంటే ఆ ఎస్టేట్ లో పనిచేసే ప్రతి ఒక్కరికీ సింహస్వప్నం. డబ్బుతిన్నా లెక్కచెయ్యడు. దొంగ లెక్కలు చూపించినా సహిస్తాడు. కాని రేస్ గుర్రాల విషయంలో ఏ పొరపాటు జరిగినా నిలువునా చీరేస్తాడు_ ఆ ఎస్టేట్ లో మనుషులుకన్నా పందెపు గుర్రాలకే ప్రాముఖ్యం.

    "హైద్రాబాద్ రేసు క్లబ్ కి పంపించాను సార్...." అన్నాడా సెక్రటరీ వినయంగా, ఎకౌంట్స్ చెప్పేందుకు పిలిపించిన ఆడిటర్ కి అది కొనసాగించాలో లేదో తెలియడం లేదు. తను ఎకౌంట్స్ చెబుతూనే వున్నాడు. ఆయన గుర్రాల గురించి సెక్రటరీతో మాట్లాడుతూనే వున్నాడు.

    "రాయల్ కింగ్ ఎక్కడుంది...."

    "పూనాలో ట్రైనర్ అనంత్ సీక్రెట్ గార్డెన్స్ లో...."

    "పదే పదే చెప్పను. రాయల్ కింగ్ ని ఎంతో నమ్మకంతో కెనడా నుంచి ప్రత్యేకంగా తెచ్చుకున్నాను. దానికెలాంటి ప్రమాదం జరగకూడదు. ఈసారి తప్పనిసరిగా "డక్కన్ డెర్బీ (హైద్రాబాద్ రేసు క్లబ్ కి చెందిన అత్యున్నతమైన ట్రోపీ) మనకు రావాలి. అనంత్ కి ఫోన్ చేసి చెప్పు_ దానికి మంచి ట్రైనింగ్ ఇవ్వమని. అలాగే నమ్మకస్తుడైన, సామర్ధ్యంగల జాకీ సెలక్ట్ చేయమని...."

    అప్పుడు చెబుదామనుకున్నాడు సెక్రటరీ_ దాన్ని షూట్ చేసేందుకు శశాంక మనుషులు ట్రై చేస్తున్నారని_ ఆ పని సుదర్శన్ కి అప్పగించబడిందని కాని భయంతో చెప్పలేదు.

    యజ్ఞభూపతికి కొన్ని విషయాలు చాలా కోపాన్ని తెప్పిస్తాయి. తనకు రావాల్సిన ప్లేట్ (గెలిచిన గుర్రాలకు ఇచ్చే బహుమతి_ క్లబ్ దీన్ని గుర్రం యజమానికి ఇస్తుంది) మరొకరు వెళ్ళినా, తన గుర్రం ఓడినా, జాకీ గుర్రాన్ని బాగా పరిగెత్తించలేకపోయినా సహించలేడు.

    కొన్ని సందర్భాల్లో ఓడిపోయిన తన ఖరీదైన గుర్రాల్ని అక్కడికక్కడే కాల్చి చంపిన యజ్ఞభూపతి అంటే ట్రైనర్స్ కి, జాకీలకు కూడా భయమే.

    "చెప్పాను సార్....ఈసారి దక్కన్ డెర్బీ మనదే...."

    "వశిష్ట ఈమధ్య కనిపించడంలేదే...."

    వశిష్ట యజ్ఞభూపతికి అన్ని విషయాల్లోనూ ప్రధాన సలహాదారుడు. ఎవర్నీ అంత త్వరగా నమ్మని భూపతి ఒంటిచెయ్యి వశిష్టను బాగా నమ్ముతాడు.

    "కబురు పెడతాను సార్...." సెక్రటరీ అంటూ వుండగానే ఫోన్ మోగింది. వెంటనే ఎత్తాడు సెక్రటరీ. ఫోన్ లో విన్న మాటలు సెక్రటరీకి చెమటలు పట్టించాయి. అవేమీ భూపతికి చెప్పలేకపోయాడు.

    "అన్ని ఎంట్రీస్ రాగానే క్లబ్ కి ఫోన్ చేసి రహస్యంగా ఎవరి గుర్రాలు రేస్ కొస్తున్నాయో_ వాటి పెడిగ్రి, వెయిట్, జాకీల వివరాలు సంపాదించి నాకు చెప్పు....అంటూ గుర్రాన్ని నడిపించుకుంటూ దూరంగా వెళ్ళిపోయాడు భూపతి.

    (ఎంట్రీ: సీజన్ ప్రారంభం కాబోయేముందు రేస్ క్లబ్ ఒక బుక్ లెట్ ప్రింట్ చేస్తుంది. దాన్ని మిగతా క్లబ్ లకి, ఓనర్స్ కి పంపిస్తుంది. అందులో ఆ సీజన్ లో నిర్వహించే రేసెస్_వాటి వివరాలు_ప్లేట్స్, ట్రోఫీలు, గుర్రం రేస్ లో పాల్గొనేందుకుగాను ఓనర్ కిచ్చే స్టెట్ ఎమౌంట్ వివరాలు_జాకీల బరువు, క్లబ్స్ ఇచ్చే సబ్సిడీ వివిధ ప్రాంతాల నుండి వచ్చే గుర్రాలకు ఇచ్చే రవాణా ఖర్చులు, దాణాలో కన్ సెషన్, ట్రైనర్స్ కి, జాకీలకిచ్చే బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు, క్లాస్ ఒన్, క్లాస్ టూ, క్లాస్ త్రీ, క్లాస్ ఫోర్ కేటగిరీల్లో నిర్ణయించిన రేస్ ల దూరం లాంటి వివరాలు ఆ ప్రాసెక్టస్ బుకౌలెట్ లో ఇస్తారు. ఇవి దృష్టిలో పెట్టుకొని యజమానులు తమ గుర్రాలు, ట్రైనర్స్, జాకీల వివరాలు అందిస్తూ రేస్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పించమంటూ క్లబ్స్ కి పెట్టుకొనే అభ్యర్ధనలే ఎంట్రీలు)

    క్లబ్ నుంచి రహస్యంగా తెల్సుకోవాల్సిన పనిలేదు. వాస్తవానికి పదిహేను రోజుల ముందే ఆ నివరాలతో బుక్ లెట్ ప్రింటు చేస్తుంది. పంటర్స్ (పందెం కాసేవాళ్ళు) కోసం ముందే తెల్సుకోవటం వలన ప్రయోజనం అంతకంటే మంచి గుర్రాన్ని పంపించవచ్చని భూపతి ఆలోచన.

    గుర్రాల్ని రేస్ కి పంపించడమేగాక పెద్ద మొత్తాల్లో బెట్టింగ్స్ (పందెం) కాస్తుంటాడు. రాబోయే రేస్ లో భూపతి కాయబోయే ఓ పెద్ద బెట్టింగ్ ని తలక్రిందులు చేసే పధకంలో శశాంక తేజదత్త మరో ఓనర్ తో కల్సి రహస్య మంతనాలు జరుపుతున్నట్లు భూపతికి తెలియదు.


                                *    *    *


    భరత్ తొలిసారి మరోసిటీకి రావటం ఇదే మొదటిసారి. హైదరాబాద్ లో దిగిన భరత్ కు శుక్రాచార్యను ఎలా కలవాలో తెలియదని ముందే చెప్పడంతో శంకర్ శుక్రాచార్యకు టెలిగ్రామ్ ఇచ్చాడే తప్ప అడ్రస్ చెప్పలేదు.

    శుక్రాచార్య అడ్రస్ ఒక్క శంకర్ రెడ్డికి తప్ప మరెవరికీ తెలియదు. చివరకు నాయర్ క్కూడా....

    భరత్ స్టేషన్ బయటకు వస్తుండగానే శుక్రాచార్య ఎదురయ్యాడు. భరత్ ని చూసి మందహాసం చేశాడు. తన రాక శుక్రాచార్యకు ఆనందం కల్గించిందన్న విషయాన్ని అతని మందహాసంలో పసిగట్టాడు భరత్.

    ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు.

    ఆటోలో అరగంట ప్రయాణం చేశాక సికింద్రాబాద్ లో ఓ మారుమూల వీధిలోని చివరి ఇంటిముందు ఆగింది. శుక్రాచార్యే ఆ ఇంటితాళం తీసి భరత్ ని లోనికి తీసుకెళ్ళాడు.

    చిన్న ప్లాట్ - ఒక చిన్న బెడ్ రూమ్, డ్రాయింగ్ హాల్: డైనింగ్ ముచ్చటగా వుంది. గోడలకు తగిలించివున్న హార్సెస్ పెయింటింగ్స్ చూసి ఆ ఇల్లు తనకోసమే ముందు సిద్ధంచేసినట్లుగా గ్రహించాడు భరత్.

    "ఇప్పుడే విషయాన్ని నేనడగను. అలా కాలాన్ని వృధాచేయడం నాకిష్టం లేదు. నీకిష్టమయ్యే వచ్చావని భావిస్తున్నాను. నువ్వీక్షణం నుంచే రంగంలోకి దిగాలి. నీకు వంట చేసి పెట్టేందుకు, నీ వ్యవహారాలూ చూసేందుకు శంకర్ రెడ్డి పూనా నుంచి వస్తున్నాడు.

    ఎక్కువమందితో పరిచయాలు పెట్టుకోకు_ స్నేహాలు వద్దు. నీ పనేదో నీవే...." ఓ క్షణం ఆగాడు శుక్రాచార్య.

    భరత్ శ్రద్ధగా వింటున్నాడని గ్రహించగానే మరలా చెప్పటం మొదలెట్టాడు.

    శశాంక కొడుకు అశ్వదత్త ఇప్పుడు అబిడ్స్ పోలీస్ రిమైండ్ లో వున్నాడు. ఎల్లుండే కోర్టులో హాజరుపరచబోతున్నారు...."

    మధ్యలోనే అడ్డొచ్చాడు భరత్.

    24 గంటల్లోపే కోర్టులో హాజరు పెట్టాలి. అప్పుడే మర్డర్ జరిగి రెండు రోజులయింది. మరో రోజున్నర అయ్యేలా వుంది. మీరు చెప్పేదాన్నిబట్టి...." భరత్ ప్రశ్నార్ధకంగా అడిగాడు.

    చెబుతున్న విషయాలపట్ల అప్పుడే లోతుగా ఆలోచించటం మొదలెట్టిన భరత్ వేపు ప్రసంశాపూర్వకంగా చూస్తూ తన సెలక్షన్ గాడి తప్పలేదని, తన పగకు వేసుకున్న పునాదులు గట్టివేనని గుండె నిండా ఊపిరి పీల్చుకొని చెప్పటం మొదలెట్టాడు.

    "నిజమే....కాని కోర్టుకు శెలవులు....అందుకే మూడున్నర రోజులు జాప్యం జరిగింది. ఇకపోతే సాక్షులలో ఓ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్స్, నలుగురు లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్స్ తోపాటు, మరో నాలుగువందలమంది దాకా షాపింగ్ కి వచ్చిన ప్రజలు, షాపులవాళ్ళూ వున్నారు. శశాంక ఇన్ని సాక్ష్యాల్ని ఏం చేయలేడు. ఇప్పుడతను జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత టెన్షన్ లో వున్నాడు. సరీగ్గా అదే టైమ్, విశ్వదత్తను ఎలా రక్షిస్తావో నీవే నిర్ణయించుకో.... నీకు తట్టకపోతే నన్నడుగు. కానీ నీకు తెలివితేటలున్నాయని నా నమ్మకం." శుక్రాచార్య ఆగి భరత్ వేపు సూటిగా చూశాడు. దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్న భరత్ "పూర్తి వివరాలు చెప్పండి ఆ మర్డర్ ఎలా జరిగింది? వున్నది వున్నట్లుగా కెమేరా చూపించినట్లుగా చెప్పండి" అన్నాడు.

    తన పదకం కరీంని విశ్వదత్త ఎలా చంపింది, ఎన్ని గంటలకు....ఎక్కడ అనేవి పూర్తిగా చెప్పాడు.

    మనం ఇప్పుడే అబిడ్స్ కెళ్ళి ఆ స్పాట్ ని చూడాలి. ఆ స్పాట్ నుండి అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఏవైపులో ఎంత దూరంలో వుందో కూడా చూడాలి. కమాన్ అంకుల్...." అంటూ బయటకు నడిచాడు. భరత్ స్పీడుకి, షార్ప్ నెస్ కి శుక్రాచార్యే ఆశ్చర్యపోయాడు. అది పైకి కనిపించకుండా తనూ బయలుదేరాడు. దారిపొడవునా భరత్ ఏవేపు ఆలోచిస్తున్నాడు? ఎలా వప్పించాలనుకుంటున్నాడు? ఏం పధకం వేస్తున్నాడన్నదే ఆలోచిస్తున్నాడు శుక్రాచార్య.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra