Home » D kameshwari » Kadedi Kadhaku Anarham


                                             తలుపు గొళ్ళెం

    ఆరోజు శోభ శోభనం! రాత్రి పదిగంట లయింది. అమ్మలక్క లందరూ హస్యాలాడుతూ శోభని గదిలో వదిలి పైన తలుపు గొళ్ళెం పెట్టేశారు.
    తలుపు గొళ్ళెం పెట్టగానే సావిట్లో మంచమ్మీద పడుకున్న కావమ్మ గారి గుండెల్లో రాయి పడ్డట్టయింది. బితుకు బితుకుమంటూ తలుపు గొళ్ళెం వంక చూసింది. 'అమ్మా శోభా- నాతల్లీ! నే నెంచేతూనే తల్లీ" అనుకుంది బాధగా, రాత్రి శోభ తెల్లచీర కట్టుకుని సన్నజాజులు తురుముకుని ముస్తాబవుతుంటే గదిలోకి వెళ్ళి 'అమ్మడూ భయం వేస్తుందా తల్లీ?" జాలిగా తల నిమిరి అడిగింది. మామ్మ అంటున్నది అర్ధం కాక తెల్లపోయి చూసింది. "అదే నమ్మడూ, రాత్రి గదిలోకి వెళ్ళాలంటే బెంగగా వుందా?" శోభ సిగ్గుల మొగ్గ అయి తలదించుకుంది. కావమ్మగారు రహస్యంగా బుజ్జగిస్తున్నట్టు "పరవాలేదులే తల్లీ" నేను సావిట్లోనే వుంటాగా, అందరూ వెళ్ళాక తలుపు గొళ్ళెం తీసి వుంచుతాలే అంది. శోభ మరింత తెల్లపోతూ చూసింది. "పిచ్చితల్లీ! ఎలా చెప్పనే , ఎంత వెర్రి మాలోకానివే తల్లీ!" మనవరాలు పులి నోట్లో తల పెట్టబోతున్నట్టు తల్లడిల్లి పోతూ ఎలా చెప్పాలో అర్ధం కాక తికమక పడుతుండగా కోడలు గదిలోకి రావడంతో మెల్లగా గదిలోంచి వెళ్ళి పోయిందావిడ.
    అరవై ఏళ్ళు దాటిన కావమ్మగారికి తలుపు గొళ్ళెం చూస్తె చచ్చే భయం. ఏభై ఏళ్ళ క్రితం - మొదటిసారి ఆవిడ పన్నెండో ఏట - రజస్వల అయి స్నానం అయిన నాలుగో నాడు ఆ పెద్ద యినప గొళ్ళెం వున్న గదిలోకి అమ్మలక్క లందరూ తోసి గొళ్ళెం బిగించారు. ఆ గదిలో యింతెత్తు, అంతలావు - యింతింత ఎర్రకళ్ళు , అంతంత మీసాలతో - ఆర్నెల్లనాడు పెళ్ళి పీటల మీద, పల్లకిలో కలిసి కూర్చున్న ముప్పై ఏళ్ళ ఆ ఆంబోతు లాంటి మనిషి - ఆడదాని కోసం వాచిపోయినట్టు ఆరాటంగా ఎదురుచూస్తూ రాక్షసుడిలా గదిలోకి రాగానే ఆ పసిపిల్లని ఆ ముక్కు పచ్చలారని, వంటి తడి ఆరని ఆ పసిపిల్లని అమానుషంగా, క్రూరంగా, నలిపి నలిపి రాత్రంతా అనుభవించాడు. గువ్వపిట్టలా గజగజ వణికిపోతూ , పిల్లి నోట చిక్కిన పిచ్చిక పిల్లలా గిలగిల కొట్టుకుంటూ ఏడుస్తున్న ఆ పిల్ల నోరునొక్కి , ఏడిస్తే చంపేస్తానని బెదిరించి తన అవసరం యిష్టం వచ్చినంత సేపు తీర్చుకుని అలసి సోమ్మసిల్లె ఆంబోతులా గుర్రు పెట్టి నిద్రపోయాక ఆ పిల్ల గట్టిగా ఏడవడానికి భయపడి వెక్కిపాడుతూ ఆ గదిలోంచి పారిపోవడానికి దారులు వెతికింది. రాక్షసి లాంటి యినప గొళ్ళెం - అదీ ఆమెకి అందనంత ఎత్తున - దిగాలు పడి ఏడుస్తూనే దీపం పెట్టిన ముక్కాలి పీట ఎత్తి తలుపు దగ్గిర వేసుకుని, తుప్పు పట్టి ఊడిరాని ఆ యినప గొలుసుల గోళ్ళన్ని అతికష్టం మీద తీసి, అదృష్టవ శాన అర్ధరాత్రి అవతల వైపు గొళ్ళెం ఆమె తల్లి తీసివుంచడం వల్ల - తలుపు తీసి పరుగున వెళ్ళి అమ్మా అంటూ తల్లి పక్కలో బోరుమంటూ ఏడుస్తూ దూరిపోయింది - "అయ్యయ్యో - తప్పమ్మా, అలా రాకూడదమ్మా- అల్లుడి గారికి కోపం వస్తుంది. ఏం చేసినా ఓర్చుకోవాలి తల్లీ -" అంటూ ఆ తల్లి భయపడ్తూ కూతుర్ని - తప్పమ్మా అంటూ ఏడుస్తున్న ఆ పసిదాన్ని - నిర్ధాక్షిణ్యంగా బలిపశువుని యీడ్చుకెళ్ళినట్టు రెక్కపట్టి లాక్కెళ్ళి ఆ గదిలో తోసి బయట గొళ్ళెం పట్టేసింది- తెల్లవారు ఝామున ఆ పతిదేవుడు మేల్కొని మళ్ళీ ఓసారి ఏడ్చి ఏడ్చి కటిక నేలని అప్పుడే కను మూసిన అ పసిపిల్లని , అప్పటికి వళ్ళేరగకుండా జ్వరం వచ్చిన అ అమ్మాయిని పూర్తిగా ఆరోజుకి పిప్పి చేసి వదిలాడు. ఆ పిల్ల స్మృతి కోల్పోయిన సంగతన్నా గుర్తించలేదు ఆ రాక్షసుడు - రెండోరోజు నూటమూడు జ్వరం వున్న పిల్లని గదిలోకి పంపమంటే అలిగి వెళ్ళిపోవడానికి అల్లుడు గారు, తయారైతే మామ, అత్త కాళ్ళా వెళ్ళా పడి ఆ జ్వరం వున్న పిల్లనే గదిలోకి పంపడం - రెండోరోజు ఎమయిందీ కూడా గుర్తించలేని మగతలో వుండిపోయింది ఆమె - తరువాత ఆమె కాపురం చేసిన మూడేళ్ళల్లో మొదటిరోజు అనుభవం కంటే మృదు మధురమైన అనుభవం ఆవిడకి కల్గలేదు - మొగుడంటే రాక్షసుడే! తలుపుగొళ్ళెం పెడితే గుండె అదిరేది. దగ్గిరకు వస్తుంటే వళ్ళు వణికెది- పెదాలు బిగపెట్టి ఘోరం చూడలేనన్నట్టు కళ్ళు మూసుకుని ముక్కకుండా , మూల్గకుండా మూల్గితే తన్నులు తినాలని ఊపిరి బిగపెట్టి వళ్ళప్పగించి భర్తగారు వదిలేవరకు క్షణం ఒక యుగంలా నరకం చూసి అయన వదలగానే తలుపు గొళ్ళెం తీసుకుని ఒక్క ఉదుటున బయటికి వచ్చిపడి ఊపిరి పీల్చుకుని ఆ పూట గడిచిపోయినందుకు వెయ్యి దండాలు పెట్టుకునేది ఆమె - భర్త, దాంపత్యం అంటే ఆమెకి తెల్సిందదే , అంతకంటే ఎక్కువ తెలిసే అవకాశం - యీయకుండానే పదిహేనో ఏటే విధవని చేసి వెళ్ళిపోయాడు. ఆ భర్త తనకి గుర్తుగా ఓ కొడుకుని అందించి- కాముడు , కావమ్మ, కావమ్మగారిగా అంచెలంచల మీద మారి ఆవిడ కొడుకుని పెంచుకుంటూ వాడితోనే కాలం వెళ్లబుచ్చేది. పోయిన మొగుడు పొతే పోయాడు - సామెత మాదిరి - మొగుడు పోయి యింక ఆ బాధ వుండనందుకు లోలోపల సంతోషమే కల్గింది ఆవిడకి - లోకంలో అడబతుకుల పట్ల ఆవిడకి జాలి. మొగుళ్ళతో కాపురం చేసుకుంటున్న ఆడవాళ్ళని చూసి పాపం అని జాలిపడేది. ఏ ఆడపిల్ల కన్నా శోభనం అంటే ఆవిడ గుండెల్లో ఏదో గుబులు పుట్టేది. ఉరికంబం ఎక్కబోయే వాళ్ళ మీద జాలిపడెట్టు జాలిగా చూసేది. ఆవిడకి కొడుకు పెరిగి పెద్దయి పెళ్ళి జరిగిన నాడు కొడుకు శోభనం రోజు -- ఆవిడకి కోడలి మీద ఎక్కడ లేని దయ పుట్టుకొచ్చింది. కొత్త పెళ్ళి కూతురు -- ఆ పిల్లతో ఏమన్నా చెపితే వాళ్ళవాళ్ళెం అనుకుంటారో నని గదిలోకి పంపేముందు కొడుకుని చాటుగా పిలిచి - "వరేయ్ బాబూ - చిన్నపిల్ల  జాగ్రత్త ....పాపం.....భయపడ్తుందేమో ...." ఈ చాదస్తం ఏమిటన్నట్టు కొడుకు తల్లి వంక చూసి - "తెలుసులే" అన్నాడు. పూర్తిగా వినకుండానే యింకేం చెప్పాలో తెలియక కావమ్మ గారు నోరుమూసుకుంది....ఆ రాత్రంతా ఆవిడకి కంటి మీద కునుకు లేదు, సావిట్లో పడుకుని మాటిమాటికి తలుపు వంక చూస్తూ, లోపల్నించి ఏడుపు వినవస్తుందేమో కోడలు పిలుస్తుందేమోనన్నట్టు చెవులు ఒగ్గి, మూతలు పడిపోయే కళ్ళని బలవంతాన విప్పుకొని రాత్రంతా జారగం చేసింది. ఆవిడనుకున్నట్టు గదిలోంచి ఏడుపులు వినపడలేదు గాని , గుసగుసలు విన్పించాయి. చిన్నగా, నవ్వులు, గాజుల గలగలలు విన్పించాయి. ఆవిడకి నమ్మశక్యం కాక నెమ్మదిగా తలుపు సందులోంచి చూసింది. ఒకరి కౌగిట్లో ఒకరు నవ్వుకుంటూ గుసగుసలాడు కుంటున్న కొడుకు కోడల్ని నమ్మలేనట్టు చూసింది. ఆవిడ మనసెందుకో ముల్లు గుచ్చుకున్నట్లయింది. శోభనం నాడు యిలా నవ్వుకోటం, ఊసులాడుకోటం, కనివిని ఎరగని వింతలా విడ్డూరం అన్పించింది. తెల్లారి కోడలు గదిలోంచి రాగానే మొహంలోకి పట్టిపట్టి చూసింది. ఏడుపు చాయలు లేకపోగా సిగ్గుతో ముసిముసినవ్వులు నవ్వుకుంటున్న కోడలిని చూసేసరికి ఆవిడకి ఏదో మంట కల్ఫింది. కోడలు కాపురంకి వచ్చిం దగ్గిర నించి, కొడుకు కోడలు సందు దొరికితే గదిలో దూరటం గుసగుసలు, నవ్వులు, సాయంత్రం అయ్యేసరికి తెల్లచీర కట్టుకుని ముస్తాబయ్యే కోడలిని చూస్తె ఆవిడకి తిక్క రేగింది. కోడలు గనక తనలా భయపడి ఏడిచి వుంటే ఆవిడ కోడలిని నెత్తిన పెట్టుకుని జాలి సానుభూతి చూపి కడుపున పెట్టుకునేది - ఆవిడ జాలి, సానుభూతి ఎవరికీ అక్కరలేకపోవడంతో - తనకి దక్కని సుఖం కోడలికి దక్కినందుకు ఏదో , అసూయ, ద్వేషం పెరిగాయి ఆవిడలో అది మొదలు కోడలుని సాధించడం, దెప్పడం, పిల్లి మీద, ఎలక మీద పెట్టి తిట్టడం , పట్టపగలే యింత బరితెగించి మొగుడితో అత్త ముండని వున్నాననైనా లేకుండా సరసాలా -- అవ్వ - కలికాలం అంటూ మెటికలు విరిచేది. కోడలు కొత్తలో వూరుకున్నా తర్వాత ఎదురు తిరిగి జవాబులు యిచ్చేది . అత్తా కోడళ్ళ మధ్య కొడుకు నలిగేవాడు. "చూడు మా అమ్మకాపురం చేసింది మూడేళ్ళే- మా నాన్న రాక్షసుడిలా ఆవిడని కాల్చుకు తిని మొగుడు ,  సంసార సుఖం అంటే భయపడేలా చేసి వదిలాడు ఆవిడ్ని - నీవు తనలా కాక సంతోషంగా వున్నావని తనకు దక్కనిది వనుభావిస్తున్నావని ఆవిడ అసూయ - పాపం ఏం సుఖపడింది ఆవిడ జీవితంలో , ఆవిడ కోరికలెం తీరలేదు . అసలలాంటి కోరిక లుంటాయని యిప్పుడే తెల్సుకుంది గనక ఎవరి మీద చూపలేని కోపం నీమీద చూపిస్తుంది. కాస్త ఆవిడ బాధ అర్ధం చేసికుని ఏమన్నా మాట్లాడక వూరుకో - అంటూ ఓరోజు పెళ్ళానికి సర్ది చెప్పాడు. అప్పటి నించి కోడలు కావమ్మ గారి సాధింపు వినీ విననట్లూరుకుంది.
    మనవరాలు శోభ పుట్టాక కావమ్మగారు కాస్త మారి మనవరాలి ముద్దు ముచ్చట్లతో కాలక్షేపం చేస్తూ కోడలిని సాధించడం మానేసింది. పిల్లలందరిలో శోభ అంటే ఆవిడకి ముద్దు - ఆ శోభ పెద్దదయి - పెళ్ళయ్యాక -

    ఆ శోభకి - శోభనం అంటే కావమ్మగారికి దిగులు, బెంగ పట్టుకున్నాయి. తన కొడుకంటే మంచివాడు గనక, తను చెప్పింది గనక కోడలిని కష్ట పెట్టలేదు. యిప్పుడీ శోభ మొగుడు ఎలాంటివాడో! తన మనవరాలిని ఏం చేస్తాడో - మొదటిరోజు గుర్తు వచ్చి ఆవిడ భయంతో వణికిపోయింది. అయినా నిస్సహాయంగా రాత్రంతా సావిట్లో మంచం మీద కళ్ళల్లో వత్తులు వేసుకుని కూర్చుంది - కాని కొడుకు కోడలిని మించి రాత్రంతా యిద్దరూ ఒకటే నవ్వులూ, మాటలు , కిలకిలలు విని ఒకవిధంగా సంతృప్తి పడినా - లోకంలో మొదటిరాత్రి అనుభవం తనకోక్కర్తేకే దక్కనందుకు మొదటిసారిగా బాధపడింది.
    మూడు రాత్రులు శోభ మిగతా ప్రపంచాన్ని మరిచిపోయినట్టు గది తలుపులు గొళ్ళెం పెట్టుకుని మొగుడితోనే లోకం అన్నట్టు ప్రవర్తించడం చూసి విస్తుపోయింది. కావమ్మగారు చటుక్కున రావడం ఏ కాఫీయో, టీఫినో, నీళ్ళో పట్టుకెళ్ళడం మళ్ళీ గొళ్ళెం పెట్టేసుకోవడం - అక్కడ నించి ఒకటే వికవికలు పకపకలు - చూసి చూసి వారం రోజులు పోయాక మొగుడు వెళ్ళాక శోభని దిగ్గరలాక్కుని కూర్చో పెట్టుకుని అన్నాళ్లుగా , అన్నేళ్ళుగా ఆవిడ మనసులో కదలాడే సందేహలన్నీ బయటపెట్టింది. పన్నెండేండ్ల దానిలో తన మొదటి రాత్రి అనుభవం , మొదటి రాత్రే కాదు మూడేళ్ళ రాత్రుల అనుభవం అనుభూతి చెప్పింది - ;అమ్మడూ మొదటి రోజు నీకు భయం వేయలేదే తల్లీ - అలా నవ్వుకుంటున్నారు. అతను....అతను నిన్నేం చెయ్యలేదా - బాధ కల్గలేదా ఏమో తల్లీ ఇప్పటికీ నాకారోజు తలుచుకున్నా - ఆ రోజే కాదు ఏ తలుపు గొళ్ళెం చూసినా గుండె దడే అమ్మా, యిన్నాళ్ళయినా ఆ దడ తగ్గలేదే -- రాకాసి లాంటి ఇంతింత గొలుసుల గొళ్ళెం తో నన్ను బంధించిన ఆ గొళ్ళెం చూస్తె ......అమాయకంగా చెప్పుకున్న మామ్మని జాలిగా, సానుభూతిగా చూసి నవ్వింది శోభ.
    "మైడియర్ మామ్మా - తలుపు గొళ్ళెం కేవలం మనుష్యులని బంధించేదిగా మాత్రమే నీకు తెల్సు , కాని మనసులని బంధించడానికి ఉపయిగిస్తుంది మామ్మా - ఐ పిటీ యు....' అంది యింకేం చెప్పలేక .

                                            ***

                                                                                   గుర్రపు కళ్ళెం

    రాజాధిరాజ......రాజమార్తాండతేజ.....వంది మాగధులు స్తోత్రం చేసే రాజాధిరాజు కాకపోయినా రంగాపురం జమిందారు రాజా రావుబహుద్దూర్ రంగరాజు గారి దివాణం ......రాణివాసంతో, దాసదాసీ జనంతో , విందులు, విలాసాలు , నాట్యాలు, అతిధి అభ్యాగతులతో కళకళలాడేది --- ఆయనగారి ముఖ్య హాబీ గుర్రపు స్వారీ. ఎంత ఖర్చయినా సరే మంచి గుర్రం కనిపిస్తే కొనకుండా వదిలే వారుకారు. అరడజనుకి తక్కువ కాకుండా నల్లగా, ఎత్తుగా, బలంగా నిగ నిగలాడే గుర్రాలు సాలలో యెప్పుడూ వుండేవి. వాటి సంరక్షణ, మాలిష్ కి ప్రత్యెక మనుషులు. రోజూ ఉదయం, సాయంత్రం గంట స్వారీ చేసేవారాయన. తెల్ల దొరలు అతిధులుగా వచ్చినపుడు గుర్రపు పందేలుండేవి. అయన కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆడమగ అందరూ ఐదో ఏట నించి గుర్రపు స్వారీ నేర్చుకోవాల్సిందే. రేసుల సీజనులో సిటీకి వెళ్ళి రేసులలో పాల్గొనడం ఆయనకున్న వ్యసనాలలో ఒకటి. గుర్రాలకయితేనేం వాటి పోషణ కైతేనేం , రేసుల కైతేనేం , సాలీనా వేలకి వేలు ఖర్చు పెట్టె వాడాయన.
    ఈ కధంతా ఈనాటిది కాదు. ఆ రంగరాజు గారు పోయి ఏభై ఏళ్ళు అయింది. అయన కొడుకు వేంకటపతిరాజాగారూ కాలధర్మం చేసి పదేళ్లయింది. వెంకటపతి రాజాగారి సుపుత్రుడు రమేష్ చంద్రుడు. రమేష్ చంద్ర రాజా కాదు, ఉత్తి రమేష్ చంద్రుడే అతను. వెంకటపతిరాజాగారి హయాములోనే జమీందారీలు పోయాయి. భరణాలు ఏర్పడ్డాయి. రంగారాజుగారితోటే సగం జమీ అయన వ్యసనాలకీ, సరదాలకి, విలాసాలకి తరిగిపోయింది. అయన కొడుకు వెంకటపతిరాజా మిగిలినది కర్పూరంలా వెలిగించాడు. ఇప్పుడు ఆ దివాణం కళకళలాడడం లేదు. ఆ దాసదాసీ జనం లేరు. విందులు, వినోదాలు లేవు. దివాణం సున్నానికైనా నోచుకోకుండా పాడుపడినట్లయిపోయింది. ఆ గుర్రపుశాలలో గుర్రాలన్నీ పోగా ఒకే ఒక గుర్రం మిగిలింది. అది రమేష్ చంద్రగారి గుర్రం. అది ఏమయినా సరే అమ్మడానికి వీలులేదని పట్టు పట్టగా తోడు లేనిదానిలా ఒకే గుర్రం మిగిలింది.
    రమేష్ చంద్ర ఈ దేశంలో చదువు నచ్చక (వంటబట్టక ) విదేశంలో బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సు చదవడానికి వెళ్ళి పదిహేను రోజుల కిత్రమే స్వదేశం స్వగ్రామం తిరిగి వచ్చాడు. రావడం పెద్ద ప్లానుతోనే వచ్చాడు. ఆ గ్రామంలో భూములు, అస్తులు అన్నీ అమ్ముకుని సిటీ వెళ్ళి ఓ రీరోలింగ్ ఫ్యాక్టరీ స్థాపించాలని, ఆ విధంగా చదివిన చదువుని సార్ధకపరచుకోవాలని అనుకున్నాడు. విదేశాలలో వుండి వచ్చాక డర్టీ ఇండియాలో అందునా డర్టీ విలేజీలో వుండాలంటే అతనికి ముళ్ళ మీద వున్నట్టుంది. లంకంత కొంపకి ముసలి తల్లి సుభద్రా దేవి ---ఇద్దరు దాసీలు, ఇద్దరు నౌకర్లు....వూర్లో ఎటు చూసినా పచ్చని పొలాలు , చుట్టూ కొండలు - రైతులు, ఆవులు, గేదెలు - తప్ప సివిలైజ్ డ్ ఎట్ మాస్ ఫియర్ లేని ఆ డర్టీ వూర్లో దినమొక యుగంలా వుంది . ఆస్తులు అమ్ముకు వెళ్ళిపోయే ఆ కొద్దిపాటి వ్యవధి కూడా భరించలేనిదిగా వుందతనికి. ఎంతకని పుస్తకాలు చదవడం , ఎంత కని రెడియోగ్రాం వినడం ! ఉదయం గంట, సాయంత్రం గంట గుర్రపు స్వారీ రాత్రి డ్రింక్స్ .....రికార్డ్సు - పుస్తకాలు తిండి- నిద్ర - పదిరోజులకే యీ జీవితం విసుగెత్తి ఎప్పుడూ పోదామా అని వుంది. ఫారిన్ లో అలవాటయిన మదిరతో పాటు మగువ కోసం అతనికి శరీరం తపిస్తుంది. ఇదే ఏ సిటీలోనో అయితే పర్సు బరువుని బట్టి టెస్టు బట్టి, కావాల్సినవారిని ఎన్నుకోవచ్చు. ఈ డర్టీ విలేజ్ లో పెడ పిసుక్కునే వాళ్ళు తప్ప ఎవరున్నారు? సాయంత్రం గుర్రపు స్వారీతో వంటి నిండా చెమట పట్టాక, వేడినీళ్ళ టబ్ బాత్ తరువాత వెచ్చవెచ్చని విస్కీ -- తరువాత అతనికి యింకా వెచ్చనిదేదో కావాలనిపించిచేది, కావాల్సింది దొరక్క -----నిద్రపట్టక ..... పక్క మీద దొర్లి.... తన మత్తులో నిద్రలోకి జారేవాడు. గత పదిహేను రోజులుగా అదే రొటీన్ తో విసుగెత్తిపోయిన అతనికి.....
    ఆ తెల్లారి..... అంటే అతని సంభాషణలో.....ఉదయం తోమ్మిందింటికీ లేవగానే ....కిటికీ లోంచి .....ఓ జవ్వని దర్శన మిచ్చింది. బంతిపువు రంగు చీరకి ఎర్రంచు , పచ్చ జాకెట్టు - జడలో చామంతులు ....నెత్తిన పచ్చ గడ్డి మోపుతో వయ్యారంగా గుర్రాలశాల వైపు వెడుతుంది. గుర్రాల శాలలో రంగడు గుర్రానికి మాలిష్ చేస్తున్నాడు. దూరం నించే చూసినా రమేష్ కళ్ళలో కాంతి వచ్చింది ఆమెని చూడగానే. యిన్నాళ్ళకి తను వెతుకుతున్నదేదో దొరికిందనిపించింది . బ్రష్ నోట్లో పెట్టుకునే చకచక మేడదిగి గుర్రాల శాలవైపు వెళ్ళాడు. గడ్డిమోపు కింద పడేసి వంగుని గడ్డి విప్పి గుర్రం ముందు వేస్తుంది. వంగున్న ఆమె వంపు సొంపులు చూసేసరికి రమేష్ రక్తం వేడెక్కింది. చామనచాయ అయితేనేం ఆమె మోహంలో మంచి కళ వుంది. పెద్ద పెద్ద కళ్ళు - తీర్చినట్లున్న కనుబొమలు ముక్కున ఒంటి తెల్లరాయి ముక్కు పుడక, వంకుల జుత్తు లొంగక చెల్లాచెదరై నుదుటిని పడుతుంది. ఏదో నవ్వుతూ రంగడితో మాట్లాడుతుంటే తెల్లటి పలువరుస తళుక్కుమంది.పెదాలు కాస్త నల్లగా వుంటేనేం ఆ పెదాలలో, కళ్ళలోనే ఏదో ఆకర్షణ వుందనిపించింది రమేష్ కి. ఆ ఎత్తు , లావు, నడుం, అబ్బ ఏం ఫిగర్ ....అందగత్తె కాదు.....కాని ఆమెలో ఏదో ఆకర్షణ ....దీన్నే గాబోలు యింగ్లీషులో స్మార్ట్ నెస్ అంటారు. ఉత్తి స్మార్ట్ నెస్ కాదు సెక్సీగా వుంది. ఈ లలనామణి హటాత్తుగా ఎక్కడనించి వచ్చిపడింది. అసలేవరు? ఇన్నాళ్ళు తన కళ్ళు ఎలా మూసుకుపోయాయి? వాటే లక్కీ డే.....ఓహో ఆ పల్లెటూరి డ్రస్సు లోనే యింత ఆకర్షణీయంగా వుంది. కాస్త నాజూకు డ్రసింగ్ అవుతే .....ఆమె వలువల్ని, తలపుల్లో వలచి చూసి ఆనందిస్తున్నాడు. ఆశగా, ఆబగా .....అలికిడికి తలెత్తి చూసిన రంగడు యజమానిని చూసి తడబిడ పడ్డాడు. రంగడు నిశ్శబ్దం అయిపోగానే తలెత్తిన సీతాలు.....రమేష్ ని చూసి సిగ్గుతో మెలికలు తిరిగి ఒక్క గెంతులో రంగడి వెనక్కి పరిగెత్తింది.
    "రంగా......ఎవర్రా...." అన్నాడు రమేష్ కళ్ళేగరేసి సీతాలుని చూపిస్తూ.
    "మా ఆడదండి ..." రంగడు సిగ్గుపడ్తూ అన్నాడు.
    "ఓహో.....పెళ్ళాడావా.....యెప్పుడు....?"
    "మొన్నే నండి, ఆర్నెల్లయిందండి ...."
    "అలాగా.....మరిన్నాళ్ళూ ....ఎప్పుడూ చూడలేదే...." సీతాలునే మింగేసేటట్టు చూస్తూ అన్నాడు రమేష్.
    'అల్లమ్మకి వల్లు బాగునేదంటే కన్నోరింటికెళ్ళి నిన్నే వచ్చిందండి..."
    "అదా సంగతి ....ఒరేయ్ నీ పెళ్ళాం బాగుందిరా....మంచి పెళ్లాన్నే సంపాదించావు. పెరెంటిరా?.....' చనువుగా అడిగాడు.
    "సీతాలచ్చండి... సీతా అంటానండి....' యజమాని భార్యని పోగిడినందుకు సంబరంగా, గర్వంగా సీతాలు వంక చూశాడు రంగడు.
    సీతాలు సిగ్గుల మొగ్గ అయింది. కళ్ళ చివర్ల నించి చిన్నదొర మిసమిసలాడే రంగుని, వేసుకున్న ఖరీదయిన నైట్ సూట్, మెరిసే నల్ల చెప్పుల మధ్య మల్లె పూవు లాంటి కాళ్ళని , నిగనిగలాడే వంకీల క్రాపుని , చేతికున్న ఖరీదయిన వాచిని .....అన్నీ చూసి అబ్బో చిన్నదొర ఎంత బాగున్నాడనుకుంది సీతాలు.
    "వరేయ్ రంగా, మీ సీతాలే కనక సిటీలో వుంటే సినిమా స్టార్ ని మించి పోయేది .....కాస్త షోగ్గా డ్రస్సయిందంటే ....మరి చూసుకో....మంచి ఫోటో జేనిక్ ఫేస్ రా....అనక ఎండ తగ్గేలోపల ఫోటోలు తీస్తాను యిద్దరూ ముస్తాబయి రండిరా ....సీతాలు మంచి చీర కట్టుకురా....రంగా ...నీవూ ......ఆ వేషం తీసి శుభ్రంగా రా....' అన్నాడు.
    చిన్నదొర ఆదరభిమానాలకి పొంగిపోతూ ఫోటో తీస్తానన్నందుకు ఆనందంతో తబ్బిబ్బ అయిపోతూ యిద్దరూ దండాలు పెట్టారు. మొదటిసారే యింకా చూస్తె బాగుండదన్నట్టు రమేష్ అయిష్టంగానే అక్కడ నించి కదిలి లోపలికి వెళ్ళాడు.

                                             *    *    *    *

    మధ్యాహ్నం రంగడు సీతాలు యిద్దరూ అతి వుత్సాహంగా ముస్తాబయి ఫొటోలకి వచ్చారు. సీతాలు అమ్మగారు తనకిచ్చిన గులాబీ నైలక్స్ చీర కట్టి గులాబి రంగు జాకెట్టు తొడిగి, తోటలో గులాబీలు తలలో పెట్టుకొని నీటుగా కాటుక, బొట్టు పెట్టి తయారైంది. రంగడు రమేష్ యిచ్చిన పాత ప్యాంట్ షర్టు తొడుక్కుని సంబరంగా సీతాలు పక్కన నిలబడ్డాడు. గులాబీ చీరలో ఉదయం కంటే ఆకర్షనీయంగా వున్న సీతాలుని చూసి గుటకలు మింగాడు రమేష్. అతని మెదడు చురుకుగా ఆలోచిస్తుంది. ఫోటోలు తీసే నెపంతో ....'అరె ....అలా మొహం వంచకూడదు , ' అలా కాదు యిటు చూడాలి -' 'ఇలా నవ్వాలి ' ......'ఇలా దగ్గిరగా నిలబడు ' అంటూ గడ్డం ఎత్తి - భుజాలు పట్టుకుని..... అనేక రకాల ఫోజుల్లో నిలబెట్టాడు ఆమెని తాకుతూ ....సీతాలు చిన్న దొరగారి స్పర్శకు ముడుచుకుపోతుంటే - ' ఏటే అలా మెలికలు తిరగ తండవు. దొర చెప్పినట్టు చూడు " అన్నాడు రంగడు. ఫోటోల కార్యక్రమం అయ్యాక ---" వరేయ్ రంగ మేడమీదకి రండిరా పాటలు విందురు గాని, రా సీతాలు నా దగ్గర అంత సిగ్గేమిటి "

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra