Home » Dr c. ananda ramam » గర్ల్ ఫ్రండ్

    "అంటే?....అంటే...."
    "అంటే, ఇది ప్రాస్టిట్యూషన్ లా నీచమైనది కాదు. మనం స్నేహితులుగా ఉందాం! నీ కష్టసుఖాలన్నింటిలోనూ నీకు అండగా వుంటాను. నువ్వు నాతోతప్ప మరొకరితో స్నేహం చెయ్యకూడదు."
    ఇప్పటికి పూర్తిగా అర్ధమైపోయింది వేదకి. నిజమే, దీన్ని ప్రాస్టిట్యూషన్ అనటానికి వీల్లేదు. మరి? గర్ల్ ఫ్రెండ్! తను వ్యభిచారిణి కాబోవటంలేదు. గర్ల్ ఫ్రెండ్ కాబోతుంది.
    "పిచ్చిదానివి! ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు. ఇలాంటి అవకాశం వస్తే ఎగిరి గంతేసి ఆనందించే ఆడపిల్ల లెంతమంది ఉన్నారో? నీకు తెలియదు!"
    "ఉండచ్చు! అందులో ఆశ్చర్యంలేదు. డబ్బుకి ఎక్కడలేని ప్రాధాన్యమూ ఉన్న సమాజం ఇది. డబ్బుతో ఏదైనా కొనుక్కోగలిగే వ్యవస్థ ఇది. అందుచేత డబ్బుకోసం ఎవరు ఏది చెయ్యటానికి సిద్ధపడ్డా ఆశ్చర్యపడక్కర్లేదు."
    జయపాల్ తన చెయ్యిజాపాడు. వేద ఆ చేతిలో తన చెయ్యి వేసింది. ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని వేదను తనమీదకు లాక్కున్నాడు. వేద అతనితో ఆ ఇంట్లోనే మూడు రోజులుంది. ఆ తరువాత ఇంటికి వచ్చేసింది. ఆమెకి ఉద్యోగం దొరికింది. ఆమె కుటుంబం ఆ ఇరుకు అద్దె ఇంటిలోంచి మరొక విశాలమైన ఇంటిలోకి మారారు. తండ్రి కంటికి ఆపరేషన్ జరిగి చూపు బాగుపడింది. తల్లికి ట్రీట్ మెంట్ జరుగుతోంది. గీత మెడిసిన్ లో జాయినయింది. జయపాల్ వారానికోసారో, పదిహేనురోజులకొకసారో, ఆమెతో 'డిస్కషన్స్' కి వస్తాడు. అప్పుడు ఆ ప్రాంతాలకి పూర్తిగా కుటుంబసభ్యులెవరూ వెళ్ళరు. 'డిస్కషన్స్' పూర్తయిపోయాక జయపాల్ ఇంటిలో అందరినీ మర్యాదగా పలకరించి వెళ్ళిపోతాడు.
    ఈ పరిస్థితుల్లో ఒకరోజు జ్ఞానస్వరూప్ ఆమెను చూడటానికి వచ్చాడు. అన్నను కూచోమనికూడా అనలేదు ఆమె. తల్లి మాత్రం చాలా సంబరంతో ఆహ్వానించి కాఫీ ఫలహారాలందించి, ఆమె అదృష్టాన్ని తెగ పొగడసాగింది! అన్నిచూస్తు, అంతా వింటూ ఏం మాట్లాడకుండా కూచుంది ఆమె. జ్ఞానస్వరూప్ కి ఆమెతో మాట్లాడాలని ఉంది. పలకరించాలంటే భయంగా వుంది. ఎలాగో గొంతు పెగల్చుకుని "నిన్నీ స్థితిలో చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది వేదా!" అన్నాడు. ఆమె నవ్వింది. ఆ నవ్వు అతడిని నిలువునా ఈసడించింది. ఒక్క గుటక మ్రింగి "అఫ్ కోర్సు.... ...." అని ఆగిపోయాడు. ఏం మొదలుపెట్టాడో గుర్తు రాక, ఎలా పూర్తి చెయ్యాలో అర్ధంకాక, కాఫీ త్రాగి ఖాళీ కప్పు పనిమనిషి చేతికిచ్చేసి ఆమె పక్కగా వచ్చి కూర్చున్నాడు. ఆమె కళ్ళెత్తి కూడా చూడలేదు."  
    "వేదా! నీకు నామీద చాలా కోపంగా ఉంది. నాకు తెలుసు. కానీ ,నువ్వే ఆలోచించు! ఉద్యోగంకోసం నేను చెయ్యని ప్రయత్నం అంటు ఉందా? మూడేళ్ళు కాయలు కాచేలా తిరగలేదూ? బి.ఇ. డిగ్రీ చేతిలో పెట్టుకుని గుమాస్తా ఉద్యోగం కూడా సంపాదించలేకపోయాను. అదంతా నా తప్పేనంటావా? చివరికి....అలా....ఇంట్లోంచి వెళ్ళిపోవటం, అది తప్పేననుకో.... బట్ ....నేను నీమీద కోపంతో వెళ్ళిపోయాననుకున్నావా? పిచ్చిమొహమా! అలా వెళ్ళిపోతేగాని, నువ్వు నీ మొండిపట్టుదల వదలి ఉద్యోగంలో చేరవని అలా వెళ్ళిపోయాను. చూశావా? ఎంత మంచి జరిగిందో?"
    కళ్ళెత్తి అన్నవైపు చూసింది ఆమె, ఈ చివరి మాటలకి. ఆ చూపులకు నిలువునా వణికాడు జ్ఞానస్వరూప్. ఐనా నిలదొక్కుకున్నాడు. స్వప్రయోజనం సాధించటానికి ఎంతటి అవమానాన్నైనా సునాయాసంగా మింగెయ్యగలడు అతడు.
    "వేదా! ప్లీజ్! నువ్వెలాగైనా జయపాల్ గారికి చెప్పి నాకొక ఉద్యోగం ఇప్పించాలి! ఎంత చిన్నదైనా పరవాలేదు. వయసు మించిపోకుండా గవర్నమెంట్ సర్వీస్ లో చేరిపోతే, తర్వాత చూసుకోవచ్చు."
    మండిపోయింది ఆమెకి. "సిగ్గులేదూ, నన్నిలా అడగటానికి!" చీదరించుకొంటూ అంది.
    "లేదు-నా చుట్టు జరుగుతున్న అన్యాయాలను చూస్తూ అర్ధం చేసుకుంటూ, ఏమీ చెయ్యలేని చవట నైనందుకే సిగ్గు పడటంలేదు. ఇక నేను సిగ్గుపడవలసినదేముంది?" అతనూ రోషంగా అని వెళ్ళిపోయాడు. తల్లి భోజనం చేసి వెళ్ళమంటున్నా, వినిపించుకోలేదు.
    తరువాత తల్లి కూతురుని ప్రాధేయపడటం మొదలుపెట్టింది. "వాడు కష్టపడి చదివాడు గదే! మంచి మార్కులతో ప్యాసైనాడుగా! ఏ రౌడీ వేషాలూ వెయ్యలేదుగా! ఉద్యోగం రాకపోతే ఆ తప్పు వాడిదా? బాబుగారితో చెప్పి వాడికేదైనా ఉద్యోగం ఇప్పించవే!"
    తల్లి జయపాల్ ని బాబుగారనే అంటుంది. అలా అనటం ఆమెకే మాత్రమూ ఇష్టంలేదు. కానీ, అలా దీనంగా ప్రాధేయపడుతుంటే, భరించలేకపోయింది. "అలాగే చేస్తానులే!" అంది. వారం తిరిగేలోగానే, గవర్నమెంట్ ఫరంలోనే వెయ్యి రూపాయల జీతం ఉద్యోగం దొరికింది జ్ఞానస్వరూప్ కి. ఆ పైవారమే కలిగినింటి అమ్మాయితో అతనికి క్షణాలమీద పెళ్ళికూడా ఐపోయింది. ఉభయపక్షాలవారూ దొరికిన అవకాశం ఎక్కడా చెయ్యిజారిపోతుందోనని హడావుడిపడుతూ పెళ్ళి జరిపించేశారు. పెళ్లికాగానే మంచిఇల్లు అద్దెకు తీసుకుని భార్యతో వేరుకాపురం పెట్టేసాడు జ్ఞానస్వరూప్....తల్లీతండ్రీకూడా కొడుకు దగ్గరకే వెళ్ళిపోయారు, గీతను కూడా రమ్మన్నారు. కానీ, గీత అక్కను విడిచిరానని మొండికేసింది. "పోనీ, ఉండనియ్యి" అన్నాడు. ఎక్కడికక్కడ బాధ్యతలు తప్పించుకోవాలనే జ్ఞానస్వరూప్. తల్లి నోటినుండి వెలువడబోయిన యెన్నో వాక్యాలు ఆమె ,ముఖం చూసి ఆగిపోయాయి. ఎంతైనా తల్లి ప్రాణం గనుక మరీ కర్కోటకంగా మాట్లాడలేక, కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది. గీత, వేద మాత్రమే మిగిలారు. అప్పుడు ఆమె చాలా నిదానంగా "గీతా! నువ్వు వెళ్ళకపోయావమ్మా?" అంది.
    "నిన్ను విడిచి నేను వెళ్ళలేనక్కా!"
    "ఇక్కడుంటే__నువ్వూ నాలా అయిపోతావేమోనమ్మా!"
    "అక్కా! నిన్ను గురించి ఆలోచించే వాళ్ళెవరూ నీకు లేకపోయారు. కానీ నాకు నువ్వున్నావు. నన్ను గురించి నాకేం దిగులులేదు."
    రెండు చేతులూ చాచి చెల్లెల్ని దగ్గరకు తీసుకుంది ఆమె. మాటలకందని భాషలో ఆ యిద్దరూ ఆప్యాయతలు కలబోసుకున్నారు.
    తల్లిని చూట్టానికి అన్న ఇంటికి వెళ్ళింది ఆమె. ఆఫీస్ నుమ్హి తిన్నగా వెళ్ళటంచేత. అప్పటికి అన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఆమెను వరండాలోకి ఏదో పనిమీద రమ్మని "నీకు అమ్మని చూడాలని ఉంటే, అమ్మనే నీ దగ్గరకు పంపిస్తానులే. నువ్వు మాత్రం ఇక్కడికి రాకు! మీ వదినకు ఇష్టంలేదు" అన్నాడు నిర్ఘాంతపోయింది ఆమె.
    "ఛీ! నువ్వు మనిషివేనా?"
    "ఆ చీదరింపు ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా భుజాలెగరేసి "పరిస్థితులు సందర్భాలు - ఉద్యోగం చూపెట్టమని ప్రాధేయపడిన సొంత అన్నని చీదరించుకున్న - ఈసడించుకున్న నువ్వు మనిషివి కాదు" అన్నాడు.
    వేద ఇంటికి వచ్చేసింది. ఇంత దారుణ పరాభవం జరిగినా ఆమెకి ఏడుపురాలేదు. రోషంతో మనసు రగిలిపోయిందే తప్ప. ఎందుకో అప్పటికే అంతరాంతరాల్లో తనతప్పు కాదనే భావన ఆమెకుంది! సమాజంలో పెళ్ళిపేరిట జరుగుతోన్న వ్యభిచారాలెన్నో ఉన్నాయి. తమ అనుబంధం పెళ్ళిముద్రలేని దాంపత్యం కాకూడదా? అందుకే ఎదురవుతోన్న ఎన్ని అవమానాలనైనా ఎదుర్కొని తలఎత్తుకొని నిలబడగలుగుతోంది.
    డబ్బున్న బిజినెస్ పీపుల్ అనేకమందికిలాగానే జయపాల్ కి కూడా ఖరీదైన హాట్ డ్రింక్స్ అలవాటు. మొదట మొదట ఆ వాసన వేద భరించలేకపోయినా తర్వాత తర్వాత అలవాటుపడిపోయింది. మద్యపానంతో మనుష్యులెంతగా మారిపోతారో జీవితంలో ప్రత్యక్షంగా చూడగలిగింది ఆమె. అతనికి సహజమైన ఆ గాంభీర్యమూ, అన్ని విషయాలూ పరిశీలనగా అర్ధంచేసుకోగల వివేకమూ, ఏమయిపోయాయో? వెర్రిబాగుల పరిపిల్లవాడులా మారిపోతాడు. ఆ సమయంలో అతడు మాట్లాడని విషయమంటూ ఉండదు. ఎంతో చాకచక్యంతో మనసులో దాచిపెట్టిన విషయాలనేకం బయటకి వచ్చేస్తాయి ప్రవాహంలా! ఈర్ష్యలూ, స్పర్ధలూ ,కక్షలూ__అన్నీ బట్టబయలయిపోతాయి. ఆ మాటలు వినటానికి ఎప్పటికప్పుడే ఎంతో కుతూహల పడుతుంది వేద. ఎందుకంటే, ఆ మాటలలో ఆమెకంతకుముందెన్నడు తెలియని, ఊహకయినా అందని మరో ప్రపంచం కనిపిస్తుంది. అలాంటి "మూడ్" లోనే ఒకసారి జయపాల్ "నీరద్! నీరద్ గురించే నాకు బెంగ!" అన్నాడు.
    "నీరద్ ఎవరు? మీకు బెంగ దేనికి!" అని అడిగిందామె. 
    "నీరద్ నా కొడుకు! వాడిపైన ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? వాడు కాస్త నా మాట వింటే పెద్ద బిజినెస్ మాగ్నెట్ ని చేద్దును. కానీ, వాడు క్లబ్బులలో డాన్స్ చేస్తాడు. నా మాట విననే వినడు."
    కొడుకు భవిష్యత్తుకోసం పరితపిస్తున్న ఆ తండ్రిని చూసి నిజంగా సానుభూతి కలిగిందామెకి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra