ఫలితంగా-
కన్నుమూసి తెరిచేటంతలో పరిసరాల రూపం మారిపోయింది.
హిమాలయాల ఎత్తు పెరిగింది!
ఆ తాకిడికి వందలకొద్దీ కిలోమీటర్ల మేర భూభాగం ముడతలు పడిపోయింది.
భూమికి పడిన ఆ ముడతలు మామూలు ముడతలు కావు.
అవి మహా పర్వతాలు.
క్షణకాలంలో-
ఢిల్లీ పరిసర ప్రాంతాలలో -
మంత్రం వేసినట్లుగా మహా పర్వత శ్రేణులు పుట్టుకొస్తాయి.
భూమి అంతగా ముడతలు పడిపోయినదన్నమాట.
భూమి పుట్టుక సమయంలో -
భూమి కుత కుత ఉడికిపోతున్నప్పుడు ఆ కదలికలలో ఆ ప్రేలుళ్ళలో పుట్టుకొచ్చాయి పర్వతాలు.
మళ్ళీ ఇవాళ -
భూగోళం నాశనమైపోతున్నప్పుడు -
అదే విధంగా కొత్త పర్వతాలు పుట్టుకొచ్చాయి. భారత భూభాగానికి అడ్డంగా సరికొత్త వింధ్య పర్వతాల లాగా-
సరికొత్త పర్వత పంక్తులు!
మైదాన ప్రాంతం అతి వేగంగా వచ్చి మంచు కొండలని తాకడంతో-
ఆ తాకిడికీ-
ఆ రాపిడికీ-
వర్ణనాతీతమైన వేడిమి పుట్టుకొచ్చి-
మంచు కరగడం మొదలుపెట్టింది.
మామూలు మంచుకాదు.
మొత్తం హిమాలయాలలో వున్న మంచు!
కొద్ది నిముషాల క్రితం -
క్షణంలో రెట్టింపు ఎత్తుకి ఎదిగిపోయిన ఎవరెస్టు మహా శిఖరం!
హఠాత్తుగా పెరగడం ఆగి-
కరగడం మొదలెట్టింది.
ప్రపంచంలోకెల్లా అతి పెద్దదయిన ఆ ఎవరెస్టు శిఖరం అలా ఒక ఐస్ క్రీం కోన్ లాగా కరిగిపోతూ వుంటే-
ఆ దృశ్యం అతి భయంకరంగానూ వుంది.
అత్యంత సుందరంగానూ కూడా వుంది.
జరుగుతున్నదంతా ఎవరూ చెప్పకుండానే టెలిస్కోపు కొండమీద వున్న వీళ్ళకి తెలిసిపోతోంది.
"జపమాలా!" అన్నాడు సాహస్ ప్రాధేయపూర్వకంగా. "జపమాలా! ఆలస్యం చేయకు. ఏదో ఒకటి తక్షణం చేసేయ్. ఏదన్నా చేసి ఈ ప్రళయాన్ని ఆపేయ్" అన్నాడు సాహస్.
"ముందు మన ప్రణయం సంగతీ, పరిణయం సంగతీ నువ్వు తేలిస్తే..." అంది జపమాల పట్టుదలగా.
అసహనంగా కట్ చేసింది కూకూ.
'నీ పాణిగ్రహణం ఈ స్కైలాబ్ తో జరిగిపోయింది జపమాలా!" అంది సాధ్యమైనంత మృదువుగా.
"నేను ఒప్పుకోను. నా పెళ్ళి సాహస్ తో జరిగి తీరాల్సిందే" అంది జపమాల.
సహనం కోల్పోయాడు సాహస్.
"జపమాలా!" అన్నాడు సాహస్ అసహనంగా.
"నిజం చెప్పనా?" అంది జపమాల.
అప్పటిదాకా ప్రేక్షకుడిలాగా వీళ్ళిద్దరి మాటలూ వింటున్న స్కైలాబ్ ఒక్క గెంతు గెంతి చటుక్కున ముందుకు వచ్చాడు.
"అవును. నిజం చెప్పు! ఇంతకీ నీకూ నాకూ పెళ్ళయిపోయినట్లేనా? నన్ను ఏ ఆడపిల్లయినా అసలు పెళ్ళిచేసుకుంటుందా లేదా అని ఇన్నాళ్ళ నుంచీ మా చెడ్డ బెంగగా వుండేది. నీలాంటి అందగత్తె దొరికితే ఇంక నా జన్మ ధన్యమైపోయినట్టే!" అన్నాడు ఉత్సాహంగా.
పొట్టిగా, వికృతంగా, వింతగా కనబడుతున్న స్కైలాబ్ వైపు వెగటుగా చూసింది జపమాల.
"జపమాలా!" అన్నాడు సాహస్ హెచ్చరిస్తూ.
"సాహస్! నిజం చెప్పెయ్యనా?" అంది జపమాల అతని వైపు తిరుగుతూ.


