శివదేశికాచార్యులు మహానందముతో మహారాజ్ఞి కెదురువచ్చి భగవత్ ప్రసాదముగా నొసంగిన ఫలాహరములను రుద్రమదేవి సగౌరవముగా గ్రహించి కన్నులకద్దుకొని భుజించినది. అనంతర మామె కొంచెముసేపు విశ్రమింపఁ దలంచి శైవమఠ మధ్యభాగమునకు వచ్చి యించుక మేనువాల్చినది. శివదేవ దేశికాచార్యులవారు తన జటాజూటమును సవరించుకొనుచు ద్వారపురో భాగమున నిటునటు పచారుచేయుచుండిరి.
ఆకస్మికముగా నాలయప్రాంతమున గుఱ్ఱపుడెక్కల చప్పుడు వినిపించినది. మరు నిమేషమునందే యొక రాజభటుఁడు నురుగులు గ్రక్కుచు దేవాలయము ముందు గుఱ్ఱమును దిగి "శివదేవ దేశికాచార్యులవారెక్కడ" యని యాతురతతో ప్రశ్నించెను. అతనికి జనము దారి చూపించెను. ఆ భటుఁడు శివదేవయ్యగారిని చూచి సాష్టాంగ దండప్రణామముగావించి గోవిందామాత్యులవారి స్వహస్తముతో లిఖింపఁబడిన యొక లేఖను చేతి కందించెను. శివదేవయ్య ఆ లేఖనందుకొని వడివడిగా విప్పి రెండు మూఁడు పంక్తులు చదివెనో లేదో వెంటనే నిదురించుచున్న రుద్రమదేవి నుద్దేశించి "తల్లీ! నీ యనుమాన మీనాఁటికి నిజమైనది. మురారి హరిహరదేవులు సామ్రాజ్యమునకు మహాప్రళయము గొని వచ్చినారు" అని పలుకుచు లేఖను మహారాణి కరకమలములలో నుంచెను.
రుద్రమదేవి యాతురతతో నా లేఖనందుకొని వడివడిగా నిట్లు చదువుకొనినది -
"స్వస్తిశ్రీ స్వయంభూదేవదివ్య శ్రీపాద పద్మారాధక, పరబలసాధక, ప్రత్యక్షప్రమథగణసహితావతార, శ్రీమన్మహామండలేశ్వర కాకతీయ రుద్రదేవ మహారాజులుంగారికి - హరిహర మురారి దేవులపార సైన్యసమేతులైవచ్చి మన దుర్గమును ముట్టడించినారు. వారలకు యాదవరాజు సహాయమున్నట్లు తెలియుచున్నది. తాము తత్ క్షణము పయనమై రాజధాని నగరమునకు దయచేయవలయును. వందనములు.
పాదపర్మారాధకుఁడు - గోవిందామాత్యుఁడు"
ఒక్కమాటుగా మహారాణి శరీరమంతయుఁ బులకించినది. కనుబొమలు ముడివడినవి. వదనమండల మరుణ వర్ణము దాల్చినది. వామభుజ మదరినది. సేనానాయకునిఁ బిలిచి వెంటనే ప్రయాణసన్నాహ మొనరింపుమని రుద్రమదేవి యాజ్ఞాపించినది. ఆ విశాలలోచనములనుండి ప్రళయ కాలాగ్ని జ్వాలలు ప్రజ్వలింపసాగినవి. శివదేవ దేశికా చార్యులవారికే యాసమయమున మహారాజ్ఞి ముఖమండలమున దృష్టి నిలుపుటకు భయము కలిగినది.
6
యాదవసైన్య సహాయుతో ముందుగా బయలుదేరి మురారి హరిహరులు ఏకశిలాపురమునఁ బ్రవేశించిరి. అసావధానులైయున్న పట్టణప్రజలు మొట్టమొదట శత్రుసైన్యములను గాంచి కొంతభయమందిరి. కాని మెల్లఁగా ధైర్యము తెచ్చుకొని పోరాడసాగిరి. ఓరుగల్లు దుర్గరక్షణమునం దప్రమత్తుఁడై యున్న మహామంత్రి గోవిందామాత్యుల వారు శత్రుసైన్యములు దుర్గపరిసరములకు రాకుండ నడ్డగించుచుండెను. మహారాణి దుర్గములో లేదని తెలియుటచే మరింత యుత్సాహముతో నెట్టులైనఁ గోట స్వాధీనముచేసికొనవలెనని పట్టుదలతో మురారిహరిహరుల సైన్యములు ప్రాణములకుఁ దెగించి సమరము సాగించుచుండెను. అయ్యపోతినాయఁడు మొదలగు దుర్గరక్షకులు రాణిగారులేని సమయమున కాకతీయసామ్రాజ్య గౌరవమును సర్వవిధములఁగాపాడుటకై నడుముగట్టి విరోధివరూధినుల నెదుర్కొనుచుండిరి. ఇరువైపుల సైన్యములకు పోరు ఘోరమయ్యెను.
ఇంతలో రుద్రమదేవి సేనావాహినీ సమేతముగ మహావేగముతో వచ్చి వెనుకనుండి మురారిహరిహరుల కాల్బలముమీఁద దాడిచేసినది. యాదవసైన్యములు కాకతీయసేనల వీరవిజృంభణమున కాఁగలేక చెల్లాచెదరైపోసాగెను. అడగత్తెరలోఁ బడిన వక్కవలె మురారిహరిహరుల సైన్యము దిక్కుతోఁచక దిగ్భ్రమనందుచుండెను. కాని మురారిహరిహరుల ధైర్యము సన్నగిలలేదు. కొలఁది కాలమట్లే పోరాడుచుండినచో యాదవరాజగు మహాదేవుఁడు మహత్తర సేనాసమూహముతోఁ దమకు సాయమురాఁగలఁడుగదాయని వా రాశపడుచుండిరి. ఇంతలో మహాదేవరాజు సైన్యముతో రానేవచ్చెను. శత్రువుల బల మధికమైనది. రుద్రమదేవి యద్వితీయ పరాక్రమముతో మహాసముద్రమును బోలిన యాదవసైన్యమును మందరపర్వతము వలెఁగలఁచి వేయుచుండెను. పగతుర యసంఖ్య సేనాసమూహము మధ్య వీరవిహార మొనరించుచున్న యా నారీ శిరోమణి దుర్గ ప్రాకారమునుండి చూచువారలకు "మహిషాసురమర్దని" వలెఁ గానుపించుచుండెను. ఆమె నడుమనడుమ కులదేవతయగు కాకతిమహాశక్తిని, ఇష్టదైవతమగు స్వయంభూదేవస్వామిని స్మరించుచు కరాగ్రమున భయంకర కరవాలమును ధరించి శత్రుసైనికులను చించి చెండాడసాగినది.
రుద్రమదేవీ సైన్యములకు సహాయముగా గోవిందామాత్యులవారు కోటలోనుండి కొంతసైన్యమును బంపెను. ఎవరో యొక యజ్ఞాతయువకుఁడా సైన్యముల కధిపతియై నడిపించుకొనివచ్చుచుండెను. అతఁడు మహారాణి సైన్యములను చేరకముందే యాదవసైన్య మాతనిపైఁ దలపడినది. ఆ యువకుఁడు నిరుపమాన విక్రమముతో ప్రతిపక్ష సేనల చీల్చి చెండాడి పురోగమించు చుండెను. రణము క్షణమున కొకవిధముగా పరిణమింపఁజొచ్చినది. తప్పక జయలక్ష్మి తమ్మే వరింపఁగలదను విశ్వాసముతో యాదవ సైన్యము లసువులపై నాశలు వీడి ముందుకుఁ జొచ్చుకొని వచ్చుచుండిరి. అజ్ఞాతవీరుఁడు వీరాభిమన్యునివలె విజృంభించెను. శత్రువుల చమూసమూహములు వానిముందు నిలువలేక పలాయనము చిత్తగించినవి. ఇదియంతయు దూరమునుండి గాంచుచున్న మహాదేవుఁడు సైన్యముల నన్నింటిని సమీకరించుకొని యా వీరునిపైఁ దలపడెను. ఎట్లయినను కోటలోని సైన్యమును రుద్రమదేవి సైన్యములతోఁ గలియనీయరాదని మురారి హరిహరులు ప్రయత్నించుచుండిరి.
క్రొత్తగాఁ గోటలోని సైన్యములను నడిపించుకొని వచ్చిన యజ్ఞాతవీరుఁడు శత్రుసైన్యమధ్యమునఁ జిక్కెను. నలు ప్రక్కల యాదవసైన్యములు చుట్టుకొనినవి. ఇంతలోఁగాకతీయ సైన్యములయందు జయజయధ్వనులు మిన్ను ముట్టినవి. అన్నామాత్యుఁడు పెద్ద సైన్యముతో నజ్ఞాతవీరునకు సహాయముగా వచ్చెను.
అన్నామాత్యుఁడు కళింగదేశమునుండి సైన్యసమేతుఁడై యరుదెంచినవార్త దుర్గములోనివారికిఁ దెలిసినది. వారి యానందోత్సాహముల కంతులేదు. కాకతీయసైనికులు ద్విగుణీకృతోత్సాహముతో విజృంభింప సాగిరి. అయ్యపోతి నాయఁడు గజసైన్యమును నడిపించుకొని కోటలోనుండి వెలుపలకు వచ్చి విరోధిచమూవాహినిపైఁబడెను. కాకతీయగజములు యాదవసైన్యములపైఁబడి త్రొక్కి చిందఱ వందఱచేసినవి. యాదవవీరులు దిక్కుతోఁచక పంచబంగాళమై పరువెత్తసాగిరి. మహారాణి మహాదేవరాజుపై దూఁకి యాతనిని బందిగావించినది. మురారిహరిహరులు పలాయన మంత్రమును పఠింపఁజూచిరి. కాని అన్నామాత్యుఁడు హరిహరుని వెంటఁబడెను. అజ్ఞాతవీరుఁడు మురారిని వెన్నాడెను.
విద్రోహులిరువురును బంధితులైరి. మురారిహరిహరులను నడిపించుకొని యజ్ఞాతవీరుఁడును, నన్నామాత్యుఁడును మహారాణిని సమీపించిరి. కాకతీయ విజయదుందుభి స్వనములతో దిక్కులు పిక్కటిల్లినవి.
వీరరాజ్ఞీమణి రుద్రమదేవి యేకశిలానగరమున బ్రహ్మాండముగా విజయోత్సవములు జరిపించినది. వీరశిరోరత్నములగు కాకతీయ సైనికులకు సముచిత బహూకృతులొసంగినది. యుద్ధద్రవ్యముగా యాదవరాజు నుండి గ్రహించిన ధనమును ప్రజలకుఁ దోసిళ్ళకొలది బంచిపెట్టినది. మురారి హరిహరులను భ్రష్టులఁ గావించి బందీగృహముల పాలు చేసినది.
నిన్న మహాసంగ్రామరంగమున వీరవిహార మొనరించిన యా యాజ్ఞాతవీరుఁడెవ్వరో యని యందఱకు సందేహము పొడమెను. ఆ వీరుఁడెవ్వరోకారు, మహారాణి రెండవ కుమార్తెయగు వీరనారీశిరోమణి రుయ్యాంబికయే! ఆమె బహుకాలము నుండియు యోధాగ్రేసరుఁడగు నన్నామాత్యునిఁ బ్రేమించినదని మహారాణి యెఱుగును. ఆ విజయోత్సవ సంతోషసందర్భములో రుద్రమదేవి రుయ్యాంబికకును అన్నామాత్యునకును పాణిగ్రహణ మహోత్సవము జయప్రదముగా జరిపించినది.
రుద్రమదేవి యాదర్శ వీరనారీశిరోమణి. ఆమె వీర చరిత్రము భారతదేశచరిత్రలో బంగారు పంక్తులతో వ్రాయఁదగినది. ఆంధ్రగౌరవమును, ఆంధ్రసామ్రాజ్యగౌరవమును, ఆంధ్ర మహిళా గౌరవమును రుద్రమదేవి విశ్వవిఖ్యాతములు గావించినది. ఇట్టి మహాప్రకాశవంతమగు వీరరత్నమును గాంచుటచే మన భారతమాత నిజముగా రత్నగర్భ.
* * * *


