చిన్నమ్మా
వీళ్ళందరూ సగంసగం మనుష్యులు
మరోసగం మరుగునపడిన భయస్తులు బాధాగ్రస్తులు
భారతం భాగవతం చదువుతారు
పాపం పుణ్యం కేటాయిస్తారు
డైలీ పేపరు తిరగేస్తారు
జాలీగా వున్నట్లు నటిస్తారు
చప్పబడిన నిన్నటి మాటల్నే మాట్లాడుతుంటారు
కప్పబడిన నిన్నటి కలల్నే తలచుకుంటారు
సన్నంగా పళ్ళ సందున నవ్వుకుంటారు
హఠాత్తుగా జడుసుకుంటారు
నిటారుగా నిలబడలేరు
వీళ్ళందరూ ముక్కలైన గాజుపెంకులు
చెల్లాచెదురైన మూగ ముత్యాలు
కల్లాకపటం తెలియని కబోది గుంపులు
తమని తామే మోసగించుకునే విద్యాధికులు విదూషకులు
తమ చెట్టుకొమ్మని తామే నరుక్కునే అమాయకులు
సంప్రదాయకులు
చిన్నమ్మా
వీళ్ళను విడిచి వెళ్ళిపోకు
వీళ్ళందరూ నీ బిడ్డలు
ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు
వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ
దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ
ఓపికలేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ
ధైర్యంలేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ
బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళమధ్య
డైనమేట్ పేలాలి
డైనమోలు తిరగాలి
కాళరాత్రివేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి
దారిపక్క నిల్చిన మోడుచెట్ల బాధని అనువదించాలి
పచ్చికలో దాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి
రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి
చిన్నమ్మా
నేను వెళ్ళొస్తాను
చీకటి పడుతోంది
చిటారుకొమ్మలో నక్షత్రం చిక్కుకుంది
శిధిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతుంది
దారంతా గోతులు యిల్లేమో దూరం
చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం
* * *
---1964


