Home » Dr jandhyala papayya sastry » Karunasri Sahityam - 4 - Balasahiti - 2

   
    అంతలో సభ మఱల నిశ్శబ్దమైనది. గణపతి దేవ చక్రవర్తి కరము నూఁతగాఁ గొనివచ్చిన పదునాలుగేఁడుల రాజకుమారుఁడు తన మణిమయ పీఠమును దిగి నిలువఁబడెను. వీరరసమువెల్లివిరియుచున్న యా రాచబిడ్డ సుందరవదనార విందము గాంచి సభ్యులు ముగ్ధులైరి. చక్రవర్తి యాతనిఁగాంచి చిరునవ్వుతో "నాయనా! నీవు ప్రయత్నింతువా?"యని పలికెను. ఆ వీరకిశోరము దృఢనిశ్చయముతో నౌనన్నట్లు తల యాడించెను. మహాప్రధాని గోవిందా మాత్యుల వారు లేచి యా రాకుమారుని దీసికొనిబోయి రంగమధ్యమున నిలిపి తిరిగివచ్చి నిజాసనముపయినుపవిష్టుఁడయ్యెను. చక్రవర్తి మరల పావురమునోట మృణాళవల్లిక నునిచి స్తంభాగ్రముపై నిలబెట్టెను. బాణప్రయోగమునకుఁ జక్రవర్తి యనుజ్ఞ నిచ్చిన వెంటనే యొక్కమాటుగా మూఁడు వాఁడి ములుకులు వింటినుండి వెలువడినవి. గాలికే తెలియనట్లు నిశ్శబ్దముగానవి లక్ష్యమునుజేరి మూఁడుముక్క లొనరించి చక్రవర్తికి నమస్కరించుచున్నవో యన్నట్లు చరణముల ముందు వ్రాలినవి. గణపతి దేవచక్రవర్తి యపరిమితానందముతో రంగస్థలమున కేఁగి యా వీరకిశోరమును గౌఁగిలించుకొని కొనివచ్చి యంకభాగమునఁ గూర్చుండఁ బెట్టుకొని వీర కరవాలమును స్వహస్తముతో బహూకరించెను.
    సభాసదు లా బాలవీరునిమౌళిపైఁ బుష్పవర్షము గురిపించి పెక్కువిధముల నభినందించిరి. నలుమూలలనుండి జయజయధ్వనులు మిన్నుముట్టినవి. గోవిందామాత్యులు వచ్చి సప్రేమముగా నా బిడ్డ శిరము మూర్కొనెను. శస్త్ర విద్యా ప్రదర్శనమహోత్సవము ముగిసినది.

                             2

    ప్రదర్శనానంతరము పట్టరానిసంతోషముతో నా రాచపట్టి చేయిపట్టుకొని గణపతి దేవచక్రవర్తి యేకాంతమందిరమున కేఁగెను. యాదవరాజుల కారాగారము నుండి తిరిగివచ్చి విశాలాంధ్రసామ్రాజ్యమున కభిషిక్తుఁడైన నాఁడైన గణపతి దేవచక్రవర్తి కింత యానందము కలుగలేదు. అరివీర భయంకరుఁడైన పల్లవరాజు కొప్పెరుంజింగని జయించి వానినిఁ దన పాదసేవకునిగాఁ జేసికొనినాఁడైన నాయన ముఖపద్మ మిట్లు వికసింపలేదు. విద్యాప్రదర్శనము ముగిసిన మఱునిముసమునుండి చక్రవర్తి హృదయమునందేదో యవ్యక్తమగు నూతనోత్సాహము వెల్లివిరిసెను. ఆయన వదనమండలము నావరించియున్న విచార రేఖ మటుమాయమైనది.
    ఏకాంతమందిరమునకుఁ జేరినయనంతరము గణపతి దేవచక్రవర్తి యా రాకుమారుని దగ్గఱకుఁదీసికొని ముద్దుగొని "తల్లీ! రుద్రమదేవి! ధనుర్విద్య యందు నీకింతటి యఖండపాండిత్య మున్నదని యింతకుముందెన్నఁడు మాట మాత్రమైన యనినావుకావేమి?" యని పలికెను. రాజకుమార వేషముతో నున్న రుద్రమదేవి నవ్వుచు "తండ్రీ! ఎన్నఁడును నా కట్టి యవకాశము లభింపక పోవుటయే కారణ"మని వచించెను. గణపతి దేవచక్రవర్తి తన ముద్దుల కుమార్తెను గౌఁగలించుకొని "అమ్మా! మీ విద్యాగురువెవ్వరో యడుగవచ్చునా?" యనెను. రుద్రమ్మ సవినయముగా "గోవిందామాత్యులవారు" అని పలికెను.
    గణపతి దేవచక్రవర్తి యీమాట నాలకించినతోడనే మిక్కిలి సంతోషము గలిగి మనస్సులోనే గోవిందామాత్యులకు భక్తిపూర్వకముగా నమస్కరించి "మహామంత్రీ! ఎంతటి దూరదర్శివి. మహారాజునకుఁ బుత్రసంతతి లేదను నూహవలననేనా రుద్రమకు మీరిచ్చిన యీ శిక్షణ విధానము. కర్తవ్య విమూఢుఁడనై యున్న నా కన్నులకు వెలుఁగు చూపించి నా హృదయములోని నిరాశను దూరము చేసితి" రని యనేక విధములఁ బ్రశంసించెను.
    మహత్తరమైన విశాలాంధ్ర సామ్రాజ్యమును సంస్థాపించి దేశమున శాంతి నెలకొల్పిన గణపతి దేవచక్రవర్తికిఁ బూర్వ మొక నిమేషమైన హృదయశాంతి యుండెడిదికాదు. తన యనంతరము ప్రజాక్షేమకరముగా సింహాసనమునఁ గూర్చుండి రాజ్యమును బరిపాలించుటకుఁ దనకుఁ బుత్రసంతానము లేకపోవుటయే చక్రవర్తి నిరుత్సాహమునకు, నిరాశకు, నశాంతికిఁ బ్రధాన కారణము. సవతి తమ్ముని కుమారులైన మురారి హరిహరదేవులలో నెవ్వరికైన రాజ్యము నప్పగించుట కాసార్వభౌముని హృదయ మంగీకరింపక పోయెను.
    ఇప్పుడు చక్రవర్తికి రుద్రమదేవి కుమార్తె గాడు, కుమారుఁడు. రాజకుమారుల యాభరణములే యామె యాభరణములు, రాజనందనుల దుస్తులే యామె దుస్తులు. రాజపుత్రుల యాటలే యామె యాటలు. జన్మముచేత నామె స్త్రీయైనను క్రమక్రమముగా నామె పురుషోచితవేషభూషణములను ధరించి యొక యుత్తమరాజకుమారుని వలెఁ బ్రకాశించెను.
    నాఁడు శస్త్ర విద్యాప్రదర్శనమునందుఁ దన నేర్పుచూపి చక్రవర్తిమన్ననలు వడసి వీరకరవాలమును బహుమానముగాఁగైకొనిన రాజకుమారుఁడు నిజముగాఁ బురుషుఁడు గాఁడనియు గణపతి దేవచక్రవర్తి కుమార్తెయగు రుద్రమదేవియే పురుషవేషముతో నట్లు ప్రవర్తించుచుండెననియుఁ దెలిసికొని రాజ్యమునందలి ప్రజలందఱు మిగుల సంతోషించిరి. తమకుఁ జక్రవర్తి యనంతరము యోగ్యురాలైన మహారాజ్ఞి లభించుచున్నదిగదాయని యొక విధమైన సంతోషము వారల యంతరంగముల నుప్పొంగు చుండెను. తమ కాఁబోవు చక్రవర్తినిని గాంచినప్పుడెల్లజనుల వదనములు నిరతి శయా నందముతోఁ బ్రపుల్లము లగుచుండెను. కాని యిరువురకు మాత్రము రుద్రమదేవి వీర విహారము సంతోషదాయకముగాలేదు.
    మురారియు హరిహరుఁడును నా యమ్మపేరు విన్ననులికిపడుచుండిరి. మునుముందు సామ్రాజ్యమున కంతయు నామెయే యుత్తరాధికారిణియగు నన్నమాట వారేమాత్రమును సహింపఁజాలకుండిరి. ప్రజాముఖముల నామెస్తుతి పాఠములు విన్నప్పుడెల్ల నీర్ష్యతో ద్వేషముతో వారి హృదయములు దహించుకొని పోవుచుండెను.
    కాకతీయ గణపతిదేవచక్రవర్తికి నానాఁటికిఁ దన వీరపుత్రికారత్నముపై అనురాగము పెంపొందసాగెను. రుద్రమదేవి గుఱ్ఱముపై నెక్కి యరణ్యములకుఁ బోయి వేఁటాడ నేర్చినది. ఖడ్గచాలనమున నసమానపాండిత్యమును గడించినది. రాజకార్యములందు సంపూర్ణ విజ్ఞానమును సంపాదించినది. నానావిధములగు యుద్ధపద్ధతులను గ్రహించినది. సామదానభేద దండోపాయముల నాకళించుకొన్నది. కామందక కౌటిల్యాది రాజనీతి శాస్త్రములు పఠించినది. గణపతి దేవచక్రవర్తి కొలువు దీర్చినప్పుడెల్ల పురుషవేషదారిణియై రుద్రమదేవికూడ మహారాజుప్రక్క విరాజిల్లు చుండవలసినదే. ఆమెకొఱకుఁ బ్రత్యేకముగాఁ గొలువు కూటమున నొక సింహాసనము నిర్మింపఁబడినది. రాజకార్యములను బరుష్కరింపవలసివచ్చినప్పుడు రుద్రమదేవి లేనిదే సార్వభౌముఁడు కొలువుతీరెడివాఁడు కాఁడు.
    కాలము గడిచినకొలఁది రుద్రమదేవి రాజ్యపరిపాలనమున కావశ్యకములైన విద్యల నన్నింటిని నేర్చినది. తండ్రితో ననేక యుద్ధ రంగములకుఁ దానుకూడ నేఁగి రాజనీతిని, సమరనైపుణ్యమును ప్రత్యక్ష ప్రమాణములతో నేర్చుకొనినది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra