యాదగిరి మాటలు కూడా వాడిలో ఎలాంటి చలనం కలిగించలేదు.
"నాకేం? నేను కాలేజీలో చేరతా? నాకు చదవాలని ఉంది" అన్నాడు మళ్ళా మొండిగా.
శంకర్రావ్ కి కోపం వచ్చింది.
"అరె నీయవ్వ- మళ్ళీ అదేమాట మాట్లాడతావు? చదువులేనోళ్ళు ఎంత మంచిగా బ్రతుకుతున్నారో చూసి కూడా బుద్ధి తెచ్చుకోవేరా?" అంటూ రెండు వేసేసరికి రంగారెడ్డి అతనికి అడ్డు వెళ్ళాడు.
"ఒరే రమణా! మనదేశ చరిత్రంతా ఓసారి చూడరా! 'కింగ్ మేకర్' అని పేరున్న కామరాజ్ నాడార్ ఏం చదివాడ్రా? అతనికి రాయటం, చదవటం రెండూ రావ్ కదరా! అయినా రాజుల జాతకాలు రాశాడు. అవునా? అందాకా ఎందుకు? మన ఎక్స్ చీఫ్ మినిష్టర్ అంజయ్య నీలాగా చదువుకునివుంటే చీఫ్ మినిష్టర్ అయ్యేవాడా? మన రాష్ట్రాన్ని మిగతా చదువుకున్న చీఫ్ మినిష్టర్లకంటే బాగా పరిపాలించ గలిగేవాడా? మన కాలనీలో ప్రెసిడెంట్ మెడల్ సంపాదించిన ఇంజనీర్ ఏం చేస్తున్నాడు? వేలిముద్రలు వేసే కాంట్రాక్టర్ కింద రోజు కూలీ లెక్కన పనిచేస్తున్నాడు కదా" ఏకధాటిగా స్పీచ్ ఇచ్చాడు.
"అందాకా ఎందుకురా! నువ్వు చదివిన స్కూల్స్, కాలేజీలు ఎవరివనుకున్నావ్? ఒకటో క్లాస్ గూడా చదవని సారా కాంట్రాక్టర్ వి! మరి వాడి కిందే ఎమ్.ఏ. పిహెచ్ డీలూ, ఎమ్మెస్సీ బి.ఇ.డీలూ, ఎమ్. కాం.లూ పనిచేస్తున్నారా లేదా? నువ్వు ఎగబడి చూసే సినిమా డైరెక్టర్లూ, ప్రొడ్యూసర్లూ ఎంతమంది చదువుకున్నారనీ? మనదేశం మొత్తం మీద ఎమ్మెల్యేలు, ఎం.పీ.లలో అక్షరం ముక్కరాని వాళ్ళే ఎక్కువమంది ఉన్నారన్న విషయం తెలుసా నీకు? వాళ్ళు రకరకాల కమిటీలకు హెడ్స్ గా పనిచేస్తూ మనదేశ భవిష్యత్తుని నిర్ణయించటం లేదూ?" తనూ కల్పించుకుంటూ అన్నాడు గోపాల్రావ్.
"ఆ మాట కొస్తే చాలా పత్రికల ఎడిటర్లకూ, కొంతమంది తెలుగు రచయితలకూ ఒక్క లైన్ రాయటం కూడా రాదు. అయినా వాళ్ళను మన తెలుగు ప్రజలు పైకెత్తేసి జేజేలు కొట్టటం లేదూ? బాగా చదువుకుని ఉంటే పాపం వాళ్ళ గతేమయి ఉండేది?" అంది రాజేశ్వరి.

ఆ కుర్రాడు ఆలోచనలో పడ్డాడు.
"మా మాట వినరా బాబూ! గొప్ప గొప్ప వ్యాపారస్తులూ, లక్షాధికారులూ, కోటికి పడగలెత్తిన వారూ మెజారిటీ ఏబిసిడీలు రాని వారేరా! క్రిమినల్ 'ప్రొసీజర్' కోడ్ అనే లావుపాటి పుస్తకాలు చదివి సమాజంలోని రుగ్మతలన్నీ అదుపులో పెట్టాల్సిన పోలీసుల్లో నూటికి డెబ్బైమంది చదువురాని వారేరా! ఎవరిక్కావాల్రా చదువు?" అంది వాళ్ళమ్మ.
"వాటి సంగతలా వుండనీ! నువ్ చదువులేని వాడవయితే మన ప్రభుత్వం నీకు ఎన్ని రకాల రాయితీ లిస్తుందో ఒక్కసారి చూడు! జనార్ధన్ పూజారి స్కీం ప్రకారం చదువూ సంధ్యా లేకుండా పనిపాటా చేయని వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం అయిదువేలు ఉచిత లోన్ దొరుకుతుంది. ప్రతి బాంక్ లోనూ రకరకాల మారుపేర్లతో ఎన్నో వందలసార్లు లోన్లు తీసుకుని ఎగ్గొట్టవచ్చు! నీలాంటి వాళ్ళందరికీ గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకునే హక్కు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే అలాంటి స్థలాలు సంవత్సరానికి ఒకటి ఆక్రమించుకుని పట్టా దొరగ్గానే అమ్మేసుకుని డబ్బు చేసుకోవచ్చు. ఇదికాక బలహీనవర్గం అని చెప్తే సంవత్సరానికో ఇల్లు కూడా ప్రభుత్వం నీకిస్తుంది. అదీ అమ్మేసుకోవచ్చు. ఇదీగాక నీ ఓటుని అన్నిరకాల ఎలక్షన్ లకూ కలిపి అయిదేళ్ళకు టోకున ఏ పదివేలకో ఏదో ఒక పార్టీకి అమ్మేసుకోవచ్చు" చెప్పాడు రంగారెడ్డి.
"ఇప్పుడు నెహ్రూ రోజ్ గార్ యోజన స్కీమ్ లో ఇంకెంత డబ్బు ముడుతుందో తెలీదు. ఎలక్షన్లలోగానే ఎన్టీర్ రోజ్ గార్ స్కీమ్ ఒకటి ప్రవేశపెడితే ఇంక నీకు డబ్బుకేం కొదవ చెప్పు!" నచ్చజెప్పసాగాడు గోపాల్రావ్.
"గ్రీన్ కార్డ్ హోల్డర్ వయితే నీకెన్ని సౌకర్యాలుంటాయో తెలుసా? నిజామ్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ లాంటి అతి ఖరీదయిన ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం, కిలో రెండ్రూపాయల బియ్యం, అతి చౌకగా బట్టలు- ఇంతకంటే ఇంకేం కావాల్రా నీకు?" అన్నాడు రంగారెడ్డి.
వాడిలో సంచలనం కలిగింది.
"మీరు చెప్పింది నిజమేననుకో" అన్నాడు నెమ్మదిగా.
అందరికీ ఒక్కసారిగా నెత్తిమీద బరువు దింపినంత సంబరమయింది.
శంకర్రావు కొడుకుని కౌగిలించుకున్నాడు.
"ఎంత మంచివాడివిరా నువ్వు? ఎంత త్వరగా అర్థం చేసుకున్నావు?" అన్నాడు ఆనందభాష్పాలు రాలుస్తూ.
"కానీ నాకు పెద్ద పదవుల్లోకెళ్ళే ఛాన్స్ పోతుంది కదా అంకుల్?" రంగారెడ్డినడిగాడు వాడు.
"ఏ పదవులు కావాలనుకుంటున్నావ్ నువ్వు?"
"ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. లాంటివి"
అందరూ ఘొల్లున నవ్వారు.
"పిచ్చివాడా! ఆ పదవులన్నిటికన్నా పై పదవిని చాలా తేలిగ్గా ఎలాంటి చదువూ లేకుండా సంపాదించవచ్చురా?" అన్నాడు రంగారెడ్డి.
"ఎలా?"
"ఎలాగేముంది? రాజకీయ నాయకులకు పాదాభివందనం చేస్తే చాలు! నాలుగయిదేళ్ళు అలా శ్రమపడ్డావంటే పెద్ద పదవి తప్పదు- న్యూస్ పేపర్లలో ఆ ఫోటోలు చూడలే నువ్వు?"
రమణ మొఖంలో చిరునవ్వు కనిపించింది.
"అయితే సరే! నేను కాలేజీలో చేరను డాడీ!" అన్నాడు నిర్ణయించుకున్నట్టు. శంకరయ్య, అతని భార్య, రమణను ఆనందంగా ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మేమంతా కూడా తేలికయిన హృదయాలతో ఎవరిళ్ళకు వాళ్ళు బయల్దేరాం.
* * * * *


