వచ్చిన యాదవులలో నొక వృద్దుఁడు కొంచెము ముందుకు వచ్చి మరల నిట్లు ప్రారంభించెను. 'దొరా! ఈ సంవత్సరము మా రాజ్యములో బొత్తిగా వర్షములు గురియలేదు. మాపంట పైరులు మలమల మాడిపోయినవి. మాకు తిండి గింజలు లేవు సరి కదా మా పశువులకు మేఁతయును శూన్యమైపోయినది. కాటకముచే కనిగిరిసీమయంతయును గగ్గోలు పడుచున్నది. కడుపులు మాఁడి మా గోగణములు కుప్పలు కుప్పలుగాఁ కూలి నశించిపోవుచున్నవి. మీ చిత్తము మా భాగ్య" మని పలుకుచు నాతఁడు మరలమరలఁ జేతులు పైకెత్తి మహారాజునకు నమస్కరించెను. గోపాలకులందఱు నొక్కమాటుగా "మమ్ములను మా పశువులను రక్షించండి బాబూ" అని మ్రొక్కిరి. ఖడ్గతిక్కన యొక్క ప్రక్కఁ గూర్చుండి యిది యంతయును గమనించుచునే యుండెను.
మహారాజు చేసన్నతో మిన్నకుండుఁడని యాదవులను వారించి వృద్ద గోపాలునితో "ఒయీ! ఐన, మీ యుద్దేశమేమి? మీరు మావలన నెట్టి సాయమును గోరుచున్నారో స్పష్టముగాఁ బలుకుఁ"డని వచించెను. మరల నా యాదవ వృద్దుఁడీ విధముగా మనవి చేసికొనసాగెను. సామీ! ఏమి తమ యదృష్టము౧ పచ్చలేఁబచ్చికతోఁ గళకళలాడు దేవరవారి పొలములు కన్నుల పండువుగాఁ గానవచ్చు చున్నవి. తమ పంట పైరులు తమ మహాభాగ్యమును వేనోళ్ళఁ జాటుచున్నవి. ఈ సంవత్సరమునకు మా పశువులకు మేఁత కొరకై కొన్ని పచ్చిక బీళ్ళు మాకు గుత్తకీయవలెనని వేడుకోనుచున్నాము. అందుక్రింద తమరు నిర్ణయించిన పుల్లరిని మేము చెల్లించుకొందుము. ఈ కష్టసమయమున మమ్ము మా పశువులను గాపాడుఁడని మా మహారాజుగారు తమతో మరిమరి విన్నవించుకొన్నట్లు చెప్పమన్నారు. తర్వాత తమ చిత్త",మని యా యాదవ వృద్దుఁడు మూఁడు పర్యాయములు నేలకువంగి నమస్కారములు గావించెను.
మునుమసిద్ది మహీనాదుఁడు స్వభావసిద్దముగ దయార్ద్ర హృదయుఁడు. ఆగర్భశత్రువులైనను యాదవులు కాటుకముచే బాధపడుచు'న్నారని విన్నయంతనే యాయన హృదయము కరఁగేను. వారు గోవులు మేపుకోనుటకై తన రాజ్యము నందని పచ్చిక బీళ్ల నోసంగుటకు నాయన హృదయ మంగీకరించెను. మునుమసిద్దిమహారాజు భావమును గ్రహించిన తిక్కనామాత్యుఁడు కాదనలేకపోయెను.
కాని ఖడ్గతిక్కన కిది యెంతమాత్రము భరింపరాని విషయమయ్యేను. కాటమరాజు స్వభావ మాతఁడు బాగుగనెఱుగును. ఇందులో నేదో మోసముకలదని యాతఁడు హించెను. వెంటనే మహారాజున కభిముఖుడై "నృపాల శేఖరా! మనము పెక్కు దినములనుండియు కాటమరాజు స్వభావము నేరుంఁగుదుము. అతఁడిట్లయిన మనపైఁ బగదీర్చుకొనవలయునని వేచి యున్నాఁడు. నేఁడు కష్టము వచ్చినది గనుక కాళ్లబేరమునకు దిగినాఁడు. "యేరుదాఁటిన వెనుక దెప్పగాల్చు" వారలను మనము విశ్వసించి మన రాక్యములో వారికిఁ జోటిచ్చుట కోరవితో దలగోఁకు కొనుటవంటిది. ఈ విషయమున దేవరవారు దూరమాలోచించి కర్తవ్యమును నిర్ణయింపవలయునని కోరుచున్నా"నని పలికి కూర్చుండేను యాదవుల ముఖములు వెల వెలఁబోయినవి. ఇంకఁ దమకు సింహపురిసీమలో నడుగు పెట్టునవకాశము లేదని వారు తలంచిరి.
కవితిక్కనయు నీ విషయమునఁ దీవ్రముగా నాలోచించెను. కఱవు కాటకములలో నున్న వారికి సహాయము చేయుటయే ధర్మమని తుదకొక నిర్ణయమునకు వచ్చెను. అందును గోగణరక్షణ మవశ్యకర్తవ్యముగా నాయనకుఁ దోఁచెను. చిట్టచివరకు మహారాజుతో నాలోచించి పుల్లరి పుచ్చుకొని భూము లిచ్చుటకే నిశ్చయించెను. కొన్ని బీళ్లను గొంతకాలము వరకు యాదవులకు కవులున కిచ్చునట్లును, అందులకు గాను పుల్లరి క్రిందఁ గాటమరాజు వేయివరాలు మనుమసిద్దిమహారాజునకు గడువుదాఁకుండ చెల్లించునట్లును పరస్పరము 'ఒప్పందము' చేసికొనిరి.
యాదవులు సంతోషముతో గంతులు వైచుచుఁదమ వచ్చిన కార్యము నెరవేఱినందుకు బోలేరమ్మకును, పోతురాజునకును వందనములు సమర్పించుచుఁ గనిగిరిసీమకు బరుగు బరుగున బోయి కాటమరాజున కిదియంతయుఁ దెలియఁబఱిచిరి. కాటమరాజందుల కిష్టపడిన తరువాత కనిగిరి సీమ యందలి గోబృదములను తోలుకుని యాదవులందరు సింహపురాజ్యమునందుఁ బ్రవేశించి తాము గుత్తకు తీసుకొన్న పచ్చిక బీళ్ళలో మేపుకొనసాగిరి. చిక్కి యెముకలు బయటపడియున్న గోవులన్నీయుఁ గొలఁదికాలములోనే కండపట్టి కామధేనువులయ్యెను. కోడెదూడలు నంది వాహనముల వలె బలిసి రంకేలు వేయసాగెను. పగలెల్ల పచ్చిక మేసి పెన్నానదిలో మధురజలమ్మును ద్రావి కనిగిరి పశువులు కళకళలాడుచు కనుల పండువు గావించుచుండెను.
గడువు సమీపించింది. పశువులను మ్రేపుకోనుటయే గాని పుల్లరి క్రింద నీయవలసిన ధనము మాట కనిగిరి యాదవులకు జ్ఞాపకమే లేకపోయెను. మనుమసిద్దిమహారాజు సేవకులను పంపి తమ కీయవలసిన ధనమును వెంటనే చెల్లింపవలయునని యాదవులకు వర్తమానము చేసెను. కాని వారు సైనికుల మాటలను పెడ చెవిన పెట్టిరి. బలవంతముచేయుపరిస్థితిరాఁగా, చివరకు రెండు మూఁడు దినములలో నీయవలసిన పుల్లరి పైకమునంతయు నిత్తుమని చెప్పియప్పటికిఁ దప్పుకోనిరి. అనంతర మొకరాత్రి దొంగతనముగాఁ బశువులను దోలుకొని తమ రాజధాని వెడలిపోయిరి.
తమ బీళ్లలో సంవత్సరమంతయుఁ బశువులను మెపుకొని చివరకుఁ దమ కీయ నిర్ణయించుకొన్న ధనమును చెల్లింపకుండ మోసము చేసి యాదవులు గోవులను దోలుకొని కనిగిరిసీమకు జనినారనువార్త వినినంతనే మనుమసిద్ది మహారాజునకు మిక్కిలి యాగ్రహము కలిగెను. అతఁడు వెంటనే యఖండసేనామేతుఁడైకనిగిరి సేమపై దండెత్తి యాదవుల గర్వభంగము గావింపదలఁచెను గాని తిక్కనామాత్యుఁడు దూరదృస్టితో నాలోచించి రాజుతో నిట్లు పలికెను.
"మహారాజా! కాటమారాజిట్టి మోసము చేయునని నేను మొదటనే యూహించితిని. కాని శరణాగతరక్షణ బిరుదాంకితులగు మీ సంకల్పమును గాదనజాలకపోయితిని. కష్టము కలిగినప్పుడు వచ్చి మన పాదములు పట్టుకొన్నారు యాదవులు .వర్షములు కురిసి భూమి పచ్చ పడఁగానే మన పుల్లరి సైత మేగఁగొట్టి పశువులను దోలుకొనిపోయినారు. చూచితిరా వారి దుర్మార్గము! దీని కంతటికీఁ గాటమరాజు ప్రోత్సాహమే కారణము. అయినను తోలుదొల్తనే కయ్యమునకుఁ గడంగుట క్షత్రియధర్మము గాదు. సాధ్యమయినంత వరకు సామోపాయముచేతనే కార్యమును సాధింపవలయునని నా యుద్దేశము. యాదవులు చేసిన యపరాధమును గాటమరాజున కెరుకపరిచి న్యాయముగా మనకు రావలసిన ధనమును చెల్లింపమని కాటమరాజు నొద్ద కొక రాయబారి పంపుదము. సక్రమముగా నిచ్చెనాసరే, యక్రమమునకు వచ్చేనా పరాక్రమమే ప్రయోగింతము."


