మాకెవరికి కొద్దిసేపటివరకూ నోట మాట రాలేదు.
చివరకు రంగారెడ్డి కోలుకుని మాట్లాడాడు.
"మరి కళల్లో ప్రావీణ్యత గలవారు కావాలంటే మమ్మల్ని సెలక్ట్ చేశారేమిటి మీరు?"
"ఇదిగో మిమ్మల్ని మీరలా కించపరచుకోకండయ్యా! ఒకాయనకు ఆరోక్లాస్ చదువుతున్నప్పుడు డ్రాయింగులో తాబేలు బొమ్మకు తొంభయ్ మార్కులొచ్చాయ్! అలా అలా ఆయన ఇప్పుడు ఆంధ్రదేశంలోని చిత్రకారుల్లో ప్రముఖుడయ్యాడు."
శాయిరామ్ కంగారుపడ్డాడు.
"అదేమిటి? ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకూ బొమ్మే వేయలేదు. ఓసారి మళ్ళీ తాబేలు గీయబోయాను గాని అది ఎలుకలాగా కనిపించేసరికి మానుకున్నాను. మరి నేను ఆంధ్రదేశంలో ప్రముఖ చిత్రకారుడినని ఎలా చెప్తాము."
"అబ్బా! నిజంగా నువు ప్రముఖ చిత్రకారుడివి అవ్వక్కర్లేదయ్యా! ఆ పేరుతో వెళ్తావ్ అంతవరకే."
"కానీ తీరా అక్కడికెళ్ళాక నేను కాకిబొమ్మ కూడా గీయలేనని తెలుస్తే."
"చట్! ఊరుకోవయ్యా! వెధవనుమానాలూ నువ్వూనూ! పాపం వాళ్ళసలే ప్రవాసాంధ్రులు! ఇక్కడ ఎవడు గొప్ప చిత్రకారుడో, ఎవతె అద్భుతమయిన నాట్యగత్తో, ఎవడు సంగీత విద్వాంసుడో, ఎవడు ఉత్తమ నటుడో అవేమీ వారికి కొంచెం కూడా తెలీదు.
నేను ఎవడి గురించి ఏం ఇంట్రడక్షన్ ఇస్తే అదే వేదవాక్కు వాళ్ళకు! పాపం అప్పుడప్పుడూ వాళ్ళను చూస్తే నాకు జాలిగా కూడా ఉంటుందనుకో! ఎందుకంటే అమెరికాలాంటి దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మన తెలుగు డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారస్తులు, ఇంకా అనేక ఇతరవృత్తుల వాళ్ళను నేను ఇట్టే బోల్తా కొట్టిస్తున్నానే అని గిల్టీగా కూడా ఉంటుంది. కానీ ఏం చేస్తాం? తప్పదు! బిజినెస్ ఈజె బిజినెస్! వ్యాపారం అన్నాక మోసం తప్పదు కదా? ఏమంటారు?" వేదాంత ధోరణిలో అన్నాడు.
"అవునవును" వప్పుకున్నాడు జనార్ధన్.
"ఆ! ఎందాక వచ్చాం! తాబేలు బొమ్మ వేసినవాడిని ప్రస్తుతం ఆంధ్రదేశంలో ప్రముఖ చిత్రకారుడు అంటాం. ఇకపోతే, కాలేజ్ సంగీత పోటీల్లో "రాయబారం చేయవే తడికో తడికా" అని పాటపాడిన వాడెవడు?"
"నేను" అన్నాడు రంగారెడ్డి.
"ఆ! చూడు బ్రదర్! నువ్వు ప్రస్తుతం రేడియోలోనూ, టీవీలోనూ తెలుగుదేశాన్ని ఊపేస్తోన్న మధుర ఏకైక గాయకుడివి! నీకు తెలుగు ప్రజలంతా కలసి "గాన రాక్షస" అనే బిరుదు ఇచ్చారు."
రంగారెడ్డి భయపడిపోయాడు.
"అయ్యా నా వల్ల కాద్సార్! నన్నక్కడ స్టేజి ఎక్కించి పాడమంటే నా గతేంకాను? అతను చిరాకుపడ్డాడు.
"వినేది ప్రవాసాంధ్రులయితే మధ్యలో నీకు భయమెందుకయ్యా? వాళ్ళ చావు వాళ్ళు ఛస్తారు! నువ్వు నీకిష్టమొచ్చిన పాటలు ఓ అరడజను నేర్చుకుని పాడెయ్! కావాలంటే రేపట్నుంచే ప్రాక్టీస్ ప్రారంభించు. తరువాత జనార్ధన్ గారెలాగూ సినిమా నటుడు. ఆయన నటించిన చిత్రాల్లో కొన్ని దృశ్యాలు ప్రవాసాంధ్రులకు స్టేజిమీద ప్రదర్శిస్తారు. ఇకపోతే యాదగిరి! ఇద్దరూ కూడా సినిమా నటులే కానీ ఒకే బాచ్ లో వుండటం బాగుండదు. అందుకు మీరు సినిమా డైరెక్టర్ నని చెప్పండి!"
యాదగిరి మొఖంలో ఆనందం కనిపించింది.
"అంటే అక్కడేం చేయాలి నేను?"
"ఏముందీ? స్టేజి ఎక్కిస్తారు వాళ్ళు. అక్కడ మీరు తీసిన సినిమా అనుభవాలు అంటే ఏవో కొన్ని అబద్ధాలు కల్పించి చెప్తారన్న మాట సరేనా?"
"ఓ! అలాంటి మిమిక్రీ మనకు కొట్టినపిండి!" ఉత్సాహంగా అన్నాడతను.
"ఇక గోపాల్రావు సంగతి సరేసరి! మాజిక్ ప్రదర్శన ఓ అరగంట సేపు ఇచ్చేయవచ్చు" గోపాల్రావు అదిరిపడ్డాడు.
"ఏమిటి? నేను మాజిక్ చెయ్యాలా? నా వల్ల కాదండి! నేను అమెరికా వెళ్ళనసలు"
బ్రోకర్ నవ్వాడు.
"అరె! ఇంత పిరికివాళ్లేమిటండీ బాబూ ఈ కాలనీలో! అరగంట సేపు మాజిక్ చేయమంటే పారిపోతాడేమిటాయన?"
"ఎలా చేస్తానండీ! నాకసలేమీ రాదని చెప్పాను కదా?"
"వస్తే నిన్నెందుకు పంపిస్తామయ్యా మేము? భలేగున్నావే! మనమేం ప్రవాసాంధ్రుల కోసమే బ్రతుకుతున్నట్లు మాట్లాడతావేమిటి? వాళ్ళ అమాయకత్వాన్ని నేను కాష్ చేసుకుంటాను. మీరేమో విదేశాలు వాళ్ళ ఖర్చు మీద చూడడం ద్వారా మీ సరదాలు తీర్చుకుంటున్నారు. అంతే! అంచేత వారం రోజుల్లో మాజిక్ నేర్చుకోవటం ఎలా అనే పుస్తకం కొనుక్కో! లేదా మన ఫేమస్ మెజీషియన్ షాడో దగ్గరకెళ్ళి షార్ట్ టరామ్ కోర్స్ నేర్చుకో! అయిందా? ఇంక పార్వతీదేవి గారూ! మీకు ముగ్గువేయటం హాబీ అన్నారు కదూ! మీరో పని చేయండి! ఓ అరగంట భరతనాట్యం చేయండి! మిమ్మల్ని ప్రఖ్యాత భరతనాట్య ప్రవీణురాలు శ్రీమతి పార్వతీదేవి అని వాళ్ళకు పరిచయం చేస్తాం."
పార్వతీదేవి విరగబడి నవ్వేసింది.
"బాగుందండీ జోకు"
బ్రోకర్ తృళ్ళిపడ్డాడు.
"జోకా? జోకేమిటండీ! నాకు జోకులేసుకుంటూ తిరగటమే పననుకున్నారేమిటి?" అన్నాడు కోపంగా.
"అంటే? నిజంగానే నన్ను భరతనాట్య ప్రదర్శన ఇమ్మంటున్నారా?" నమ్మలేనట్లు అడిగిందామె.
"అవునమ్మా! నిజంగానే ఇవ్వాలి!"
"మీకు పిచ్చేమయినా ఎక్కిందా ఏమిటి? నాకసలు సరిగ్గా నడవడం కూడా రాదని మావారు ఆటలు పట్టిస్తుంటారు. మీరేమో..."
"అబ్బా- మీరేం డాన్స్ పోటీలకెళ్తున్నారా? ప్రవాసాంధ్రుల కిచ్చే డాన్స్ ప్రోగ్ర్రాంకి కూడా డాన్స్ చేయటం రావాలా ఏమిటి? మీరలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన్లేమీ పెట్టుకోకండి! పోనీ వాళ్ళు తప్పట్లు కొట్టాలని అంతగా కోరికగా వుంటే మూర్ఛ వచ్చినవాడినెవ్వర్నయినా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి! ఆ రకంగా కాళ్ళూ చేతులూ కొట్టుకుంటే చాలు! కొంచెం కాలు బెణికిందనీ అంచేత నృత్యం అనుకున్నంత అద్భుతంగా చేయలేకపోయాననీ ఓ మాట చెప్పేస్తే సంతోషపడిపోతారు వాళ్ళు. చాలా అల్ప సంతోషులు పాపం వాళ్ళు."
పార్వతీదేవి నోట మాట రావటం లేదు.
"ఇంక నువ్వమ్మా రాజేశ్వరీ! నువ్వు డిటెక్టివ్ నవలలు రాస్తానన్నావు కదూ! డిటెక్టివ్ అన్న ముక్క వదిలేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ని ఉర్రూతలూగిస్తోన్న ప్రఖ్యాత రచయిత్రి రాజేశ్వరి అని పరిచయం చేద్దాం! మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే నువ్వు రాసిన కొన్ని ఇటీవలి నవలలు గురించి ఓ రిపోర్ట్ తయారుచేసి చదవటమే"
"ఓ! బ్రహ్మాండంగా చదివేస్తా" ఉత్సాహంగా అందామె.
"అంతేకాదు! కేవలం రచయిత్రి అయినంత మాత్రాన వాళ్ళకు అంత థ్రిల్ వుండదు కనుక మీరు క్లాసికల్ సింగర్ అని కూడా ప్రచారం చేస్తాం. మీరు ఓ అరగంట క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రాం ఇస్తే సరిపోతుంది. అది నాకు రాదు కదా అని అడక్కండి! బోలెడు టైముందు మీకు నేర్చుకోటానికి! నెల రోజుల వ్యవధి అంటే మాటలా?"
"అవును! పైగా గొంతు బాగోలేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు పాడినా ఎవరూ ఏమీ చేయలేరు! కదూ?" మరింత ఉత్సాహంగా అందామె.
మా అందరి దగ్గరా తలో వందరూపాయలు తీసుకుని లేచి నిలబడ్డాడు బ్రోకరు.
"చూడండి! ఎవరు ఏ ఏ కళల్లో ప్రవీణులో ముందే చెప్పేశాను. తరువాత మళ్ళీ కన్ ఫ్యూజ్ అయి నన్ను కన్ ఫ్యూజ్ చేయకండి! నేను మళ్ళీ ఎల్లుండి మీ కాలనీ కొస్తాను. ఆ రోజు మీ అందరూ తలో మూడువేలూ అర్జెంటుగా ఎలా సంపాదించాలో అయిడియా ఇస్తాను. అంటే స్కీం నెంబర్ త్రీ అన్నమాట! వస్తా"


