అందరికీ ఆశ ఎక్కువయిపోయింది.
"అయితే మేము ఎంత ఖర్చు పెట్టాలంటారు?"
"ఎంతో లేదు బ్రదర్! ముందు అందరూ తలో వందా నాకివ్వాలి. నేను ఆ డబ్బుతో విదేశీయాత్ర కెళ్ళవలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను అప్పుడు ఒకవేపు విమానం టికెట్ కి మాత్రం డబ్బు మీరే కట్టుకోవాలి! అదిగాక నాకు తలో వెయ్యీ ఇస్తే చాలు. అద్భుత విదేశీయాత్ర!" ఊరిస్తూ చెప్పాడు.
మా గుండెల్లోరాయి పడినట్లయింది.
"మైగాడ్! అంత దబ్బె! అంత డబ్బు మా దగ్గరెక్కడిది?" గాబరాగా అడిగాడు రంగారెడ్డి.
అతను చిరునవ్వు నవ్వాడు.
"అలా కంగారుపడితే ఎలా బ్రదర్స్! ఒకవేళ ఆ మూడువేల రూపాయలు కూడా మీరు పెట్టుకోలేకపోతే స్కీం నెంబర్ త్రీ ఉంది. అది ఫాలో అయిపోండి! నేను గైడ్ చేస్తాను.
"స్కీం నెంబర్ త్రీ అంటే ఏమిటండీ?" వినయంగా అడిగాడు గోపాల్రావ్.
"ఆ మాత్రం తెలీదా. మీ ఏరియాలో శంకర్ దాదా శిష్యుడు గుడుంబా నర్సింహ లేడా? అతనిని స్కీం నెంబర్ త్రీ తోనే పంపించాను. సరే దాని సంగతి తర్వాత చెప్తాను ముందు మీ కమిటీ మెంబర్లందరినీ ఫస్ట్ బాచ్ గా తయారుచేసి సింగపూర్, మలేషియా పంపిస్తాను. ఆ తరువాత ఇతర దేశాలు- అలా జీవితాంతం రెండు మూడు నెలల గాప్ లో ప్రపంచమంతా తిరిగిరావచ్చు. ఎలా వుంది మన స్కీం?" సగర్వంగా అడిగాడు.
అందరూ ఓసారి మొఖాలు చూసుకున్నారు.
"బాగానే వున్నట్లుంది! ఇంతకూ అసలా స్కీం నెంబర్ త్రీ అంటే ఏమిటి?" గొణిగాడు శాయిరామ్.
"వస్తున్నా! మీ ఎనిమిది మందిలో ఎవరికయినా లలితకళలలో ప్రవేశం ఉందా?"
"అలాంటిదేమీ లేదు"
అతని మొఖంలో కోపం కనిపించింది.
"లేకుండా ఎలా ఉంటుందండీ! మనిషన్నాక ఏదొక కళలో అభిరుచి ఉండాలి- ఉంటుంది! కనీసం కాలేజీలో చదువుకునే రోజుల్లోనయినా 'హాబీ' లాంటిదేదయినా ఉండాలిగా"
"ఓ! అదా! అలా అయితే ఉన్నాయండీ! నాకు చిన్నప్పుడు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టంగా ఉండేది. తెలుగు వాచకంలో తాబేలు బొమ్మను చూసి అచ్చం అలాగే డ్రాయింగ్ బుక్ లో దించేసరికి మా డ్రాయింగ్ టీచర్ డంగైపోయాడు. నూటికి తొంభయ్ మార్కులు వేసేశాడు!" ఆనందంగా చెప్పాడు శాయిరామ్.
"నేను ఇంటర్ చదివేప్పుడు లలిత సంగీత పోటీలు జరిగాయ్. అందులో "రాయబారం చేయవే తడికో తడికా" అనే పాట పాడాను. బహుమతేమీ రాలేదు గానీ అందరూ భలే మెచ్చుకున్నారు" చెప్పాడు రంగారెడ్డి.
"నేను స్టేజ్ మీద మంచిగ యాక్షన్ జెయ్యాలని జబర్దస్త్ ఖాయిషుండెనన్నా! ఎవ్వళ్ళూ ఛాన్స్ గిట్ట ఇవ్వలేగానీ ఇప్పటి గ్గూడ యాక్షన్ చెయ్యాల్ననే ఉన్నది. జనార్ధన్ అన్నతో- సినిమాలో చిన్న వేషం వేసినా గానీ అది ఎడిటింగ్ లో కట్ జేసేసిన్రు బాడ్ కవ్ లు" చెప్పాడు యాదగిరి.
"నా సంగతి మీకు ఇదివరకే తెలిసి ఉంటుంది" అన్నాడు జనార్ధన్ క్రాఫ్ సర్దుకుంటూ బ్రోకర్ తో.
"నాకేమీ తెలీదే?" ఆశ్చర్యంగా అన్నాడు బ్రోకర్.
"జనార్ధన్ హెయిర్ స్టయిల్ ఇంకోసారి సర్దుకుని "ఇప్పుడు చూడండి! గుర్తుపట్టారా?"
"నాకేం అర్థం కావటం లేదు. సంగతేమిటో త్వరగా చెప్పండి" చిరాగ్గా అన్నాడు బ్రోకర్.
"నేను కొన్ని సినిమాల్లో హీరోగా చేశానండీ"
"అలాగా?"
"మీరు సినిమాలు చూడరా?"
"ఒక్క సినిమా కూడా వదలకుండా చూస్తాను. మీరెందులోనూ కనిపించినట్లు గుర్తులేదే! ఒకే ఒక్క సినిమా మాత్రం మిస్సయ్యాను. ఎందుకంటే ఫస్ట్ డే మాట్నీకి రిజర్వ్ చేసుకున్నాను. ఆ నాకొడుకులేమో మాణింగ్ షోతో సినిమా ఎత్తేశారు" చిరాగ్గా అన్నాడు బ్రోకర్.
"ఆ! అదే! అదే నేను జనార్ధనన్నా యాక్ట్ చేసిన పిక్చరు" సంబరంగా అన్నాడు యాదగిరి.
"మిగతా సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు" అన్నాడు జనార్ధన్.
"మీ సంగతేమిటి గోపాల్రావ్ గారూ? మా హాబీ ఏమిటి?"
"ఏమీలేదే" ఆలోచిస్తూ అన్నాడు గోపాల్రావ్.
"లేకపోవటమేమిటి? ఏదో ఉండే ఉంటుంది! సరిగ్గా గుర్తు తెచ్చుకోండి"
గోపాల్రావ్ రెండు నిముషాలు ఆలోచించాడు.
"ఆ! గుర్తుకొచ్చింది! టెన్త్ చదివేప్పుడు మా ఇంటి వెనుక గడ్డివాము దగ్గర చుట్టుపక్కల పిల్లలందరినీ కూర్చోబెట్టి మాజిక్ షో ఇచ్చాను. మాజిక్ అంటే చాలా ఇష్టం నాకప్పుడు."
అందరం ఆశ్చర్యంగా చూశాం గోపాల్రావ్ వేపు.
"అయితే నీకు మాజిక్ వచ్చా? మాకెవరికీ చెప్పలేదేం మరి?" ఆశ్చర్యంగా అడిగాడు శాయిరామ్.
"ఏడ్చినట్లుంది. ఆ రోజు నేను చేసిన ఒకే ఒక్క అయిటం కాస్తా ఫెయిలయింది. గుప్పిటలో పావలా కాయిన్ చూపించి కాసేపు చేయి గాలిలో తిప్పితే అర్ధరూపాయి కాయిన్ గా అయిపోవాలది. వాళ్ళందరూ నా చేతివేపు చూస్తూండడంతో కాయిన్ మారుస్తున్నప్పుడు దొరికిపోయాను"
"మరి మీ హాబీ ఏమిటమ్మా?" రాజేశ్వరిని చూస్తూ అడిగాడతను.
"నేను డిటెక్టివ్ రైటర్ని"
"ఒండర్ ఫుల్! ఎన్ని బుక్స్ రాశారు మీరు?"
"పదహారు నవలలు రాశాను గానీ ఒకే ఒక్కటి పబ్లిషయింది."
"ఏం ఫరవాలేదు. అది చాలు దున్నేయటానికి! మీ సంగతేమిటమ్మా?" పార్వతీదేవి నడిగాడతను.
"నాకు ముగ్గలేయటం హాబీ అండీ ఇంకేమీ రాదు."
"సూపర్బ్! అది చాలు!"
"కానీ ఇవన్నీ ఎందుకసలు?" అడిగాడు శాయిరామ్.
"ఎందుకేమిటయ్యా? ప్రవాసాంధ్ర అసోసియేషన్ లు మీకోసం అంతంత డబ్బు ఎందుకు ఇస్తున్నాయనుకున్నారు?" అడిగాడు బ్రోకరు.
"ఖచ్చితమయిన కారణం ఫలానా అని మాకు తెలీదుగానండీ, తెలుగు ప్రజల మీద ప్రేమతో జనాభా అందరినీ బాచ్ ల వారీగా వాళ్ళ దేశాలు పిలిపించుకుని చూద్దామని అలా చేస్తున్నారని అనుమానమండీ"
బ్రోకర్ మతిపోయినట్లు చూశాడు.
"ఇదిగో మీ అనుమానం సంగతేమో గానీ మా మాటలు వింటే నాకు మతిపోయేట్లుంది! అసలు సంగతేమిటో తెలుసా? పాపం ఆ విదేశాల్లో తెలుగు వాళ్ళు తెలుగు ప్రజలకూ, తెలుగు కళలకూ, తెలుగు సంస్కృతికీ దూరంగా ఉంటున్నారు కదా! అందుకని అన్ని రంగాల్లోనూ నిష్ణాతులయిన తెలుగు ప్రముఖులను వాళ్ళ దగ్గరకు పిలిపించుకుని వారి ప్రతిభను స్వయంగా తిలకించి ఆనందించాలని కోరిక! అందుకని అప్పుడప్పుడూ బోలెడు డబ్బు ఖర్చుచేసి ఇలా వివిధ కళల్లో ప్రావీణ్యం గల వారిని పిలిచేస్తుంటారు. ఇప్పుడర్థమయిందా?"


