"త్వరగా వెళ్ళి మా వాళ్ళందరినీ తీసుకురా! శాయిరామ్ కి అర్జంటుగా కంబళి పెరేడ్ చేయాలని చెప్పు! 'ఫారిన్ టూర్' అంటూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడు."
మా ఆవిడ గాబరాగా పరుగెత్తింది.
నేను బయటకొచ్చి శాయిరామ్ తో సంభాషణ ప్రారంభించాను.
"ఉహూ! అయితే మనందరం కలిసి ఫారిన్ టూర్ వెళ్ళవచ్చన్నమాట" అన్నాను చాలా ఆసక్తి కనబరుస్తూ.
"అవును! చాలా ఈజీ అనుకో! ఇంతకాలం మనకీ సంగతి తెలీక ఫారిన్ టూర్ అంటే అబ్బో- చాలా కష్టం అనుకున్నాం! వింత పిచ్చివాళ్ళమో చూడు! అహ్హహ్హహ్హ"
"అవును భలే పిచ్చివాళ్ళం అహ్హహ్హహ్హహ్హ"
"ఇప్పటికయినా నేను చొరవ తీసుకోబట్టి గానీ లేకపోతే జీవితాంతం మనం ఫారిన్ వెళ్ళకుండానే ఉండిపోయేవాళ్ళం. ఎంత దారుణమో చూడు."
"చాలా దారుణం. ఫారిన్ వెళ్ళని బ్రతుకూ ఓ బ్రతుకేనా? ఇప్పటికయినా ఫారిన్ వెళుతున్నాం కనుక బ్రతికి పోయాంగానీ లేకపోతే ఆ నిరాశ భరించలేక చచ్చేవాళ్ళం"
సరిగ్గా అప్పుడే రంగారెడ్డి, యాదగిరి, గోపాల్రావ్, జనార్ధన్, చంద్రకాంత్ ఛటోపాధ్యాయ్ కంబళీ తీసుకొచ్చేశారు వెనుకనుంచీ.
కానీ తీరా కంబళి మీద వేయబోయే సమయానికి గమనించి గట్టిగా అరుస్తూ పక్కకు దూకేశాడు శాయిరామ్.
"ఏమిటిది? నాకేం పిచ్చెక్కిందనుకున్నారా?" అన్నాడు గాబరాగా.
వాళ్ళందరూ నావేపు చూశారు.
"పిచ్చి అంటే మరీ పిచ్చికాదు గానీ, కొంచెం దాని "జలక్" అన్నమాట!" అన్నాన్నేను. అప్పటికే చుట్టుపక్కల ఆడాళ్ళందరూ బిందెలతో నీళ్ళు తీసుకొచ్చేశారు రెడీగా.
శాయిరామ్ మొఖం మాడిపోయింది.
"ఇదన్యాయం గురూ! సత్యన్నారాయణకు మెదడు కొంచెం చెదిరినప్పుడు ఈ కంబళి పెరేడ్ షాక్ ట్రీట్ మెంట్ గురించి చెప్పింది నేనే! ఇప్పుడు దాన్ని నా మీదే ప్రయోగిస్తారా?" కోపంగా అడిగాడు.
"మరి నువ్ కూడా ఫారిన్ టూర్ వెళ్ళిపోతున్నాం" అంటూ పిచ్చి మాటలు మాట్లాడావంట కదా?" అన్నాడు రంగారెడ్డి బెదురుగా.
శాయిరామ్ నావంక చూసి "హు!" అన్నాడు.
"అయితే నేను ఇందాకట్నుంచీ మాట్లాడుతున్నదంతా పిచ్చెక్కి మాట్లాడుతున్నానని అనుకుంటున్నావన్నమాట"
"ఎగ్జాట్ గా పిచ్చి అని కాదు గానీ మెదడు తాత్కాలికంగా చెదరటం లాంటిదని"
"హు!" అన్నాడు శాయిరామ్ మళ్ళీ. మాకు అతని మీద జాలివేసింది.
"అయితే ఇప్పుడు నార్మల్ అయిపోయినట్లే గదా! ఇంక 'ఫారిన్ టూర్' అనవు కదా!" అడిగాడు గోపాల్రావ్.
ఆ మాటతో మళ్ళీ కోపం వచ్చింది శాయిరామ్ కి.
"అరె! నిజంగానే చెప్తున్నా నయ్యా! మనందరం ఫారిన్ టూర్ వెళ్ళేందుకు ఓ మాంచి ఛాన్స్ దొరికింది. ఇంకాసేపట్లో అతనొస్తున్నాడు మన కాలనీకి! మనందరం రెడీగా ఉంటే అతనిని వివరాలన్నీ అడిగి ఆ ఏర్పాటు చేసుకోవచ్చు."
అందరం ఒకరి మొఖాలొకరు చూసుకున్నాం.
"ఎవరతను?" అడిగాడు జనార్ధన్.
"బ్రోకర్"
"ఏం బ్రోకరు?"
"అదే గురూ! విదేశాలు చూడాలనుకునే వారందరికీ అక్కడి తెలుగువారి ఖర్చుమీద ఆ దేశాలు టూర్ చేసే ఏర్పాట్లు చేస్తాడు. ఇప్పటికి పదకొండు వందల మందిని బోలెడు దేశాలకు పంపించాడు."
మాకు శాయిరామ్ మాటలు వివరంగా తెలీటం లేదు.
"ఆ దేశాల్లోని తెలుగువాళ్లు ఎందుకు అంత డబ్బు ఖర్చుపెట్టి మన రాష్ట్రంలో వారందరినీ పిలిపిస్తున్నట్లు?"
శాయిరామ్ బుర్ర గోక్కున్నాడు. అతనికి ఆ పాయింట్ అర్ధమయినట్లులేదు.
"ఇలాంటి దిక్కుమాలిన రాష్ట్రంలో ఉన్న మన తెలుగువాళ్ళందరి మొఖాలు ఓసారి చూడాలనిపించిందేమో" అన్నాడు అనుమానంగా.
మాకూ సరిగ్గా అదే అనుమానం వచ్చింది.
"అవునవును! ఇలాంటి కోరిక ప్రవాసాంధ్రులకు కలగటం చాలా సహజం" అన్నాడు రంగారెడ్డి కూడా వప్పుకుంటూ.
"ఇంతకూ బ్రోకర్ కి డబ్బెవరిచ్చు కుంటారు?" అడిగాడు జనార్ధన్.
"ఇంకెవరిస్తారు? మనమే!"
"మన మెందుకిస్తాం?"
"మనం ఇవ్వకపోతే ఇచ్చేవాళ్ళను పంపిస్తాడు. విదేశాలు చూడాలనుకునే వాళ్ళు తక్కువయితే కదా!"
అందరం అప్పటికి సమావేశం విరమించాం.
బ్రోకర్ వచ్చాక తిరిగి కాలనీ వేదిక దగ్గర సమావేశమవాలని నిర్ణయించుకున్నాం.
సరిగ్గా పదకొండవుతూండగానే బయటనుంచి శాయిరామ్ కేకలు వినిపించేసినయ్. నేను వెళ్ళేసరికే అందరూ ఓ అంబాసిడర్ కారు చుట్టూ మూగి ఉన్నారు. ఓ వ్యక్తి చాలా ఖరీదయిన దుస్తుల్లో కారు దిగి శాయిరామ్ ద్వారా అందరినీ పరిచయం చేసుకుంటున్నాడు.
"ఈయన చక్రధర్ గారు! జనాల్ని పోగుచేసి విదేశాలు పంపించటంలో ఈయనదే రికార్డ్ ఇంతవరకూ మొత్తం పదకొండొందల మందిని పంపారట" పరిచయం చేశాడు శాయిరామ్.
అందరం నమస్కరించాం వినయంగా.
అతనిని వేదిక మధ్యలో కూర్చోబెట్టి అందరం చుట్టూ మూగాం.
"మీలో ఎంతమంది ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నారు?" తన చేతిలోని ఫైల్స్ ఓపెన్ చేస్తూ అడిగాడు బ్రోకర్.
"మా కమిటీ మెంబర్స్ అందరం వెళ్ళాలనుకుంటున్నామండీ" అన్నాడు శాయిరామ్ బెరుగ్గా.
"అంటే ఎంతమంది?"
"మొత్తం ఎనిమిదిమందండీ."
ఆ మాటతో మా వెనుకే నిలబడ్డ రాజేశ్వరి, సావిత్రమ్మ గారూ, రజనీదేవి కయ్యిన లేచారు.
"కమిటీ మెంబర్సేనేమిటి? మేమూ ఫారిన్ వెళ్తాం! మేము మాత్రం ఎందుకెళ్ళకూడదు?" కోపంగా అంది రాజేశ్వరి.
బ్రోకర్ చిరునవ్వు నవ్వాడు.
"ఓ ఎవరయినా వెళ్ళవచ్చమ్మా ఎంతమందయినా వెళ్ళవచ్చు! ఏ దేశమయినా వెళ్లవచ్చు! ఏం ప్రాబ్లెమ్ లేదు. కారుచౌకలో ఫారిన్ కంట్రీస్! మీ పేర్లు రాసివ్వండి! పేర్ల కెదురుగ్గా ఏ ఏ దేశాలు వెళ్ళాలనుకుంటోందీ కూడా రాయండి. ఏం ఫరవాలేదు. అందరికీ ఛాన్సిస్తాను. కారుచౌక! బ్రదర్స్ అండ్ సిస్టర్స్! ఏం మొహమాటపడకండి!"
అతని మాటలతో ఎక్సర్సయిజ్ నోట్ బుక్స్ నాలుగు కాలనీ వాళ్ళ పేర్లతో ఠకీమని నిండిపోయాయి.
బ్రోకర్ ఆ పేర్లన్నీ చూసుకుని ఆనందంగా నవ్వాడు.
"ఆహా! ఇలా ముందుకి రావాలి తెలుగు ప్రజలందరూ! చాలా గొప్ప అండర్ స్టాండింగ్ పవర్ ఉంది మీకు. సెభాష్! బ్రదర్స్ అండ్ సిస్టర్స్! అందర్నీ విదేశాలకు పంపించే పూచీ నాది."
"కానీ ఇన్ని వందలమందిని అంతఖర్చుతో ఫారిన్ కంట్రీస్ ఎలా పంపించగలరు?" అనుమానంగా అడిగాడు శాయిరామ్.
"చాలా మంచి ప్రశ్న బ్రదర౧ కొంచెం ఆలస్యంగా అడిగావ్! అయినా ఫరవాలేదు! ఇందులో మన ఖర్చేమీ ఉండదు! అంతా విదేశీ తెలుగువాళ్ళే భరిస్తారు. ప్రవాసాంధ్ర అసోసియేషన్స్ దగ్గర డబ్బు తెగ మూలుగుతోంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్! అంచేత ఖర్చులన్నీ వాళ్ళవే! మనం చాలా నామినల్ గా డబ్బు ఖర్చుచేయాలి. ఒకోసారి మనం ఖర్చుపెట్టిన కొద్ది మొత్తానికి కూడా నాలుగింతలు బహుమానాలు ఇస్తారు వాళ్ళు."


