Home » Yandamuri veerendranath » Rakshasudu


    "మధ్యాహ్నం ఒకసారి పట్నం వెళ్ళొస్తావా?"

 

    "ఎందుకు?"

 

    "బ్యాంకుకి వెళ్ళి రావాలి" అంటూ చిన్న కాగితం తీసుకుని వ్రాశాడు.

 

    "25. No Question Pl"

 

    ఇదేమిటి?"

 

    "తీసుకెళ్ళి మేనేజర్ కివ్వు. మన వెచ్చాలకీ, తిండికీ సరిపడా డబ్బు ఇస్తాడు".

 

    జానకి ఇబ్బందిగా చూస్తూ "నేనెప్పుడూ బ్యాంకుకి వెళ్లలేదే" అన్నాడు.

 

    "బ్యాంకుకే వెళ్ళలేదా?"

 

    "ఎందుకంత ఆశ్చర్యం? నే నింతవరకూ బ్యాంకికేకాదు. హోటల్ లోపలికి, గుళ్ళోకి కూడా వెళ్ళలేదు".

 

    "అదేమిటి? ఎందుకని?"

 

    "నిజంగా తెలియకే అడుగుతున్నావా? నేను కొజ్జాని" జానకిరాముడు కంఠంలో అకస్మాత్తుగా మార్పు కనబడింది. "మమ్మల్ని అంత దూరంలోనే నిలబెడతారు జనం. చిన్నపిల్లలాడుకునే ఆటవస్తువుల్లాంటి వాళ్లం మేము. కొట్ల ముందు నాట్యంచేస్తే చూసి ఆనందిస్తారు. ఒంటరిగా దొరికితే రాళ్ళేసి ఆనందిస్తారు. మామీద సినిమాలు తీసి సంతోషిస్తారు. అలాంటి మాకు హోటల్స్ కీ, గుడికీ వెళ్ళే యోగం కూడానా? అయ్యో! అంత అదృష్టం వుంటే ఇంకేం?"

 

    అతడు జానకివైపు సానుభూతిగా చూశాడు. ఎప్పుడూ నవ్వుతూ జోకులేస్తూ వుండే ఈ మనిషిలో సామాజిక గుర్తింపు లేకపోవటంవల్ల వచ్చిన వ్యధ ఎంతగా పేరుకుపోయిందో చూస్తూంటే జాలేసింది. తమలపాకులతో పండిన నోటి చిరునవ్వు వెనక-కాటుక వ్రాసిన ఆ కళ్ళనీడల్లో..... అంతటా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే..... నేను కొజ్జాని- నేను కొజ్జాని......

 

    కాదు జానకీ. నువ్వు కొజ్జావికాదు. శారీరకంగా అయితే అవ్వొచ్చు గాక! కానీ నిన్ను కొజ్జా అనే ఈ ప్రజలంతా కొజ్జాలు!! నీకన్నా పెద్ద కొజ్జాలు!!! ఒకరితో నవ్వుతూ మాట్లాడి, అతడు పక్కకి వెళ్ళగానే అతడి గురించి పక్కవాడితో ఎగతాళిగా చెప్పేవాళ్ళు గుణ రూపేణా కొజ్జాలు. ఉన్న ఒక్క రాత్రి తామున్న రైల్వే కంపార్ట్ మెంట్ ని శుభ్రంగా వుంచుకోవాలన్న ఇంగిత జ్ఞానంలేని ప్రయాణీకులు గొర్రెలకన్నా హీనమయిన కొజ్జాలు! వేసవిలో వేసిన రోడ్డు వర్షాకాలంలో కొట్టుకుపోతే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ని తామందరం కలిసి నిలదీయవచ్చనే ఆలోచన కూడా స్ఫురించని ప్రజలు గొర్రెలకన్నా తెలివితక్కువ కొజ్జాలు! యాభైమందిని క్యూలో నిలబెట్టి పక్కనే సినిమా టిక్కెట్లు అమ్ముతున్న బ్లాక్ మార్కెటర్ని తాము యాభైమంది కలిసి కూడా అడ్డుకోలేమని భయపడేవాళ్ళు ధైర్యం రూపేణా కొజ్జాలు! గుణం నుంచి ధైర్యంవరకూ ప్రతీ అంశంలోనూ కొజ్జాలే వున్న ఈ దేశంలో నిన్ను చూసి నవ్వే ధైర్యం ఎవరికుంది జానకీ?

 

    "పర్లేదు వెళ్ళు. ఎవరూ ఏమీ అనర్లే. మేనేజర్ కి ఇది ఇవ్వు. ప్రశ్నలడక్కుండా డబ్బు ఇస్తాడు. తీసుకురా!"

 

    జానకి తటపటాయించి, తలూపాడు.

 

    ఆ మధ్యాహ్నమే ఆ కాగితం పట్టుకుని పట్నం వెళ్ళాడు.

 

    బ్యాంకు బాగా రష్ గా వుంది.

 

    లోపలికి ప్రవేశిస్తున్న అతడిని గూర్ఖా కర్రతో "ఏయ్! వెళ్ళెళ్ళు బయటుండి అడుక్కో" అన్నాడు. జానకి బెదిరి "ఇది ..... మానేజర్ కివ్వాలి" అన్నాడు.

 

    గూర్ఖా ఆ కాగితం వైపు అనుమానంగా చూస్తూ "సరే వెళ్ళు" అన్నాడు. అతడు లోపలికి వస్తూంటే అందరి కళ్ళూ గుమ్మం వైపు తిరిగినాయ్. ఒక తల్లి తన చిన్న కొడుక్కి అతడిని చూపిస్తోంది. ఒక సదాచార సంపన్నుడు అతడిని చూసి కౌంటర్నుంచి తప్పుకున్నాడు.

 

    జానకిరాముడు ఇదేమీ పట్టనట్టు మేనేజర్ కాబిన్ లోకి ప్రవేశించాడు. అప్పటివరకూ ఏదో పనిచేసుకుంటున్న మేనేజర్ తలెత్తి, అతడిని చూసి పక్కలో పాముని చూసినట్టు ఉలిక్కిపడ్డాడు. "ఏంటి? ఏం కావాలి" అనబోతూవుండగా జానకి అతని ముందు తన చేతిలో వున్న కాగితం పెట్టాడు.

 

    క్షణంలో మేనేజర్ మొహంలో భావాలు మారినయ్. 'ఎప్పుడిచ్చారిది' అనబోయి, 'నో క్వొశ్చన్ ప్లీజ్' అన్న వాక్యం వైపు మరోమారు దృష్టిసారించి, తలూపి తనే స్వయంగా లోపలికి వెళ్ళి నోట్లకట్ట తీసుకుని ఇచ్చాడు.

 

    "ఎంతిది?"

 

    "ఇరవై అయిదువేలు"

 

    జానకిరాముడు గుండె ఆగిపోయింది. "ఇ.... ఇ...ఇరవై అయిదు వేలా?" అన్నాడు తడి ఆరిన గొంతుతో.

 

    "అంతేగా రాసింది"

 

    ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం ప్రమాదం వస్తుందో అన్నట్టు జానకిరాముడు ఆ నోట్లు భద్రంగా పట్టుకుని బయటికొచ్చేశాడు.

 

    అతడు తిరిగి గ్రామం చేరుకునేసరికి సాయంత్రమైంది. అంతడబ్బు అతని జన్మలో చూడలేదు. లోపల్నుంచి ఉద్విగ్నత పొంగుకొస్తూంది. పాకముండు సాయంత్రపు ఎండలో కూర్చున్న అతడిని చూసి, జానకి రాముడు అదే ఉద్విగ్నంతో, "ఇరవై అయిదు వేలిచ్చారు తెలుసా" అన్నాడు.

 

    "అంతేగా నేను వ్రాసింది!"

 

    "నేను కలలో కూడా అనుకోలేదు".

 

    "ఇప్పుడు చెప్పు నేనెంతకాలం నీతోపాటూ వుండొచ్చు".

 

    "ఎంత కాలమా? ఎంతకాలమేమిటి? ఎంతకాలమన్నా వుండొచ్చు. జీవితాంతం వుండొచ్చు.... బాబోయ్ పాతికవేలు ఇది... ఇదంతా మనదేనా"

 

    "ఆహా మనదికాదు"

 

    "మరి"

 

    "నీది, నీ ఒక్కడిదే. ఎందుకో తెలుసా? నా గాయాలు మానే వరకూ ఉంచుకున్నందుకు.... నన్ను రక్షించి తీసుకువచ్చినందుకు-"

 

    "గాయాలు మానేవరకూ మాత్రమే వుంటావా? ఇప్పుడేగా అన్నావ్.... ఎంతకాలమన్నా వుంటానని"

 

    "ఉంటానులే"

 

    "అయినా పట్నంలో అంతడబ్బు పెట్టుకుని ఇక్కడ వుండిపోతానంటావేం? ఈ పల్లె అంత బావుందా?"

 

    ".............."

 

    ఆ ఒక్క ప్రశ్నకీ సమాధానం చెప్పలేనట్టు అతడు లేచి "అలా వెళ్ళివస్తాను" అంటూ కదిలాడు.

 

    గోధూళి వేళయింది.

 

    కొబ్బరాకుల మధ్య చిన్నదైపోయిన ఆకాశం మీద, ప్రియుడికోసం రాత్రంతా వేచిన ప్రియురాలి కళ్ళలో ఎరుపుదనాన్ని తీసుకొచ్చి అద్దినట్టున్నాడు సూర్యుడు.

 

    రచ్చబండ దగ్గర ఇద్దరు కుర్రాళ్ళు గోళీలాడుకుంటున్నారు. దాన్ని దాటి, ఊరుదాటి బయటికి వచ్చాడు. అక్కడ చిన్న గొడవ జరుగుతూంది. పదిమంది కుర్రాళ్ళు, స్కూలు సంచులు భుజాన వేసుకుని ఒకమూల తాటిచెట్ల పక్కగా నిలబడివున్నారు. లావుగా నల్లగా వున్న ఒక వ్యక్తి గొంతు పెద్దది చేసి అరుస్తున్నాడు. అతడు మరింత దగ్గరగా వెళ్ళాడు. అప్పుడు కనబడింది సుమతి. తలవంచుకుని నిలబడివుంది. చుట్టూ కుర్రవాళ్ళు బిక్కమొహం వేసుకుని చూస్తున్నారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra