Home » Yandamuri veerendranath » మరణ మృదంగం


    అప్పటి వరకూ బయటకు చూస్తున్న జానీ, ఆలోచన్ల నుంచి  తెప్పరిల్లినట్లు తలతిప్పి, "బిల్లూ మొత్తం  మాఫియా గాంగ్ అంతా ప్రొద్దున్నే ఈ బస్ స్టాండ్ లో కాసిందేమిటి?" అన్నాడు.

    అప్పుడప్పుడే కొద్దికొద్దిగా భయపు ఛాయల్నుంచి, బయటకు రాబోతూన్న ఉత్పల, బాంబు పడినట్టు అదిరిపడి చివాలున సీట్లోంచి లేవబోయింది.

    అంతలో బస్సు కదిలింది.

    "ఏం అమ్మాయ్? ఏమైంది"

    "ఏం లేదు ఏంలేదు" ఉత్పల కంఠం వణికింది. చాలాసేపు ఆమెకేం చెయ్యాలో తెలియలేదు. బస్సు ఊరిబయటకు వచ్చాక స్పీడు అందుకుంది.

    దాని ముందొక జీపు, వెనుకొక జీపు అనుసరిస్తున్నాయి. ముందు జీపులో రాము, మరో ఇద్దరు మూడు స్టెన్ గన్స్ తో వున్నారు. వెనుక జీపులో గుండప్ప వున్నాడు.

    బస్సు వేగంగా సాగిపోతోంది. ఏదో అనబోతూ ఉత్పలవైపు చూసిన బిల్హణుడు విస్మయంతో "ఏమిటి ఏమైంది" అని మళ్ళీ అడిగాడు ఆమె మొహాన్ని పరిశీలనగా చూస్తూ.

    "ఏం లేదు, ఏం లేదు" అందామె కంగారుగా.

    జానీ కళ్ళు మూసుకుని ఈ సంభాషణ వినకుండా తన లోకంలో తనున్నాడు. అంతలో బస్ ఆగింది. అందరూ ముందుకీ పక్కలకీ చూశారు. అప్పటికే బస్సు వూరుదాటి నలభై కిలోమీటర్లు వచ్చేసింది. చుట్టూ కొండలు- చిన్న అడవి.

    జానీ కళ్ళు విప్పాడు.

    ఈ లోపులో బస్ డ్రైవరు కిటికీలోంచి తల బయటకు పెట్టి ఏదో మాట్లాడుతున్నాడు. జానీ కూడా బయటకు చూశాడు. అప్పుడర్ధమైంది. బస్ ఎందుకు ఆగిందో....! బస్ కి ముందు జీపు ఆగిపోయి వుంది. "రోడ్డు మధ్యగా జీపు వుంది పక్కకి తోసి దారి వదల' మంటున్నాడు డ్రైవర్.

     ఈ లోపులో బస్ ద్వారం దగ్గిర చప్పుడయింది. బనీస్ వేసుకున్న ఇద్దరు లోపలికి ఎక్కారు. వాళ్ళ మొహాలకి అడ్డంగా గుడ్డలున్నాయి. చేతిలో స్టెన్ గన్స్ వున్నాయి.

    బస్ లో ఒక్కసారి హాహాకారాలు చెలరేగాయి. తల్లులు అప్రయత్నంగా పిల్లల్ని దగ్గరికి తీసుకున్నారు. ఎవరో వెనుక నుంచి ఆపకుండా కెవ్వున అరుస్తున్నారు. నోటికి గుడ్డ అడ్డుగా కట్టుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు జేబులోంచి మరో పిస్తోలు తీసి గాలిలో పేల్చేడు.

    బస్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయింది. ఆ నిశ్శబ్దంలోంచి వాడి గొంతు కంచు మ్రోగినట్టు వినిపించింది. "ఎవరూ కదలకండి. కదిల్తే చంపేస్తాం".

    అందరూ శిలా ప్రతిమల్లా కూర్చుండిపోయారు.

    ఆ ఇద్దరూ ఒక్కొక్క సీటే వెతుక్కుంటూ వస్తున్నారు.

    ఒకడు ఉత్పల వున్న సీటు దగ్గిర ఆగాడు.

    అప్పటికే ఆమె మోకాళ్ళమీదవరకు పూర్తిగా వంగిపోయి మొహాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తూంది.

    "ఏయ్....లే" అన్నాడు కటువుగా.

    ఆమె కదల్లేదు. ఈ లోపుగా రెండోవాడు కూడా అక్కడికి పరుగెత్తుకు వచ్చాడు. ఉత్పలకి ఇటువైపు బిల్హణుడు వున్నాడు. కిటికీ వైపు జానీ వున్నాడు. ఇద్దరూ కూడా తమ ముఖాలకి చేతిరుమాలు అడ్డు పెట్టుకున్నారు.

    స్టెన్ గన్ పట్టుకున్న వ్యక్తి బిల్హణుడి భుజం పట్టుకుని పక్కకి విసురుగా లాగుతూ "తప్పుకోబే" అన్నాడు. బిల్హణుడు లేచి దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. వాడు ఉత్పల రెక్క పట్టుకుని పైకి లేపాడు.

    అప్పటి వరకూ భయంతో నోటమాట రాక గువ్వలా ముడుచుకుపోయి వున్న ఉత్పల, వాడి చెయ్యి మీద పడేసరికి హిస్టీరియా వచ్చినదాన్లా "నన్నొదులు నన్నొదులు" అని గింజుకోసాగింది. వాడు స్టెన్ గన్ తో ఆమె భుజం క్రిందుగా గట్టిగా పొడిచాడు. ఆమె కెవ్వున అరిచింది.

    'లే' అన్నాడు మరోసారి. ఆమె లేచినిలబడబోయిభయంతో కాళ్ళు సహకరించక పోగా మళ్ళీ కూలబడింది. ఈసారి రెండోవాడు కూడా సాయం చేశాడు. ఇద్దరూ కలిసి ఆమెని బలవంతంగా లేపారు.

    జానీ, ఏ క్షణమైనా పేలటానికి సిద్ధంగా వున్నట్టు మెరుస్తూన్న ఆ స్టెన్  గన్ వైపే చూస్తూ వూరుకుండి పోయాడు.

    ఆమెని దాదాపు ఈడ్చుకుని గేటు వరకూ లాక్కెళ్ళారు. బలవంతంగా క్రిందికి దింపి తలుపు వేస్తూ డ్రైవర్ తో "మేము వెళ్ళిన అయిదు నిమిషాల వరకూ బస్ కదలకూడదు. అర్థమైందా" అని తమ జీపు దగ్గిరకు వెళ్ళిపోయాడు.

    బస్ లో  అందరూ ఒక్కసారిగా సంతృప్తితో నిట్టూర్చడంతో 'హా' అన్న శబ్దం గాలిలోంచి వచ్చింది. ఆడవాళ్ళు తమ నగలు తడిమి చూసుకున్నారు. తీసుకెళ్ళిన ఆ పిల్లని వాళ్ళు ఏం చేస్తారని కుతూహలంగా కిటికీలోంచి బయటకి చూస్తూన్నారు మొగాళ్ళు. 'ఘోరం......ఘోరం....పట్ట పగలే ఏమిటీ దారుణం' అని లెంపలేసుకుంటూ ఓ ముసలమ్మ కలికాలన్ని తిట్టింది. "అమ్మా. ఏం జరిగిందే?" అని పిల్లలు అడిగిన  ప్రశ్నకి "ఏం లేదు- ఊరుకో" అని కసిరి, ఇంటికెళ్లాక ఈ సంఘటన గురించి చెల్లెళ్ళకి, పక్కింటి వాళ్ళకి ఎంత థ్రిల్లింగ్ గా చెప్పొచ్చో ఆలోచించుకుంటున్నారు ఆడపడుచులు.

    ఆ బస్సు మనదేశమే!

    దుప్పుల గుంపుమీద సింహం పడినా- పిల్లని లాక్కెళ్ళకుండా కొమ్ముల్తో నిరోధించటానికి ప్రయత్నిస్తాయి ఆ జీవాలు. ఆపాటి కూడా చెయ్యరు మన  ప్రజలు. తుపాకికి ఎదురెళ్ళలేకపొయినా, ఎంత తొందరగా ఆ జీపు వెళ్ళిపోతే అంత బావుణ్ణు అన్న మనస్తత్వానికి లొంగిపోవడం ఎంతో దారుణం.

    ఈ లోపులో ఉత్పలని జీపు దగ్గిరకు లాక్కెళ్ళిన వ్యక్తులు అక్కడ ఆగారు. వెనుక నుంచి గుండప్ప తోలుతున్న జీపు బస్ ని దాటుకుని ముందుకెళ్ళి ఆ జీపు పక్కన ఆగింది. ఈ రెండు జీపులూ బస్ కి పది గజాల ముందు వున్నాయి. ముందు జీపు డ్రైవింగ్  సీట్ లో వున్న రామూ దిగి గుండప్ప దగ్గిరకి వచ్చాడు. "మీరందరూ ఈ జీపులో వెళ్ళిపొండి. నేను దీన్ని తీసుకుని అడ్డదారిలో అడవిలోకెళ్ళి సంగతి కనుక్కుంటాను" అన్నాడు.

    "నీతో పాటు ఇంకెవరూ అవసరం లేదా?"

    "ఇద్దరొస్తారు"

    వాళ్ళు గ్రూపులుగా విడిపోయాడు. ఉత్పలని తీసుకొని రామూ తన జీపువైపుకి నడవసాగాడు.

    ఉత్పలని గుండాలు తీసుకుపోగానే బిల్హణుడు తన సీటు దగ్గిరకి వచ్చాడు అంతలోనే జానీ తన సీటులోంచి లేచాడు.

    "పాపం చాలా మంచి అమ్మాయి. పావురంలా వుంది కదూ".

    జానీ మాట్లాడలేదు. డ్రైవర్ ముందున్న అద్దం గుండా బయట దృశ్యాన్ని చూశాడు. అదే సమయానికి రెండు గ్రూపులూ  తలో జీపు దగ్గిరకి విడిపోతున్నాయి.

    జానీ తలతిప్పి బిల్హణుడివైపు చూశాడు. అతడి కళ్ళల్లో భావాన్ని అర్థం చేసుకున్నట్టుగా బిల్హణుడు తలూపి "ఆ పిల్ల పక్కన కూర్చోగానే నీ మొహంలో మెరిసిన భావాల్ని చూసాన్లే" అన్నట్టు నవ్వాడు.

    "...రిస్క్ అవుతుందేమో- వాళ్ళదగ్గిర కనీసం నాలుగు స్టెన్ గన్లున్నాయి. మన దగ్గిర రెండే.... అవైనా ఆరు గుళ్ళ పిస్తోళ్ళు."

    జానీ ఆ మాటలు వినిపించుకోలేదు. ఉత్పల వున్న పోజిషనుని చూస్తున్నాడు. ఆమెకి ఇరువైపులా ఇద్దరు నడుస్తున్నారు. జీపు సమీపంలోకి తీసుకువెళ్తున్నాడు. జానీ బిల్హణుడివైపు జూశాడు. కళ్ళు మాట్లాడుకున్నాయి.

    బిల్హణుడు డ్రైవర్ సీటు దగ్గరికి వెళ్ళి అతడిని పక్కకి జరగమని, ఆ సీటులో కూర్చొన్నాడు. డ్రైవర్ ఏదో అభ్యంతరం చెప్పబోయి, అతని మొహంలో కనిపిస్తున్నా హిప్నాటిక్ డిటర్మినేషన్ కి స్థబ్దుడై అప్రయత్నంగా పక్కకి జరిగాడు. జానీ తలుపు పక్కగా నక్కి జేబులోంచి పిస్టల్ తీసి రెడీగా పట్టుకున్నాడు. అది చూసి పక్కసీటులో కూర్చున్న వ్యక్తి "ఏయ్, ఏమిటిది? ఏం చేస్తున్నావు" అని అరవబోయాడు. అతడి మాట పూర్తిగా బయటికి రాకముందే జానీ చెయ్యి వేగంగా వెళ్ళి అతడినోటిమీద చరిచింది. ఇంకెవరైనా అయితే ఇటువంటి విషయాల్లో కాస్త జాలి చూపిస్తాడేమో గాని జానీకి అలాటి కనికరంఏమీ లేదు.

    "ఎవరూ మాట్లాడకండి. తలలు బాగా వంచి కూర్చోండి" అంటూ హెచ్చరించాడు.

    ఆ లోపులో బస్ కదిలింది.

    ఆ శబ్దానికి జీపులోకి ఉత్పలని ఎక్కిస్తున్న మనుష్యులు తలతిప్పి చూశారు. "అప్పుడే కాదు. కొంచెం సేపు ఆగు" అని అరిచాడు వాళ్ళలో ఒకడు డ్రైవర్ ని ఉద్దేశించి. వాళ్ళు ఈ బస్సు విషయం పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు. తుపాకి చూపించగానే మామూలు మనుష్యులు ఎలా బెదిరిపోతారో అనుభవ పూర్వకంగా వాళ్ళకి తెలుసు. డ్రైవరే బస్సుని ముందుకు తీసుకువస్తున్నాడని అనుకున్నారు వాళ్ళు. అది బయల్దేరే సమయానికే గుండప్ప తన అనుచరులతో జీపు ఎక్కేసి వెళ్లిపోవటానికి సిద్ధంగా వున్నాడు.

    వున్నట్టుండి బస్సు వేగం అందుకుంది. గేరుమార్చే ప్రయత్నం ఏదీ చెయ్యలేదు బిల్హణుడు. రెండో గేరులోనే స్పీడు పెంచాడు. ఆ శబ్దానికి బస్  గాలిలో ఆకులా అటూ ఇటూ వూగిపోతూ ముందుకు వెళ్ళింది. బస్ లో వున్న జనం హాహాకారాలు చేస్తూ, చేతులు తలకి అడ్డుపెట్టుకుని ప్రాణ రక్షణ కోసం ముందుకి వంగారు. అపాయం అప్రయత్నంగానే వాళ్ళకి దాన్ని నేర్పింది. జానీ వెనుక జరుగుతున్న కలవరాన్ని గమనించే స్థితిలోలేడు. అతడి చూపు ఉత్పలమీదే వుంది.

    కనురెప్పపాటులో బస్సు, గుండప్ప బయల్దేరటానికి సిద్ధంగా వున్న జీపుని చేరుకుంది. వూహించని ఈ పరిణామానికి ఉత్పలకి చెరో వైపున వున్న గూండాలు నిరుత్తరులై ఆమెని వదిలి చేతిలో వున్న స్టెన్ గన్ ని బస్ వైపు తిప్పారు.

    మామూలు పరిస్థితిలో అయితే ఆమె ఏం చేసేదో గాని, అప్పటికే మరణం వెంట్రుకవాసి దూరంలో తరుముతూ వుండటం వల్ల వచ్చిన తెగింపుతో ఉత్పల, వాళ్ళు వదిలెయ్యగానే నేలమీదకు జారిందల్లా, పక్కకు దొర్లింది. ఇంత గొడవ జరుగుతున్నా కంగారుపడని వాళ్ళలో రామూ కూడా వున్నాడు. అతడిలాటి పరిస్థితుల్ని అంతకు ముందు ఒకటి రెండు సార్లు చూశాడు. ఊహించని పరిస్థితుల్లో మనుష్యులు ఈ విధంగానే  ప్యానిక్ అవుతారని అతడికి తెలుసు, అయితే అతడు, భయంతో దిక్కు తోచకుండా డ్రైవరే బస్ ని అలా తీసుకు వస్తున్నాడని భావించాడు. జీవుల మధ్యగుండా బస్ ముందుకు సాగిపోతుందని అనుకున్నాడు. పక్కనున్న స్టెన్ గన్  తీసుకుని జీపుకి అటువైపు దిగాడు.

    అప్పటివరకూ అతడూహించినట్టే బస్ ని తీసుకువచ్చిన బిల్హణుడు అక్కడి వరకూ వచ్చాక చటుక్కున స్టీరింగ్ పక్కకి తిప్పాడు.

    బస్ వేగంగా వచ్చి గుండప్ప కూర్చున్న జీపుని పక్కనుంచి తాకింది. చెవులు బ్రద్దలయ్యేటంత శబ్ధంతో జీపు గాలిలోకి ఎగిరి పక్కకి దొర్లింది. జీపు క్రింద చిక్కుకున్న అనుచరుడి ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది. జీపులో వాళ్ళు ఏమయ్యారో తెలీదు. వాళ్ళ అరుపుల్ని బస్ శబ్ధం డామినేట్  చేసింది. బస్ లోపలి వాళ్ళు ఎలా వున్నారో బిల్హణుడు పట్టించుకోలేదు. అతడిచూపు ఉత్పలమీదే వుంది. ఆమె పక్కకి జరగటం గమనించగానే అతడి చేతులు చకచకా గేర్లు మార్చినయ్. బస్సు రివర్సులోకి వచ్చింది.

    బస్సు వెనక్కి రావటం గమనించగానే రామూకి- జరుగుతున్నదేమిటో అర్థమైంది. బస్ ని డ్రైవ్ చేస్తున్న మనిషి వెళ్ళిపోవటానికి ప్రయత్నించటం లేదనీ, తమని ఎదుర్కోవటానికే వస్తున్నాడని గమనించగానే టప్ టపా స్టెన్ గన్ పేల్చటం మొదలు పెట్టాడు. బిల్హణుడి ముందున్న అద్దం భళ్ళున్న బ్రద్దలయింది. ఈ లోపులో ఉత్పల పక్కనున్న గూండాలుకూడా తమ గన్స్  తో బస్ మీద  గుళ్ళ వర్షం. కురిపించసాగారు. కానీ అది క్షణం సేపుమాత్రమే.

    బస్ డోర్ పక్కనే నిలబడి అప్పటి వరకూ ప్రేక్షకుడిలా చూస్తున్న జానీ, ఒక జీపు పక్కకి పడిపోగానే చెయ్యి బయటకు పెట్టి రెండు సార్లు పిస్టల్ పేల్చాడు. ఇద్దరు గూండాలు అరుస్తూ ముందుకి పడ్డారు. వాళ్ళ చేతిలో తుపాకులు నేలరాలాయి. అంతవేగంగా వెనక్కి వెళ్తున్న బస్ లోంచి జానీ తెరుచుకుని క్రిందకి దూకాడు. నేలమీద పడీపడగానే స్ప్రీంగ్ లా కదిలి పడిపోయిన జీపువైపు మళ్ళీ ఒక్కసారి పిస్తోలు పేల్చాడు. బిల్హణుడి వైపు గన్ గురి పెడుతూన్న గుండప్ప భుజంలోకి గుండు దూసుకుపోయింది. ఎన్నో హత్యల్ని సమర్థవంతంగా నిర్వహించిన ఆ రౌడీ కూడా అవతలి వ్యక్తి సామర్థ్యానికి అదిరిపోయి, బుల్లెట్ బార్ ని క్షణకాలం మార్చిపోయాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra