Home » Vasireddy seeta devi novels » Dr Vasireddy Sitha Devi Rachanalu - 4


    "క్షమించండి. నేను మిమ్మల్ని చాలా బాధపెట్టినట్లున్నాను" అన్నాడు చంద్రం అపరాధిలా.

 

    ప్రసాదరావు కళ్ళు మూసుకొని పడుకొని వున్నాడు. హేమ తిరస్కారంగా చంద్రం ముఖంలోకి చూసి గబగబా గదినుంచి బయటకువచ్చి మేడమీదకు వెళ్ళిపోయింది.

 

    హేమకు క్షమాపణ చెప్పుకోవాలని నిల్చున్నాడు చంద్రం. కాని, హేమ ఎంతకూ రాలేదు. ఏమిటా ఇలా జరిగింది! తను అనుకున్నదేమిటి? అనుకోకుండా ఏర్పడిన గండిని పూడ్చటానికి వచ్చిన తను హేమ మధ్య తన మధ్య - అగడ్తనే త్రవ్వుకున్నాడు. తను ఏది చెయ్యాలనుకుంటాడో దానికి వ్యతిరేకంగా జరుగుతూంది!

 

    ఆలోచిస్తూ - బరువుగా, భారంగా, బయటకు నడిచాడు చంద్రం.

 

                                          17

 

    పోరాటం వ్యక్తుల మధ్య జరగదు. వ్యక్తుల విభిన్న ఆదర్శాల మధ్య జరుగుతుంది విభిన్న ఆదర్శాలు, అభిరుచులూ గల ఇద్దరు వ్యక్తులు ప్రాణస్నేహితులుగానో, లేక ప్రేమికులుగానో వుండగలుగుతున్నారంటే వారిలో మానవత వారి అభిరుచులనూ, ఆదర్శాలనూ అదుపులో పెట్టగలిగి వుండివుండాలి. ఈ కోవకు చెందిన వ్యక్తులు జీవితంలో రాజీ పడగలరు. పరిస్థితులతో రాజీ పడటం మానవ వికాసానికి గొడ్డలిపెట్టే కావచ్చును కాని తను ప్రేమించే హృదయం ముందు తన ఆదర్శాలను, అభిరుచులనూ అదుపులో పెట్టుకోక తప్పదు. అలా కానప్పుడు ఇద్దరు ప్రత్యేక వ్యక్తిత్వంగల వ్యక్తులు ఒకరికొకరు ఎంత దగ్గరకు రావాలని ప్రయత్నించినా దూరం అవుతూనే వుంటారు.

 

    చంద్రం, హేమల మధ్య ఇలాంటి పోరాటమే జరుగుతున్నది. వారిద్దరూ ఒకరికొకరు ఎంత దగ్గరకు రావాలని ప్రయత్నిస్తున్నారో అంత దూరం అవుతున్నారు. హేమలోని అభిమానం, అభిజాత్యం తన ప్రేమను ప్రకటించడంలో అడ్డుపడుతున్నాయి.

 

    అవమానించబడిన ప్రేమ ద్వేషంగా మారుతుంది. కృష్ణారావు ఇంట్లో జరిగిన సంఘటన హేమ అహాన్ని దెబ్బకొట్టింది. చంద్రం, గౌరి లాంటివారిని సమర్థించటం గాయపడిన హృదయాన్ని మళ్ళీ రేపినట్లయింది. ఆమె హృదయాంతరాళల్లో ఎక్కడో లోతుగా చంద్రం యెడల ద్వేషం తేలు పిల్లలా కదలసాగింది. తను ప్రేమించే వ్యక్తినే ద్వేషించ సాగిన హృదయం పడే యాతనంత బాధ మరోటి లేదేమోననిపిస్తుంది హేమకు.

 

    ప్రేమ, ద్వేషం మధ్య జరుగుతున్న పోరాటంలో హేమ హృదయం విలవిల్లాడిపోతుంది. ఏదో అశాంతి నీడలా వెన్నంటసాగింది హేమను. చంద్రం ఆ ఊరువచ్చి నాలుగు నెలలు కావస్తుంది. దాదాపు రోజూ సాయంత్రం హేమ దగ్గిరకు వస్తూనే వున్నాడు. హేమ ఒకవైపు చంద్రాన్ని అసహ్యించుకుంటూనే - కొంచెం అతను రావటం ఆలస్యం అయితే అశాంతితో అల్లాడిపోతుంది. ఒకరోజు రాకపోతే గౌరితో చంద్రాన్ని ఊహించుకొంటూ అతన్ని అసహ్యించుకొంటుంది. అతన్ని చూట్టం, అతనితో మాట్లాడడం తనకు అసహ్యం అనుకొంటుంది. మళ్ళీ అతని ముఖం చూడకూడదని ఎన్నోసార్లు నిర్ణయించుకుంటుంది. అంతలోనే వెక్కివెక్కి ఏడ్చేస్తుంది. ఆ తరవాత హృదయం కొంత తేలిక పడుతుంది. ద్వేషం స్థానాన్ని ప్రేమ వశపరుచుకుంటుంది. చంద్రంకోసం మనస్సు గిజగిజలాడిపోతుంది.

 

    వారం రోజులనుంచీ చంద్రం రాకపోవటానికి కారణం అనేక రకాలుగా వూహించుకోసాగింది హేమ. ఆ రోజు సాయంత్రం ఆమె హృదయం శ్రావణ మేఘంలా భారంగా ఏ కొంచెం చల్లగాలి తగిలినా వర్షించటానికి సిద్ధంగా వుంది.

 

    హేమ అశాంతిగా ఇంటిముందు ఆవరణలో తిరుగుతోంది. తనకు తెలియకుండానే మొక్కల పువ్వులు తెంపింది. ఆకులు పళ్ళ సందునుంచి చేత్తో చింపుతుంది. లోపలకు వెళుతుంది. హాలులో ఆగి మళ్ళీ వెనక్కు వరండాలోకి వస్తుంది.

 

    ఈ రోజు ఏమయినా తను ఖచ్చితంగా చెప్పదల్చుకుంది. తను అంత చవకబారు అభిరుచులుగల మొగవానిని ప్రేమించలేదు - చంద్రం అంటే తనకు అసహ్యం. అతనితో ఆ మాట ఈ రోజు చెప్పేస్తుంది. లేకపోతే తనను ఏమనుకున్నాడు? కాలక్షేపంకోసం తన దగ్గరకు వచ్చి కబుర్లు చెబుతున్నాడా? ఆ బజారు పిల్లకోసం ఆ గుడిసెల్లో పడివుంటాడా? తనంటే ఏ కొంచెం లక్ష్యంవున్నా తన అభిరుచులను తెలుసుకోవటానికి ప్రయత్నించాడా?   

 

    ఆ అమ్మాయితో.... ఛీ! అలాంటివాడిని తను ప్రేమించటం ఏమిటి? చంద్రంలో బలహీనత వుంది కాబట్టే తనదగ్గర చనువు తీసుకోలేకపోతున్నాడు. ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దర్ని ప్రేమించగలడా? కేవలం వ్యామోహం.... ఆలోచిస్తున్న హేమకు గుండెలు చిక్కపట్టినట్లయింది. వెళ్ళి వరండాలోవున్న కుర్చీలో యాంత్రికంగా కూలబడింది. కళ్ళునుంచి తనకు తెలియకుండానే ఎంతోసేపుగానో కారుతున్న నీటిని ఉలిక్కిపడి గబగబా తుడుచుకుంది. ఇంకానయం - చంద్రం రాలేదు. తను ఏడుస్తున్నట్లు కనిపిస్తే చంద్రం దృష్టిలో ఇంకా చవక అయివుండును.   

 

    తను చంద్రాన్ని నిజంగా అసహ్యించుకుంటుందా? కాదు.... తన ప్రేమను అవమానించాడనే కక్షకొద్దీ తనే కావాలని అతనిమీద అసహ్యాన్ని పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నది. కాని అది సాధ్యమా?    

 

    చిన్ననాటి స్నేహం తనకు తెలియకుండానే ప్రేమ రూపాన్ని ధరించి తనలోని ప్రతి జీవాణువుతోపాటు పెరిగింది. రక్తంలో ప్రవహిస్తూంది. తనలోని రక్తం గడ్డకట్టిననాడుకాని చంద్రం యెడల ప్రేమ కరడుకట్టదు. రక్తనాళాలలో రక్తంతోపాటు ప్రవహిస్తూ హృదయంలోకి ప్రతి నిముషం ప్రవేశిస్తూనే వుంది. చంద్రం ప్రేమను ద్వేషిస్తుందంటే తనను తానే ద్వేషించుకుంటుందన్నమాట!  

 

    తను చంద్రాన్ని మరచిపోవటం అసంభవం. అతనులేని జీవితం తనకు అక్కరలేదు. మగవాడు - పైగా, పెద్దల రక్షణకు దూరంగా పెరిగినవాడు. పరిస్థితుల కారణంగా కొన్ని అలవాట్లకు లొంగిపోయి వుండవచ్చు. తను చంద్రాన్ని సానుభూతితో అర్థం చేసుకొని, అతన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి బదులుగా, ప్రతి చిన్న విషయాన్ని కొండంతగా ఊహించుకొని అసహ్యించుకుంటూ అతన్ని దూరం చేసుకుంటున్నది. అసహ్యంతో వ్యక్తుల్ని దూరం చేసుకుంటామేకాని దగ్గరకు లాక్కోలేము. ఇకనుంచి తన హృదయం మీది కృత్రిమ తెరలను తొలగించుకొని చంద్రాన్ని దగ్గరగా తీసుకోవాలి.  

 

    చంద్రం మరీ అమాయకుడిలా వున్నాడు. తన ముఖంలోని జుగుప్సను చూసినప్పుడు చంద్రం ముఖాన్ని ఎంత చిన్నబుచ్చుకుంటాడో! అలా చిన్నబోయిన చంద్రం ముఖం చూస్తుంటే తన రెండు చేతులు అతని మెడచుట్టూ చుట్టి అనునయించాలనిపిస్తుంది. కాని, తను చస్తే అలా చెయ్యలేదు - ఎందువల్ల?   

 

    చంద్రం అలా దూరదూరంగా ఎందుకుంటున్నాడు? చంద్రానికే ధైర్యంవుండి ఇంగ్లీషు సినిమాల్లో, కొన్ని నవలల్లోని హీరోల్లాగా బలవంతంగా తనను దగ్గరకు లాక్కుంటే తను లొంగిపోకుండా వుండగలదా? అభిమానంగల స్త్రీ ఎప్పుడూ తను ప్రేమిస్తున్న వ్యక్తులద్వారా శాసించబడాలని కోరుకుంటుంది. ప్రేమతో కూడిన అధికారానికి లొంగని స్త్రీ హృదయం వుండదేమోనని తను అనుకుంటూ వుంటుంది అప్పుడప్పుడు. రచయిత అయిన చంద్రం తనలోని బలహీనతను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు?  

 

    ఎవరో గేటు తెరుచుకొని లోపలకు వస్తున్నట్లు ఆలోచనల్లోవున్న హేమకు లీలగా అనిపించి అటువైపు చూసింది. చంద్రం! అంతవరకూ చీకటి గదిలో దేనికోసమో వెతుకుతున్న హేమకు ఆకస్మాత్తుగా ఎవరో మెర్ క్యూరీ లైటు వేసినట్లనిపించింది. హృదయంలోని ఆ వెలుగును కళ్ళద్వారా బయటపడకుండా బలవంతంగా వెనక్కు నెట్టేసింది. లేనిపోని గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకొన్నది ముఖంలోకి.  

 

    చంద్రం వచ్చి హేమకు ఎదురుగావున్న కుర్చీలో కూర్చున్నాడు. హేమ చిరునవ్వుకు జవాబుగా నవ్వలేదు. చంద్రం మూతి బిగింపు చూసిన హేమకు నవ్వు వచ్చింది.

 

    "ఇంటిలో చాలా వుక్కగా వుంది. అలా ఓసారి పార్కు వైపుకు వెళదామా చంద్రం?"

 

    హేమ మాటలను నమ్మలేనట్లు విస్మయంగా చూశాడు చంద్రం. చంద్రం వాలకం చూస్తుంటే ఆ రోజు ఏదో నిర్ణయించుకొని, పోట్లాటకు సిద్ధంగా వచ్చినట్లనిపించి హేమకు తమాషా అనుభూతి కలిగింది. తనకు కావాల్సింది అదేనేమో!

 

    హేమ, చంద్రం జవాబుకు ఎదురు చూడకుండానే లోపలకు వెళ్ళి, ఐదు నిముషాల్లో హేండ్ బాగ్ తో వచ్చి నిల్చుంది. చంద్రం లేచి యాంత్రికంగా హేమ వెనకనే నడవసాగాడు. హేమ ప్రవర్తనలో మార్పు చంద్రాన్ని ఆశ్చర్యంలో ముంచివేసింది. పార్కు రెండు. ఫర్లాంగుల దూరంలోనే వుంది. ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. అలా ఒకరి పక్కన ఒకరు నడుస్తూ ఎవరి ఊహల్లో వారు తేలిపోతున్నారు.   

 

    హేమ తన పక్కన అలా నడుస్తుంటే చంద్రానికి ఎన్నో సామ్రాజ్యాలను జయించినట్లుంది. ఆనాడు తను గౌరితో నడుస్తూ అందరూ తనవంకే చూస్తుంటే సిగ్గుతో తాబేలులా ముడుచుకుపోయాడు. తాబేలులాగా తనకూ ఓ కవచం వుంటే ఎంత బావుణ్ణు! ఎవరికీ కనిపించకుండా అందులోకి ముడుచుకుపోదును అనిపించింది. కాని ఆ మాటే ప్రకాశంతో అంటే తనను క్షమించడు. తనకు న్యాయంగా అలా అనిపించకూడదు. అది తన బలహీనతే కావచ్చు. కాని, ఈ రోజు తను సగర్వంగా నలుగురూ చూడాలన్నట్లు నడుస్తున్నాడు...

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra