Home » Manjari » నన్ను ప్రేమించవు

    "అతన్ని ఇక్కడనుంచి తీసుకుపో" చెప్పాడు రామకృష్ణ.
    అందుకోసమే చూస్తున్నట్టు ఆ వ్యక్తి జనార్ధనాన్ని భుజంమీద వేసుకుని అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
                                                                   *    *    *    *
    సాయంకాలం రామకృష్ణతో చెప్పాడు శివరావు.
    "రాత్రికి నేను ఊరెళుతున్నాను....."
    "ఏ ఊరు?"
    "బొంబాయి."
    "అర్చనతో చెప్పావా?"
    తలూపాడు శివరావు.
    ఆ సమయంలో అర్చన గుమ్మానికి ఆనుకుని నిలబడింది. అతను పదిహేనురోజులు క్యాంప్ వెళ్ళడం ఆమెకు నచ్చలేదు. అన్నిరోజులు అతనికి దూరంగా ఉండగలనా? ప్రశ్నించుకుంది.
    విశాఖ డైరి స్థానిక సంస్థ. అందులో సేల్స్ మాన్ గా పనిచేస్తున్నాడు శివరావు. విశాఖ డైరీ కార్యకలాపాలు ప్రక్క జిల్లాకు మాత్రమే విస్తరించి ఉన్నాయి. బొంబాయిలాంటి నగరాలకు ఆఫీసు పనిమీద వెళ్ళే అవసరం ఆ సంస్థ ఉద్యోగులకు ఉండదు. ఈ విషయాలు తెలియకపోవడం వల్ల రామకృష్ణకి ఎటువంటి అనుమానం రాలేదు.
    "తిరిగి ఎప్పుడొస్తావ్?" అడిగాడు రామకృష్ణ.
    "ఇరవయ్యో తేదీన వస్తాను...." చెప్పాడు.
    "లక్ష్మీనారాయణగారు సాయంకాలం సిద్దాంతి దగ్గరకు వెళ్లొచ్చారు. సులోచన పెళ్ళికి ముహూర్తం పెట్టించారు. ఇరవయ్యో తేదీ సాయంకాలం ముహూర్తం."
    ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలించి తన కార్యక్రమాన్ని రూపొందించుకున్నాడు శివరావు. అయినా కూడా సులోచన పెళ్ళి వచ్చిపడింది. ఆ పెళ్ళి గురించి తనకి ముందే తెలియడం మంచిదయింది. లేకపోతే ఆ కబురు తెలియజెయ్యడానికి ఆఫీసు కెళ్ళేవాడు. తను పదిహేను రోజులు మెడికల్ లీవు తీసుకున్నట్టు, బొంబాయి వెళ్ళడం నాటకమని తెలిసిపోయేది. అందువల్ల తన పథకానికి ఎటువంటి నష్టంలేకపోయినా తిరిగొచ్చిన తరువాత ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యేవి.
    "తొందర దేనికి?" అన్నాడు శివరావు.
    "ఇప్పటికే ఆలస్యం చేశాం. పెళ్ళి వెంటనే చేసేయాలని నీ మామగారు పట్టుబట్టారు. నువ్వు రెండు రోజుల ముందు ఇక్కడుండాలి....."
    "ప్రయత్నిస్తాను...." చెప్పాడు శివరావు.
    పద్దెనిమిదికి తిరిగి రావడం అసాధ్యమని అతనికి తెలుసు.
    శివరావు లోపలకు వెళ్ళాడు. లక్ష్మీనారాయణ భోజనం ముగించి పెరట్లో కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు. రాత్రి పడుకోబోయే ముందు ఆయన చేసే చివారి పని అది.
    విశాఖపట్నం వచ్చిన తరువాత ఆరోగ్యంగా ఉన్నాడు. మొహంలోకి కళాకాంతులు వచ్చాయి. ఉదయం శీతయ్య వెంట దుకాణానికి వెళ్ళి ఎనిమిది గంటల వరకూ ఉంటాడు. ఇంటికి కావాల్సిన కూరగాయలు తీసుకుని వచ్చేస్తాడు. పదకొండు గంటలకు అన్నం తిని నడుంవాలుస్తాడు. సాయంకాలం కూతుళ్లతో కాలక్షేపం చేస్తాడు.
    "సులోచన పెళ్ళికి ముహూర్తం పెట్టించారట...." ఆయన ప్రక్కన కూర్చుని అడిగాడు.
    "అవును బాబూ! నీకు ముందుగా చెప్పలేదని ఏమీ అనుకోకు....." అన్నాడు.
    "నోట్లోంచి చుట్ట తీసి, పొగ శివరావు మొహంపైకి వెళ్ళకుండా చేత్తో పట్టుకుని దూరంగా ఉంచాడు. ముందురోజు రాత్రి అందరూ పడుకున్న తరువాత సులోచన పిల్లిలా శీతయ్య పక్కలోకి దూరింది. అతను మందలించి ఆమెను అక్కడనుంచి పంపేశాడు. తనని కాదన్నాడని సులోచన చాలాసేపు ఏడుస్తూ కూర్చుంది. ఉదయం దుకాణం దగ్గర శీతయ్య అన్యమనస్కంగా ఉన్నాడు. జీవితంలో చివరి మజిలీ చేరిన ఆ వృద్దుని కళ్ళు చీకట్లో నడుస్తున్న చిన్న కూతుర్ని నిశ్శబ్దంగా గమనించాయి.
    లక్ష్మీనారాయణ తెలివితేటలు లేని మనిషికాదు. పేదరికం ఆయన తెలివి తేటల్ని అణిచివేసింది. పరిస్థితులు ఆయన పౌరుషాన్ని చంపేశాయి. కాంతం ప్రవర్తన గురించి ఆయనకి తెలుసు. తనకి తెలియనట్టు ఉండేవాడు. ఆ వాతావరణం నుంచి కూతుర్ని దూరంగా పంపాలని జనార్దనం వెంట పంపాడు. కాంతం అతనితో కలిసి పథకం వేసిందని మాత్రం ఆయన ఊహించలేదు. ఆ తప్పు అర్చన జీవితాన్ని బలి తీసుకుంది.
    చిన్నకూతురు శీతయ్యతో పరిచయం పెంచుకోవడం కూడా ఆయనకి తెలుసు. కావాలనే అభ్యంతరం చెప్పలేదు. తను చచ్చిపోతే కనీసం ఓ తోడు ఉంటుందని భావించాడు. జీవితంలో తగిలిన దెబ్బలు తట్టుకుని తన గుండె ఇంకా పని చేస్తుండటం ఆయనకెప్పుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది.
    "నేను ఊరెళుతున్నావు.....ఈ డబ్బు మీ దగ్గరుంచండి." అని కొంత డబ్బు ఇచ్చాడు శివరావు.
    "ఇప్పుడెందుకు బాబూ!" మొహమాటంగా అన్నాడాయన.
    "ఖర్చులుంటాయి కదా!"
    లక్ష్మీనారాయణ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆయన జీవితంలో డబ్బు ఇచ్చిన మొదటి వ్యక్తి అతను. కొడుకు చేసేపని అతను చేశాడు.
    ఆ రాత్రి శివరావు, రామకృష్ణ కలిసి రైల్వేస్టేషన్ కి వెళ్ళారు. శివరావు బొంబాయికి టిక్కెట్ తీసుకున్నాడు. కోణార్క్ లో అతి కష్టం మీద బెర్త్ దొరికింది. ట్రైన్ కదిలేవరకూ అక్కడే ఉండి ఇంటికొచ్చాడు రామకృష్ణ.
    విశాఖపట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అనకాపల్లి రైల్వే స్టేషన్. కోణార్క్ తెల్లవారు ఝామున రెండున్నరకు ఆ స్టేషన్ చేరుకుంది. ఎయిర్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని క్రిందకు దిగాడు శివరావు. టిక్కెట్ గేటులో ఇచ్చి బయటకొచ్చాడు. అతను బయటకొస్తుంటే కోణార్క్ బయలుదేరిన శబ్దం వినిపించింది.
    రిక్షామీద బస స్టాండ్ చేరుకున్నాడు. అరగంట తరువాత అనకాపల్లి నుండి విశాఖపట్టణం వెళ్ళే మొదటి బస్సు ఎక్కాడు. విశాఖపట్టణం ఆర్. టి. సి. కాంప్లెక్స్ చేరడానికి గంట పట్టింది. శివరావు బస్సుదిగి బయటకొచ్చాడు. అక్కడ ఆటో ఎక్కి చైనా వాల్తేర్ లో దిగాడు.
    అప్పటికి సూర్యకిరణాలు ఇంకా భూమిని తాకలేదు.
                              *    *    *    *
    సూర్యకిరణాలు భూమిని తాకని ఆ సమయంలో రవితేజ నిద్రలేచాడు. అతను విజయవాడ సత్యనారాయణ పురంలో ఉంటున్నాడు. సూర్యోదయానికి ముందు నిద్రలేవడం అతనికి అలవాటు. ముఖ్యమైన పనయితే అర్దరాత్రి వరకూ మేలుకుని ఆ పని చేస్తాడు. అటువంటి రోజున కూడా అతను తెల్లవారు ఝామునే లేస్తాడు.
    ఆ రోజు మెలుకువ వచ్చిన మరుక్షణం లేచి కూర్చున్నాడు. పని లేనప్పుడు మరికొంత సేపు మంచంపైన దొర్లుతాడు. మధ్యాహ్నం ఓ ముఖ్యమైన ప్రయాణం ఉండడం వల్ల కాసేపు పాడుకోవాలనే ఆలోచన రాలేదు.
    మంచంపై నుంచి దిగి టాయిలెట్ కి వెళ్ళొచ్చాడు. లుంగీ విప్పి సరిగ్గా కట్టుకుని, షర్టు వేసుకున్నాడు. కళ్ళజోడు తీసుకుని షర్టుతో అద్దాలు తుడిచి పెట్టుకున్నాడు. ఆ గది గోడలకు రకరకాల ఫోటోలు వ్రేలాడుతున్నాయి. వాటిలో స్టివెన్ స్పీల్ బర్గ్, ఆకిరా కురుసోవా వంటి విదేశీ సినీ దర్శకులు ఫోటోలు కూడా ఉన్నాయి.
    సిగరెట్ ముట్టించుకుని బయటకొచ్చి రూం లాక్ చేశాడు. తలమీద సగానికి పైగా వెంట్రుకలు ఊడిపోవడం వల్ల బట్టతల కనిపిస్తోంది. కొబ్బరికాయకి ఉండే పిలకలాంటి తన జుత్తుని చేత్తో వెనక్కి సర్దుకున్నాడు. తలెత్తి ఆకాశంలోకి చూశాడు. సూర్యుడు ఉదయించడానికి ఆయత్తమై వస్తున్నట్టు తూర్పు దిక్కున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. సూర్యోదయంలోని మొదటి కిరణం శరీరానికి తాకితే ఒళ్ళు పులకరిస్తుంది.
    అతను మెట్లు దిగి నడవసాగేడు. జన సంచారంలేని రోడ్లు బోసిగా కనిపిస్తున్నాయి. సెంటర్ లో పాలకోసం నిలబడ్డ జనం తాలూకు మాటల సవ్వడి వినిపిస్తోంది.
    వంద గజాల దూరంలోని టీ స్టాల్ చేరుకున్నాడతను. అతన్ని గమనించిన హోటల్ కుర్రవాడు కాఫీ తెచ్చి ఇచ్చాడు. కాఫీ త్రాగుతూ టీ స్టాల్ దగ్గరున్న మనుషుల్ని పరీక్షగా చూశాడు. ప్రతిరోజూ అదే సమయంలో కనిపించే మనుషులే అక్కడ ఉన్నారు. అతను ఎవర్నీ పలకరించడు. వాళ్ళు కూడా అతన్ని పలకరించరు.
    తనొక ఫిలిమ్ డైరెక్టర్ అనే విషయం వాళ్ళకి తెలియకూడదని అనుకుంటాడు. తెలిసిన మరుక్షణం తనని చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలతోను, తన దృష్టిలో పడాలనే తాపత్రయంతోను తన మూడ్ పాడు చేస్తారని భయం. సినిమా దర్శకుడు అయితే వాళ్ళు వెంటనే గుర్తు పట్టేవారు. డాక్యుమెంటరీలు తీసే తనలాంటి దర్శకుని గుర్తు పట్టడం వాళ్ళకి సాధ్యం కాదు. అయినా కూడా వాళ్ళతో మాట్లాడి తన ఆలోచనా ప్రపంచము నుండి బయటకు రావడానికి రవితేజ ఇష్టపడడు.
    వూనా ఫిలిం ఇన్ స్టిట్యూట్ నుండి దర్సకత్వ శాఖలో డిప్లొమా తీసుకున్నాడు. మొదటిసారి ఓ స్నేహితుని ప్రోత్సాహంతో డాక్యుమెంటరీ తీశాడు. అది ఉత్తమ డాక్యుమెంటరీగా జాతీయ స్థాయిలో బహుమతులు గెల్చుకుంది. ఇప్పటి వరకూ అతను నాలుగు డాక్యుమెంటరీలు తీస్తే వాటిలో మూడు బహుమతులు పొందాయి.
    సూర్యోదయం అయింది.
    ఓ కిరణం అలవోకగా రవితేజ శరీరాన్ని తాకింది. అతను తలెత్తి ఉదయిస్తున్న సూర్యున్ని చూశాడు. భవనాలను, చెట్లను తప్పించుకున్న ఆ కిరణం సరిగ్గా అతను కూర్చున్న ప్రదేశంలో పడుతోంది. ఆ కాంతిలో రవితేజ మొహం ప్రశాంతంగా ఉంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra