Home » Yandamuri veerendranath » దుప్పట్లో మిన్నాగు


                       ఉపసంహారం
    చెప్పటం పూర్తిచేసి పట్నాయక్ బీరుగ్లాసు అందుకుని కుర్చీ వెనక్కు వాలి తాపీగా తాగటం మొదలు పెట్టాడు. నా మిత్రులు నలుగురి మొహాలు టెన్షన్ తో నిండి వుండటం గమనించాడు. శివ ఆపుకోలేక, "తరువాత ఏమయింది?" అని అడిగాడు. పట్నయక్ నవ్వి "మీరు నలుగురూ ఒకళ్ళకొకళ్లు అతి రహస్యంగా ముగింపులు చెప్పుకుని మార్కులు పూర్తిగా వేసుకున్నారు. మీరందరూ నాకూ అలా వేస్తానంటే నేను చెపుతాను" అన్నాడు.
    "పట్నాయక్ సంగతి అక్కరలేదు. వైజయంతి కథే ఇంటరెస్టింగ్ గా వుంది. ఆమె బయటపడిందా? అదొక్కటే చెప్పండి చాలు" అన్నాడు శివ.
    "వైజయంతి బయటపడాలి అంటే పట్నాయక్ పోలీసులకి దొరికిపోవాలి- ఆ రాత్రి గుండు తగిలి అతడు చచ్చన్నా వుండాలి- లేదా, తరువాత దొరికిపోయి ఉరికంబమన్నా ఎక్కివుండాలి. అతడి డెత్ స్టేట్ మెంటు ఒక్కటే ఆమెని రక్షించగలదు. వైజయంతి రక్షింపబడిందా లేదా అన్న విషయం చెప్పటం ద్వారా పట్నాయక్  విషయమూ చెప్పేస్తానన్నమాట. మీ యిష్టం. మీరు నా షరతుకి వప్పుకొని పూర్తి మార్కులు ఇస్తాను అంటే చెప్పేస్తాను."
    "వద్దు వద్దు" అన్నాడు విజ్జీ- "ఇంకేం చర్చలూ వద్దు. మనం వెళ్లిపోవటానికి టైమయింది" అంటూ నావైపు తిరిగి, "మార్కులు వెయ్యి" అన్నాడు.
    నేను ఇబ్బందిలో పడ్డాను.
    ముగింపు తెలియకపోతే పట్నాయక్ చెప్పిందీ మంచి కథ. కానీ ఆ ముగింపు నాకు తెలుసునాయే! నా ఎదురుగా కూర్చున్నది పట్నయక్కే కదా! కానీ ఆ విషయం నా ఒక్కడికే తెలుసు.
    అందుకని అతడి కథకన్నా నాకు 'దుప్పట్లో మిన్నాగు' కొద్దిగా బావుందనిపించింది. మళ్ళీ ఇంకో భావం- బహుశా పట్నాయక్ కథ పూర్తిగా  తెలుసుకాబట్టి నాకు అలా అనిపిస్తుందేమో! ఆ కథకన్నా  ట్రూత్ టెల్లరే బావుందేమో అనిపించింది ఇంకోవైపు. జడ్జీ అన్న తర్వాత నిష్పక్షపాతంగా వుండాలి. కథని బట్టి మార్కులు వెయ్యాలి తప్ప మిగతా విషయాలు పట్టించుకోకూడదు.
    అంతలో నాకు "వరండా కుర్రాడు" కథ జ్ఞాపకం వచ్చింది. రాధని వూహించుకుంటున్నకొద్దీ ఆ కథకే మొదటి మార్కు వెయ్యాలనిపిస్తుంది.
    నేనిలా ఆలోచిస్తూ వుండగానే శేషూ అసహనంగా "ఐదుకథల్లో ఏది మంచిదో సెలక్ట్ చెయ్యటానికి ఇంత ఆలోచన ఏమిటి? తొందరగా" అన్నాడు.
    పెన్ను పట్టుకుంటే చేతులు వణకసాగాయి. తలెత్తి పట్నాయక్ వైపు చూసేను. నన్ను హిప్నటైజ్ చేస్తున్నవాడిలా సూటిగా చూస్తున్నాడు. నిజం చేపోద్దూ, నాకు కొద్దిగా భయం వేసిన మాట నిజమే. తలవంచి గబ గబా మార్కులు వేసి కాగితాన్ని విజ్జీగాడి ముందుకు తోసేను.
    'ట్రూత్ టెల్లర్' కి ఐదు మార్కులు.
    మిగతా ఒక్కోదానికి నాలుగు.
    విజ్జీ దాన్ని చూసి కోపంతో, "ఇది అన్యాయం" అని అరిచాడు.
    "- ఆయన నీ స్నేహితుడు కాబట్టీ, నిన్ను బిల్లు ఇవ్వకుండా రక్షించాడు కాబట్టీ, నువ్విలా ఆయనకథకి ఎక్కువ మార్కులేశావు" అని ఆరోపించాడు.
    పట్నాయక్ అతడిని శాంతింపజేస్తూ "ఆవేశపడకండి. మన మిత్రుడి మనసులో అటువంటి దురభిప్రాయం ఏదైనా వుంటే మనం 'ట్రూత్ టెల్లర్' తో  పట్టుకోవచ్చుగా" అని తన  మిషను నుంచి ఒక గొట్టం తీసి నా చేతికి కట్టాడు. "మీకు అన్ని కథల కన్నా నేను చెప్పిన కథే బావుందని చెపితే ఆ అబద్ధం వాళ్ళ నా రక్తప్రసరణ హెచ్చి, పట్టుబడిపోతానేమో! ఒకవేళ 'కాదు' అని చెపితే- మరిలా ఎందుకు వ్రాసేవు? అని స్నేహితులు నిలదీస్తారే! ఏం  చెప్పాలో తోచక కొట్టుమిట్టు లాడసాగేను.
    "తొందరగా  చెప్పు, అన్ని కథలకన్నా 'ట్రూత్ టెల్లరే' బావుందా" విజ్జీ నొక్కి అడిగాడు.
    ఊరిపి బిగపట్టి "అవును" అన్నాడు.
    అందరి దృష్టి మిషన్ మీదకు వెళ్ళింది.
    మిషన్ లో మార్పులేదు. అంటే నేను చెప్పింది అబద్ధం కాదన్నమాట. నా జడ్జిమెంటు కరెక్ట్ అన్నమాట.
    నా స్నేహితులు నలుగురూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
    అంతలో ఎయిర్ లైన్స్ వారి అనౌన్స్ మెంటు వినిపించింది. విమానం బయలుదేరటానికి సిద్ధంగా వున్నట్టు ప్రకటన మైకులో వినిపించింది. అందరికన్నా ముందు కదలింది శివ. "ఇంకెందుకు ఆలోచించటం" అంటూ జేబులోంచి డబ్బు తీసేడు. "మొత్తం పదహరోందలయింది బిల్లు. పట్నాయక్ పుణ్యమా అని- చాలా  పెద్ద కథ చెప్పాడు. అది వింటూ అందరం టెన్షన్ తో తెగ తాగేశాం. ఇదంతా నేనొక్కణ్ణీ ఇవ్వవలసివస్తే చచ్చి వుండేవాడిని."
    ఇక తప్పదన్నట్టూ నలుగురూ తలో నాలుగొందలూ తీసి ప్లేట్ లో వేసేరు. ఓడిపోయామన్న బాధ వాళ్ళ మొహాల్లో కనిపించింది. అంతకన్నా ఎక్కువ తమ రహస్యాన్ని మేము కనుక్కున్నామన్న ఉక్రోషం కూడా.
    ఎవరి లగేజి వారు తీసుకున్నారు. నేను విజ్జీవైపు తిరిగి "నువ్వూ దిబ్రూగడ్ కేనా?" అని అడిగాను.
    "ఉహూ, నేను అక్కడలేను. అక్కణ్ణించి ట్రాన్స్ ఫరయి సంవత్సరం కావస్తూంది" అన్నాడు.
    శివ అందరితోనూ అన్నాడు, "మనం కనీసం అప్పుడప్పుడు ఒకరి యోగక్షేమాలోకరం కనుక్కుంటూ వుంటే మంచిది. ఏదో సంవత్సరానికి ఒకసారి కలుసుకొని మందు కొట్టటం స్నేహం అనిపించుకోదు."
    "తెలుగు వాళ్ళకున్న అవలక్షణమే ఇది" అన్నాడు విజ్జి నా వైపు చెయ్యి సాచి.
    నేను వరసగా అందరికీ షేక్ హాండ్ ఇచ్చాను. వాళ్ళు పట్నాయక్ వైపు తిరిగి చెయ్యి సాచేరు. అతడూ కరచాలనంచేస్తూ, "ఫ్రెండ్స్!" అన్నాడు. ".....ట్రూత్ అనేది చాలా భయం కరమైనది. మనుష్యులు దాన్ని భరించలేరు. మీరూ భరించలేరు. కానీ దాన్ని ఆశ్రయించుకొని వున్న వాడికి ఎప్పుడూ ఆత్మ సంతృప్తి వుంటుంది. ఆ విషయం మాత్రం  గుర్తు వుంచుకోండి. మీకు తెలిసిన విషయాన్ని నిర్భయంగా వెల్లడించండి. కానీ మీకు వాస్తవం తెలియకపోతే - మీకు తెలిసిన  దానికి నాలుగు కల్పించి చెప్పకండి. అవతలివాడు దానికి నాలుగు కలుపుతాడు. కాబట్టి 'నిజం' నాలుగు- ఎనిమిది- పన్నెండు ౦ ఇలా ముక్కలై పోతుంది. పెద్దవాడిగా ఇదే నేను  మీకిచ్చే సలహా. రెండొందల రూపాయల కోసం సాటిమనిషి వెనుక రహస్య మంతనాలాడిన మీకూ, తన పత్రిక అభివృద్ది కోసం పట్నాయక్ ని హత్యకేసులో ఇరికించిన స్వామినాయుడుకీ ఏమిటి తేడా- చూసేరా, ఈ పోలికకే మీరెంత భయపడుతున్నారో- అందుకే బ్రదర్స్! ట్రూత్......ని...జం...... అంత భయంకరమైనది! విష్ యూ బెస్టాఫ్ లక్....."
    వాళ్ళ మొహాలు వాడిపోయిన వెంటనే తేరుకున్నారు. అతడి మాటల్లో నిజాయితీని గుర్తించినట్టు వాళ్లలో మార్పు కనిపించింది. విజ్జీ నావైపు తిరిగి "సారీ" అన్నాడు. నేనూ తేలిగ్గా నవ్వేస్తూ "ఇట్సాల్ రైట్" అన్నాను. ఒకరి తర్వాత ఒకరు కదిలిపోయారు.
    నేను చెయ్యి వూపాను. క్రమక్రమంగా వాళ్ళు అదృశ్యమయ్యారు. దూరంగా విమానం కనబడుతూంది. మేమిద్దరం మిగిలేం- రెయిలింగ్ పట్టుకుని.
    పట్నాయక్ నావైపు చూసి నవ్వాడు. 'ఇంకెప్పుడూ ఇలాటి వాటిలో ఇరుక్కోకు' అన్నట్టుంది ఆ నవ్వు. కాస్త సిగ్గుపడి "మిత్రుల్ని డిసప్పాయింట్ చెయ్యటం ఇష్టంలేక వాళ్ళ ఉత్తరం  అందుకుని వచ్చాను" అన్నాను.
    "ఊరికే అలా వెళ్తూ వెళ్తూ అద్దాల్లోంచి ఎందుకో తొంగి చూశాను. బిక్క మొహంతో నువ్వు కనబడ్డావు. విషయం అర్థమైంది. సరే సాటి కులస్తుడివి కదా- నిన్ను రక్షిద్దామని నేను రంగంలో ప్రవేశించవలసి వచ్చింది" అన్నాడు.
    "వాళ్ళు బయటకు వెళ్లి విడివిడిగా వాళ్ళ కథల ముగింపులు చెప్పుకుంటారని నేననుకోలేదు. మనుష్యుల్లో నిజాయితీ ఇంత చచ్చిపోతుందని నేను ఊహించుకోలేకపోయాను" అన్నాడు.
    "నువ్వు నీ కథ ముగింపు కూడా ఆ నలుగురికీ చెప్పాల్సింది. భయంతో గుండె ఆగి చచ్చేవాళ్ళు" అన్నాడు.
    "ఏది? అరుంధతి పుట్టింటికి వెళ్ళిపోవటం సంగతా? వితంతు వివాహ ప్రాత్సాహ సంఘానికి అధ్యక్షురాలవటం సంగతా?"
    "కాదు. డాక్టర్ విలియమ్స్ ఆపరేషన్  అయిదు  రోజుల తరువాత దారుణంగా  ఫేలయిన సంగతి. నిజంగా డాక్టర్  విలియమ్స్ లాటి  సూడో మేధావుల వల్లే కదా మనం  సంఖ్యాపరంగా పెరుగుతున్నది" అన్నాడు.
    టాపిక్  మారుస్తూ నేను "నాకో విషయం అర్థంకాలేదు......" అన్నాను.
    "ఏమిటి?"
    "నిజంగా మీ కథకి ఫస్టుమార్కు వేసేముందు చాలా తటపటాయించాను. కాని ఆ విషయాన్ని మీ మిషను పట్టుకోలేదు."
    "అబద్ధం  చెప్తే, లా చెప్పినప్పుడు పెరిగే రక్త ప్రసరణాన్ని మాత్రమే ణా  మిషను పట్టుకోగలదు. శరీరంలో రక్తం ఘనీభవించి వుంటే ణా మిషనేం చెయ్యలేదు."
    నేను కొద్దిగా తటపటాయించి, "మీ కథ వింటూంటే నాకూ ఆ అనుమానం మిగిలిపోయింది" అన్నాను.
    "ఏమిటి?"
    నసుగుతూ, "అదే వైజయంతి ఏమైంది?" అని అడిగాను. అతను బిగ్గరగా నవ్వి- ఇంకే థ్రిల్స్ జోలికి పోకుండా "మామూలుగా  ఉద్యోగం చేసుకుంటూ వుంది, పోతే ణా ఫోటోకి దండవేసి ఇప్పటికీ గదిలో పెట్టుకుంది. చచ్చిపోయే ముందు డెత్ స్టేట్ మెంట్ యిచ్చి రక్షించినందుకు కృతజ్ఞతా సూచకంగా" అన్నాడు.
    విమానం గాలిలోకి లేస్తూ ఉంటే చూస్తూ నిలబడ్డాం. ఆ నిశ్శబ్దంలోంచి పట్నాయక్ అన్నాడు- "నువ్వూ ఈథ్రిల్స్ ఇక మానెయ్యి బ్రదర్. ఆ నలుగుర్లో ఏ  ఒక్కరికైనా మనిద్దరిలో కనీసం ఒకరి సంగతి తెలిసినా కథ మొదట్లోనే ఆగిపోయేది. అప్పుడా కథే మనం చెప్పిన అయిదు కథల కన్నా గొప్ప సస్పెన్సు థ్రిల్లరయ్యేది."
    "అవును. అప్పుడా మొత్తం కథ పేరు 'నవమాలిక' అయ్యేది."
    అతడు నా మాటలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా, టేకాఫ్  అవుతున్నా విమానం  వైపు చూపిస్తూ సాలోచనగా అన్నాడు- "ఈ మనుష్యులున్నారు చూసేవూ వీళ్ళు మనకన్నా దుర్మార్గులు. మనం కాదు పీక్కుతినేది. వీళ్ళే! సాటి మనిషిని పీక్కుతినేది వీళ్ళే. రకరకాల వ్యక్తులు...... రకరకాల మనస్తత్వాలు...."
    నిజమే అనిపించింది. సాటిమనిషి పక్క దుప్పట్లో పాము దూరి వుంటే దాన్ని థ్రిల్ గా తీసుకున్న కామాక్షమ్మ. యాభైవేల కోసం నడి సముద్రంలో దూకిన దైవాధీనం, తన వయసులో సగం కూడా లేని అమ్మాయిని పెళ్ళాడటానికి మానవాతీత శక్తుల పేరిట మోసం చేయబోయిన మెజీషియనూ, ఎదురింటి శ్రీమతికి, పక్కింటి కుర్రాడికి ఏదో సంబంధం వుండే వుంటుందని ఎప్పుడూ తలుపు సందుల్లోంచి తొంగిచూసే పరంధామయ్య, మనిషి నుంచి కన్ను, మెడకు వేరుచేసి చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోవాలన్న కోర్కెతో ఆపరేషన్ టేబుల్ మీదే పేషెంట్ ని చంపేసిన డాక్టర్ విలియమ్స్..... మా కన్నా ఏ విధంగా గొప్పవాళ్ళు? మేమే నయం.
    "ఏమిటాలోచిస్తున్నావ్?"
    "ఈ మనుష్యుల గురించి."
    పట్నాయక్ బిగ్గరగా  నవ్వి, "వాళ్ళ గురించి ఆలోచించటానికి చరిత్రకారులు, విప్లవకారులు, రచయితలూ, రాజకీయ నాయకులూ ఇందరుండగా మనం దేనికి-? పద పోదాం. నువ్వెటు?" అన్నాడు.
    "దిబ్రూగడ్"
    "నేనూ అటే, పద పోదాం......."
    ఇద్దరం చుట్టుప్రక్కల అటూ ఇటూ చూసి. మమ్మల్నెవరూ గమనించటంలేదని నిర్థారించుకుని, గాలిలోకి లేచి, విమానం పక్కనుంచి దిబ్రూగడ్ వైపు సాగిపోయాం.
                                                      (శుభం)

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra