Home » Vasireddy seeta devi novels » Dr Vasireddy Sitha Devi Rachanalu - 4


    కాని, యీనాడు తనలో కొత్త ఆశలు చిగురిస్తున్నవి. ఆ ఫోటో చంద్రానిదే! అతడు తిరిగి వస్తాడు! చంద్రం యిన్నేళ్ల తరవాత తననింకా మరిచిపోకుండా జ్ఞాపకం వుంచుకొని వుంటాడా? ఆ రోజున చంద్రం తనను ఎంత బతిమాలినా, కట్లు విప్పలేదు. తన క్రౌర్యానికి చంద్రం తననెంత అసహ్యించుకొని వుంటాడు? కట్లిప్పటంద్వారా, తన హృదయ మార్దవాన్ని కనబరిచి, అలగాపిల్ల చంద్రం హృదయంలో ఒక స్థానం ఏర్పరచుకొన్నదేమో! ఒకవేళ, వాళ్లిద్దరూ కలిసే పారిపోయారేమో! ఊహుఁ - అలా ఎన్నటికీ జరగదు. కానీ.... ఈసరికే చంద్రం మరెవరినైనా వివాహం చేసుకొని వుంటే!

 

    ఈ భావం మనసులోకి రాగానే, హేమ నిలువెల్లా కంపించిపోతూ, యిక ఆలోచించలేక, పుస్తకాల బీరువా దగ్గిరకు వెళ్ళి, ఓ పుస్తకం తీసి ఓ క్షణకాలం దానికేసి చూసి కిందికి జారవిడిచి, తిరిగివచ్చి కుర్చీలో కూర్చున్నది.  

 

    ఆ తరవాత హేమ ఎక్కడ ఆలోచించకుండానే, ఒక దృఢనిశ్చయానికి వచ్చింది. ఏది ఏమైనా చంద్రాన్ని గురించి తెలుసుకోకుండా వూరుకోవటమే మంచిది! ఒకవేళ తానింకా అతడికి గుర్తుంటే అతడికై అతడే తనకోసం తిరిగివస్తాడు. అలా కానప్పుడు తను అతడికోసం బాధపడటం వృధా....

 

    హేమ తానంతకుముందు రాసిన రెండు వుత్తరాలను చింపి, కిటికీలోంచి వీధిలోకి విసిరివేసింది. ఒక వారంరోజులాగి, తండ్రికి ఆ వుత్తరాలకు జవాబు రాలేదని చెప్పేందుకు నిశ్చయించుకున్నది.

 

                                                                                        9

 

    మద్రాస్ మెయిల్ అరవయి మైళ్ళ వేగంతో పరుగెడుతూంది. మొదటి తరగతి పెట్టెలో ప్రయాణం చేస్తున్న చంద్రం బుర్రలో ఆలోచనలు అంతకన్నా వేగంగా పరుగెడుతున్నాయి. అతని కళ్ళు యాంత్రికంగా చేతిలోవున్న దినపత్రిక మీదకు మరలాయి.

 

    దినపత్రిక చివరిపేజీలోని ఫోటోమీద అతని కళ్ళు ఓ క్షణకాలం నిలిచాయి. కింద రాసిన అక్షరాలను పదేపదే చదువుకున్నాడు.

 

    'చంద్రమోహన్ 'సాహిత్యమూ - సాంస్కృతిక విలువలూ' అనే గ్రంథానికి సాహిత్య అకాడమీ ద్వారా 5,000 రూపాయలు బహుమతి లభించింది. ఒక సుప్రసిద్ధ ప్రకాశన సంస్థ ఆ గ్రంథానికి రాయల్టీగా పది వేల రూపాయలు ఇచ్చి ప్రచురణ హక్కులను పొందింది."

 

    ఇది చదువుకొన్న అతని కళ్ళు ఆనందంతో, ఏదో సాధించానన్న సంతృప్తితో మెరిసిపోతున్నాయి. హృదయంలోని ఉత్సాహం ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నది.

 

    ఎనిమిది సంవత్సరాలనాడు తిరస్కారాన్నీ, అవమానాన్నీ, అపవాదునూ నెత్తికెత్తుకొని ఇల్లు విడిచి ఊరు విడిచి వెళ్ళిపోయిన పదిహేను సంవత్సరాల అర్భకుడు, చంద్రశేఖరే చంద్రమోహనై, ఈనాడు సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకొని, విజ్ఞాన విద్వత్తులను ఆర్జించి, చూసేవారిని నిముషంలో ఇట్టే ఆకర్షించగల వ్యక్తిత్వంతో తిరిగి తను పుట్టిపెరిగిన గడ్డమీదకు వస్తున్నాడు.  

 

    నా అనేవాళ్ళు తనకు ఎలాంటి సహాయం చెయ్యకపోయినా తను స్వయంకృషితో ఇంతవాడయాడు. భారతదేశంలో రచయితలుగా జీవిస్తూ మొదటి తరగతి పెట్టెలో ప్రయాణం చెయ్యగలవారు ఎందరుంటారు? కాని ఈనాడు తను కావాలనే ఓ కొత్త అనుభవంకోసం మొదటి తరగతిలో ప్రయాణం చేస్తున్నాడు. ఆలోచిస్తూనే చంద్రం సిగరెట్టు వెలిగించాడు. కిటికీనుంచి బయటకు చూశాడు.

 

    చిక్కని తెల్లని వెన్నెల పాముకుబుసంలా ఆకాశం నుంచి కొండశిఖరాల మీదగా పాకుతూ, చెట్లకొమ్మల సందుల్లో నుంచి జారుతూ నేలంగా తెల్లని దుప్పటిలా పరుచుకుంటూ ఉన్నది. వనస్పతులు తలలు వంచి నిద్రిస్తున్నాయి. సృష్టిలో వెతికినకొద్దీ సౌందర్యం కనిపిస్తోందనీ, సౌందర్యమే సృష్టికి సింగారమనీ మొదటిసారిగా అనిపించింది చంద్రానికి. ఇంతకు ముందుకూడా తను ఎన్నో వెన్నెల రాత్రులను చూశాడు. కాని ఇంత అందాన్ని ఎన్నడూ చూడలేదు. ఈ అందం, ఈ వెన్నెలా, తనలో ఎన్నడూ కలగని ఓ విచిత్రమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. కారణం? మానవునికి అతని మానసిక పరిస్థితికి అనుకూలంగా ప్రకృతి కనిపిస్తుందేమో?

 

    ఆలోచిస్తున్న చంద్రశేఖర్ కు రైలు ముందుకు పరుగెడుతూంటే సమస్త సృష్టి వెనక్కు పరిగెడుతున్నట్లనిపించింది. అతని ఆలోచనలు కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాల వెనక్కు పరుగెత్తసాగాయి.  

 

    ఆనాడు కూడా సరిగ్గా ఇదే మెయిలులో - కాని ఎదురు దిక్కుగా ప్రయాణం చేస్తున్నాడు. ఆనాటి తన జీవితానికి, ఈనాటి తన జీవితానికీ ఉన్న వైవిధ్యమే ఆనాటి తన ప్రయాణానికీ, ఈనాటి తన ప్రయాణానికీ ఉంది. ఆనాడు దొంగతనం చేశాడనే అపవాదును నెత్తికెత్తుకొని ఇంటినుంచి పారిపోయిన పదిహేను సంవత్సరాల బాలుడు, వచ్చీరాని వయస్సు, తెలిసీ తెలియని జ్ఞానం, అర్థం ఆయీ కాని ప్రపంచం, అటు చిన్నవాడూ కాదు, ఇటు పెద్దవాడూ కాదు, ఆ వయస్సులో లోకంనుంచి పసిపిల్లలకు లభించే ప్రేమా, జాలీ లభించవు సరిగదా - అటు పెద్దవారికి లభించే గౌరవమూ లభించదు. ఇంటినుంచి దొంగగా పారిపోయిన బాలుడు లోకం దృష్టిలో ఏమయినా కావచ్చును; లేక అసలు ఏమీ కాకపోవచ్చు. 

     

    ఆనాడు తను మూడవ తరగతి పెట్టెలో చాలీచాలని చోటులో, కిటికీకి దగ్గరగా చలికి ముడుచుకొని, మోకాళ్ళమీద గడ్డం ఆనించి కూర్చొని వున్నాడు. తను ఒంటరిగా ఆ వయస్సులో అలా ప్రయాణం చెయ్యటం పెట్టెలోని చాలామందిలో కుతూహలాన్ని రేకెత్తించినమాట నిజమే. తన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటం చూసి మళ్ళీ ఎవరిగొడవల్లో వాళ్లు పడిపోయారు. తన దగ్గరకు వచ్చి ప్రేమగా ఆప్యాయంగా పలకరించినవాళ్ళు లేరు. బహుశా తనను ఏదో గాలిరకం అనుకొని వుంటారు. హృదయంలో భయం, బాధ, కళ్ళలో కన్నీటి మేఘాలు, బయట కన్ను పొడుచుకున్నా కనిపించని కారుచీకటి తన భవిష్యత్తులాగే ఉంది. ముఖంమీద పడుతున్న వానజల్లుతో తన కన్నీరు కలసి ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు అదంతా తనకు ఒక పీడకలలా జ్ఞాపకం ఉంది.   

 

    కాని ఈనాడు, తను ఇంత కావటానికి ఎవరు కారణం? ప్రకాశం తండ్రి, ప్రకాశం వాళ్ళ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేడు. ప్రకాశం తండ్రి ఆ ఆరువందలూ యివ్వకపోతే, తను గురుకుల్ కు వెళ్ళకపోతే ఏమయి ఉండేవాడు? క్రమంగా ఏ జేబులు కొట్టే దొంగగానో మారివుండేవాడు. సంఘటనల చక్రంలో పడి నిరంతరం నలిగిపోయే మనవ జీవితం ఎప్పుడు ఏ రూపాన్ని ధరిస్తుందో ఎవరూ చెప్పలేరు. మానవుడు సన్మార్గుడు కావటానికి కారణాలూ, పరిస్థితులూ పక్కపక్కనే పోటీపడి నడుస్తూ ఉంటాయేమో?  

 

    తను ముందు ప్రకాశం ఇంటికే వెళ్ళాలి. అంతకంటే తనకు ఆప్తులు ఎవరున్నారు కాబట్టి? ఇప్పుడు తనదగ్గర పదివేలరూపాయల చెక్కు ఉంది. దాన్ని అలాగే ప్రకాశం తండ్రికి కృతజ్ఞతతో సమర్పించుకుంటాడు. ఆనాడు వాళ్ళు తనకు చూపెట్టిన ఆదరణముందు ఈ పదివేలు ఎంత? ప్రకాశం ఏం చేస్తున్నాడో? చదువుకొని ఏదైనా ఉద్యోగంలో ఉండివుంటాడు. తను గుంటూరులో ఉన్నంతకాలం, తన భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకొనేంతవరకూ తను ప్రకాశంతోనే వుంటాడు.  

 

    జీవితంలో కొందరు వ్యక్తులు చేసిన సహాయం జీవితాంతం ఋణం తీర్చుకోలేనిదిగా మిగిలిపోతుంది. తను ఏం చేసినా వాళ్ళ ఋణం తీరదు.

 

    తన భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉన్నవాళ్ళు తమ బాధ్యతను నిర్వహించలేకపోయారు. తను పారిపోతే అన్నయ్య తనను వెతికించటానికి ఏం ప్రయత్నం చేశాడు? ఎందుకు ప్రయత్నిస్తాడు? తను వెళ్ళిపోతే ఆస్తిని భాగించవలసిన పని వుండదు. మానవుడు డబ్బు తన కోసం అనే విషయాన్ని మర్చిపోయి తనే డబ్బుకోసం జీవిస్తున్నట్లనుకుంటాడు. మళ్ళీ ప్రతి ఒక్కరూ డబ్బును గురించి పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పిన నీతి కథలను విన్నవారే. ప్రతినిత్యం జీవితమే డబ్బుగా భావించి, కాపీనంతో ఎన్నో పాపాలుచేసి డబ్బు కూడబెట్టి, ఠపీమని ఏ జబ్బూ లేకుండా చచ్చేవాళ్ళను కళ్ళముందు చూస్తూనే ఉంటారు. సికిందరు చనిపోయేప్పుడు చెప్పాడట; తన రెండు చేతులూ శవపేటిక నుంచి బయటకు అందరికీ కనిపించేలా పెట్టమని. అంటే - విశ్వాన్ని జయించిన తను కూడా చివరకు వట్టిచేతులతోనే వెళుతున్నానని ప్రపంచానికి చెప్పాలని అతని ఆశయం. కాని ఆ జ్ఞానోదయం అతనికి ఎప్పుడు కలిగింది? చివరి నిముషంలో, బహుశా దాన్నే శ్మాశాన వైరాగ్యం అంటారేమో?  

 

    డబ్బు లేనివాడికి ఇతరులకు ఇవ్వటంలో, ఉన్నవాడికి వీలయినంతవరకు ఇతరులనుండి గుంజుకోవటంలోనే ఆనందం కలుగుతుందేమో! ప్రకాశం కుటుంబానికి ఎలా ఇవ్వటమో తెలిస్తే, తన కుటుంబానికి ఎలా తీసుకోవటమో తెలుసు. మనిషికీ - మనిషికీ ఉండే సున్నితమైన సంబంధాన్ని డబ్బు వ్యామోహం తెంచివేస్తుందేమో! ఈనాడు తను జన్మభూమికి తిరిగి వస్తున్న కారణాలు రెండు: ఒకటి ప్రకాశంనూ, అతని తండ్రిని చూసి తన కృతజ్ఞతను తెలుపుకోవటం. రెండు హేమా ప్రసాదరావు గారల ముందు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటం.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra