"ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలంతో చచ్చిపోతున్నారు. ఎవరి నోట విన్నా ఆ కథ గురించే!"
ప్రసాద్ మౌనంగా భోజనం చేస్తున్నాడు.
"నన్ను ఒకటే చంపేస్తున్నారు."
"మధ్యలో నిన్ను చంపెయ్యడమేమిటి?"
"ముంగింపు చెప్పమని!"
"నీకెలా తెలుస్తుంది? అది రాస్తుంది నువ్వు కాదని చెప్పు."
"అదికాదు నాన్నా!"
"మరేమిటి?"
"మిమ్మల్నడిగి చెప్పమంటున్నారు?"
"నువ్వు చెబుతానని ప్రామిస్ చేశావా?"
"అవును!"
"ఇంకెప్పుడూ అలాంటి తెలివితక్కువ ప్రామిస్ లు చెయ్యకు. సీరియల్ ఎండింగ్ ఎవరైనా ముందే చెప్తారా?"
సూర్యం ముఖం చిన్నబుచ్చుకున్నాడు.
ఏదో అనడానికి తలెత్తిన భార్య భర్త ముఖం చూసి ఆగిపోయింది.
అతను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
దిగులుగా ఉన్నట్టు కన్పిస్తున్నాడు.
ఎందుకో చాలా కృంగిపోతున్నాడు.
"ధరణి ఎడిటర్ నా దగ్గరకు వచ్చాడు."
"నాచేత తమకో నవల రాయించమని అడగడానికా?"
"అవును!"
"అతనికి కూడా ప్రామిస్ చేశావా?" తీవ్రంగా ఉంది ప్రసాద్ కంఠం.
"లేదు." ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు కొడుకు.
"రాయకూడదూ?" కృష్ణవేణి అన్నది.
"పన్నెండు వేలు ఇస్తానన్నాడు!" చిన్నతనంనుంచి దరిద్రాన్ని అనుభవించిన సూర్యం అన్నాడు.
కొడుకు మనసులోని భావం అర్థం చేసుకున్నాడు.
"సూర్యం!" మృదువుగా పిల్చాడు.
సూర్యం తలెత్తాడు.
"ఇక నేను వ్రాయనక్కర్లేదు. ఈ ఒక నవలతో మన దరిద్రం తీరిపోతుంది. హాయిగా బ్రతకవచ్చు."
ప్రసాద్ మాటలకు అర్థం బోధపడక తల్లీకొడుకులు ముఖముఖాలు చూసుకొన్నారు.
ఇద్దరిలో ఎవరికీ మళ్ళీ ప్రశ్నించే ధైర్యం లేదు.
ప్రసాద్ ఆ రాత్రంతా మధనపడ్డాడు.
తను తప్పు చేస్తున్నాడా? ఆ నవల వ్రాయవలసిందికాదు!
అది చదివి ఎంతమంది పిచ్చివాళ్ళవుతారో?
ఒకవైపు భయపడుతూనే ఎందుకు చదువుతారో? కేవలం థ్రిల్ కోసం, కుతూహలం కొద్దీ చదువుతారు. మళ్లీ మళ్లీ అలాంటివే కోరుకొంటారు.
'ఒక నవల చదివి మనిషి మార్తాడా?' అని ఎందరో ప్రశ్నిస్తారు.
ఇలాంటి నవలల ప్రభావం బలహీనమైన మనుషుల్ని కుదిపేస్తుందనే విషయం నిర్వివాదం. అమరూ అంగీకరించేదే.
ఈ విషయం వ్రాసేవాళ్లకీ, అచ్చువేసేవాళ్ళకూ, చదివేవాళ్ళకూ కూడా తెలుసు. చివరకు నష్టపోయేది చదివేవాళ్ళే!
ఈ నవల అచ్చు ప్రారంభం అయినప్పట్నుంచీ తనను తిడుతూ చాలామంది ఉత్తరాలు వ్రాస్తున్నారు. వాళ్లు మామూలుగా పత్రికలు చదివే పాఠకులు కారు. తను దయ్యాల కథ వ్రాస్తున్నట్టు విని నమ్మలేక చదువుతున్నవాళ్లు. వాళ్లు అలా తిట్టి రాస్తుంటే తనకు కోపం రావడంలేదు.
ఇక సాధారణ పాఠకుల ఉత్తరాలు పత్రికలో అచ్చు అయినవి కాగా, తనకు పుంఖానుపుంఖాలుగా వచ్చి పడిపోతున్నాయి. వాటిని తను చదవకుండానే చింపిపారేస్తున్నాడు.
ఆ నవల ముగింపు గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు. నిద్రనుంచి కలలోకి. ప్రసాదుకు తను పిశాచాల లోకంలో ఉన్నట్టు రకరకాల, వింత వింత కలలు రాసాగాయి.
15
ప్రసాద్ వ్రాసి యిచ్చినంతవరకు సీరియల్ పూర్తి అయింది.
చివరి సంచికతోపాటు, ప్రసాద్ ఎడిటర్ పేరుమీద ఇచ్చిన నోట్ కూడా ప్రచురించారు.
ఆ నోట్ చదివిన పాఠకుల్లో సంచలనం బయలుదేరింది.
రెండు వారాలు వ్యవధి ఇచ్చి, అధిక సంఖ్యాక పాఠకుల కోరిక మేరకు ఆ నవల ముగించడమా, లేక అసంపూర్ణంగానే ఆపడమా అనేది ఆధారపడి ఉంటుందని కూడా ప్రకటించారు.
ఆ నోట్ చదివిన కృష్ణవేణికి మతిపోయినట్టే అయింది.
ప్రసాద్ తో ఇక పాడు నవల వ్రాయోద్దని మొత్తుకుంది.
ఆమెకు అతను చిరునవ్వే సమాధానంగా ఇచ్చాడు.
ఆమె ఏడ్చింది.
గోల చేసింది.
"పిచ్చిదానా! నవల వ్రాస్తే చచ్చిపోతానా? ఇదో స్టంట్!" అంటూ భార్యకు సర్దిచెప్పాడు. ఆమె మనసు తేలిక పడింది. ఆమెతో ముగింపు విషయంలో ఎవరి దగ్గరా మాట్లాడవద్దని చెప్పాడు.
ఆ నోట్ చదివి కమలకు కుతూహలం పెరిగింది.
నిజంగా డాడీ చచ్చిపోతారా?
అలా చచ్చిపోతే చాలా గొప్ప పేరు వస్తుంది. డాడీ గురించి పేపర్లలో రాస్తారు. రేడియోలో చెబుతారు. టి.వి.లో కూడా చూపిస్తారు. ముఖ్యమంత్రి కూడా ఇంటికి వచ్చి.....
"ఏమిటమ్మా ఆలోచిస్తున్నావ్?" ప్రసాద్ ప్రశ్నించాడు. అప్పుడే లోపలకు వచ్చింది.
"డాడీ, మీరు నిజంగా చచ్చిపోతారా?" కుతూహలంగా అడిగింది కమల.
ప్రసాద్ నవ్వాడు.
"మీరు ఆ నవల ముగించరా?" ఆతృతగా అడిగింది.
ప్రసాద్ కూతురి ముఖంలోకి చూశాడు.
"మా స్నేహితురాళ్ళంతా ఒకటే గోల!"
"ఏమని?"
"అయ్యో! కథ మంచి సస్పెన్సుతో ఆగిపోయిందనీ, పూర్తిగా తెలుసుకోనంతవరకూ అశాంతిగా నిద్ర పట్టదనీ గోల..."
"పూర్తి చెయ్యమంటావా?"
"చెయ్యండి!" ఉత్సాహంగా అన్నది కమల.
"నేను చనిపోయినాసరే..."
"పోండి డాడీ! ఎక్కడైనా నవల రాస్తే చనిపోతారా ఏం?"
"అవును, చనిపోతారు."
"దయ్యాలు పడ్తాయనేగా భయం! బోలెడు మంది మంత్రగాళ్ళు ఉన్నారు" అన్నది కమల.
ప్రసాద్ కూతురి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
తన కూతురు కూడా ఈనాటి పాఠకులకు ప్రతినిధే!
"రాస్తావుగదూ?"
"రాస్తాను."
"నా స్నేహితులు బలే సంతోషిస్తారు. మా నాన్న నేను బలవంతం చెయ్యడం వల్లే వ్రాస్తానన్నారని చెబుతాను." కళ్ళు తిప్పుతూ గర్వంగా అన్నది కమల.
అప్పుడే వచ్చిన సూర్యాన్ని ప్రసాద్ లోపలకు పిల్చాడు.
అతడి ముఖంలో విచార రేఖలు కన్పిస్తున్నాయి.
"అలా ఉన్నావేం?"
"ఆ ఎడిటర్ నోట్ ఏమిటి?" విసుగ్గా అన్నాడు.
"ఏం?"


