"నన్నేం చూస్తారు !"
"నీ నవల చదువుతున్నారు, రాత్రిళ్ళు నిద్రకూడా పట్టడంలేదట."
"పాపం! చదవ్వద్దని చెప్పు."
"అదేంటి నాన్నా ! ఆ నవల వాళ్ళకు ఎంతో నచ్చిందట. అంత సస్పెన్సుతో ఇంతవరకూ ఏ నవలా రాలేదట."
"అలాగా !" నిర్లిప్తంగా అన్నాడు.
"వాళ్ళను పిలవనా ?"
"వద్దు."
"నిన్ను ఏదేదో అడగాలని వచ్చారు."
"వాళ్ళ ఇడియాటిక్ ప్రశ్నలకు సమాధానం నేను ఇవ్వనని చెప్పు." విసుగ్గా అన్నాడు ప్రసాద్.
"ప్లీజ్, నాన్నా !"
"అది అంతగా ముచ్చట పడ్తుంటే కాసేపు మాట్లాడరాదూ?" కృష్ణవేణి సిఫార్సు చేసింది.
"అందులో ఏ పిల్లయినా నన్ను ప్రేమిస్తున్నానంటే ఎలా ?"
"ఛ ! అవేం మాటలండీ ? వాళ్ళంతా మన అమ్మాయి తోటి వాళ్ళు."
"అయితే మరీ డేంజరు! ఆ ఈడువాళ్ళే ఎవర్నయినా ఇట్టే ప్రేమించేయగలరు-ముఖ్యంగా రచయితల్ని."
"వాళ్ళు అలాంటివాళ్ళు కాదు నాన్నా !"
"నన్ను విసిగించక వెళ్ళు. మళ్ళీ ఎవర్నీ ఇలా ఇంటికి తీసుకురాకు." కోపంగా దాదాపు అరిచినట్టే అన్నాడు.
"నేను తీసుకురాలేదు. వాళ్ళే వచ్చారు." గుణుస్తూ అన్నది కమల.
"అయితే వెళ్ళిపొమ్మని చెప్పు!" గట్టిగా అన్నాడు.
కమల ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయింది గొణుక్కొంటూ.
"అది ఎంత చిన్నపుచ్చుకొందో చూడండి. కాసేపు వాళ్ళతో మాట్లాడితే మీ కొంపేం మునిగిపోతుంది ? అంతకుముందు మిమ్మల్ని కలవడానికి ఎంతమంది వచ్చేవాళ్లు! గంటలకొద్దీ అన్నం, నీళ్లు మర్చిపోయి మాట్లాడేవారుగా?"
"వాళ్లు వేరు. వాళ్లు ఇలాంటి ఇడియట్స్ కాదు. ఈ నవల చదివి వాళ్ళు రారు."
కృష్ణవేణికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు.
"అంత బాధగా ఉంటే నువ్వు మాట్లాడరాదూ?" ఏ భావం లేకుండా అన్నాడు.
"నేనేం మాట్లాడతాను?" రాగం తీసింది కృష్ణవేణి.
"రచయిత భార్యగా మాట్లాడు. వాళ్లు వేసే ప్రశ్నలకు నువ్వు చాల్లే సమాధానాలు ఇవ్వడానికి!"
"చాల్లెండి సరసం !"
"సరసం కాదు, నిజమే చెబుతున్నాను, కృష్ణా!"
"నేను అసలు ఆ నవల చదవలేదు. రెండు వారాలు చదివాను. రాత్రిళ్ళు నిద్రపట్టక మానేశాను. అయినా ఆ నవలేంటండీ! ఆ దయ్యాలూ-భూతాలూ-ఇంతకు ముందెప్పుడైనా ఇలాంటివి రాశారా?"
"అందుకేగా ఇంతపేరు-ఇంతడబ్బూ ! వీళ్ళంతా కూడా ఆ నవల చదివేగా వచ్చారు? మన ఇంటి పరిస్థితులు కూడా చక్కబడ్డాయి."
"అవును! ఇంకా వేరే పేపరువాళ్లు కూడా అడుగుతున్నారు. వ్రాయకూడదూ?"
"ఎందుకు వ్రాయాలి? డబ్బుకోసమేగా?"
'అదేం ప్రశ్నా' అన్నట్టు చూసింది కృష్ణవేణి.
"డబ్బుకోసమేగా?" రెట్టించాడు.
"అవునండీ! ఇంత కాలానికి మళ్ళీ నేలమీద ఆనుతున్నాయి. పిల్లకు పెళ్ళి చెయ్యాలి. డబ్బుకోసమే వ్రాయండి. అందరూ వ్రాయడం లేదూ? ఆ పిచ్చిసన్నాసి ఎక్కడున్నాడో!" పారిపోయిన కొడుకుని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్నది భార్య.
"కృష్ణా, నన్ను విసిగించకు!" విసుగ్గా అన్నాడు.
కృష్ణవేణి భర్తముఖం చూసి వెళ్ళిపోయింది.
ఆలోచనలో పడింది.
ఈమధ్య ఈ మనిషి అదోలా ఉంటున్నాడేం?
ఏదో దిగులుగా ఉంటున్నాడు.
బయటిముఖం చూడటంలేదు.
ఏదో తప్పు చేసినట్టు బాధపడ్తున్నాడు.
ఒక మాటామంతీ లేదు.
ఇరవై నాలుగ్గంటలూ పుస్తకాలు ముందేసుకొని కూర్చోవడం. ఆర్థికంగా ఇబ్బందిపడినప్పుడు కూడా ఇంత దిగులుగా కన్పించలేదు.
వ్రాయడం కూడా పూర్తిగా మానేశాడు.
కృష్ణవేణికి భర్త వాలకం అర్థంకాక మధనపడసాగింది.
ఏవేళప్పుడు ఈ పాడు దయ్యాల కథ మొదలుపెట్టాడో! అప్పట్నుంచే మనిషి అదోలా ఉంటున్నాడు.
13
"ఏమండీ, ఇది విన్నారా?"
ఒక రోజు రాత్రి భర్తతో అన్నది కృష్ణవేణి ఆసక్తిగా.
ప్రసాద్ ప్రశ్నార్థకంగా చూశాడు.
"కాంతమ్మపిన్ని అత్తగారు మీ నవల చదివించి వింటున్నదట."
"అయితే ఏమంటావ్?"
"ఆమె మతిపోయినట్టుగా ప్రవర్తిస్తోందట. డెబ్బయ్ ఏళ్ల ఆవిడ రాత్రిళ్లు వంటరిగా పడుకోవాలంటే భయపడుతోందట. కన్ను మూస్తూనే పిచ్చిమాటలు మాట్లాడుతోందట! చచ్చినవాళ్ళు తనచుట్టూ చేరుతున్నట్టు చెబుతుందట."
"అలాగా?" సాలోచనగా అన్నాడు.
"ఆమెకు రోజూ రాత్రిళ్ళు ఏనాడో చచ్చిపోయిన భర్త కన్పిస్తున్నాడట!"
"మంచిదేగా!"
"అదికాదండీ! రాత్రిళ్లు ఎవర్నీ నిద్రపోనివ్వడం లేదట. పెద్దగా భర్తని తిడుతూ అరుస్తూ ఉంటుందట. ఈ వయసులో ఈ బుద్ధు లేమిటంటూ ఒకోసారి మురిపెంగా మందలిస్తుందట. ఆమెకు మతిపోయిందనీ, ఆ నవల చదివి ఆమెకు విన్పించినందుకు, ఆమె కొడుకు కోడల్ని తిట్టి పోస్తున్నాడట."
"నీ కెవరు చెప్పారూ?"
"వాళ్ళ కోడలే చెప్పింది."
"నన్ను తిట్టిందా?"
"ఇది మరీ బాగుంది! మిమ్మల్నెందుకు తిడుతుంది?"
"మనసులు పోగొట్టే నవల రాస్తున్నందుకు!"
"ఆమెకు మీ నవల చాలా బాగుందట. పత్రిక రాగానే ఇంట్లో అందరూ నేను ముందు చదవాలంటే నేను ముందు చదవాలని కొట్లాడు కుంటున్నారటండీ!" గొప్పగా చెప్పింది భార్య.
"వద్దని చెప్పు! వాళ్ళకు కూడా మతిపోతే వాళ్ళూ బాధపడాలి."
"ఏమిటండీ మీ మాటలూ మీరూనూ"
"నిజం కృష్ణా! నీకు తెలిసిన వాళ్ళందరితో ఆ నవల చదవ్వద్దని చెప్పు."
కృష్ణవేణి భర్త ముఖంలోకి చిత్రంగా చూసింది.
అతను అదేమీ పట్టించుకొన్నట్టు లేడు.
అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు.
14
"నాన్నా!"
ప్రసాద్ తలెత్తి చూశాడు.
భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు సూర్యం తండ్రితో ఏదో చెప్పే ప్రయత్నంలో తబ్బిబ్బైపోతున్నాడు.
"ఏమిట్రా?"
"మీ నవల మా ప్రెస్ లోనే ప్రింటవుతోంది."
"అయితే?"
"కంపోజిటర్స్ బలే సస్పెన్సుతో నడుస్తోంది అంటున్నారు."
ప్రసాద్ సమాధానం ఇవ్వలేదు.


