ఎడిటర్ వెన్నెముకలోకి నలికల పాము మెలికలు తిరుగుతూ పాకుతున్నట్టు శరీరం గగుర్పొడిచింది.
"అయ్యా ఎడిటరూ! అంత భయం ఏమిటి?"
"అ...అలా నవ్వకండి సర్!" నాలుకతో పెదవులు తడుపుకొంటూ అన్నాడు ఎడిటర్. ముఖానికి పట్టిన చమట్లు తుడుచుకొన్నాడు.
"ఏమిటయ్యా అంత భయపడిపోయావ్?"
"మరి భయం కాదా అండీ?" అంతకంటే ఏమనాలో తోచనట్టు అన్నాడు.
"భయమా! ఎందుకూ? నేను ఎటూ పిశాచం అవడం ఖాయం. నిన్ను మీడియంగా వాడుకోవడం కూడా ఖాయమే. నిన్నూ చంపి మాలోకానికి తీసుకెళ్ళడం ఖాయం!"
"బాబ్బాబు! మీకు దణ్ణం పెడ్తాను, అలా మాట్లాడకండి." రెండు చేతులూ ఎత్తి నమస్కరించాడు. ఎడిటర్.
"భయపడకు. నువ్వొచ్చాక అక్కడ మనం ఒక పేపరు పెడ్దాం" అని నవ్వుతూ ఎడిటర్ ముఖంలోకి చూశాడు. అతన్ని చూస్తుంటే ప్రసాద్ కు చచ్చేంత నవ్వు వస్తోంది.
"నాకంత ధైర్యం చెప్పి నువ్వంత వణికిపోతావేమయ్యా? ఎదుటివాడి ప్రాణం నీ ప్రాణం లాంటిది కాదా? మనం ఆ లోకంలో పెట్టబోయే పేపరుకు మంచి పేరు ఆలోచించు."
రాఘవేంద్రకు ఏడుపొక్కటే తక్కువ.
"మనకు రచయితలు కూడా కావాలిగా? మన తెలుగు సాహిత్యంలో పిశాచ, భూత, ప్రేత, మాయా మంత్రాల రచయితలు ఎందరో ఉన్నారు. అందులో పాండిత్యం సంపాదించిన వారున్నారు. పిశాచ లోకంలో స్వయంగా విహరించినట్టు రాయగల వారున్నారు. అందువల్ల మనిద్దరం కలిసి ఆ రచయిత(త్రు)లను కూడా పిల్చుకెళ్దాం!" అన్నాడు ప్రసాద్ నవ్వుతూ.
"సర్! నాకు భయంగా ఉంది, అలా మాట్లాడకండి." దాదాపు ఏడుస్తూనే అన్నాడు ఎడిటర్.
"జాతస్య మరణం ధృవం! భయమెందుకయ్యా పిచ్చివాడా?"
"సర్! నా మాటలు నాకే అప్పగిస్తున్నారు. సర్దాగా అంటున్నారు గదూ? నాకు తెలుసు. మీరు చాలా మంచివారు. ఈవిల్ స్పిరిట్ గా మాత్రం కారు."
"ఏ స్పిరిట్ కయినా మీడియం చాలా అవసరం." గట్టిగా ఒక్కొక్క అక్షరాన్నే నొక్కుతూ అన్నాడు ప్రసాద్.
"సర్! సర్! పిశాచ రచయిత(త్రు)లు చాలామంది ఉన్నారుగా! పిశాచాల గురించి వ్రాసి అవన్నీ తమ స్వానుభవం అని చెప్పినవాళ్ళు కూడా ఉన్నారు. అంటే, మానవుని రూపంలో ఉండి కూడా వాళ్లకు పిశాచాలతో సంబంధ బాంధవ్యాలు ఉన్నట్టున్నాయి. పైగా, వాళ్లకు ఆ ప్రత్యేక శక్తి కూడా ఉంది. వాళ్లకు మనుషుల మీదకంటే పిశాచాల బాధలమీదే చాలా సానుభూతి ఉంది. అందుకని ముందు వాళ్లను మీడియంగా చేసుకోండి సర్!" ప్రాధేయపడసాగాడు.
ప్రసాద్ ఎడిటర్ ముఖంలోకి చూస్తూ మౌనంగా వింటున్నాడు.
"ఎలాగయినా మీరూ మీరూ ఒకటి సర్! ముందు వాళ్ళను మీడియంగా వాడుకుంటే బాగుంటుంది సర్!"
"బాగానే ఉంటుంది." సాలోచనగా అన్నాడు ప్రసాద్.
"అదీ! ఆ మాటన్నారు బాగుంది!" ఉత్సాహంగా అన్నాడు ఎడిటర్.
"వాళ్ళను ముందే తీసుకెళితే నాకేం ప్రయోజనం? ముందు నాకో ఎడిటర్ కావాలి. పత్రిక పెట్టాకే మా జాతి జోలికి వెళ్తాను." ఎడిటర్ కళ్ళలోకి చూస్తూ అన్నాడు ప్రసాద్.
ఎడిటర్ కు జుట్టు పీక్కుంటూ అరవాలనిపించింది.
"సర్ ! మీకు ఐదువేలు ఇవ్వాలిగా! ప్రొప్రైటర్ దగ్గరకు వెళ్ళొస్తాను" అంటూ గబగబా ప్రొప్రయిటర్ గదిలోకి వెళ్ళాడు ఎడిటర్.
అలా వెళ్తున్న అతన్ని చూస్తూ విషాదంగా నవ్వుకొన్నాడు ప్రసాద్.
కళ్ళుమూసుకొని కుర్చీలో వెనక్కు వాలాడు.
కునుకు పట్టింది.
"ఇదుగో సర్, చెక్కు."
ప్రసాద్ తృళ్ళిపడి కళ్ళుతెరిచాడు. ఎడిటర్ చేతిలో చెక్కు అందుకొని చూశాడు. ఐదువేలకు చెక్కు! అతని కళ్ళల్లో క్షణ కాలం వెలుగు కన్పించి మరుక్షణం ఆరిపోయింది.
"మిగతాది నా భార్యకు అందించండి."
"అలాగే సర్! అంతేకాదు, మీ కుటుంబ సహాయానికి నిధి కూడా ఏర్పాటు చేస్తాను సర్, మన పేపరు పాఠకుల ద్వారా" అంటూ ప్రసాద్ ముఖం చూసి ఆగిపోయాడు.
ప్రసాదు నవ్వాడు.
"నా జోలికి రాకండి సర్!"
"మాట ఇవ్వలేను. అయినా ప్రయత్నిస్తాను" అంటూ బయటికి వెళ్ళిపోయాడు ప్రసాద్.
చేతిలోని చెక్కును చూసుకోని రిలీఫ్ గా నిట్టూర్చాడు.
సుందర్రావు రూపాన్ని తల్చుకొని ముసిముసిగా నవ్వుకొన్నాడు.
12
"మరో దయ్యం కథ" వెలుగు-చీకటి వారపత్రికలో ప్రారంభం అయింది.
పాఠకులనుంచి పుంఖానుపుంఖాలుగా ఉత్తరాలు వచ్చి పడ్తున్నాయి. ప్రసాదుగారి రచన మమ్మల్ని ఆదిలోనే ఆకట్టుకుందని కొందరు రాస్తే, ఆ నవల చదువుతుంటే చావుభయం పోయిందనీ, వీలయినంత త్వరలో పిశాచలోకం చూడాలని ఉందనీ మరికొందరు వ్రాశారు.
అవి చదువుకొని ప్రసాద్ ఆనందించలేదు.
పాఠకుల అజ్ఞానానికి జాలిపడ్డాడు.
చావు భయం పోయిందట! వాళ్ళను లాక్కొచ్చి హుసేన్ సాగర్ కట్టమీదకు తీసుకెళ్లి, దూకమని చెప్పాలనిపించింది.
'వెలుగు-చీకటి' సేల్సు బ్రహ్మాండంగా పెరిగిపోయాయి.
అది తెలుసుకొన్న అనేక పేపరువాళ్ళు అతన్ని కలిసి, నవలలు అడిగారు. ధరణి ఎడిటర్ నరాలశాస్త్రి ఇక సరేసరి!
పెద్ద మొత్తాల ఆశకూడా చూపించారు.
అయినా ప్రసాద్ అంగీకరించలేదు.
ఆ నవల పూర్తి అయాక గాని మరొకటి రాయనని చెప్పాడు.
ప్రసాద్ కు ఎందరో అభిమానుల ఉత్తరాలు వస్తున్నాయి.
అవి చదవకుండానే చింపివేస్తున్నాడు.
అతన్ని స్వయంగా కలుసుకోవడానికి వస్తున్నారు.
ఒకరోజు ప్రసాద్ సిడ్నీ షెల్డన్ వ్రాసిన 'బ్లడ్ లైన్' చదువుతూ కూర్చున్నాడు. అది అంతకుముందే చదివినట్టుగా అన్పించి ఆలోచించాడు.
అవును! ఆ మధ్య తనో నవల చదివాడు.
తెలుగు నవల అది.
అచ్చం ఇదే కథ.
సిడ్నీ షెల్డన్ కాపీ కొట్టాడనగలదు - ఒకవేళ ఎవరైనా ఆ మాట ఆ రచయిత్రితో అంటే! ప్రసాద్ కు నవ్వొచ్చింది.
"నాన్నా !" కమల పిల్చింది.
"ఏమ్మా !" పుస్తకంలోనుంచి, తలెత్తి అడిగాడు.
కమల ఈమధ్య పూర్తిగా మారిపోయింది.
అంతకు ముందు తన మీద కసికసిగా ఉండేది.
ఇప్పుడు తనకు కావాల్సినవన్నీ ఆమె చూస్తుండి. తనంటే ఎంతో గౌరవంగా చూస్తోంది. పెద్ద కొడుకు కూడా ఇంట్లో రెండు వందలకు బదులు మూడొందలు ఇస్తున్నాడు.
"నాన్నా !"
"చెప్పు !"
"నా స్నేహితురాళ్లు వచ్చారు !"
"సినిమాకు వెళ్తావా ? అమ్మకు చెప్పి వెళ్ళు."
"కాదు నాన్నా ! వాళ్ళు నిన్ను చూస్తారట !"


