అశోపహతుడు
సేఠ్ నందకిషోర్ ఆ నగరంలో ఒక ప్రముఖ నగల వ్యాపారి
నగల వ్యాపారం అంటేనే, దొంగ వ్యాపారస్తులతో అంతో ఇంతో సంబంధం ఉంటుంది. ఈ వ్యాపారంలో లక్షలు గడించాడు సేఠ్ సాహెబ్. ఇదికాక వంశానుగతంగా వస్తున్న వడ్డీ వ్యాపారం ఉండనే ఉంది. అవసరాన్ని బట్టి, మనిషిని బట్టీ, ఆయన నెలకు ఐదు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు వడ్డీ తీసుకుంటాడు. ఈ విధంగా కూడబెట్టి కోటికి పడగెత్తాలని ఆయన ప్రగాఢ వాంఛ!
ఆరోజు దుకాణం మూయబోతుండగా..... ఇద్దరు వ్యక్తులు టాక్సీలో వచ్చారు.
అందులో ఒకనిచేతిలో ఒక బ్రీఫ్ కేస్ ఉంది. వాళ్ళు సేఠ్ జీ వద్ద ఒక చిన్న వెండిగిన్నె -ఎనభై రూపాయలది కొన్నారు. వందరూపాయల నోటు ఇచ్చాడు తను.
సేఠ్ జీ దానిని జాగ్రత్తగా గల్లాపెట్టెలో వేసుకుని మిగిలిన చిల్లర ఇచ్చాడు.
ఆ సమయంలో సేఠ్ జీ షాపులో ఎవరూ లేరు. వచ్చినవాళ్ళలో ఒకడు "సేఠ్ జీ..... మీతో ఒక వ్యాపారం విషయం మాట్లాడాలి" అన్నాడు.
"ఏమిటది?" అని అడిగాడు సేఠ్.
"మాది బొంబాయి. మేము నోట్ల వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఇచ్చిన వంద రూపాయల నోటు మేము ముద్రించినదే! మీరు జాగ్రత్తగా చూసినా అది దొంగనోటని తెలుసుకోలేకపోయారు. ఈ బ్రీఫ్ కేసులో ఉన్న ఏ నోటునైనా మీరు పరీక్షించుకోండి. మీకు కనుక సమ్మతి అయితే ఒకటికి ఐదురెట్లు ఇస్తాం" అన్నారు.
సేఠ్ జీ బ్రీఫ్ కేసులోని మరికొన్ని నోట్లని పరీక్షించాడు.
అవి అచ్చంగా అసలు నోట్లలాగానే ఉన్నాయి. దొంగనోట్లు తీసుకోడానికి సేఠ్ జీ ఒప్పుకున్నాడు. మిగిలిన వివరాలు మాట్లాడుకుని ఆ ఇద్దరూ వెళ్ళిపోయారు.
అనుకున్న ప్రకారం మర్నాడు సాయంత్రం సేఠ్ నందకిశోర్ నగరం పొలిమేరలోని గుట్టమీదకి 50,000 రూపాయలు తీసుకుని ఒంటరిగా వెళ్లాడు.
ఆ ఇద్దరూ కూడా తాము తెచ్చిన పెట్టెను సేట్ జీ ముందుంచి "నోట్ల కట్టలను జాగ్రత్తగా చూసుకోండి సేఠ్ జీ!మేము మోసం చేశామని మీరు అనుకోకూడదు" అంటూ పెట్టి తెరిచారు.
సేఠ్ జీ ఆనందంతో పెట్టెలోని నోట్లకట్టలను పరీక్షించసాగాడు. ఆ సమయంలో ఆయనకి డబ్బు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఇంతలో...... వెనకాలనుంచి సేఠ్ జీ మెడమీద బలమైన దెబ్బ పడింది. కళ్లు బైర్లు కమ్మి అదిరిపడిపోయాడు సేఠ్ జీ.
మరుక్షణంలో ఆయన పీకమీద గుడ్డవేసి రెండు బలమైన చేతులు మెడని నులిమివేశాయి. నిమిషాలలో సేఠ్ జీ ప్రాణం గాలిలో కలిసిపోయింది.
సేఠ్ జీ తెచ్చిన పెట్టెనూ, తమ పెట్టెనూ తీసుకుని ఆ ఇద్దరూ వెళ్లిపోయారు.
క్రిందటి రోజువాళ్ళు సేఠ్ జీకి చూపించినవి అసలు నోట్లే! అవి దొంగనోట్లని భ్రమపడి ప్రాణం పోగొట్టుకున్నాడు సేఠ్ జీ.
- జయశ్రీ మాసపత్రిక....... మార్చి '88
*****


