విలియా
కుప్పురావుగారికి సంతాష్టకంలో చివరివాడు అప్పారావు.
అంతటి సంసారాన్ని ఈదడానికి నానా తిప్పలు పడుతూ కుప్పలుతెప్పలుగా అప్పులు చేశాడు కుప్పురావు.
పిల్లలకి ఆస్తి ఏమీలేకపోయినా అప్పులు మాత్రం మిగిల్చి 'హరీ.....' అన్నాడు.
అప్పులు చేయడానికి అలవాటుపడ్డ కుప్పురావు -బహుశా తన కొడుక్కి 'అప్పురావు' అని పేరు పెట్టాలని అనుకుని ఉంటాడు. కాని, బాగుండదని 'అప్పారావు' అని పెట్టి ఉంటాడు.
తండ్రి సంకల్పాన్ని కార్యరూపంలో చూపించడానికో, లేదా ఆయన లక్షణాలని లక్షణంగా వారసత్వంగా గ్రహించడం వల్లనో ఏమో...... మొత్తంమీద అప్పారావు కూడా అప్పులు చేయడంలో అగ్రేసరుడయ్యాడు. అప్పుల విషయంలోనే కాకుండా సంతానం విషయంలోనూ ఆయన తండ్రిని అనుసరించాడు.
అప్పారావు పెద్దకూతురు పెళ్ళీడుకొచ్చింది.
పెళ్ళంటే మాటలా.......?! ఖర్చులకే కనీసం పదివేలైనా కావాలి.
ఒకసారి తిరుపతి వెళ్లి వస్తూ -స్వంత ఊరు నెల్లూరులో మేనమామ కొడుకు ఇంట్లో దిగాడు. ఉద్యోగరీత్యా చెల్లాచెదరైపోయిన కుటుంబాలు చాలాకాలం తర్వాత కలుసుకున్నందుకు చక్రపాణిగారు ఎంతో సంతోషించాడు. మాటల్లో ఆయన ఏ అవసరానికైనా తన దగ్గరికి రావచ్చునని భరోసా ఇచ్చాడు. ఆయన వ్యాపారంలో బాగానే సంపాదించాడు.
అప్పారావు అమ్మాయికి పెళ్ళి కుదిరింది. ఇంక డబ్బు సమకూరటమే తరువాయి!
వెంటనే నెల్లూరు వెళ్లి చక్రపాణిగారితో 'అనుకోకుండా సంబంధం కుదిరిందనీ, అవసరంగా పదివేలు కావాల'నీ అడిగాడు.
అప్పారావు మంచి మాటకారి. హైద్రాబాద్ లో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడన్న భ్రమతో అప్పారావు అడిగిన మొత్తాన్ని చక్రపాణి సర్దాడు. పెళ్ళి సలక్షణంగా జరిగిపోయింది.
నెలలు గడిచిపోతున్నా అప్పారావు దగ్గర నుంచి అప్పుతీర్చే సూచనలేవీ కనిపించలేదు. ఆ తరువాత అసలు సంగతి తెలిసింది. 'అప్పారావు అప్పులకుప్ప' అని అర్ధమైంది -చక్రపాణి గారికి! ఇంక అనుకుని ప్రయోజనం ఏముంది?
దిగులు పడుతున్న చక్రపాణికి భార్య సుందరమ్మ చక్కని సలహా ఇచ్చింది. అప్పారావు పెద్దకొడుకు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. కుర్రాడు బాగానే ఉంటాడు. ఇంకా పెళ్ళి కాలేదు. చక్రపాణి రెండో కూతురు పెళ్ళీడుకొచ్చింది. ఆ అమ్మాయిని అప్పారావు అబ్బాయి కిచ్చి, తనకి రావలసిన బాకీలు కట్నం క్రింద చూసుకుని విలియా వేసుకుంటే సరిపోదూ? 'కరణేషు మంత్రి.....' అయిన సుందరమ్మ సలహా మేరకు చక్రపాణి అప్పారావుతో మంతనాలు సాగించాడు.
ఉభయ ఖర్చులు పెట్టుకునే షరతు మీద అప్పారావు ఒప్పుకున్నాడు.
అంతే......! పెళ్ళి అయిపోయింది. అప్పారావు అప్పుతీర్చింది. కాణీ ఖర్చులేకుండా చక్రపాణి కూతురు పెళ్ళి జరిగింది.
-జయశ్రీ మాస పత్రిక ......ఏప్రిల్' 88
*********


