రజ్జు -సర్పం
ఆ మ్యారేజ్ హాల్ అసంఖ్యాకమైన రంగురంగుల విద్యుద్దీపాలతో, ఆకర్షణీయమైన అందమైన డిజైన్లతో ధగద్ధగాయమానంగా వెలిగిపోతోంది. ఆకాశంలోని తారకల్ని కోసుకొని వచ్చి అక్కడ తాపడం చేశారా..... అన్నంత అద్భుతంగా ఉన్నాయి ఆ దీపాలు.
బయట అంతా రంగురంగుల దీపాల అలంకరణ అనుకుంటే...... లోపల ఖరీదయిన చీరలు, దుస్తులు, ఆభరణాలు ధరించిన ఆడవారు వన్నెల విసనకర్రలలాగా, సీతాకోకచిలుకల్లాగా, హడావుడి అంతా తమదేనన్నట్లుగా తిరుగుతున్నారు. వారి మెడలోని నెక్లెసులు, చెవుల కమ్మలు, చేతి గాజులు ఆ కాంతిలో కళ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి.
మగవారు ఖరీదైన సూట్లూ, వ్రేళ్లకు వజ్రపు ఉంగరాలు, మెళ్లో బంగారు గొలుసులతో వచ్చారు. ఆడవారు తమకు ఎదురైన స్త్రీల ఆభరణాలను, చీరలను ఓరకంట కనిపెడ్తూ వాటి ఖరీదును, వాటిని ధరించిన వారి అంతస్తునూ అంచనా వేస్తున్నారు.
ఇదంతా కోటీశ్వరుడు సేఠ్ అగర్వాల్ కుమార్తె వివాహ సంరంభం!
ఇంతలో .....పెళ్లివారికి చెందిన ఒకవ్యక్తి ఆందోళన ముఖంతో లోపలికి వచ్చాడు. బయట ఇన్ కంటాక్స్ అధికారులు కొందరు నిలబడ్డారట - చావు కబురు చల్లగా చెప్పాడు.
ఈ వార్త దావానలంలాగా నిమిషాలమీద హాలంతా వ్యాపించింది. వెంటనే ఆడవారందరూ తమ విలువైన ఆభరణాలను, పర్సులను హ్యాండ్ బ్యాగ్స్ లోను, బొడ్డుక్రిందా.... ఇలా వీలయిన చోటల్లా దాచేశారు. ఖరీదైన చీరలనుకూడా దాచగలిగితే బాగుండుననుకున్నారు గాని......, అదిసాధ్యపడి చావలేదు.
ఇంతలో...... కొందరు ముందుచూపున్నవారు అలంకరణంగా పెట్టిన రంగురంగుల దీపాలను ఆర్పివేశారు. ఎలాగయితేనేం....... పెళ్ళి పెద్దలలో ఒకరు ధైర్యంచేసి బయటవున్న ఆదాయపు పన్ను వారికి పళ్ళూ, ఒళ్ళూ చల్లబరిచే ఐస్ క్రీం ను ఆఫర్ చేశారు - చిరునవ్వు ముఖానికి పులుముకుని.
"ఉహూ...వద్దు" అంటూ బిర్రబిగిశారు వారు.
చేసేదిలేక ఈ విషయం సేఠ్ అగర్వాల్ చెవిన వేశాడు ఆయన.
'ఇదెక్కడ పీడరా భగవంతుడా.....! కిర్లోస్కర్, బజాజ్ ల తర్వాత ఇపుడు దాడి నా మీదనా? అందులోనూ పెళ్ళి కానున్న సమయంలో ఈ మ్యారేజ్ హాలులోనా?' అని మనసులోనే వాపోయాడు అగర్వాల్.
హాలులోని అందరూ దాడుల గురించే గుసగుసలాడుకోసాగారు.
ఇంతలో.... అసలయిన ఇన్ కంటాక్సు అధికారి, మరికొందరు పిల్ల అధికారులు వచ్చారన్న వార్త వచ్చింది.
వారిని కలుసుకుందామని ఎదురేగుతుండగా వారే లోపలకు వచ్చేశారు.
వాళ్ళను చూడగానే యములాళ్ళను చూసినట్లు పెళ్ళిపెద్దల పై ప్రాణాలు పైనేపోయాయి. కొందరు గుండెని బలంగా పట్టుకున్నారు.
అగర్వాల్ గారు ఆరిపోయిన పెదవులతో, ఎండిపోయిన గొంతుతో వారి దగ్గరకువెళ్ళి భోజనాలకి రావలసిందిగా మర్యాదగా ఆహ్వానించాడు.
అయినా.... వాళ్ళు ససేమిరా రామని బిగుసుకున్నారు.
'హరీ.....' అనేవాడేకాని, అంతలోనే ఆఫీసరుగారు చావుకబురు చల్లగా చెప్పారు.
వారందరూ అదే మ్యారేజ్ హాలులో ఒక గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారట. వీరి పెళ్లి అవగానే వారు హాలులోకి వస్తారట. అందువలన అంతసేపు బయట నిలబడి ఎంతలో ఉందో చూద్దామని లోపలకు వచ్చారట. ఆ విషయం చెప్పి వచ్చిన వాళ్ళు వచ్చినట్లే బయటికెళ్లిపోయారు.
అంతే.....! అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి. దాచిన నగలు బయటికి వచ్చాయి.
ఆరిన దీపాలు తిరిగి వెలిగాయి.
- జయశ్రీ మాసపత్రిక.. ఏప్రిల్ '88
***************
పాత రిఫరెన్సులు
"అయ్యా..... నిన్న మీకు చూపించిన అమ్మాయి ఎలా ఉంది?.... నచ్చిందా?" అని అడిగాడు పెళ్ళిళ్ళ పేరయ్య.
"ఏమైనా ఆ అమ్మాయికి సెక్సప్పీల్ అంతగా ఉన్నట్టు లేదు. ఓసారి శాంపుల్ చేస్తేనే కాని......పెళ్ళాడేదీ, లేనిదీ చెప్పలేను" అన్నాడు వంకర శంకరరావు.
వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి - "ముందు శాంపుల్ చూస్తేనేకాని, పెళ్ళాడనంటున్నాడు ఆ అబ్బాయి. ఏమంటావు?" అని అడిగాడు పేరయ్య.
"శాంపిల్ -గీంపిల్ చూపించేదేమీ లేదు. కాకపోతే.....నా గురించి 'లోతు'గా తెలిసిన వారి రిఫరెన్సులు ఎన్నో ఇస్తాను. వారిని అడిగి తెలుసుకోమను!" అనితాపీగా జవాబిచ్చింది ఆ అమ్మాయి.
అభివృద్ధి
"మన కొత్త నటిలో అభివృద్ది కనిపిస్తోంది కదూ!" అని అడిగాడు నిర్మాత - డైరెక్టర్ వాసూరావుతో.
"అవునవును. మొదట్లో ఆఫీస్ బాయ్ తో, తర్వాత అసిస్టెంట్ తో, ఆపైన అసోసియేట్ తో....... ఇలా అంతకంతకీ హోదా ఎక్కువున్నవారితో ప్రేమాయణం నడుపుతోంది. అంతేకాదు,......., మొదట నడుముకి పట్టేసినట్లుండే పొట్ట ఇప్పుడు కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది" అన్నాడు వాసూరావు.
******


