2. రోహిణీ నక్షత్రం. ప్రజాపతిర్దేవతా. మృగశీర్ష నక్షత్రగ్ం. సోమోదేవతా. ఆర్ద్రా నక్షత్రగ్ం. రుద్రో దేవతా. పునర్వసూ నక్షత్రం. అదితి ర్దేవతా. పుష్యమి నక్షత్రం. బృహస్పతిర్దేవతా. ఆశ్రేషా నక్షత్రం. సర్పా దేవతాః. మఘా నక్షత్రం. పితరో దేవతాః. ఫల్గుణీ నక్షత్రం. ఆర్యమా దేవతా. ఫల్గునీ (ఉత్తర.) నక్షత్రం. భగో దేవతా. హస్తో నక్షత్రగ్ం. సవితా దేవతా. చిత్రా నక్షత్రం. ఇన్ద్రో దేవతా. స్వాతీ నక్షత్రం. వాయుర్దేవతా. విశాఖే నక్షత్రం. ఇన్ద్రాగ్నీ దేవతా. అనూరాధా నక్షత్రం. మిత్రో దేవతా. రోహిణీ నక్షత్రం. ఇన్ద్రో దేవతా. విచృతౌ (మూల.) నక్షత్రం. పితరో దేవతా. ఆషాఢా నక్షత్రం. ఆపో దేవతా. ఆషాఢా (ఉత్తర.) నక్షత్రం. విశ్వేదేవాదేవతా. శ్రోణా (శ్రవణ.) నక్షత్రం. విష్ణుర్దేవతా. శ్రవిష్ఠా (ధనిష్ఠా.) నక్షత్రం. వసవః దేవతా. శతభిషం నక్షత్రం. ఇన్ద్రో దేవతా. పోష్ఠ పదా (పూర్వాభాద్ర.) నక్షత్రం. అజ ఏకపాద్దేవతా. పోష్ఠ పదా (ఉత్తరాభాద్ర.) నక్షత్రం. ఆహిర్బుధ్నియో దేవతా. రేవతీ నక్షత్రం. పూషా దేవతా. అశ్వయుజౌ (అశ్విని.) నక్షత్రం. అశ్వినౌ దేవతా. భరణీ నక్షత్రం. యమో దేవతా.
3. పూర్ణ మాస నామక ఇష్టకను అన్ని నక్షత్ర ఇష్టకలకు చివరన తూర్పున ఉపధానము చేయవలెను. అమావాస్య నామక ఇష్టకను అన్ని నక్షత్ర ఇష్టకలకు చివరన పడమటి దిక్కున ఉపధానము చేయవలెను.
పదకొండవ అనువాకము
1. చైత్ర, వైశాఖ మాసములు వసంత ఋతువు.
2. జ్యేష్ఠ, ఆషాఢ మాసములు గ్రీష్మర్తువు.
3. శ్రావణ, భాద్రపద మాసములు వర్షర్తువు.
4. ఆశ్వయుజ, కార్తీక మాసములు శరదృతువు.
5. మార్గశీర్ష, పూష మాసములు హేమంత ఋతువు.
6. మాఘ, ఫాల్గుణ మాసములు శిశిరఋతువు.
7. ఋతు విశేషమా! నీవు అగ్ని యొక్క అంతరమున చేర్చబడుచున్నావు. నా అభ్యుదయమునకు గాను ద్యావా, పృథ్వి, జల, ఓషధులు తమ ధర్మములు నిర్వర్తించునుగాక. ఈ కర్మయందలి అగ్నులు విశేషముగ నెలకొల్పబడునుగాక. ద్యావాపృథ్వుల మధ్య నున్న అగ్నులు శిశిర ఋతువు నందు చేరి దేవతలు ఇంద్రుని సేవించిన రీతి సేవించునుగాక.
ఇష్టకా! అట్టి నిన్ను ఉపదధామి.
8. ఇష్టకా! నీవు అగ్ని, చంద్ర, సూర్యులను నియంత్రించు దానవు. వారికి ప్రకాశ కారణము అగుచున్నావు.
9. ఇష్టకా! నీవు పితరుల, యముని, ఇంద్రుని ఉగ్ర బలమును, భయంకర శక్తి స్వరూపము అగుచున్నావు.
10. ఇష్టకా! నీవు సవితృ దేవుని, మరుత్తుల, వరుణుని స్థిరత్వము అగుచున్నావు. విస్తీర్ణ శక్తి స్వరూపము అగుచున్నావు.
11. ఇష్టకా! నీవు మిత్రా వరుణుల యొక్కయు, మిత్ర దేవుని యొక్కయు, ధాత యొక్కయు ధారణ శక్తివి అగుచున్నావు. ధరిత్రివి అగుచున్నావు.
12. ఇష్టకా! నీవు వసూనామ్. రుద్రాణామ్, ఆదిత్యానామ్ తూర్పునందున్న శక్తివి, పడమటి యందున్న శక్తివి అగుచున్నావు.
13. ఇష్టకా! ఆయా దేవతలు నీకు అధిపతులు అగుచున్నారు. తేభ్యః నమః వారు మాకు సుఖములు కలిగింతురుగాక. మేము ఎవరిని ద్వేషించుచున్నామో, మమ్ము ఎవరు ద్వేషించుచున్నారో వారలను ఆ దేవతల నోళ్లలో పడవేయుచున్నాను.
14. ఇష్టకా! నీవు తూర్పు దిక్కున వేల ఇటుకలంత, దక్షిణమున వేల ఇటుకలంత, పడమట వేల ఇటుకలంత, ఉత్తరమున వేల ఇటుకలంత, పై దిక్కున వేల ఇటుకలంత ప్రమాణము కలదానవు అగుచున్నావు. వేల ఫలములు కలుగుటకు నిన్ను ప్రోక్షించుచున్నాను.
15. అగ్నీ! ఈ ఇష్టకలు వాకు ధేనువుల వలె ప్రీతికారకములు అగునుగాక.
అగ్నీ! ఇవి ఒకట్లు, వందల, వేలు, ఆయుతములు, నియుతములు, ప్రయుతములు, అర్బుదములు, న్యర్బుదములు, సముద్రములు, మధ్యములు, అంతములు, పరార్ధ సంఖ్యాక ఇష్టకలై ధేనువుల వలె నాకు ప్రీతికారకములు అగునుగాక.
(సంఖ్య అంతము వరకు పదివేల కోట్లకు చేరినది. పరార్ధము నూరు వేల కోట్లు కావచ్చును.)
ఇష్టకలారా! మీరు అరువది కండి. వేయుకండి. ఆయుతము - పదివేలు కండి. క్షీణించకండి. యజ్ఞమున ఉండండి. యజ్ఞమును వర్థిల్ల చేయండి. ఆజ్యమును, మధువును ప్రవహింపచేయండి. మీరు బలవంతులు అన్నవంతులు కండి.
అగ్నీ! ఈ ఇష్టకలు ప్రకాశవంతములగు నా కోర్కెలును తీర్చునుగాక. స్వర్గమునందును, ఇంద్ర లోకమునందును నాకు ధేనువుల వలె ప్రీతి కారకములు అగునుగాక.
పన్నెండవ అనువాకము
1. దిక్కులతో ఎంతో ప్రకాశించునది ప్రొద్దు పొడుచు తూర్పు దిక్కు. ఆ దిక్కు మాకు ధనాదికములను ఇచ్చి రక్షించును గాక. చైత్రము కన్న వైశాఖము మమ్ము కాపాడును గాక. దుఃఖము కలుగచేయు శత్రువు నుండి అగ్ని దేవత మా బలమును, మమ్ము రక్షించునుగాత.
2. రథంతర సామభిః అస్మాన్ పాతు - మమ్ము రక్షించునుగాక. ఛన్దసాం విశ్వరూపా గాయత్రీ అస్మాన్ పాతు. త్రివృత్ స్తోమము ఆహ్నములతో కూడి మమ్ము పాలించును గాక. సముద్రపు గాలి మా బలమును రక్షించునుగాత.
3. దిక్కులందు దక్షిణము ఉగ్రము. అది పాపముల నభిభవించును. మృతుని యమలోకమునకు చేర్చును. జ్యేష్ఠ, ఆషాఢ మాసములు ఎంతో వేడి గలవి. ఇంద్రా! నీవు దక్షిణ దిశకును, జ్యేష్ఠ ఆషాఢ మాసములకును అధిపతివి. కావున మమ్ము దక్షిణ దిశ నుండి, జ్యేష్ఠ ఆషాఢ మాసముల అతి వేడి నుండియు రక్షింపుము. జగదేక బలమును మాకు కలిగించుము.
4. 'బృహత్' సామము బలము కలిగించునది. మగటిమమును పెంచునది. ఆ సామము త్రిష్టుప్ ఛందస్సుతో కలసి మమ్ము రక్షించునుగాత.
ఇంద్రా! పంచదశస్తోమము, సాగర వాయుయుక్తుడై భూత భవిష్యత్తుల మధ్యనున్న నన్ను రక్షింపుము.
5. దిశలందు పశ్చిమము యశస్విని. యశస్వతి. స్వర్గమే నివాసముగా గలది. అట్టి పశ్చిమ దిశ మమ్ము రక్షించును గాక.
విశ్వేదేవతలారా! వర్షర్తువునందును, పశ్చిమ దిశయందును మమ్ము రక్షించండి. నా శక్తి శత్రువునకు అసాధ్యమగునుగాత. నా బలమును ఎవరును మించకుందురు గాక. నా బలము వేల స్థానములు కలది అగును గాక.
6. మేము వైరూప సామమును ఆశ్రయించినాము. అందువలన ఈ కర్మయందు ఆశించిన ఫలితములు పొందగలుగుచున్నాము. జగతీ ఛందస్సు అనుగ్రహమున ఇతడు ప్రజలకు ప్రభువు అగుచున్నాడు.
విశ్వేదేవతలారా మీ అనుగ్రహము వలన సప్తదశ స్తోమపు అనుగ్రహము వలన మా బలము తేజోయుతము, సలిల వాత అనుగ్రహము, కలదియు శత్రువును ధిక్కరించునదియు అగును గాక.
7. దిశలందు ఉత్తర దిశ కోరికలు ఫలింపచేయునది, అర్చించ దగినది అగుచున్నది. ఉత్తర దిశ మా క్షాత్రమును వర్థిల్ల చేసినది. మా బలము బహు మిత్రవంతము అగునుగాక.
మిత్రావరుణులారా! మీరు శరదృతువు యొక్క అహస్సులను ఎరింగినవారు. మీరు ఈ దేశమునకు మహా సుఖములు ప్రసాదించండి.
8. వైరాజ సామము నా బుద్ధిని అధిష్టించునుగాత. అనుష్టుప్ ఛందస్సు నాకు శక్తిని, శత్రు తిరస్కార సామర్థ్యమును కలిగించునుగాక.
మిత్రావరుణులారా! ఈ క్షాత్రమును బహు మిత్రయుక్తముగను, సుక్షేత్రముల నిచ్చునదిగను, ఆధిపత్యము కలిగించునదిగను చేసి దానిని రక్షించండి.
9. దిశలందు ఊర్థ్వ దిశ సామ్రాట్టు. సామములతో కూడినది. శక్తియుక్త, ఊర్థ్వ దిశ మమ్ము పోషించును గాక. విశిష్ట హేమంతము మమ్ము పాలించును గాత. రక్షించు వాయువులు గల జగతీ ఛందస్సును, శాక్వర సామమును ఘృతాహుతి యుక్తమగు మా ఈ యజ్ఞమును రక్షించును గాక.
10. దిశలకు దేవి స్వర్గము నిచ్చునది. మాకు కామధేనువు వంటిది. పాడితో కూడినది. ఆజ్యము కలది.
బృహస్పతీ! నీవు మమ్ము ఎదుట రక్షించుము. వెనుక రక్షించుము. ఇతరులను ఆదేశించదగిన వాక్కును కలిగించుము.
11. దిశలందు ఊర్థ్వ దశ ప్రీతికారకము. ఓషధులను పెంచునది. ఊర్థ్వ దిశ మాకు సుఖప్రదము అగును గాక. అహస్సులు, వత్సరములతో కూడిన సూర్యుడు మాకు సుఖప్రదుడు అగును గాక. రైవత సామము, అతిచ్చందము, ఆ ఋక్కునందలి ఛందస్సు మమ్ము అజాత శత్రువులను చేయునుగాక.
12. ఊర్థ్వ దిగ్దేవత త్రయస్త్రింశ స్తోమ యుక్త. భూతజాత పోషక. వివస్వన్నామక వాయు యుత. ఆ దేవి మాకు హితము కూర్చును గాక.
సవితృ దేవా! ఈ ఊర్థ్వ దిశ మాకు క్షీరవతియు, ఘృతవతియు అగును గాత. మాకు ఆధిపత్యము కలిగించునదియు, ప్రీతి హేతువును అగును గాత.
13. దిశలందు స్థిరము, సమానమవు దిక్కునకు విష్ణువు పాలకుడు. అది శాంత స్వరూప. బలముల నియంత. మనసున అర్చించదగినది. ఆ దిశ, బృహస్పతి, మాతరిశ్వ వాయువు, చలింపచేయువాయువు ఇవన్నియు మాకు హితమును ఉపదేశింతురు గాత.
14. అదితి ద్యులోకమునకు ఆధార భూత పృథ్విని భరించునది. జగత్తును శాసించునది. విష్ణువు అధిపతిగా గలది. జగత్తును వ్యాపించి ఉండునది. అన్నము కలిగించునది. శోభనైశ్వర్య సహిత. మేము ఆ అఖండనీయ అదితి ఒడిలో ఉన్నాము. ఆమె మాకు సుఖప్రద అగును గాక.
15. "వైశ్వానరోనఊత్యా" పురోనువాక్య. 'వృష్ణోదివి' యాజ్య.
16. "అనున్కోద్యానుమతిః" పురోనువాక్య. "అన్విదనుమతే త్వమ్" యాజ్య.
17. "కయానశ్చిత్ర ఆభువత్" పురోనువాక్య, "కో ఆద్యయుంక్తే" యాజ్య.
శ్రీమదాంధ్ర వచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత
నాలుగవ కాండము నందలి నాలుగవ ప్రపాఠకము సమాప్తము.


