Home » Bhakti Content » Aacharalu » గయ క్షేత్ర విశిష్టత ఏమిటి  శ్రాద్ధం చేస్తే మోక్షం ఎందుకు వస్తుందంటారు.!

గయ క్షేత్ర విశిష్టత ఏమిటి  శ్రాద్ధం చేస్తే మోక్షం ఎందుకు వస్తుందంటారు.!

భారతీయ సనాతన సంప్రదాయంలో పితృదేవతల రుణం తీర్చుకోవడానికి, వారి ఆత్మలకు సద్గతులు ప్రసాదించడానికి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న క్షేత్రం గయ. ప్రసిద్ధ పితృక్షేత్రంగా పేరొందిన గయను దర్శించడం, అక్కడ పితృకార్యాలు నిర్వహించడం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన విధిగా భావిస్తారు. గయ క్షేత్రానికి అంతటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత రావడానికి వెనుక ఒక గొప్ప పురాణ నేపథ్యంతో పాటు  కొన్ని వింత నమ్మకాలు ఉన్నాయి.

గయాసురుడు..

గయ క్షేత్ర విశిష్టతకు ప్రధాన కారణం గయాసురుడు అనే రాక్షసుడి కథ. గయాసురుడు రాక్షస కులంలో జన్మించినప్పటికీ, తీవ్రమైన తపస్సు చేసి విష్ణుమూర్తిని మెప్పించాడు. తన శరీరం అత్యంత పవిత్రమైనదిగా మారాలని, తనను చూసినా, తాకినా సకల పాపాలు తొలగిపోయి జనన మరణ చక్రం నుంచి విముక్తి కలగాలని కోరుకున్నాడు. అతడి తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు ఆ వరాన్ని ప్రసాదించాడు. దాంతో గయాసురుడిని దర్శించిన వారందరూ నేరుగా వైకుంఠానికి వెళ్లడం ప్రారంభించారు.

లోకంలో పాపపుణ్యాల సమతుల్యత దెబ్బతినడంతో, దేవతలు అందరూ కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. యజ్ఞం నిర్వహించడానికి గయాసురుడి శరీరాన్ని పవిత్ర స్థలంగా ఇవ్వమని కోరారు. దానికి గయాసురుడు సంతోషంగా అంగీకరించి ఉత్తరం నుండి  దక్షిణాభిముఖంగా పడుకున్నాడు. యజ్ఞం పూర్తయ్యాక కూడా అతడి శరీరం కదలకుండా ఉండటానికి బ్రహ్మదేవుడు ఒక పెద్ద బండరాయిని అతడి గుండెలపై ఉంచాడు. అప్పటికి ఆ రాయి కదులుతుండటంతో, శ్రీమహావిష్ణువు స్వయంగా తన గదతో ఆ రాయిపై నిలబడి గయాసురుడిని భూమిలోకి తొక్కాడు. 

ఆ సమయంలో గయాసురుడు విష్ణుమూర్తిని వేడుకుంటూ, తన శరీరం పై ఎవరైతే తమ పితృదేవతలకు పిండప్రధానం, తర్పణాలు అర్పిస్తారో, వారి పితృదేవతలందరికీ మోక్షం కలగాలని కోరుకున్నాడు. అతడి త్యాగానికి, భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు ఆ వరాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ విష్ణువు తన పాదంతో గయాసురుడు తలను భూమిలోకి తొక్కడంతో దీనికి శిరోగయ అని, విష్ణుపాద క్షేత్రం అని పిలుస్తారు.  నాటి నుంచి అక్కడ పిండప్రధానం చేస్తే పితృదేవతలకు మోక్షం లభిస్తుందని ప్రసిద్ధి చెందింది.

​ఈ క్షేత్రంలో ప్రధానంగా మూడు ప్రదేశాలలో పితృకార్యాలు నిర్వహించడం శ్రేష్ఠమని భావిస్తారు. మొదటిది ఫల్గుణీ నది, రెండోది విష్ణుపాదం, మూడోది అక్షయ వటవృక్షం. ఫల్గుణీ నది తీరంలో స్నానం చేసి తర్పణాలు వదలడం వల్ల పితృదేవతల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

విష్ణుపాద క్షేత్రంలో ఉన్న శ్రీమహావిష్ణువు పాదముద్రల వద్ద పిండప్రధానం చేయడం ద్వారా పితృదేవతలు నేరుగా విష్ణులోకానికి చేరుకుంటారని విశ్వసిస్తారు. 

చివరగా అక్షయ వటవృక్షం వద్ద ఇచ్చే పిండప్రధానం తరతరాల పితృదేవతలకు శాశ్వత సంతృప్తిని ఇస్తుందని నమ్మకం.

​హిందూ ధర్మం ప్రకారం ప్రతీ మనిషికి దేవ రుణం, రుషి రుణం, పితృ రుణం అనే మూడు రకాల రుణాలు ఉంటాయి. వీటిలో పితృ రుణాన్ని తీర్చుకోవడానికి గయా శ్రాద్ధం అత్యంత సులువైన, పవిత్రమైన మార్గం.

జాతకంలో పితృదోషాలు ఉన్నవారు లేదా కారణాంతరాల వల్ల కర్మకాండలు సరిగ్గా జరగని పితృదేవతల ఆత్మలు శాంతించకపోతే, గయలో శ్రాద్ధం చేయడం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయి.

​ఎవరైనా గయలో ఒకసారి పిండప్రధానం చేస్తే, వారి వంశంలో గతించిన అనేక తరాల పితృదేవతలకు ముక్తి లభిస్తుంది. అంతేకాకుండా, గయలో కర్మకాండలు నిర్వహించిన తర్వాత మళ్లీ ప్రతి సంవత్సరం చేసే సాంవత్సరిక శ్రాద్ధాలు చేయాల్సిన అవసరం ఉండదని కూడా ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులు, పూర్వీకుల ఆత్మశాంతి కోసం, వారి ఆశీస్సులు తమ వంశానికి దక్కడం కోసం గయా క్షేత్రాన్ని దర్శించి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తుంటారు.

                      *రూపశ్రీ.

google-ad-img