తులసి మొక్కను నాటడానికి, పూజించడానికి సరైన నియమాలు ఇవే..!

 

తులసి మొక్క భారతీయ హిందూ గృహాలలో తప్పని సరిగా కనిపించే మొక్క.  ఇది ఆయుర్వేదంలో ఔషద మొక్క. తులసిని  లక్ష్మీ దేవి నివాసంగా పరిగణిస్తారు. చాలామంది నచ్చినప్పుడు తులసి మొక్కను నాటడం, పాత మొక్కను తొలగించడం చేస్తుంటారు. తులసి గురించి స్కంద పురాణం, పద్మ పురాణం,  గరుడ పురాణం మొదలైన వాటిలో కూడా ప్రస్తావన కనిపిస్తుంది. తులసిని విష్ణు ప్రియ అని పిలుస్తారు. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల పాపాలు అన్నీ నశిస్తాయి. తులసి మొక్కను నాటడానికి, పూజించడానికి సరైన నియమాలు తెలుసుకుంటే..

వాస్తు శాస్త్రంలో కూడా, తులసి సానుకూల శక్తిని అందించే మొక్కగా చెప్పబడింది. తులసి మొక్కను  నాటి, ప్రతి రోజూ పూజించి, నీరు అర్పించే ఇళ్లలో విష్ణువు,  లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాంటి ఇళ్లలో ఆనందం,  సంపదకు ఎప్పుడూ కొరత ఉండదు.

వాస్తులో తులసి మొక్కను ఉంచడానికి,  నాటడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో అంటే ఈశాన్య దిశ, తూర్పు దిశ,  ఉత్తర దిశలో తులసిని నాటడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దిశలో తులసి మొక్కను నాటడం ద్వారా, సానుకూల శక్తి చాలా మెరుగైన రీతిలో ప్రసారం అవుతుంది. ఇది ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తిని ఉంచుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎప్పుడూ దక్షిణ దిశలో నాటకూడదు. ఈ దిక్కుకు అధిపతి యమరాజు. అందుకే  పొరపాటున కూడా తులసి మొక్కను దక్షిణ దిశలో నాటకూడదు.  ఇంట్లో తులసి మొక్కను ఎక్కడ నాటినా అక్కడ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

తులసికి పూజ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత, తులసికి నీటిని సమర్పించాలి. దీనితో పాటు గంగా జలాన్ని నీటిలో కలిపి తులసికి సమర్పిస్తే అది చాలా శుభప్రదమైనది,  ఫలవంతమైనది. తులసి మొక్కను పూజించడం, దీపం వెలిగించడం,  ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత హారతి చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

ఇంట్లో తులసి మొక్కను నాటుతుంటే దానిని గురువారం నాటాలి. మత విశ్వాసాల ప్రకారం కలియుగంలో పూజించడం, జపించడం, ధ్యానం చేయడం, నాటడం,  తులసిని ధరించడం వల్ల అన్ని పాపాలు దహించి మోక్షం లభిస్తుంది. తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. తులసి లేకుండా విష్ణువు, కృష్ణుడు,  హనుమంతుడికి సమర్పించే నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.

ప్రతి నెల ఏకాదశి, పూర్ణిమ, అమావాస్య తిథిలో,  కార్తీక మాసం అంతా తులసిని ప్రత్యేకంగా పూజించాలి. కొన్ని రోజులలో.. ముఖ్యంగా ఆదివారం, ఏకాదశి వంటి ప్రత్యేక రోజులలో, సూర్యాస్తమయం తరువాత,  గ్రహణం సమయంలో తులసి ఆకులను కోయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. తులసి ఆకులను ఎప్పుడూ పాతవిగా పరిగణించరు.  అందుకే ఈ నిషేధించబడిన రోజులలో తులసి ఆకులు అవసరమైతే వాటిని కోసే బదులు, పడిపోయిన ఆకులను తీసుకొని పూజలో ఉపయోగించవచ్చు. లేదంటే తులసి ఆకులను ఒక రోజు ముందుగానే తెంచుకుని పక్కన పెట్టుకోవాలి.

బూట్లు లేదా చెప్పులు ధరించినప్పుడు లేదా అపరిశుభ్రమైన స్థితిలో ఉన్నప్పుడు తులసి మొక్కను ఎప్పుడూ మురికి చేతులతో తాకకూడదు. తులసి మొక్క ఏ కారణం చేతనైనా ఎండిపోయినప్పుడు, దానిని ఎక్కడంటే అక్కడ విసిరేయకూడదు. బదులుగా దానిని నదిలోకి లేదా బావిలోకి వేయాలి.  

శివుడికి ఎప్పుడూ తులసి ఆకులను సమర్పించకూడదు. తులసి ఆకులను విష్ణువు, కృష్ణుడు, హనుమంతుడు వంటి దేవతలకు   మాత్రమే సమర్పించాలి.

                                        *రూపశ్రీ.
 


More Aacharalu