గాల్లో తేలే వింత ఆలయం.. ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకతలేంటి?
.webp)
భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, వాటి వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆలయాలు తమ ప్రత్యేక నిర్మాణ శైలితో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి వాటిలో కర్ణాటక రాష్ట్రంలోని గాల్లో తేలే ఆలయం కూడా ఒకటి. సాధారణంగా గుళ్లు నేల మీద ఉంటాయి, కొన్ని కొండ మీద ఉంటాయి. కానీ, నీటి మధ్యలో ఉంటూ ఎటూ కదలకుండా అలా ఉండిపోయే ఈ ఆలయం చూసేందుకు గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? దీని విశేషాలు ఏంటో వివరంగా తెలుసుకుంటే..
బసవేశ్వర ఆలయం..
ఈ అద్భుతమైన దేవాలయం కర్ణాటక రాష్ట్రం, బాగల్‌కోట్ జిల్లాలోని కుడలసంగమ సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో కృష్ణా నది ప్రవహిస్తుంది. ఇక్కడి నది మధ్యలో ఒక ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పేరు బసవేశ్వర ఆలయం లేదా నది మధ్యలో ఉండే శివాలయం అని స్థానికులు పిలుస్తుంటారు. ఈ ప్రదేశం చూడటానికి ఎంతో ప్రశాంతంగా, ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది.
గాల్లో తేలే ఆలయం..
ఈ ఆలయానికి ఉన్న ముఖ్యమైన వింత ఏమిటంటే, నదిలో నీటి మట్టం ఎంత పెరిగినా ఈ ఆలయం మునిగిపోదు లేదా కొట్టుకుపోదు. నీటి ప్రవాహం మధ్యలో ఈ గుడి ఒంటరిగా నిలబడి ఉంటుంది. దూరం నుంచి చూసేవారికి ఈ ఆలయం నీటిలో లేదా గాల్లో తేలుతున్న అనుభూతిని ఇస్తుంది. అందుకే దీన్ని ఫ్లోటింగ్ టెంపుల్ అని పిలుస్తారు. వర్షాకాలంలో చుట్టూ నీరు నిండిపోయి, ఈ ఆలయం నీటి మధ్యలో తేలుతున్నట్లు కనిపించే దృశ్యం కనుల పండువగా ఉంటుంది.
ఆలయ చరిత్ర..
ఈ ఆలయం బసవేశ్వరుడి కాలం నాటి పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇక్కడ కృష్ణా నది ప్రవహించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నదుల సంగమ ప్రాంతం కావడంతో ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. సాధారణంగా ఇలాంటి నిర్మాణాలను చూస్తే నీటి ఒత్తిడికి కూలిపోవాలి, కానీ ఏళ్ల తరబడి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చెక్కుచెదరకుండా నిలబడటం నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే చెప్పాలి.
ఈ ఆలయాన్ని చూడటానికి భక్తులతో పాటు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రత్యేకించి వర్షాకాలం , శీతాకాలంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నది మధ్యలో ఉన్న ఈ ఆలయాన్ని చూసేందుకు పడవల్లో వెళ్లాల్సి ఉంటుంది. నీటి అలల మధ్య ప్రయాణిస్తూ ఈ గుడిని దర్శించుకోవడం భక్తులకు ఒక అద్బుతమైన అనుభూతిని ఇస్తుంది.
*రూపశ్రీ.






