Home » Gods » Dattatreya » దత్తాత్రేయుడు జింకను తన గురువుగా ఎందుకు ఎంచుకున్నాడు..దీని వెనుక ఉన్న అంతరార్థమేమిటి.!

 దత్తాత్రేయుడు జింకను తన గురువుగా ఎందుకు ఎంచుకున్నాడు.! 


శ్రీమద్భాగవతంలో చతుర్వింశతి గురువుల చరిత్ర ఎంతో విశిష్టమైనది.  దత్తాత్రేయుడు ప్రకృతిలోని ఇరవై నాలుగు అంశాలను గురువులుగా స్వీకరించి, వాటన్నింటి నుంచి ఎన్నో గొప్ప జీవన సూత్రాలను నేర్చుకున్నారు. అందులో ఒక గురువే జింక. బాహ్య ప్రపంచంలోని శబ్దాలకు, సంగీతానికి మనస్సును సమర్పించి ప్రాణాలు కోల్పోయే ఒక సాధారణ జంతువు నుంచి యోగి అయిన దత్తాత్రేయుడు ఏ పాఠం నేర్చుకున్నాడనేది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అదేంటో వివరంగా తెలుసుకుంటే..

జింకకు సంగీతమంటే ఎంతో ఇష్టం. తీయనైన శబ్దం లేదా మనోహరమైన సంగీతం వినబడగానే అది తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోతుంది. తన శత్రువుల గురించి, తనకు ఎదురయ్యే ప్రమాదాల గురించి ఆలోచించకుండా ఆ నాదంలో మునిగిపోతుంది. వేటగాడు ఇదే బలహీనతను ఆసరాగా చేసుకుంటాడు. తీయనైన వేణుగానమో లేదా శబ్దమో చేస్తూ జింకను ఆకర్షిస్తాడు. ఆ ధ్వనికి పరవశించిపోయిన జింక తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా ఆ శబ్దం వైపే అడుగులు వేసి వేటగాడి వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతుంది.

శబ్ద వ్యామోహం..

ఈ సంఘటన నుంచి దత్తాత్రేయుడు శబ్ద వ్యామోహం ఎంత ప్రమాదకరమో గ్రహించారు. మనిషి ఐదు ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తాడు. అవి చూపు, స్పర్శ, రూపం, రుచి మరియు శబ్దం. జింక ఒక్క శబ్దానికి మాత్రమే లొంగిపోయి తన జీవితాన్ని అంతం చేసుకుంది. అదే మనిషి అయితే ఈ ఐదు ఇంద్రియాల వ్యామోహంలో నిత్యం కొట్టుమిట్టాడుతుంటాడు. ఒక్క శబ్దానికే ఒక జీవి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు, ఐదు ఇంద్రియాల వెంట పడే మనిషి స్థితి ఏంటో దత్తాత్రేయుడు ఆలోచించారు.

అంతరార్థం..

జింక ఉదంతం వెనుక ఉన్న ముఖ్యమైన అంతరార్థం ఇంద్రియ నిగ్రహం. మనస్సు అనేది బాహ్య ప్రపంచంలో ఉండే ఆకర్షణల వైపు చాలా సులభంగా లాగబడుతుంది. వినడానికి ఇంపుగా ఉండే మాటలు, సంగీతం లేదా ఇతరులు చెప్పే పొగడ్తలకు మనిషి లోనైతే, తన విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతాడు. ప్రశంసలు, తీపి మాటలు, అబద్ధపు ఆకర్షణలు మనిషిని వేటగాడి వల లాంటి మోసంలో పడేస్తాయి.

కాబట్టి, ఇంద్రియాల ఆకర్షణకు లొంగిపోకుండా మనస్సును ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలని జింక జీవితం ద్వారా దత్తాత్రేయుడు మనకు బోధించారు. శబ్దాల వ్యామోహంలో పడి ప్రాణాలు కోల్పోకూడదనే వివేకాన్ని నేర్పినందుకే ఆయన జింకను తన గురువుగా స్వీకరించారు.

                                                                                                                                              *రూపశ్రీ.

google-ad-img