Home » Bhakti Content » Enduku-Emiti » మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆరాధనా రహస్యం..

మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆరాధనా రహస్యం..

 

కలియుగంలో కొరిన కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవంగా శ్రీ రాఘవేంద్ర స్వామిని భక్తులు ఎంతో నిష్టతో కొలుస్తారు. ఎంతటి కష్టాల్లో ఉన్నవారైనా స్వామివారిని స్మరిస్తే చాలు, ఆపదల నుంచి గట్టెక్కుతారని విశ్వసిస్తారు. ముఖ్యంగా మంత్రాలయంలో సజీవ సమాధి అయిన రాఘవేంద్ర స్వామి పాదాలను ఆశ్రయిస్తే జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయని, ఆధ్యాత్మికంగా , ప్రాపంచికంగా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. స్వామివారి అనుగ్రహం వెనుక ఉన్న ఆరాధనా రహస్యం ఏమిటో, ఆయన దివ్య లీలలు ఎలాంటివో  వివరంగా తెలుసుకుంటే..

మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఎవరు?

శ్రీ రాఘవేంద్ర స్వామి పదిహేడో శతాబ్దంలో జీవించిన గొప్ప వైష్ణవ సన్యాసి , మధ్వాచార్యుల పరంపరకు చెందిన మహనీయుడు. ఈయన తమిళనాడులోని భువనగిరిలో వెంకటనాథుడు అనే పేరుతో జన్మించారు. చిన్నతనం నుంచే గొప్ప జ్ఞానం, దైవభక్తి కలిగిన వెంకటనాథుడు తరువాత కాలంలో రాఘవేంద్ర తీర్థులుగా సన్యాసాశ్రమం స్వీకరించారు.

ప్రహ్లాదుని అవతారం..

పురాణాల ప్రకారం ఈయన ప్రహ్లాదుని అవతారమని భక్తులు నమ్ముతారు. శ్రీ మహావిష్ణువుపై ప్రహ్లాదునికి ఉన్న నిశ్చలమైన భక్తి, తదనంతర అవతారాలలో కూడా కొనసాగిందని చెబుతారు. రాఘవేంద్ర స్వామి తన జీవిత కాలంలో అనేక అద్భుతాలు చేసి దారిద్య్రం, రోగాలు, కష్టాలతో బాధపడేవారిని రక్షించారు.

రాఘవేంద్ర స్వామి ఎవరిని ఆరాధించారు?

శ్రీ రాఘవేంద్ర స్వామి స్వయంగా గొప్ప దైవస్వరూపుడైనప్పటికీ, ఆయన నిరంతరం శ్రీ మూల రాముడిని అత్యంత నిష్టతో ఆరాధించేవారు. శ్రీరాముని సేవలోనే తన జీవితాన్ని తరింపజేశారు. ఆయన రాముని నామాన్ని, వైష్ణవ తత్వాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ,  సకల ప్రాణులలోనూ భగవంతుడిని చూశారు. రాఘవేంద్ర స్వామి చేసే ప్రతి పూజ, జపం శ్రీరాముని ప్రీత్యర్థమే జరిగేవి. స్వామివారి ఈ అనన్యమైన భక్తికి మెచ్చి శ్రీరాముడు , శ్రీకృష్ణుడు ఆయనకు అపారమైన  శక్తులను ప్రసాదించారని అంటారు.

రాఘవేంద్ర స్వామి పాదాలను ఆశ్రయిస్తే జరిగేది ఇదే..

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని సందర్శించి ఆయన పాదాల వద్ద తలవంచి నమస్కరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనసులోని భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి.

ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న తీవ్ర అనారోగ్య సమస్యలు స్వామివారి మృత్తిక ప్రసాదంతో నయమవుతాయని అనుభవపూర్వకంగా భక్తులు చెబుతారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు స్వామిని నమ్ముకుంటే త్వరలోనే మంచి మార్పును చూస్తారు.

నిజమైన భక్తితో ఆయన పాదాలను ఆశ్రయించేవారికి సన్మార్గంలో నడిచే జ్ఞానం లభిస్తుంది. పాపాలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి.

స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి?

రాఘవేంద్ర స్వామి అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. ఆయనకు ఆడంబరాల కంటే స్వచ్ఛమైన మనసు, నిశ్చలమైన భక్తి ముఖ్యం. ఆయన కటాక్షం పొందడానికి కొన్ని నియమాలు పాటించవచ్చు..

ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అనే  మంత్రాన్ని రోజుకు కనీసం ఎనిమిది సార్లు లేదా నూట ఎనిమిది సార్లు మనస్ఫూర్తిగా జపించాలి.

వారంలో గురువారం రోజున స్వామివారికి చాలా ప్రీతికరమైనది. ఆ రోజున ఇంట్లో దీపం వెలిగించి, స్వామివారి పటము ముందు తెల్లటి పువ్వులు ఉంచి పూజించాలి.

రాఘవేంద్ర స్వామి స్తోత్రం లేదా గురుచరితను చదవడం వల్ల విశేష ఫలితం ఉంటుంది.

స్వామివారి పూజతో పాటు పేదలకు, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం ఆయనకు చాలా ఇష్టం. సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలి.

నిత్యం నిజాయితీగా జీవిస్తూ, ఇతరులకు హాని తలపెట్టకుండా ఉంటే రాఘవేంద్ర స్వామి ఎల్లప్పుడూ మన వెంటే ఉండి కాపాడుతారు.

                                                                                                                                          *రూపశ్రీ. 

google-ad-img