అమరనాథ్ క్షేత్రం.. జంట పావురాల రహస్యం!

హిందూ ధర్మంలో జ్యోతిర్లింగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. 12 జ్యోతిర్లింగాలను సందర్శించడం ఎంతో గొప్ప యాత్రగా చెబుతారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కానప్పటికీ, అమర్‌నాథ్‌లోని శివలింగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అమర్నాథ్ క్షేత్రం నమ్మకానికి,  మోక్షానికి విశిష్ట ప్రదేశంగా పరిగణిస్తారు.  అమర్నాథ్ యాత్ర ఏడాది మొత్తం ఉండదు. కేవలం కొన్ని రోజులు మాత్రమే యాత్రకు,  అమర్నాథ్ గుహలోని అమరేశ్వర స్వామిని దర్శించుకోవడానికి  వీలవుతుంది.  అమరనాథ స్వామి దర్శనం కోసం భక్తులు ఎన్నోకష్టాలను అధిగమించి వెళుతుంటారు. అసలు అమరేశ్వర శివలింగ ప్రాముఖ్యత ఏమిటి? ఈ క్షేత్రం ఎందుకంత పవిత్రతను సంతరించుకుంది? అమరనాథ గుహలో ఉండే జంట పావురాల రహస్యం ఏమిటి? వివరంగా తెలుసుకుంటే..

అమరేశ్వర శివలింగం ప్రాముఖ్యత..

పరమేశ్వరుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కానప్పటికీ , స్వయంభువుగా వెలసిన మంచు లింగం కావడం వల్ల అమరేశ్వర లింగం చాలా ప్రత్యేకమైనది.  అమర్‌నాథ్ గుహలోని శివలింగం గుహ పైకప్పు నుండి కారే మంచు బిందువుల నుండి సహజంగా ఏర్పడుతుంది. ఈ శివలింగం చంద్రుని దశలతో పాటు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ శివలింగం శ్రావణ మాసంలో దర్శనమిచ్చి, శ్రావణ పౌర్ణమి, అంటే రక్షాబంధన్ వరకు ఉంటుంది. అమరేశ్వర లింగాన్ని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

అమరేశ్వర గుహ  ప్రత్యేకత..

అమరనాథ్ గుహను పవిత్రమైనదిగా భావిస్తారు, ఎందుకంటే ఇక్కడే శివుడు పార్వతీ దేవికి అమర కథను చెప్పాడట. అందువల్ల దీనిని "అమర్‌నాథ్" అని పిలుస్తారు.  ఈ ప్రదేశాన్ని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని కూడా చెబుతారు. ఈ గుహ  ప్రత్యేకత ఏమిటంటే, ప్రధాన శివలింగంతో పాటు, సహజంగా ఏర్పడిన పార్వతీ , గణేశుడి మంచు  రూపాలు కూడా గుహ లోపల కనిపిస్తాయి.

జంట పావురాల రహస్యం..

పురాణాల ప్రకారం శివుడు పార్వతీ దేవికి అమరత్వపు కథను చెబుతుండగా , రెండు పావురాలు దానిని విని అమరులయ్యాయట. ఈ విషయం తెలుసుకున్న శివుడు మొదట ఆగ్రహించినప్పటికీ, తరువాత ఆ పావురాలు శివపార్వతులకు ప్రతీకగా శాశ్వతంగా ఆ గుహలోనే ఉండిపోతాయని వరం ఇచ్చాడు.  ఆ పావురాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయని చెబుతారు.  . ఆ గుహలో రెండు పావురాలను చూసిన భక్తులు చాలా అదృష్టవంతులని నమ్ముతారు.  అయితే ఇవి అందరి కంటికి కనిపించవు.

అమరనాథ్ యాత్రను ప్రత్యేకంగా నిలిపే విషయాలు..

అమర్‌నాథ్ గుహ సముద్ర మట్టానికి 14,500 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. అందువల్ల, అమర్‌నాథ్ యాత్రను ధైర్యానికి, దైవం పట్ల అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. అమర్‌నాథ్ ధామ్ కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, అది ఒక దివ్యమైన అనుభూతి. ఇక్కడ భక్తులు అమరత్వం కోసం, శివ దర్శనం కోసం కఠినమైన మార్గాల గుండా ప్రయాణిస్తారు. ఈ కఠినమైన యాత్ర చేసి అమరేశ్వర స్వామిని దర్శించుకున్న  భక్తుల జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి, వారి కోరికలు కూడా నెరవేరతాయని నమ్ముతారు.

                           *రూపశ్రీ.


More Punya Kshetralu