జ్యేష్ఠ పౌర్ణమి.. నువ్వులతో ఈ పరిహారం చేస్తే పితృదోషం తొలగిపోతుంది!

జ్యేష్ట మాసం లేదా పురుషోత్తమ మాసం విష్ణుమూర్తి ఆశీస్సులు పొందడానికి, అలాగే పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. పితృదేవతలు సంతోషంగా ఉన్నప్పుడు, దేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయని అంటారు. హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాస పౌర్ణమి 2026 మే 31న వస్తుంది. ఈ రోజున పితృదేవతల కోసం కొన్ని పరిహారాలు చేస్తే వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. కొందరికి జీవితంలో పితృదోషం ఉంటుంది. అలాంటి వారు జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు పితృదేవతలు సంతృప్తి పడాలన్నా, పితృదోషం తొలగిపోవాలన్నా నువ్వులతో పరిహారం చేయాలి. అదేంటోతెలుసుకుంటే..
పితృదోషం పోవడానికి నువ్వుల పరిహారం..
ఋగ్వేదం ప్రకారం, పితృదేవత ఆర్యముడు. అందువల్ల, జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆర్యమునికి నల్ల నువ్వుల లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలట. ఇలా చేయడం వల్ల పితృదేవతల పాపాలు శాంతిస్తాయట. అంతేకాకుండా, పితృదేవతల ఆశీస్సులు జీవితంలో శ్రేయస్సును, ఆనందాన్ని చేకూరుస్తాయని చెబుతారు.
పితృ దోషం కారణంగా జీవితంలో ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది, ఇంట్లో ఎప్పుడు కలహాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు అశాంతితో ఉంటారు. ఈ సమస్యలను తగ్గించడానికి, జ్యేష్ఠ పౌర్ణమి రోజున, పితృదేవతలను ధ్యానిస్తూ, పాలలో నల్ల నువ్వులను కలిపి రావి చెట్టు మొదలుకు సమర్పించాలి. ఈ పరిహారం పితృదేవతల ఆత్మశాంతికి కూడా ప్రత్యేకంగా మేలు చేస్తుంది.
జ్యేష్ఠ పౌర్ణమి సాయంత్రం రావి చెట్టును పూజించి, దాని కింద ఆవనూనె దీపాన్ని వెలిగించాలి. ఆ దీపంలో నల్ల నువ్వులను కూడా వేయాలి. మరణించిన పెద్దలను ధ్యానించాలి. వీలైతే పితృ సూక్తాన్ని పఠించాలి. ఒకవేళ పితృ సూక్తాన్ని పఠించలేకపోతే, "పితృభ్య నమః" అనే మంత్రాన్ని కనీసం 27 సార్లు జపించాలి.
పైన చెప్పుకున్న పరిహారాలు పాటించడం వల్ల పితృదోషం నుండి ఉపశమనం లభిస్తుంది. పితృదేవతలు తృప్తి చెందుతారు.
*రూపశ్రీ.


