పితృ అమావాస్య రోజు ఈ మూడు మొక్కలు నాటితే పితృదోషం తగ్గుతుందట..!

పూర్వీకులను స్మరించుకోవడానికి, వారి ఆశీస్సులు పొందడానికి పితృ పక్షం చాలా పవిత్రమైన సమయం. ఈ పక్షంలో చివరి రోజున వచ్చే అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని పిలుస్తారు. పూర్వీకుల మరణ తిథి తెలియని వారు లేదా నిర్ణీత రోజున శ్రాద్దం చేయలేకపోయిన వారు, ఈ ఒక్క రోజున తర్పణం వదిలితే పితృ దేవతలకు శాంతి లభిస్తుందని చెబుతారు. అయితే జాతకంలో లేదా ఇంట్లో పితృ దోషాలు ఉంటే కుటుంబంలో అశాంతి, పనుల్లో ఆటంకాలు, అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ పితృ దోషాల నుంచి ఉపశమనం పొంది, ఎనిమిది తరాల పూర్వీకుల అనుగ్రహం పొందడానికి సర్వ పితృ అమావాస్య రోజున కొన్ని పవిత్రమైన మొక్కలను నాటడం చాలా మంచిదని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రోజున నాటాల్సిన మూడు ముఖ్యమైన మొక్కలు , వాటి ఫలితాల వివరాలు తెలుసుకుంటే..
శమి మొక్క..
శమి చెట్టుకు ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. దీనికి శని దేవునితో దగ్గరి సంబంధం ఉంటుంది. ఈ శమి మొక్కను ఎప్పుడూ ఇంటి ప్రధాన ద్వారం బయట లేదా ఆవరణలో నాటాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. సర్వ పితృ అమావాస్య నాడు ఈ మొక్కను నాటి ప్రతిరోజూ నిష్టతో పూజిస్తే పితృ దోషాలు తొలగిపోవడమే కాకుండా, పూర్వీకుల కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ కుటుంబంపై ఉంటాయని నమ్ముతారు.
తులసి మొక్క..
సనాతన ధర్మంలో తులసిని అత్యంత పవిత్రమైన మొక్కగా పూజిస్తారు. పూజా కార్యక్రమాల్లో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. సర్వ పితృ అమావాస్య రోజున కొత్త తులసి మొక్కను నాటడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ఇంట్లో ఇప్పటికే తులసి మొక్క ఉన్నప్పటికీ, అమావాస్య రోజున మరొక కొత్త మొక్కను నాటడం చాలా మంచిది. ఈ రోజున తులసి మొక్కను నాటి ప్రతిరోజూ నీరు సమర్పిస్తూ, సాయంత్రం వేళ ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఇంట్లోని సమస్త దోషాలు, పితృ దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి.
అశోక చెట్టు..
అశోక వృక్షం కూడా ఎంతో పవిత్రమైనది. సాధారణంగా పండుగలు, శుభకార్యాల సమయంలో ఈ చెట్టు ఆకులతో తోరణాలు కట్టి ఇంటిని అలంకరిస్తుంటారు. సర్వ పితృ అమావాస్య రోజున అశోక మొక్కను నాటడం వల్ల దాదాపు ఎనిమిది తరాల నుంచి వస్తున్న పితృ దోషాల నుంచి ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ మొక్కను ఇంటి బయట నాటడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. ఒకవేళ ఇంటి ఆవరణలో తగినంత స్థలం లేకపోతే, సమీపంలోని ఏదైనా దేవాలయం దగ్గర నాటినా సమానమైన పుణ్యఫలం లభిస్తుంది.
సర్వ పితృ అమావాస్య నాడు ఈ మూడు పవిత్రమైన మొక్కలలో ఏదో ఒకదానిని నాటి జాగ్రత్తగా పెంపొందిస్తే, ఆ ప్రభావం సంవత్సరం పొడవునా ఉండి కుటుంబానికి పూర్వీకుల పూర్ణాశీస్సులు లభిస్తాయి.
*రూపశ్రీ.




.webp)

