Home » Bhakti Content » Punya Kshetralu » మెహందీపూర్ బాలాజీ ఆలయం.. అడుగడుగునా అద్భుతాలు.. విస్తుపోయే రహస్యాలు!

మెహందీపూర్ బాలాజీ ఆలయం..అడుగడుగునా అద్భుతాలు.. విస్తుపోయే రహస్యాలు!

దేవాలయం అనగానే ప్రశాంతమైన వాతావరణం, పూజలు అర్చనలు, పువ్వులు, అగరబత్తులు,  గంధం సువాసనలు గుర్తుకు వస్తాయి. కానీ కొన్ని దేవాలయాలు మాత్రం చాలా విశిష్టమైనవి. అక్కడి వాతావరణం నుండి,  అక్కడి సంప్రదాయాలు, పద్దతులు.. ముఖ్యంగా అక్కడ ప్రత్యేకమైన ఆచారాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి.  అలాంటి దేవాలయాలలో మెహందీపూర్ బాలాజీ దేవాలయం కూడా ఒకటి.  భారతదేశంలోనే అత్యంత దుష్టశక్తులను వదిలించే దేవాలయంగా మెహందీపూర్ బాలాజీ ఆలయాన్ని పరిగణిస్తారు. ఈ ఆలయంలో అడుగడుగునా అద్భుతాలు, విస్తుపోయే రహస్యాలు ఉంటాయి.  ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే అసలు అక్కడ ఏం జరుగుతోందో కూడా సరిగా అర్థం కానంత అయోమయంలోకి జారిపోతారు.  ముఖ్యంగా పిరికివాళ్లు అక్కడకు వెళ్లొద్దని,  ధైర్యంగా ఉన్నవారు మాత్రమే వెళ్లాలని చెబుతారు. ఈ ఆలయం గురించి తెలుసుకుంటే..

మెహందీపూర్ బాలాజీ దేవాలయం..

రాజస్థాన్‌లోని మెహందీపూర్ అనే చిన్న గ్రామంలో, భారతదేశంలోని అత్యంత రహస్యమైన , శక్తివంతమైన దేవాలయాలలో ఒకటైన మెహందీపూర్ బాలాజీ ఆలయం ఉంది . ఈ ఆలయం శక్తి,  ఆధ్యాత్మిక భూతవైద్య పద్ధతులకు ప్రసిద్ధి చెందిది.  ఇక్కడ  హనుమంతుడు పూజలు అందుకుంటున్నాడు, ఎంతటి నాస్తికులు అయినా ఆలయంలోకి అడుగు పెడితే  వణికిపోతారని చెబుతారు. శతాబ్దాలుగా, దుష్ట శక్తులు, చేతబడి , వివరించలేని బాధలతో బాధపడేవారు ఉపశమనం కోసం ఈ ఆలయానికి వస్తుంటారు.  

అద్భుతాలు,  రహస్యాలు..

భారతదేశంలోని చాలా దేవాలయాలలా కాకుండా, మెహందీపూర్ బాలాజీ ఆలయం చాలా ప్రత్యేకం.    పిరికివారు వెళ్లడానికి ఇది తగిన ప్రదేశం కాదు.  ఆలయ  ప్రాంగణంలోకి అడుగుపెట్టిన క్షణం నుండే, అక్కడి వాతావరణంలో  కలవరపరిచే  శక్తి అనుభూతి కలుగుతుంది.  దీనిని భారతదేశం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షించే ఒక శక్తివంతమైన,  అయస్కాంత ఆకర్షణగా వర్ణిస్తే, మరికొందరు ఆలయంలోని ఆధ్యాత్మిక వాతావరణమే తమను కలవరపరుస్తుందని అంటారు.  ఇక్కడ హనుమంతుని మరో పేరు బాలాజీ..  

ఇక్కడికి హనుమంతుడి దర్శనం కోసం కాకుండా.. జీవితంలో కష్టాలు, అనారోగ్యాలు,  దుష్టశక్తుల నుండి లేదా చీకటి శక్తుల వల్ల కలిగే బాధల నుండి పరిష్కారం కోసం వస్తుంటారు. అలాంటి సమస్యలను అన్నింటిని తొలగించగల శక్తి ఈ ఆలయానికి ఉందని నమ్ముతారు.

ఆచారాలు..

మెహందీపూర్ బాలాజీలోని ఆచారాలు ఇతర సాధారణ దేవాలయాలలో లాగా ఉండవు.  ఇక్కడ మొత్తం కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. అక్కడ జరిగే సంఘటనలు కావచ్చు, అక్కడి వాతావరణం కావచ్చు,  ఆలయ పద్దతులు కావచ్చు. అంతా విభిన్నంగానే ఉంటుంది . ఈ ఆలయ పూజారులు భూతవైద్యం చేయడంలో ప్రసిద్ధి చెందారు,  అక్కడికి వచ్చే వారిలో చాలా మంది ప్రజలు అరుస్తూ, గింజుకుంటూ, కొన్నిసార్లు వింత స్వరాలతో మాట్లాడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా వ్యక్తులలో ఉండే నెగిటివ్ ఎనర్జీ లేదా దుష్ట శక్తుల తొలగింపులో భాగంగా జరుగుతూ ఉంటుంది.

ఇక్కడికి చాలా మంది  "జాదుయి చికిత్స” లేదా “దైవ చికిత్స” కోసం  వస్తారు.  ఈ చికిత్స దుష్టశక్తులు ఆవహించిన లేదా వాటి ప్రభావానికి గురైన వారిని నయం చేస్తుందని  చెబుతారు.  సాక్షాత్తు బాలాజీ స్వామి తన హనుమాన్ అవతారంలో భక్తులను దుష్ట శక్తుల నుండి రక్షిస్తారని నమ్ముతారు.

రహస్య కథలు..

ఈ ఆలయం కేవలం ఆచారాలకు మాత్రమే పరిమితం కాదు; ఇది లెక్కలేనన్ని అతీంద్రియ  కథలకు నిలయమైన ప్రదేశం. ప్రజలు తాము వివరించలేని వింత దృశ్యాలను, అనుభవాలను చూసినట్లు చెబుతారు. కొందరు తమను ఎవరో వెంబడిస్తున్నట్లు అనిపిస్తుందని చెబుతుండగా, మరికొందరు ఆలయ ప్రాంగణంలో నీడలు సంచరిస్తున్నట్లు చూశామని పేర్కొంటున్నారు. ఈ కథలు ఎంతగా వ్యాపించాయంటే, మెహందీపూర్ బాలాజీని తరచుగా "భారతదేశంలోని అత్యంత దెయ్యాలు తిరిగే ఆలయాలలో" ఒకటిగా పేర్కొంటారు.

విచిత్రమైన నమ్మకం..

అత్యంత విచిత్రమైన నమ్మకాలలో ఒకటి..  బాలాజీ రూపంలో ఉన్న హనుమంతుడి  చేత స్వస్థత పొందిన వారు ఆలయం నుండి బయలుదేరేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట. వెనక్కి తిరిగి చూడటం ఆలయ రక్షణ కవచాన్ని విచ్ఛిన్నం చేసి, దుష్టశక్తి తిరిగి రావడానికి అనుమతిస్తుందని నమ్ముతారు. భక్తులు తరచుగా ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు, ఈ ఆచారం ఆలయం  రహస్యాన్ని మరింత పెంచుతోంది.

ఆలయ ప్రాంగణంలో అపరిచితులు ఇచ్చే ఆహారం, నీరు లేదా ఏవైనా నైవేద్యాలను స్వీకరించకూడదట. ఎందుకంటే ఆ వస్తువులు ప్రతికూల శక్తులతో కలుషితమై ఉంటాయని నమ్ముతారు. ఆలయంలోని నీటికి కూడా ఒక నియమం ఉంది.  అక్కడికి వచ్చిన భక్తులలో దుష్ట శక్తులు ఉంటాయని, ఈ కారణంగా ఆ నీరు మలినం అవుతుందని,  నీటికి కూడా తాకకూడదు అని చెబుతారు.

నైవేద్యం,  ప్రసాదం..

మెహందీపూర్ బాలాజీ ఆలయాన్ని దర్శించిన వారికి ఒక నియమం కూడా ఉంటుంది.  ఈ ఆలయంలో ఎవరైనా సరే.. వారికి ఇచ్చిన తీర్థ ప్రసాదాలు దేవాలయం లోపలే స్వీకరించాలి. దేవాలయం దాటి వాటిని తీసుకెళ్లకూడదు.

                           *రూపశ్రీ

google-ad-img