ఆదాయం: 14, వ్యయం: 11  - రాజపూజ్యం:  7, అవమానం: 2

గురువు ఉగాది నుండి 1-6-2026 వరకు తామ్రమూర్తిగా సంచారము చేయును. తదుపరి 31-10-2026 వరకు పంచమస్థానంలో తామ్రమూర్తిగా, ఆ తరువాత 24-1-2027 వరకు షష్టమస్థానంలో తామ్రమూర్తిగా, అనంతరం ఉగాది వరకు పంచమస్థానంలో సువర్ణమూర్తిగా సంచారము చేయును. శని ఉగాది నుండి మరల ఉగాది వరకు జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచరించును. రాహు–కేతువులు ఉగాది నుండి 5-12-2026 వరకు సువర్ణమూర్తులుగా, తదుపరి ఉగాది వరకు లోహమూర్తులుగా సంచారము చేయును. ఈ రాశి స్త్రీ–పురుషులకు,ముఖ్యంగా రైతు సోదరులకుముహూర్తబలంతో వ్యవసాయం చేసినచో అధిక దిగుబడులు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్నవారికి కొంతవరకు అనుకూలత ఉంటుంది. లాయరకు్ల ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. డాక్టర్లు స్థిరాస్తులు సమకూర్చుకునే అవకాశముంది. కాంట్రాక్టరకు్ల అనుకూల కాలము. రాజకీయ నాయకులకు శని ప్రభావం వలన
అనుకూలత ఉంటుంది. అయితే నిర్లక్ష్యం చేసినచో మానసిక అశాంతి పెరుగుతుంది.

జన్మరాశిలో శని సంచారం వలన దైవంపై సంపూర్ణవిశ్వాసం ఉంచిన వారికి అంతరంగిక సంతృప్తి లభిస్తుంది. వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. బదిలీలు; మీరు కోరుకున్న ప్రాంతానికి ప్రయత్నించినచో ఫలితం ఉంటుంది. ఉద్యోగం లేనివారికి ఉద్యోగ ప్రాప్తి సూచనలు ఉన్నాయి. ప్రయత్నంలో లోపం ఉండకూడదు. మీ ప్రయత్నమే మీ విజయానికి మూలం. ప్రతి పనిలో విశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. పెద్దపరిశ్రమల వారికి, చిన్న పరిశ్రమల వారికి లాభ సూచనలు ఉన్నాయి. బల్క్ డ్రగ్ రంగంలో ఉన్నవారికి అధిక ఆదాయం కలుగుతుంది. అన్ని రకాల వ్యాపారస్తులకే కాక సామాన్యులకూ లాభసాటి కాలము. “నీరు ఉన్నప్పుడు పారబోసితే తరువాత దొరకదు” అన్నట్లు, అవకాశాలు ఉన్నప్పుడే ఇంటి వ్యవహారాలు చక్కదిద్దుకోవాలి. జాయింట్ వ్యాపారాలలో మొదట కలిసికట్టుగా సాగినా, కొన్ని సందర్భాలలో ఆలోచనల భేదంతో విడిపోవడం కూడా జరుగును. కోర్టు కేసుల విషయంలో రాజీమార్గంలో ఆలోచించడం శ్రేయస్కరం.

గెలిచిన తరువాత కూడా బాధపడే పరిస్థితులు, ఓడినవారు కోర్టులోనే కన్నీరు పెట్టుకునే పరిస్థితులు రావచ్చు. అధికారుల అనుగ్రహం లభిస్తుంది. రాజకీయ నాయకులు వ్యక్తిగత నిర్ణయాల వలన పార్టీ మారే సూచనలు ఉన్నాయి. సమగ్రంగా చూసినచో అనుకూలతే అధికంగా ఉంటుంది. విజయం కోరుకుంటే రాజీ పడకుండా నిరంతర ప్రయత్నం చేయాలి. నక్షత్రాలవారీపరిహారములు:పూర్వాభాద్ర నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించి, దక్షిణామూర్తి పూజలు, సాయినాథుని ఆరాధన చేయాలి. గురువారం శనగల గుగ్గిళ్లు ప్రసాదంగా పంచాలి.

ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించి, శనికి తైలాభిషేకం చేయాలి. చేయనివారికి పనులలో ఎక్కడో ఒకచోట ఆటంకం కలగవచ్చు. నలుపు గొంగళి, ఇనుప గంట, తోలు చెప్పులు, నలుపు గొడుగు, 1¼ కిలో నువ్వులు బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. నలుపు వస్త్రాలు అయ్యప్ప స్వామికి ఇవ్వాలి. రేవతి నక్షత్రం వారు జాతి పచ్చ ధరించి, శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకార దర్శనం చేయాలి లేదా స్వామివారికి అలంకరణ చేయించాలి. చక్కెర పొంగళి ప్రసాదంతో స్వామివారిని తృప్తిపరచి వారి అనుగ్రహం పొందాలి. లక్ష్మీ–గణపతి హోమం, మహాన్యాస రుద్రాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు, దానాలు ఆచరించుట శ్రేయస్కరం. ధ్యానం, యోగ, ఆక్యుప్రెషర్, ఆయుర్వేద చికిత్సల ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యం పొందగలరు. అదృష్ట సంఖ్య: 3.


More Rasi Phalalu 2026 - 2027