
హిందూ సనాతన ధర్మంలో కార్తిక మాసానికి అత్యంత విశిష్టమైన, పవిత్రమైన స్థానం ఉంది. శివకేశవుల ఆరాధనకు ప్రసిద్ధి చెందిన ఈ మాసంలో తెల్లవారుజామునే స్నానమాచరించి, భక్తిశ్రద్ధలతో దీపారాధన చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం జ్యోతిః పరబ్రహ్మ... అనే శ్లోకానికి అనుగుణంగా, వెలిగించిన దీపం కేవలం వెలుతురును ఇవ్వడమే కాకుండా మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అయితే ఈ పవిత్ర కార్తిక మాసంలో ఏ నూనెతో లేదా ఏ పదార్థంతో దీపం వెలిగిస్తే ఎలాంటి విశేష ఫలితాలు కలుగుతాయి అనేదానిపై భక్తుల్లో అనేక సందేహాలు ఉంటాయి. పూజా విధానంలో సరైన నియమాలను పాటించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
హిందూ సాంప్రదాయాల ప్రకారం దీపారాధనకు ఉపయోగించే ప్రతి ద్రవ్యానికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదంగా, పవిత్రంగా భావిస్తారు. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదా సానుకూల వాతావరణం ఏర్పడి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఒకవేళ ఆవు నెయ్యి అందుబాటులో లేని పక్షంలో స్వచ్ఛమైన నువ్వుల నూనెను ఉపయోగించి కూడా దీపారాధన చేయవచ్చు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి నూనెను కూడా పూజా దీపాలకు సాంప్రదాయబద్ధంగా వాడుతుంటారు.
కార్తిక మాసంలో దీపారాధన చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలను విధిగా పాటించాలని పెద్దలు సూచిస్తున్నారు. సాధారణంగా ఇంట్లో లేదా ఆలయాల్లో దీపం వెలిగించేటప్పుడు ఒక వత్తిని మాత్రమే ఎప్పుడూ ఉపయోగించకూడదు. కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ వత్తులను (రెండు, మూడు లేదా ఐదు వత్తులు) కలిపి వెలిగించడం అత్యంత శ్రేయూకరమని చెబుతారు. అలాగే ప్రమిదలను నేరుగా నేలపై ఉంచకుండా, కింద అక్షతలు (బియ్యం) లేదా పూలు ఉంచి, దానిపై చిన్న పళ్లెంలో లేదా తమలపాకుపై ప్రమిదను ఏర్పాటు చేసి దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇంట్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో నిష్టతో దీపం వెలిగించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, మనశాంతి వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా ఈ పవిత్ర మాసంలో ఆలయాల్లో మరియు విశేష పుణ్యక్షేత్రాలలో వెలిగించే ఆకాశదీపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఎంతో లోతైనది. కార్తిక మాస నెల అంతటా సాయంత్రసమయాల్లో ఆలయ ధ్వజస్తంభం వద్ద లేదా ఎత్తైన ప్రదేశాలలో ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఈ ఆకాశదీప దర్శనం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని, పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని, దైవిక అనుగ్రహం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.
ఇది కూడా చదవండి:మీ మనసు, ప్రశాంతంగా ఉండాలా? ఈ శక్తివంతమైన శ్లోకం చదవండి!
ఈ మాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే స్నానాలు ఆచరించి, కొత్త మట్టి ప్రమిదలను లేదా శుభ్రం చేసిన ఇత్తడి, వెండి ప్రమిదలను ఉపయోగించి దీపాలు వెలిగించాలి. పాత లేదా పగిలిన ప్రమిదలను పూజకు ఉపయోగించకూడదని నియమం ఉంది. దీపం వెలిగించే సమయంలో కార్తీకే దీపం దత్వా జ్ఞానం ప్రాప్నోతి మానవః అనే మంద్రాన్ని లేదా దైవ నామాలను స్మరిస్తూ దీపారాధన పూర్తి చేయడం ద్వారా సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలితాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు.
.webp)
అంతిమంగా, ఏ నూనెతో లేదా నెయ్యితో దీపం వెలిగించినప్పటికీ భక్తి, శ్రద్ధ, పరిపూర్ణమైన మనసు ఉండటమే అత్యంత ముఖ్యం. కార్తిక మాసంలోని ప్రతి రోజూ నిష్టతో దీపారాధన చేయడం వల్ల మనసులోని అశాంతి తొలగిపోయి దైవ చింతన పెరుగుతుంది. ఈ చిన్న నియమాలను పాటిస్తూ కార్తిక దీపాలను వెలిగించడం ద్వారా శివకేశవుల కటాక్షాన్ని పొందడమే కాకుండా ఇంటా బయటా సర్వత్ర సానుకూలతను ఆహ్వానించవచ్చు.
మీకు నచ్చవచ్చు:తొలిపూజల దైవం. వినాయకుడి దివ్య నామాలను, ఎందుకు పఠించాలి?
భక్తులు తప్పకుండా, సందర్శించాల్సిన తెలంగాణ చారిత్రక ఆలయాలు!
Kartika Deeparadhana Secrets, Lamp Oils Benefits, Akashadeepam Significance, Kartika Masam Diyas, Hindu Devotional Customs, Spiritual Articles, Devotional Articles In Telugu.






