Home » Temples » అమృత గుండంలో వెలిసిన అమ్మవారి క్షేత్రం.. చ్యవన మహర్షి తపస్సు చేసిన పుణ్య స్థలం.. ఎక్కడంటే..!

 అమృత గుండంలో వెలిసిన అమ్మవారి క్షేత్రం.. చ్యవన మహర్షి తపస్సు చేసిన పుణ్య స్థలం.. 

అమేథీలోని కాళికన్ ధామం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది మన దేశపు పురాతన సంస్కృతికి, భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిలువెత్తు రూపం. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్న తీరు, ఈ ప్రాంతం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఎంతో విశిష్టమైనవి. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా ప్రతి సోమవారం ఇక్కడ జరిగే పెద్ద తిరునాళ్లకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ క్షేత్రం గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

చ్యవన మహర్షి తపో స్థలం..

ఈ పవిత్ర స్థలానికి సంబంధించి పురాణాలలో ఎన్నో ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం చ్యవన మహర్షి తపస్సు చేసిన పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందింది. పూర్వం అయోధ్యను పాలించిన రాజు తన కుమార్తె సుకన్యతో కలిసి ఈ అడవికి రాగా, ఆ సమయంలో చ్యవన మహర్షి తీవ్రమైన తపస్సులో పుట్టలో ఉన్నారు. ఆయన కళ్ళు ప్రకాశవంతంగా మెరుస్తుండటంతో, సుకన్య వాటిని ఏదో రత్నమని భావించి ఒక చిన్న పుల్లతో పొడిచింది. దీంతో మహర్షికి తీవ్రమైన బాధ కలిగింది, ఆయన పైకి ఏమీ అనకపోయినా.. ఆ తరువాత  రాజు సైన్యానికి కూడా రకరకాల కష్టాలు ఎదురయ్యాయని చెబుతారు. ఆ తర్వాత రాజు సమస్యలకు కారణం ఏమిటని ఆస్థాన పండితులను, జ్యోతిష్యులను సంప్రదించగా.. అడవిలో ఏదో అపశృతి జరిగిందని వారు వివరించారు. రాజు అడవికి వెళ్లి చూడగా, పుట్టలో కళ్లలో రక్తం కారుతూ విలవిల్లాడుతున్న చ్యవన మహర్షి కనిపించాడు. రాజు తప్పును తెలుసుకొని క్షమాపణ కోరి, తన కుమార్తె సుకన్యను మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆ తర్వాత కాలంలో దేవ వైద్యులైన అశ్విని కుమారులు మహర్షికి మళ్లీ కంటి చూపును, నవయవ్వనాన్ని ప్రసాదించారు.

అమ్మవారి అమృతగుండం..

ఈ ప్రాంతం అమృత గుండానికి కూడా నిలయంగా గుర్తింపు పొందింది. చ్యవన మహర్షి కోరిక మేరకు అయోధ్య రాజు ఒక పెద్ద యజ్ఞాన్ని నిర్వహించగా, దానికి దేవతలు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ఋషుల ప్రార్థనలకు తృప్తి చెందిన కాళికా దేవి, అక్కడ ఉన్న పవిత్రమైన గుండం వద్ద సాక్షాత్కరించిందని నమ్ముతారు. అలా అమ్మవారు అమృత గుండం వద్ద వెలియడంతో, ఆమెను అమృత గుండ వాసిని అని కూడా పిలుస్తున్నారు. అంతేకాకుండా, ఆయుర్వేదంలో ఎంతో విశిష్టత ఉన్న చ్యవనప్రాశ తయారీ మూలాలు కూడా ఈ మహర్షి తపోభూమితోనే ముడిపడి ఉన్నాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

ఈ దేవాలయం కేవలం సాధారణ ప్రజలకే కాకుండా దేశంలోని ఎంతో మంది ప్రముఖులకు కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ ప్రధాన మంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు చలనచిత్ర రంగానికి చెందిన నటీనటులు కూడా ఈ  క్షేత్రాన్ని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. భక్తుల కోరికలు తీర్చే తల్లిగా కాళికా దేవికి ఉన్న నమ్మకం వల్ల ఇక్కడ ఎల్లప్పుడూ భక్తిపారవశ్యం విలసిల్లుతుంది. దసరా నవరాత్రుల సమయంలో అయితే తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తారు.

మొత్తానికి, ఆధ్యాత్మిక శోభతో విలసిల్లే ఈ కాళికన్ ధామం భక్తులకు ఎంతో గొప్ప మనశ్శాంతిని ఇస్తుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవడం ఒక మరువలేని ఆధ్యాత్మిక అనుభూతిగా నిలుస్తుంది.


                                                                                                                                               *రూపశ్రీ.

google-ad-img