దేవుడున్నాడు

 

“ఊరుకోవయ్యా పంతులూ... మన చేతుల్లో ఏముంది చెప్పు? ఎంతటి వారికైనా మరణమనేది తప్పదని కదా గీతా సారం? నువ్వెంత ఏడ్చినా పోయినావిడ తిరిగి వస్తుందా చెప్పు? నువ్వే అలా అయిపోతే పాపమా పసిపిల్ల ఏమౌతుంది? గుండెను రాయిగా చేసుకొని, జరగాల్సింది చూడు...” కండువా నోట్లో కుక్కుకొని విలపిస్తున్న రామానుజం భుజాన్ని తడుతూ అనునయించాడు, పేరయ్య శాస్త్రి. అక్కడ ఒక విషాదకరమైన వాతావరణం నెలకొని ఉంది. రామానుజం భార్య ఛాయాదేవి పార్థివశరీరం చాపమీద పడుకోబెట్టబడి ఉంది. ఆమె తల దగ్గర ప్రమిదలో దీపం నిశ్చలంగా వెలుగుతోంది. అక్కడే కూర్చుని, దీనంగా తనవైపే చూస్తున్న కూతురు మనోజ్ఞ వైపు చూస్తుంటే రామానుజం దుఃఖం మరింత ఎక్కువైంది.  చనిపోయిన అక్క పక్కనే కూర్చుని గట్టిగా శోకాలు పెట్టి మరీ ఏడుస్తున్నాడు, ఆమె తమ్ముడు బాబూరావు.


మనోజ్ఞకు పదేళ్ళ వయస్సులో తల్లి చనిపోతే, ఆ పసిదానికి అమ్మ లేని లోటు తెలియకుండా ఉండటం కోసం, నిరుపేద కుటుంబంలోంచి, దూరపు బంధువుల పిల్లను రెండవ భార్యగా చేసుకున్నాడు, రామానుజం. ఛాయాదేవికి అసలు శాంతమంటే ఏమిటో తెలియనే తెలియదు. అందచందాలు, విద్యాగంధం లేని ఛాయాదేవికి, బంగారు బొమ్మ వంటి మనోజ్ఞను చూస్తే విపరీతమైన అసూయ. అంతేకాదు, తన తల్లిదండ్రుల పేదరికం వల్లనే తానీ రెండవ పెళ్ళి చేసుకోవలసి వచ్చిందనీ, లేకపోతే తననో రాజకుమారుడు వలచి వరించి ఉండే వాడే అనీ ఒక పిచ్చి నమ్మకం ఆమెకు. అది సవతికూతురిమీద ద్వేషంగా పరిణమించింది. అంతే... పసిపిల్ల కాస్తా పనిపిల్లగా మారిపోయింది. నరకం చూపించింది. మంచిమాటలతో వారించబోతున్న భర్తకు కిరోసిన్ వంటి మీద పోసుకొని చచ్చిపోతానని బెదిరించింది. గృహ హింస కింద కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేసింది. ఎప్పటికైనా మంచిరోజులు రాకపోతాయా అనుకుంటూ, రెండో పెళ్ళి చేసుకున్నందుకు తనను తాను తిట్టుకుంటూ ఆ దైవాన్నే నమ్ముకొని భారంగా రోజులు ఈడుస్తున్నాడు, రామానుజం.


***


నాలుగైదేళ్ళు ఇలాగే బహు భారంగా గడచిపోయాయి. ఇంటి చాకిరీ అంతా మనోజ్ఞ చేస్తున్నా, ఎంతో  అలిసిపోయినట్టుగా ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక రెండు గంటలు నిద్రపోతుంది, ఛాయాదేవి. అంతే కాదు, రాత్రి కూడా తొమ్మిది తరువాత నిద్రకి ఆగలేదు. ఇది బాగా లాభించింది, మనోజ్ఞకు. ఆ రెండు గంటలు పక్కింటి సుష్మక్క దగ్గర చదువు నేర్చుకొని, పదవ తరగతి పరీక్షలు రాసి పాసైపోయింది. విషయం తెలుసుకున్నాక ఛాయాదేవికి  ఉక్రోషం ఆగక, గరిట కాల్చి మనోజ్ఞ కాలిపై వాత పెట్టింది. విలవిలలాడిపోయిన మనోజ్ఞ తండ్రి వైపు దీనంగా చూసింది, ‘ఈ నరకం ఎన్నాళ్ళు?’ అన్నట్టుగా... స్వతహాగా సౌమ్యుడైన రామానుజం కన్నీటితో ఛాయాదేవిని ప్రార్థించాడు.

 

“ఛాయా, పసిది, నీకు ఏం ద్రోహం చేసిందని నీకు అంత కక్ష? నీ సొంతకూతురే అయితే అలా చేస్తావా? ఆడదాని అవసరం కోసం మాత్రం నేను పెళ్ళి చేసుకోలేదు. నువ్వు కంటికి రెప్పలా నా కూతుర్ని చూసుకుంటావని మీ అమ్మా నాన్న నాకు మాటిచ్చి, నీ కన్నెచెర విడిపించమని ఎంతో బ్రతిమాలితే నేను నిన్ను చేసుకున్నాను. ఛ... చూస్తూ చూస్తూ నా కూతుర్ని నేనే అగ్ని గుండంలోకి తోసినట్టైంది. చూడు, నీ కాళ్ళు పట్టుకుంటాను. నీకేం కావాలో చెప్పు... నా కూతుర్నిలా హింసలు పెట్టకు...” అంటూ వేడుకున్నాడు. అదోలా చూసింది, ఛాయాదేవి. “అసలు  నిన్ను చేసుకొని నేను పూర్తిగా ఊబిలోకి కూరుకుపోయాను. చాలీ చాలని నీ పౌరోహిత్యపు ఆదాయం నా సరదాలకు ఏమాత్రం చాలదు. నాకు నీ కూతుర్ని చూస్తే చీదర. నువ్వు నాకేమిచ్చావు? కనీసం పిల్లల్ని కూడా ఇవ్వలేని చాతకాని మొగుడివి. నువ్వంటే, నీ కూతురంటే నాకు పరమ అసహ్యం...”


“అలాంటప్పుడు ఇంకా ఇక్కడ ఎందుకుంటావు? మీ అమ్మా వాళ్ళింటికి వెళ్ళిపో... మేము ప్రశాంతంగా ఉంటాం...” కోపంగా అన్నాడు, రామానుజం.


“అంత తేలికగా నేనెందుకు పోతాను? అన్నట్టు ఒక విషయం విను. నా తమ్ముడు బాబూరావు తెలుసుగా? వాడి పెళ్ళాం నిరుడే ఉరిపోసుకుని చచ్చింది. వాడు ఎంతో పెద్ద మనసుతో నీ కూతుర్ని పెళ్ళి చేసుకుంటానని అన్నాడు... వచ్చే ఆదివారమే నిశ్చితార్థం... ఆ ఏర్పాట్లలో ఉండు...” అంటూ తాఖీదిచ్చింది.


నివ్వెరపోయాడు, రామానుజం. “ఏమిటి ఛాయా... ఆ బాబూరావు తాగుబోతు, తిరుగుబోతూ అని నీకు తెలియదా? వాడి బాధలు పడలేకే కదా, అతని భార్య ఆత్మహత్య చేసుకుంది!  అలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వటానికి నేనేం చాతకాని వాడిలా కనబడుతున్నానా చెప్పు? ఇంకో సారి ఆ మాట మాట్లాడితే  నా శవాన్ని చూస్తావు జాగ్రత్త...” ఆవేశాన్ని అణచుకుంటూ అన్నాడు, రామానుజం.


“అలాగే గనుక  జరిగితే, మీ పెద్ద కర్మ అయిన మర్నాడే దానికి బాబూరావుకి గుడిలో ముడి పెట్టిస్తాను... ఏమనుకున్నారో...” పొగరుగా తలెగరేసింది, ఛాయాదేవి. అవాక్కయ్యాడు రామానుజం. “పరాత్పరా, నిన్నే నమ్ముకున్నాను... నీవే గట్టెక్కించాలి...” తాను నిత్యమూ కొలిచే ఆంజనేయుణ్ణి వేడుకున్నాడు నిస్సహాయంగా...


***


ఆ రాత్రి అసలు నిద్రపట్టలేదు రామానుజానికి. చనిపోయిన తన మొదటిభార్యను పదే పదే తలచుకుంటూ, కూతురుని సరిగ్గా చూసుకోలేకపోయినందుకు ఆమెకు వేల వేల క్షమాపణలు చెబుతూ... పక్కమీద అటూ ఇటూ దొర్లసాగాడు. రేపు ఆదివారం జరగబోయే ప్రమాదాన్ని ఎలా నివారించాలో అతనికి తెలియలేదు. తన బంగారుతల్లిని ఆ త్రాష్టుడి చేతుల్లో పెట్టటం తలచుకుంటేనే కంపరంగా ఉన్నది అతనికి. పెనమ్మీంచి పొయ్యిలో పడ్డట్టే ఇక మనోజ్ఞ పరిస్థితి... పుట్టిన తరువాత ఒక్క ఏడు సంవత్సరాలేమో తన చేతుల్లో ముద్దూ మురిపాలు అనుభవించింది ఆ పిచ్చితల్లి... ఛాయాదేవి మెడలో మూడు ముళ్ళేసి, తన కూతురి మెడకి ఉరితాడు బిగించాడు తాను... భగవాన్, ఏదైనా జరిగి ఈ గండం గడవకూడదూ?
మాగన్నుగా ఎప్పటికో నిద్రపడుతుంటే పెరట్లోంచి పెద్ద శబ్దం, దాంతో పాటే ఛాయాదేవి వేసిన కేక వినిపించాయి. గబుక్కున వెళ్ళి చూస్తే, పెరట్లోకి వచ్చిన ఛాయాదేవి కాలు జారి బట్టలుతికే బండమీద పడిపోయింది. తలకి పెద్దగాయమై స్పృహపోయింది. ఆసుపత్రిలో చేర్చాక ఆ రాత్రికి ప్రాణమే పోయింది.

 

***


కూతురికి తప్పిన గండాన్ని తలచుకుంటూ, భార్య శవం పక్కనే కూర్చుని, సంతోషాతిరేకంతో ఆంజనేయుడిని స్తుతిస్తూ, వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు రామానుజం. కుమార్తెపై అతనికున్న అవ్యాజమైన అనురాగమే చివరికి గెలిచింది. ప్రతిరోజూ పూమాలలల్లి తన మెడలో అలంకరించే తన చిన్న నేస్తం మనోజ్ఞను మరి ఆ దేవుడు కరుణించడూ?


-నండూరి సుందరీ నాగమణి


More Purana Patralu - Mythological Stories