హనుమ ఆరాధన.. ఏ హనుమంతుడి రూపాన్ని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి!

భారతీయులకు హనుమంతుడి పేరు స్మరిస్తేనే కొండంత బలం కలుగుతుంది. హనుమంతుడిని పూజించడం , ప్రార్థించడం భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. హనుమంతుని అనుగ్రహం ఉంటే అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారు. బలం, వివేకం , జ్ఞానం చేకూరతాయి. అయితే ప్రతి ఒక్కరికి సమస్యలు, కోరికలు ఉంటాయి. వాటికి అనుగుణంగా హనుమంతుడిని పూజిస్తే హనుమ అనుగ్రహం త్వరగా పొందవచ్చు. హనుమంతుడి జీవితంలో ప్రతి దశ అద్బుతమే.. బాల హనుమాన్ నుండి ఆయన రూపాలు ఎన్నో ఉన్నాయి.
బాల హనుమాన్, రాముడికి సేవ చేస్తున్న హనుమాన్, పర్వతాన్ని ఎత్తుతున్న హనుమాన్, ధ్యాన భంగిమలో ఉన్న హనుమాన్, నిటారుగా నిలబడుకుని కళ్లు మూసుకుని ఉన్న హనుమాన్.. ఇలా చాలా హనుమాన్ రూపాలు ఉన్నాయి. మనిషికి జీవితంలో ఎదురయ్యే సమస్యను బట్టి ఆయా రూపాలను ఆరాధించడం వల్ల అద్బుతమైన ఫలితం ఉంటుందట. ఏ రూపంలో ఉన్న హనుమంతుడిని ఆరాధిస్తే ఎలాంటి సమస్యలు పరిష్కారమవుతాయో తెలుసుకుంటే..
బాలహనుమాన్..
హనుమంతుని అనేక రూపాలలో బాల హనుమంతుని రూపం ఒకటి. ఆయన దర్శనం, పూజ భక్తుని భయాలన్నింటినీ నశింపజేస్తాయి. రాత్రిపూట పిల్లలు అకస్మాత్తుగా భయంతో మేల్కొన్నా, లేదా ఎవరికైనా నిరంతరం పీడకలలు వస్తున్నా, వారు బాల హనుమంతుడిని పూజించాలట. బాల హనుమంతుని పాదాల కుంకుమను నుదుటిపై పెట్టుకోవాలి. బాల హనుమంతుడిని పూజించడం వల్ల భక్తుని కోరికలు త్వరగా నెరవేరి, అనారోగ్యం , దుఃఖం తొలగిపోతాయట.
రామ సేవ చేస్తున్న హనుమాన్..
తన ప్రభువైన శ్రీరామునికి సేవ చేస్తున్న హనుమంతుని చిత్రం లేదా విగ్రహం చాలా శుభప్రదమైనది. అలాంటి విగ్రహాన్ని పూజించడం వల్ల తమ పనులను త్వరగా పూర్తి చేసుకోవడానికి, కుటుంబ ఆనందాన్ని పొందడానికి , తమ జీవితాన్ని పూర్తిగా కుటుంబంతో కలిసి ఉండటానికి సహాయపడుతుందట. రామ సేవ చేస్తున్న హనుమంతుడిని ఆరాధించే వారు తమ పనులలో త్వరగా విజయం సాధిస్తారట. రాముడిని సేవిస్తున్న హనుమంతుని పూజించడం వల్ల కార్యాలయంలో పై అధికారుల నుండి సానుకూల ఫలితం లభిస్తుందట.
పర్వతాన్ని ఎత్తిన హనుమంతుడు..
పర్వతాన్ని చేతబట్టుకుని ఉన్న హనుమంతుడిని పూజిస్తే జీవితంలోని ఎలాంటి పెద్ద లేదా ఆకస్మిక సంక్షోభాలనైనా అధిగమించగలుగుతారట. హనుమంతుని అనుగ్రహంతో సమస్యలకు పరిష్కారాలను కనుక్కోగలుగుతారట.
ధ్యాన భంగిమ హనుమాన్..
కష్టాలతో చుట్టుముట్టబడి, ఎక్కడా శాంతి, సంతోషం పొందలేకపోతే, వారు ధ్యాన భంగిమలో హనుమంతుడిని పూజించాలట. ధ్యాన భంగిమలో హనుమంతుడిని పూజించడం వల్ల మానసిక బలం పెరిగి, ఆత్మవిశ్వాసం బలపడుతుందట. ఆధ్యాత్మిక శాంతిని పొందడం ద్వారా, వ్యక్తి జీవితంలోని సమస్యలకు త్వరగా పరిష్కారాలను కనుక్కోగలుగుతాడట.
*రూపశ్రీ.


